Saturday, October 16, 2021

విశాఖ ఉక్కు: రాజకీయనేతల వైఫల్యం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోడానికి ఉద్యోగులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు చేస్తున్న ఉద్యమాలు అక్కరకు వచ్చేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సమాంతరంగా విశాఖలో వివిధ వేదికలు, వివిధ మార్గాల్లో ఉద్యమాలు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించలేదు. నగరంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర సాగుతున్న రిలే నిరాహార దీక్షలకు కూడా 100రోజులు పూర్తయింది. ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, అధికారికంగా ఆ క్రతువును నిర్వహించడానికి సలహాదారులను నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని వార్తలు వెల్లువెత్తాయి. దీనితో ఉద్యోగ సంఘాల ఉద్యమం తీవ్రతరమవుతోంది.

Also read: అల్లకల్లోలం దిశగా ఆఫ్ఘానిస్థాన్

ఎవ్వరినీ లెక్క చేయని కేంద్రం

వాస్తవానికి కేంద్రాన్ని నీలదీసేంత శక్తి ఏ పార్టీకీ లేదు. ఈ బలహీనత తెలిసిన కేంద్రం తను చేయాలనుకుంటున్న కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తోంది. దీనికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ప్రస్ఫుటంగా కనిపించేదే వ్యవసాయ ఉద్యమం. దేశ రాజధాని చెంతనే తీవ్రరూపంలో రోజుల తరబడి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కరోనా, ఎండా, వాన, చలి, అరెస్టులు, కేసులు, బెదిరింపులు ఏవీ రైతు ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత మహోధ్రుతంగా ఏ ఉద్యమం జరుగలేదు. అయినప్పటికీ, కొత్త చట్టాల ఉపసంహరణ అంశంలో కేంద్రం దిగివచ్చే ప్రసక్తే లేదని అర్ధమవుతోంది. రైతులు ఉద్యమం విరమించరు -కేంద్రం దిగిరాదు. అదే తంతు నడుస్తోంది. విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ అంశం కూడా అలాగే కనిపిస్తోంది. ఈ అంశంలో కేంద్రం వెనక్కు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. పైపెచ్చు, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. రాష్ట్రంలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాయి. రాష్ట్ర బిజెపి నేతలు మాధవ్ వంటివారు కొందరు ప్రారంభంలో కాస్త హడావిడి చేసినా, ప్రస్తుతం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.

Also read: వైఎస్ ఆర్ టీపీ ఆవిర్భావం

జనసేనాని మాటేమిటి?

ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన స్థానిక క్యాడర్ ఉద్యమంలో అప్పుడప్పుడూ పాల్గొంటున్నారు కానీ, అధినేత పవన్ కల్యాణ్ మిన్నకుంటున్నారు. ఈ తీరు ఆయనకు లాభాన్ని ఇవ్వదు, పైగా నష్టాన్ని మిగిలిస్తుంది. గత ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఓటమి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక మహానగరం విశాఖపట్నం. రాష్ట్ర ప్రగతిలో, ప్రతి అంశంలో అత్యంత ముఖ్యమైన నగరం విశాఖపట్నం. ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అత్యంత కీలకం. 2009 ఎన్నికల్లో ముక్కోణపు పోటీలోనూ ఆయన అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది. అటువంటి విశాఖ ప్రాంతంలో ప్రజలకు దగ్గర కావడం, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం పవన్ కల్యాణ్ కు రాజకీయంగా అత్యంత కీలకం. కనీసం, దానిని దృష్టిలో పెట్టుకోనైనా ఉక్కుఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాలి. ఉక్కు ఉద్యోగులకు, ఉత్తరాంధ్ర వాసులకు భరోసాగా నిలబడాలి. బిజెపికి మిత్రవర్గ పార్టీగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇబ్బందులు ఉంటే  ప్రధానమంత్రిని, కీలక మంత్రులను, నేతలను కలిసి ప్రైవేటీకరణను ఉపసంహరించుకొనేలా ఒప్పించాలి. ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అందులో విజయం సాధిస్తే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ పెరుగుతుంది. ఉత్తరాంధ్ర వాసులు, విశాఖ ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలను తనతో కలుపుకొని దిల్లీ తీసుకెళ్లాలి. ఆయనతో పాటు కలిసోచ్చే పార్టీలను జత కలుపుకోవాలి. ఇవన్నీ పవన్ కు, జనసేనకు లాభాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోయినా పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలను ప్రజలు హర్షిస్తారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర బిజెపి నేతలు కూడా తోడు కలిస్తే ఆ లాభంలో వాటా  వాళ్ళకూ దక్కతుంది. బిజెపికి అతీతంగా జనసేన తరపున ప్రజాఉద్యమం చేస్తే, పవన్ కల్యాణ్ ప్రభ ఎన్నోరెట్లు పెరుగుతుంది.

Also read: మంత్రమండలి విస్తరణ ఎన్నికల కోసమే!

చేష్టలుడిగిన చంద్రబాబు

తెన్నేటి విశ్వనాథం వంటి మహానాయకులు ప్రజా ఉద్యమాన్ని మిన్నంటేలా నడిపించారు. స్టీల్ ప్లాంట్ ను సాధించారు. అత్యంత ప్రజాభిమానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ స్థాయిలో ఉద్యమించే నాయకుడు దివిటీవేసి వెతికినా నేడు కనిపించడం లేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అంశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరు కూడా ఏమీ బాగా లేదు. ఇటువంటి ప్రజాసమస్యలను భుజానికెత్తుకొని నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతలపైనే ఉంది. కేవలం పార్టీ నేతలు పాల్గొంటే సరిపోదు. అగ్రనేతగా ఆయన కీలకమైన భూమిక పోషించాలి. నిరసనల తీవ్రత దిల్లీకి కూడా తాకేట్లు కదులుతామని ఉద్యమసంఘాలు అంటున్నాయి. వీరికి బాసటగా నిలవడంలో చంద్రబాబు ముందుకు రావాలి. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ ను సాధించుకోడానికి ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఆ స్థాయిలో జరిగితే తప్ప కేంద్రం దిగిరాదని నేతలు తెలుసుకోవాలి. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే మాట తుక్కులో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకుంటే, ఆ నేతలను ప్రజలు క్షమించరు. అధికార, ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలందరికీ ఇది పరీక్షా సమయం, దీక్షా సమయం. స్టీల్ ప్లాంట్ ను కాపోడుకోలేకపోతే, చేతగానివాళ్ళుగా మిగిలిపోతారు.

Also read: విశాఖ ఉక్కు దక్కదా?

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles