Thursday, May 2, 2024

జనసేన-టిడిపి పొత్తు ఫలించేనా? వికటించేనా?

పీపుల్స్ పల్స్ విశ్లేషణ

  • 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తామని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఈ కూటమి పొత్తు ఫలించేనా? లేక వికటించేనా? అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.
  • రాజకీయాల్లో 1+1=2 ఎప్పుడూ అవ్వదు. అయితే రాజకీయపరమైన విశ్లేషణ చేసేటప్పుడు ఏదో ఒక ఆధారం ఉండాలి.
  • ఎన్నికలకు సంబంధించి శాస్త్రీయంగా విశ్లేషణ చేసే ముందు రెండు అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి. అందులో మొదటిది ప్రైమరీ డేటా, రెండవది సెకండరీ డేటా.
  • క్షేత్రస్థాయిలో పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా వెల్లడయ్యే డేటా ప్రైమరీ డేటా. గత ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, వివిధ సామాజికవర్గాలు ఏయే పార్టీలకు మద్దతు ఇచ్చాయి తదితర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన సంస్థలు విడుదల చేసిన డేటా సెకండరీ డేటాగా పరిగణించాలి.
  • ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో స్వయంప్రకటిత మేధావులు, విశ్లేషకులుగా చలామణి అవుతున్నవారు ఏ ఒక్కరూ కూడా వాస్తవాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను, శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా తమకు తోచిన విధంగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వారు పాల్గొనే మీడియా సంస్థలకు అనుగుణంగా వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, సంపాదకులు శ్రీ గజ్జెల మల్లారెడ్డి గారు రెండు దశాబ్దాల క్రితమే “ఎంత మంచి విత్తనమైనా క్షేత్రాన్ని బట్టి మొలకెత్తుతుందని” ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర రాజకీయాలను విశ్లేషించే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
  • జనసేన – టిడిపి పొత్తు ఖరారైన తరుణంలో ఆ కూటమి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందని విశ్లేషణ చేసేముందు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రైమరీ డేటా ద్వారా, 2009, 2014, 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, వివిధ సామాజికవర్గాలు ఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు తదితర అంశాలపై సెకండరీ డేటా ద్వారా అధ్యయనం చేయాలి.
  • జనసేన – టిడిపి పొత్తు ఏ విధంగా ఉండబోతోందో అధ్యయనం చేయడానికి దేశంలోని ప్రఖ్యాతి గాంచిన సిఎఎస్ – లోక్ నీతి సంస్థ వివిధ అధ్యయనాల ద్వారా వెల్లడించిన డేటాను పరిగణలోనికి తీసుకుంటున్నాం.
  • 2019లో వైఎస్ఆర్సిపికి మద్దతిచ్చిన సామాజికవర్గాలు, వివిధ సమూహాలు ప్రస్తుతం మద్దతిస్తున్నాయా? లేదా? ఏయే సామాజికవర్గాలు, సమూహాలు మద్దతిస్తున్నాయి? ఏయే వర్గాలు దూరమయ్యాయి? ఈ విషయంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి.
  • 2019 లో టిడిపి, జనసేనకు వచ్చిన ఓట్ల శాతం కన్నా ప్రస్తుతం పెరిగిందా? లేక తగ్గిందా? పెరిగితే ఎంత పెరిగింది? తగ్గితే ఎంత తగ్గింది?
  • సంక్షేమ పథకాల కారణంగా లబ్ధిదారులు అధికార వైఎస్ఆర్సిపికి అధికశాతంమంది మద్దతిస్తున్నారని అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? 2019లో వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్ల శాతంలో ప్రస్తుతం సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్దిదారులు ఉన్నారా? లేదా? లేకపోతే ఎంత శాతం లబ్ధిదారులు వీరిలో ఉన్నారు?
  • 2019లో టిడిపికి ఓటు వేసి అధికార వైఎస్ఆర్సిపి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి ఆకర్షితులై రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మద్దతివ్వడానికి ఎంత శాతం మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు?
  • 2019లో వైఎస్ఆర్సిపికి ఓటు వేసి పాలన నచ్చక తమ అభిప్రాయాన్ని మార్చుకుని టిడిపి లేదా జనసేన కూటమికి ఓటు వేయడానికి ఎంత శాతం మంది ప్రజలు ఉన్నారు?
  • 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో వైఎస్ఆర్సిపికి 50.6 శాతం మంది మద్దతిస్తే, టిడిపికి 37.2 శాతం మద్దతిచ్చారు. వీరి మధ్య వ్యత్యాసం 13.4 శాతం ఉంది. ఈ వ్యత్యాసం రాబోవు ఎన్నికల్లో కొనసాగనుందా? లేక తగ్గనుందా?
  • 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాల్లో వైఎస్ఆర్సిపికి 28.7 శాతం మంది మద్దతిస్తే, టిడిపికి 39.4 శాతం మద్దతిచ్చారు. వీరి మధ్య వ్యత్యాసం 10.7 శాతం ఉంది. ఈ వ్యత్యాసం రాబోవు ఎన్నికల్లో కొనసాగనుందా? లేక తగ్గనుందా?
  • వైఎస్ఆర్సిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్ అని, క్యాస్ట్ వార్ కాదని అనేక సభల్లో ప్రకటిస్తున్నారు. క్లాస్ వార్ అంటే పేదవాడికి ధనవంతుడికి మధ్య పోరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది క్లాస్ వారా? క్యాస్ట్ వారా?
  • 2019లో వైఎస్ఆర్సిపీ అధికారపగ్గాలు చేపట్టడానికి ఏయే సామాజికవర్గాలు అండగా నిలబడ్డాయి, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏయే సామాజికవర్గాలు సహకరించాయి, 2024లో జరిగే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు, ఆయా పార్టీలకు అండగా వుంటాయా? లేదా?
  • 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రెడ్డి, దళితులు (మాల సామాజికవర్గం), గిరిజనులు తదితర సామాజికవర్గాల్లో భారీ మద్దతు లభించింది. ఈ మద్దతు రాబోయే ఎన్నికల్లో కూడా కొనసాగనుందా?
  • 2019 ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 86 శాతం రెడ్డి సామాజికవర్గం మద్దతు వైఎస్ఆర్సీపీకి లభించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 22 శాతం అధికంగా వీరి మద్దతు లభించింది. 2024లో కూడా వైఎస్ఆర్సిపికి రెడ్డి సామాజికవర్గం నుండి ఇంత మద్దతు లభిస్తుందా?
  • 2014లో వైఎస్ఆర్సిపికి దళిత సామాజికవర్గం 57 శాతం మద్దతు ఇవ్వగా 2019లో 76 శాతం, బీసీ విషయానికొస్తే 2014లో 37 శాతం, 2019 వచ్చేసరికి 39 శాతం మద్దతు ఇచ్చారు. కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ముద్రపడిన వైఎస్ఆర్సీపీ 2014తో పోలిస్తే 2019 వచ్చే సరికి 21 శాతం అధికంగా ఈ సామాజికవర్గం మద్దతును కూడగట్టగలిగింది. ఈ సామాజికవర్గాల్లో ఇదే విధమైన మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సిపికి లభిస్తుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 20 శాతం కాపు సామాజిక వర్గం మద్దతిచ్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో 29 శాతం ఓట్లను వైఎస్ఆర్సిపీ కోల్పోయింది. టిడిపి-జనసేన కూటమిగా ఏర్పడిన తరువాత ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏంటి?
  • రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న ముస్లింలు 2019లో వైఎస్ఆర్సిపీకి 49 శాతం మద్దతిచ్చారు. 2014తో పోలిస్తే 17 శాతం ఓట్లు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పట్ల వైఎస్ఆర్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ముస్లింలలో ఉండటమే. 2024 ఎన్నికల్లో ముస్లిం సామాజికవర్గం వైఎస్ఆర్సిపి పట్ల అదే అభిప్రాయంతో ఉందా? లేక వారిలో మార్పు వచ్చిందా?
  • 2019లో టీడీపీకి ప్రధాన మద్దతుదారులైన ‘కమ్మ’ సామాజికవర్గం ఓట్లు 12 శాతం తగ్గాయి. 2014లో 72 శాతం మంది ‘కమ్మ’ సామాజికవర్గం టీడీపీకి ఓటేస్తే, 2019లో అది 60 శాతానికి దిగజారింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? వీరిలో ఏమైనా మార్పు వచ్చిందా?
  • 2014లో 54 శాతం మంది బీసీలు టీడీపీకి ఓటేస్తే, 2019లో టీడీపీకి ఓటేసిన బీసీల సంఖ్య 46 శాతానికి పడిపోయింది. అంటే 8 శాతం ఓట్లను టిడిపి కోల్పోయింది. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తున్నది. టిడిపికి బీసీలే వెన్నెముక. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం బీసీ ఓట్లు తగ్గడమే. ప్రస్తుతం బీసీల్లో ఏమైనా మార్పు వచ్చిందా?
  • 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీచేసింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 5.6 శాతం సాధించి ఒక్క సీటు గెలుపొందింది. ఈ ఓట్లలో ఏయే సామాజికవర్గాల నుండి జనసేన పార్టీకి మద్దతు లభించిందని పరిశీలిస్తే 26 కాపు, 7 బీసీ, 3 రెడ్లు, గౌడలు, ఎస్సీలు చేరో ఒక్క శాతం మద్దతు ఇచ్చారు. రాబోవు ఎన్నికల్లో జనసేన తన ఓటు బ్యాంకును పెంచుకుంటుందా? లేదా? పెంచుకుంటే ఏయే సామాజికవర్గాల్లో పెంచుకుంది?
  • జనసేనతో పొత్తు పెట్టుకోవడంవల్ల టిడిపికి వెన్నెముక అయిన బీసీలు, టిడిపికి దూరం అవుతారా? 2014 లో టిడిపి, జనసేనతో పొత్తు పెట్టుకున్నా వైఎస్ఆర్సిపి కన్నా టిడిపికే బీసీలు మద్దతిచ్చారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలు ఎంచేస్తారు?
  • 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం 10 శాతం ఓట్లు సాధించిన స్థానం ఒక్కటే. 3-4 శాతం ఓట్లు సాధించిన స్థానాలు 3, 2-3 శాతం ఓట్లు సాధించిన స్థానాలు 6, 1-2 శాతం ఓట్లు సాధించిన స్థానాలు 31, 1 శాతం లోపు ఓట్లు సాధించిన స్థానాలు 132. రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి పరిస్థితి ఏంటి? ఒంటరిగా పోటీచేస్తే ఎన్నిస్థానాల్లో గెలుపొందుతుంది? పొత్తులో పోటీ చేస్తే ఎన్నిగెలుపొందుతుంది?
  • 2014, 2019 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీగారికి ఉన్నంత పలుకుబడి ప్రస్తుతం ఉందా? లేక తగ్గిందా?
  • రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నోటాతో పోటీపడుతున్నాయి. 2024 లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీలకు కనీసం డిపాజిట్లు అయినా వచ్చే పరిస్థితి ఉందా? ఈ పార్టీలు చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయి?
  • 2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి కలిసి పోటీచేస్తే బయట నుండి జనసేనపార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారంచేసి కూటమి విజయానికి తోడ్పడ్డారు.
  • 2014లో టిడిపి-జనసేన కూటమికి 46.63, వైఎస్ఆర్సిపికి 44.12 శాతం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి వేర్వేరుగా పోటీచేయగా టిడిపికి 39.26, జన సేనకు 5.15, బిజెపికి 0.84 శాతం ఓట్లు రాగా, వైఎస్ఆర్సిపికి 49.95 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో అధికారపగ్గాలు చేపట్టింది.
  • జనసేనపార్టీ అధినేత రాబోవు ఎన్నికల్లో జనసేన-టిడిపి కలిసి పోటీచేస్తాయని ప్రకటించడంతో ఈ ఇరుపార్టీలకు 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కలిపి చూసినప్పుడు 44.70 శాతం ఓట్లు వస్తున్నాయి.
  • 2014 లో కూడా టిడిపి కూటమికి దాదాపు ఇదే శాతం ఓట్లు వచ్చాయి. ఈ అంశాన్ని పరిశీలిస్తే జనసేన ఓట్లు ఖచ్చితంగా టిడిపికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
  • 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే టిడిపి-జనసేన కూటమిగా పోటీచేసి ఉంటే రెండు పార్టీలు కలిసి 58 సీట్లు గెలిచే అవకాశాలు ఉండేవి.
  • 2019 జగన్ హవాలో కూడా జనసేన-టిడిపికి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే 34 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉండేది. వీటితోపాటు జనసేన-టిడిపి గెలుపొందిన స్థానాలు 24. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది?
  • 2019 వైఎస్ఆర్సిపి హవాలో కూడా జనసేన-టిడిపి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి 1 నుండి 2 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 10.3 నుండి 5 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 11. ఈ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్సిపి పై ప్రజల అభిప్రాయం ఏవిధంగా ఉంది? ఈ నియోజకవర్గాల్లో ప్రజలేమైనా మార్పు కోరుకుంటున్నారా?
  • 2023 లో శాసనమండలికి (పట్టభద్రులు) జరిగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా 2019లో వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్లతో పోలిస్తే ఉత్తరాంధ్రలో 18.89, తూర్పు రాయలసీమలో 19.10, పశ్చిమ రాయలసీమలో 13.37 శాతం ఓట్లను కోల్పోయింది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేక మార్పు వస్తుందా?
  • 2023లో శాసనమండలికి (పట్టభద్రులు) జరిగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా 2019లో టిడిపికి వచ్చిన ఓట్లతో పోలిస్తే ఉత్తరాంధ్రలో 4.27, తూర్పు రాయలసీమలో 5.28, పశ్చిమ రాయలసీమలో 3.78 శాతం ఓట్లను పెంచుకుంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం వైఎస్ఆర్సిపి కోల్పోయిన ఓట్లు మొత్తం టిడిపికి బదిలీ కాలేదు. కొంత శాతం మాత్రమే బదిలీ అయ్యింది. దీనికి కారణం త్రిముఖ పోటీలు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేక మార్పు వస్తుందా?
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పట్టభద్రులు తమ ఓటర్లు కాదని వైఎస్ఆర్సిపి ప్రకటించింది. నిజంగా పట్టభద్రులు వారి ఓటర్లు కాదా? బిజెపి సాధారణంగా ముస్లింలు తమ ఓటర్లు కాదని వారిని ఓట్లు అడగదు. అలాగే వైఎస్ఆర్సిపి కూడా ఈసారి పట్టభద్రులను ఓటు వేయమని అడగదా?
  • జనసేన-టిడిపి కూటమిగా ఏర్పడి రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్న తరువాత ఈ కూటమి 2014లో లాగా విజయం సాధిస్తుందా? లేక ఓటమి పాలవుతుందా?
  • జనసేన-టిడిపి కూటమి బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఈ పొత్తుపై ముస్లిలు, క్రిష్టియన్లు ఏవిధంగా స్పందిస్తారు? బిజెపితో ఈ కూటమి పొత్తు పెట్టుకుంటే మంచిదా? లేక పొత్తు పెట్టుకోకపోతే మంచిదా?
  • స్కిల్డ్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం టిడిపికి లాభమా? నష్టమా? ఈ అరెస్టు వల్ల సానుభూతి ఏమైనా వచ్చిందా? లేక టిడిపి క్యాడర్ మనోధైర్యం దెబ్బతిన్నదా?
  • మరో అవకాశం వైఎస్ఆర్సిపికి రాబోవు ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలనుకుంటున్నారా? లేక మార్పు కోరుకుంటున్నారా?
  • నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేరా?
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం సంక్షేమాన్నే కోరుకుంటున్నారా? లేక అభివృద్ధిని కోరుకుంటున్నారా?
  • వాలంటీర్లు రాబోయే ఎన్నికల్లో గెలుపోటముల్లో కీలకపాత్ర పోషించనున్నారా? లేక వారి ప్రభావం లేదా? వాలంటీర్లను తట్టుకునే వ్యవస్థ టిడిపి-జనసేన కూటమికి ఉందా?
  • వాలంటీర్ వ్యవస్థ అధికార వైఎస్ఆర్సిపికి బలమా? గుదిబండనా? గ్రామాల్లో వాలంటీర్ల పెత్తనంతో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారా?
  • వైఎస్ఆర్సిపికి చెందిన గ్రామసర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ప్రభుత్వంపట్ల సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తితో ఉన్నారా? వీరి అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుందా?
  • వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలపై ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తితో ఉన్నారా?
  • 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం కసితో పనిచేశారు? ఈసారి ఎన్నికల్లో కూడా వారు అదేవిధంగా పనిచేస్తారా? లేక ప్రేక్షక పాత్ర వహిస్తారా?
  • వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, నాడు-నేడు తదితర కార్యక్రమాలపట్ల ప్రజల అభిప్రాయం ఏవిధంగా ఉంది?
  • తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన మహానాడులో విడుదల చేసిన “భవిష్యత్ గ్యారంటి” మినీ మ్యానిఫెస్టోపై ప్రజలు ఏం అనుకుంటున్నారు?
  • తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విజయవంతం అయ్యిందా? లేక విఫలమయిందా?
  • టిడిపి యువనేత నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రవల్ల పార్టీకి ఏమైనా మేలు జరిగిందా? యువతను ఆకట్టుకోవడంలో అతను సఫలీకృతం అయ్యాడా? లేక విఫలమయ్యాడా?
  • జనసేన పార్టీ అధినేత గత నాలుగున్నర సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా వారాహి యాత్ర, జనవాణి, కౌలురైతులకు ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం ఏవిధంగా ఉంది?
  • ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, తటస్థులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వపాలనపై సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తిగా ఉన్నారా?
  • టిడిపి… వైఎస్ఆర్సిపి రెండు ప్రభుత్వాలను పోల్చిచూసినప్పుడు రైతాంగానికి ఏ ప్రభుత్వం ఎక్కువ మేలు చేసిందని రైతాంగం భావిస్తున్నారు?
  • వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్ని పథకాల సొమ్మును మహిళల ఖాతాలోనే జమచేస్తోంది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపట్ల వీరి అభిప్రాయం ఏమిటి? రాబోయే ఎన్నికల్లో మహిళల్లో అత్యధికశాతం ప్రభుత్వానికి మద్దతిస్తారా? లేక వారిలో ఏమన్నా మార్పు వస్తోందా?
  • నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ బండ ధరలు పెరగడానికి రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కారణమా? లేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కారణమా? రెండు ప్రభుత్వాలు కారణమా? దీనిపై ప్రజల అభిప్రాయం ఏవిధంగా ఉంది?
  • ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా? ఉండదా?
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా? లేక ఒకే రాజధాని కావాలనుకుటున్నారా? 2024 ఎన్నికలు దీనికి రిఫరెండమ్ కాబోతుందా?
  • ప్రత్యేక హెూదా, పోలవరం నిర్మాణం వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజి వంటి విభజన హామీలు వచ్చే ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావం చూపిస్తాయి?
  • 2024 అసెంబ్లీ ఎన్నికలు “జగన్ కావాలి-జగన్ వద్దు” అనే అంశంపై మాత్రమే జరుగుతుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది?
  • ఆంధ్రప్రదేశ్ ప్రతీఒక్క రాజకీయపార్టీ టిక్కెట్లు కేటాయించేముందు బయోడేటాను కాకుండా బ్యాలెన్స్ షీట్ చూసి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు డబ్బున్న అభ్యర్థులు లభిస్తారా?
  • ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో సైతం 30 కోట్లు లేకుండా పోటీచేసే పరిస్థితి ఏ అభ్యర్థికి లేదు. అధికార వైఎస్ఆర్సిపి ధనబలం ముందు టిడిపి-జనసేన కూటమి, కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు తట్టుకోగలవా? 2024 ఎన్నికల్లో ధనబలందా? లేక ప్రజాబలందా?
  • సోషల్మీడియాలో వస్తున్న వార్తలపై ప్రజలు ఏమనుకుంటున్నారు?
  • జాతీయ మీడియాతో పాటు, రాష్ట్రానికి చెందిన కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా కొన్ని టిడిపికి అనుకూలంగా మరికొన్ని సర్వేలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ సర్వేల ప్రభావం ప్రజలపై ఏమైనా ఉందా?

పై అంశాలన్నీ పరిగణలోనికి తీసుకుని శాస్త్రీయంగా విశ్లేషణ చేసినప్పుడే జనసేన-టిడిపి కూటమి ఫలిస్తుందా? లేక వికటిస్తుందా అనే ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles