Sunday, September 15, 2024

ఆశల పల్లకిలో దుబ్బాక అభ్యర్థులు

  • ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు
  • దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

బండారు రామ్మోహనరావు

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 3 నాడు పోలింగ్ జరిగింది. ఓటింగ్ రోజు నుండి ఫలితాల వెల్లడికి మధ్యన వారం రోజుల వ్యవధి ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే అది దగ్గరికి వస్తుంది. దేశంలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తో సహా దేశంలో మరొక పది రాష్ట్రాల పరిధిలో ఉన్న 54 స్థానాల్లో ఉప ఎన్నిక లు జరిగాయి. ఉప ఎన్నికల పోలింగ్ అయిపోయింది. కానీ బీహార్ రాష్ట్రంలో నవంబర్ 7న మూడవ విడత పోలింగ్ మిగిలిపోయింది. ఎన్నికల లెక్కింపు  నవంబర్ 10న జరుగుతుంది. ఫలితాలు ఆ రోజు మధ్యాహ్నం వరకు వెల్లడవుతాయి.

టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోరు

ఇక దుబ్బాక నియోజకవర్గం విషయానికి వస్తే మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్య మొదట హోరాహోరి పోరు జరిగింది. కానీ మెల్లమెల్లగా కాంగ్రెస్ వెనక్కి పోయి టిఆర్ఎస్ బిజెపి మధ్య పోటీ గా మారింది. అభ్యర్థుల పరంగా చూస్తే టిఆర్ఎస్ అభ్యర్థి దివంగత రామలింగారెడ్డి భార్య సుజాత తన భర్త గత నాలు పర్యాయాలు దుబ్బాక  ఎమ్మెల్యే గా చేసిన అభివృద్ధిని  చెప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా తన తండ్రి నాలుగు పర్యాయాలు దుబ్బాక ఎమ్మెల్యే గా చేసిన అభివృద్ధిని చెప్పారు. ఇద్దరు కూడా తమ భర్త తండ్రి సానుభూతి వారసత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు.

రఘునందనరావు బరిలో మూడొ సారి

ఇక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గతంలో 2014 ,2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానం   సంపాదించుకున్నారు.2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా రఘునందన్ రావు పోటీ చేశారు. దుబ్బాక అసెంబ్లీ పరిధిలో వచ్చిన ఓట్లు చూసుకుంటే ఆయన కాంగ్రెస్ ను తలదన్ని రెండవ స్థానానికి చేరుకున్నారు. వరుసగా ఈ మూడు ఎన్నికలను పరిశీలిస్తే మొదట 2014లో రఘునందనరావు కు సుమారు 10 శాతం ఓట్లతో 15 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.  ఆ తర్వాత 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని 14 శాతానికి పెంచుకొని 22 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత ఆరు నెలల  లోపే వచ్చిన పార్లమెంటు ఎన్నికలలో రఘునందన్ రావు కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి  సుమారు 30 వేల ఓట్లు సాధించారు. 2014 నుంచి 19 వరకు చూసుకుంటే రఘునందనరావు పరిస్థితి ఎప్పటికప్పుడు మెరుగుపడింది. ఓట్ల శాతం తోపాటు  ఓట్లు కూడా పెంచుకున్నారు.

దొమ్మాటలో కాంగ్రెస్ ప్రభ

రాజగోపాల్ పేట నియోజకవర్గం ఉన్నప్పుడు 1952 ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థి గెలిచారు.దొమ్మాట నియోజకవర్గం ఏర్పడినప్పటి  నుంచి 1983 వరకు కాంగ్రెస్ ప్రభ కొనసాగింది. 1972లో  రామచంద్రా రెడ్డి ఆ తర్వాత 1978, 1983 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐరేని లింగయ్య గెలిచారు. 1985 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభావం పూర్తిగా సన్నగిల్లింది.1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొమ్మాట రామచంద్రారెడ్డి గెలిచారు.ఆ తర్వాత వరుసగా 1989, 1994, 1999, లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.

ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి విజయం

ఆ తర్వాత 2004 ఎన్నికలలో చెరుకు ముత్యంరెడ్డి  ని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఓడించారు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు వచ్చేసరికి చెరుకు ముత్యంరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014 నుండి 2018 అసెంబ్లీ ఎన్నికలలో  వరుసగా సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. రామలింగారెడ్డి వరసగా తన ఓటు బ్యాంకు క్రమక్రమంగా పెంచుకున్నారు. గెలిచిన రెండుసార్లు మొత్తం పోలైన ఓట్ల లో 50 శాతానికి పైగా ఓట్లతో గెలిచారు.1952 తర్వాత తర్వాత డబ్భై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఇలా 50 శాతం ఓట్లతో గెలిచిన వారు రామలింగారెడ్డి తప్ప మరెవరూ లేరు.ఈ పరిస్థితిలో రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చింది.

అభివృద్ధికి దోహదం చేసిన ముత్యంరెడ్డి

2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి గెలిచినా కూడా ఆయన అంతకు ముందు మూడు సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గా ఉండి అభివృద్ధి చేసిన పనులు ఫలితాలను ప్రభావితం చేశాయి. తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు కాదు. ఇక బిజెపి ప్రభ క్రమంగా వరసగా మూడు ఎన్నికలలో ఓట్లు పెంచుకుంటూ ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టు టిఆర్ఎస్ తో పోటీ పడింది. ఒక దశలో గెలుపు బీజేపీదే అన్నంతగా ప్రచారం సాగింది.

టీఆర్ఎస్, బీజేపీలపై పందాలు

ప్రస్తుతం ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. కొందరు టిఆర్ఎస్ గెలుస్తుందని, మరి కొందరు బీజేపీ గెలుస్తుందిని అనుకుంటున్నారు. దీనిపై పందాలు కూడా కాస్తున్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో  గత ఉప ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే ఎప్పుడూ అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. 2014 నుండి 2018 వరకు  కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు చనిపోవడం వల్ల ఓటర్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారు. అందులో మొదటిది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి  దామోదర్ రెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి అందులో టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థి గుణగణాలు అభ్యర్థి తెలివితేటలు ఇవన్నీ పక్కనపెట్టి మరో మూడేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండే టిఆర్ఎస్ పార్టీ గెలుపు సాధిస్తుందని ఒక అంచనా.

మూడు పార్టీలూ మూడు రకాలుగా ప్రచారం

విద్యావంతుడైన ప్రశ్నించే అభ్యర్థిని గెలిపించండి అని బిజెపి పార్టీ ప్రచారం చేసింది. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భారీగా సుజాత కు సానుభూతితో ఆలోచించి ఓటు వేయమని చెబుతూనే, వచ్చే మూడేళ్లలో దొమ్మాట అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీని గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. టిఆర్ఎస్ బిజెపి తోడు దొంగలని తమను గెలిపిస్తే గతవైభవాన్ని తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసింది.  మొత్తానికి బీజేపీ పార్టీ అభ్యర్థి తన ప్రచారంతో అధికార పార్టీని చెమటలు పట్టించారు. వీరందరి వాదనలు విన్న ఓటర్లు తమదైన శైలిలో స్పందించి ఓట్లు వేశారు. ఇక లెక్కించడమే తరువాయి. అప్పటిదాకా అన్ని ప్రధాన పార్టీలు తామే గెలుస్తామని  నమ్మబలుకుతున్నారు. అందుకే ఆశల పల్లకిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో ఆయా పార్టీల కార్యకర్తలు కలలు కంటున్నారు. ఎవరు గెలుస్తారు అని సంగతి తేలాలంటే పదవ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

రచయిత మొబైల్ నెంబర్ :9866074027

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles