Saturday, April 27, 2024

విపక్ష నేతల కోసం బిజెపి తలుపులు తెరిచే ఉన్నాయి!

వోలేటి దివాకర్

రానున్న ఎన్నికలకు సంబంధించి సీట్లు దక్కని విపక్ష పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు చేరేందుకు వీలుగా బిజె పి తలుపులు తెరిచే ఉన్నాయి. బుధవారం రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి విలేఖర్ల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ తమ పార్టీలో ఏవరైనా చేరవచ్చని, అయితే తమ పార్టీ సిద్ధాంతాలకు లోబడి  పని చేయాల్సి  ఉంటుందని షరతు విధించారు. సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవ హరించిన సమయంలో బిజెపిలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపించారు. కొంత మంది ఆపార్టీలో చేరారు కూడా.  అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికల నాటికి ఈపరిస్థితుల్లో మార్పులు రావచ్చు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విధ్వంసం, ప్రమాదకర మద్యం విధానం కన్నా తన అధ్యక్ష పదవి ప్రధానం కాదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎపి అధ్యక్షుడిగా నియమితులవుతారట కదా అన్న ప్రశ్నపై స్పందిస్తూ పురందరేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నుంచి ఎంపిగా పోటీ చేస్తారన్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారు. అయితే ఆమె విశాఖపట్నం సీటుపైనే ఆసక్తి చూపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పేర్లు మారిస్తే నిధులు నిలిపివేత?

కేంద్రం నిధులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రన్న నేడు జగనన్న పేర్లు తో స్టిక్కర్ లు వేసుకున్నారని విమర్శించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని..కేంద్రప్రభుత్వం సీరియస్ గా ఉందని, పథకాల పేర్లు మారిస్తే నిధులు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించేందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. టూరిజం పెంపొందించేందుకు రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఈ రకమైన ప్రభుత్వం మనకు అవసరమా అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని, బీజేపీకి సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తాననీ, ఆయా జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు సమీకరణాలను తెలుసుకుంటాననీ వెల్లడించారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles