Friday, June 9, 2023

నవ వసంతానికి స్వాగతం

  • భవిష్యత్తుపై భరోసా
  • ఆత్మవిశ్వాసంతో ముందడుగు
  • మానవ వనరుల సద్వినియోగం అవశ్యం

నిన్నటి జ్ఞాపకాలను  మోసుకుంటూ, రేపటి ఆశలను రేకెత్తిస్తూ కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి జనవరి 1వ తేదీ ఇంగ్లిష్ సంవత్సరాది లాంఛనమే. గతంలో ఎలా ఉన్నా, కరోనా కాలం వచ్చినప్పటి నుంచీ అది ఎప్పుడు ముగుస్తాందా అని కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాము. కరోనా దుష్ప్రభావం దాదాపుగా ముగిసినట్లే అని, పోయిన ఏడాది ఇదే రోజు అనుకున్నాం. కానీ అలా జరగలేదు. నిను వీడని నీడను నేను… అంటూ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ఇంకా వెంటాడుతూనే ఉంది. కాకపోతే, వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత ఆశాజనకంగా సాగుతుండడం వల్ల నేడు మనలో విశ్వాసం పెరిగింది. కరోనా గురించి అతిగా భయపడవద్దని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ స్వయంక్రమశిక్షణతో ముందుకు సాగుదాం. కాలంలో ఆన్నీ సద్దుకుంటాయనే పాతమాటకు విలువిద్దాం.

Also read: పుస్తక మహోత్సవం

సాధించాల్సింది చాలా ఉంది

వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకూ సాధించాల్సింది చాలా ఉంది. నిన్నటి చీకటి నుంచి బయటపడిన కొన్ని రంగాలు వెలుగులవైపు అడుగులు వేస్తున్నాయి. నిరంతరంగా కొన్ని వెలుగుతూనే ఉన్నాయి. చీకటివెలుగుల మధ్య దేశ ప్రయాణం సాగుతోంది. ఈ మధ్యకాలంలో పల్లెలకు – పట్టణాలకు మధ్య దూరం చెరగిపోతోంది. నగరాల విస్తరణలో కొన్ని గ్రామాలు కనుమరుగైపోయినా, ఇంకా అనేక గ్రామాలు తమ ఉనికిని కాపాడుకుంటునే ఉన్నాయి. పండుగలకు, శుభకార్యాలకు, వేడుకలకు పల్లెలకు వెళ్లే సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. వారంతాలు,  సెలవుదినాల్లో పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి. వైఫై వంటి సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే, పల్లెజీవనం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో పల్లెల అభివృద్ధిపై, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కరోనా ప్రభావంతో కుంటుపడిన సర్వ వ్యవస్థలను మరమ్మత్తు చేసుకొని ముందుకు సాగడంపై అందరూ మరింతగా దృష్టి సారించాల్సిందే. 2022లో దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు అన్నింటినీ రాజకీయంగానే చూడకుండా, అన్ని పక్షాల అభివృద్ధిపై దృష్టి సారిస్తే, ప్రగతి రథచక్రాల పరుగు పెరుగుతుంది, ప్రభుత్వాల పరువు నిలుస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. అదుపు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సామాజిక ఆర్ధికశాస్త్రవేత్తలు గొల్లుమంటున్నారు.

Also read: స్వర్గానికి నిచ్చెనలు

అన్ని రంగాలూ కుదేలు

నిరుద్యోగం ఆకాశాన్ని అంటుతోంది. ప్రతిఒక్కరికీ సాఫ్ట్ వేరే రంగం ఒక్కటే ఉపాధికాదు. అది కాస్త మెరుగ్గా ఉన్నా, చాలా రంగాలు కుంటినడక నడుస్తున్నాయి. చిరుపరిశ్రమలు, హోటల్స్,  టూరిజం, మీడియా మొదలైన రంగాలన్నీ కుదేలైపోయాయి. నిర్మాణరంగం  పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కూలికి వెళ్లి పొట్టపోసుకొని జీవనం సాగించే చాలామంది బతుకుల్లో ఇంకా వెలుతురు అలుముకోలేదు. అసంఘటిత కార్మిక రంగాల ఆకలికేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రెండేళ్లల్లో కొత్త ఉద్యోగాల కల్పన సంగతి దేవుడుడెరుగు,  ఉన్న ఉద్యోగాలనే పోగొట్టుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువ.   కొన్ని దశాబ్దాల కాల ప్రయాణంలో, ఇంతగా ఉద్యోగాలను పోగొట్టుకున్న దుర్దశ ఇదే. కొన్ని తరగతులకు పరీక్షలు పెట్టకుండానే ఉత్త్నీర్ణులను చేయడం వల్ల ప్రతిభావంతుడికి – సగటు విద్యార్థికి మధ్య ఉన్న దూరం చెదిరిపోయింది. ఆన్ లైన్ పాఠాలు మొక్కుబడిగానే సాగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఎక్కువమంది ఈ విధానానికి అలవాటుపడలేదు. మొత్తంగా, విద్యార్థులకు విద్యపై ఆసక్తి తగ్గుముఖం పట్టింది, పోటీతత్త్వం నీరుగారిపోయింది. ఈ గందరగోళం నుంచి బయటపడితేకానీ, విద్యారంగం మళ్ళీ వికసించదు.నూత్న విధానంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో మంచిచెడులు రెండూ ఉన్నాయి. విద్యావిధానంపై దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరిగిన తర్వాతే కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలి. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, వ్యవసాయమే జీవధాత్రి. వ్యవసాయం లాభసాటిగా మారకపోతే రైతన్నలు కాడిపడేయడం ఖాయం. అందాకా తెచ్చుకోకుండా ప్రభుత్వాలు వ్యవసాయం సర్వతోముఖాభివృద్ధి వైపు దృష్టి సారించాలి. ఏకస్వామ్యంగా, ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకోకుండా చట్టసభల్లో, బయట నిపుణులతో చర్చించాకనే ప్రభుత్వాలు కొత్త చట్టాలను అమలులోకి తేవాలి. రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఏళ్ళుపూళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. నదీజలాల అనుసంధానం ఎప్పటి నుంచో వున్న నినాదం.

Also read: వణికిస్తున్న ఒమిక్రాన్

వాజపేయి స్వప్నం

‘స్వర్ణచతుర్భుజి’పై  మాజీ ప్రధానమంత్రి వాజ్ పెయి ఎన్నో కలలు కన్నారు. నదులు, దారుల అనుసంధానం దేశగతిని సమూలంగా మార్చివేస్తాయని తపనపడిన పాలకులలో మొదటిస్థానం వాజ్ పెయికే దక్కుతుంది. ప్రస్తుతం దేశం బిజెపి ఏలుబడిలోనే ఉంది. ఆ మహనీయుడి ఆశయాలను నెరవేర్చడం, ఆయన వేసిన అడుగుజాడల్లో ముందుకు వెళ్లడంపై నేటి పాలకులు మనసు పెట్టాలి. మానవవనరుల సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధను చూపించినవారిలో ప్రథమ ప్రధాని పీవీ నరసింహారావు. సమాజంలో అనేక రంగాలు ఉన్నట్లే, ఒక్కొక్కరికీ ఒక్కొక్క రంగంలో ప్రతిభ,ఆసక్తి ఉంటాయి. వాటిని గుర్తెరిగి, సద్వినియోగం చేసుకోవడం లాభదాయకం. స్పృశించని రంగాలు, విస్మరించిన విభాగాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని సమీక్షించుకుంటూ, మానవవవనరులను శక్తివంతంగా వాడుకుంటే  దేశవికాసం కొత్తరూపు తీసుకుంటుందని పీవీ నరసింహారావు చెప్పిన మాటలను నేటి ప్రభుత్వాలు గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మౌలిక సదుపాయాల కల్పనలో పరిపూర్ణతను సాధించుకోలేకపోయాం. సహజవనరులను సద్వినియోగం చేసుకోకపోగా, విధ్వంసం చేసిన దాఖలాలే కనిపిస్తున్నాయి. సంస్కరణ నెపంతో, ప్రైవేటీకరణ పేరుతో ముఖ్యమైన రంగాలన్నీ పరాయిమయం చేయడంపై ఆయా రంగాలపైన ఆధారపడినవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఎల్ ఐ సీ మొదలైన ఆర్ధిక వ్యవస్థలపై ప్రజల్లో గందరగోళం నెలకొంటోంది. వీటన్నిటిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన హామీలు కొత్త సంవత్సరంలో వినపడతాయని ఆశిద్దాం. సర్వ ఆరోగ్యభారత్ నిర్మాణం వైపు అడుగులు వేద్దాం. నూతన సంవత్సరం భరతజాతికి నూత్న శోభను, వినూత్న ప్రభను చేకూరుస్తుందని ఆకాంక్షిద్దాం.

Also read: యథావిధిగా ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పరీక్ష

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles