Tuesday, April 16, 2024

మంత్రిమండలి విస్తరణ ఎన్నికల కోసమే!

కొన్నాళ్ళుగా వార్తా విహారం చేస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ క్రతువు పూర్తయింది. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగానే కేబినెట్ విస్తరణ జరిగిందని భావించాలి. ఎన్నికల్లో గెలవడమే పరమావధి అని మరోసారి రుజువయ్యింది. “మినిమమ్ గవర్నమెంట్ -మాక్జిమమ్ గవర్నెన్స్” అనే మాట అంటూ ఉంటారు. తక్కువమంది పాలకులతో ఎక్కువ పాలన అందించడం అని దానికి తాత్పర్యం చెప్పుకోవాలి. పాలనా ఎట్లా ఉన్నా ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ తీరుచూస్తుంటే పాలకుల సంఖ్య పెరిగింది.

అతి పెద్ద మంత్రిమండలి

మనకున్న సభ్యుల సంఖ్య ప్రకారం చూస్తే 81మంది వరకూ మంత్రులు ఉండవచ్చు. నేటి విస్తరణతో ఆ సంఖ్య 53 నుంచి 77కు పెరిగింది. మరో నలుగురికి అవకాశం ఇస్తే  అది కూడా పరిసమాప్తి అవుతుంది. మళ్ళీ విస్తరణ ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. సమీకరణల ప్రకారం ఎవరినైనా తృప్తి పరచాలనుకుంటే ఆ పనిచేస్తారు. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. ప్రస్తుత అంశానికి వస్తే  యువతకు, విద్యాధికులకు పెద్దపీటవేశారని భావించాలి. మహిళలకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాముఖ్యతను ఇచ్చారు. సామాజిక సమతుల్యత కూడా పాటించారు. ప్రాంతీయ సమతుల్యత ఆశించిన చందంలో జరుగలేదు. దక్షిణాదికి, ముఖ్యంగా తెలుగురాష్ట్రాలకు, అందునా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగలేదు. దక్షిణాదిలో బిజెపి బలం తక్కువగానే ఉంది. అది ఒక కారణం కావచ్చు. ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా లేవు. అదీ ఒక కారణమే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలపరుచుకోవాలి, అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉన్న బిజెపి తెలుగు రాష్ట్రాలపై ఇంతగా సీతకన్ను వేయడం భావ్యం కాదనే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి. తెలంగాణలో కిషన్ రెడ్డికి పదోన్నతితో పాటు, మరొకరికి అవకాశం దక్కుతుందని అనుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావుకు చోటు దక్కుతుందని కొంత ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికి కూడా దక్కకపోవడం మరీ అన్యాయం.  ఆ పార్టీకి లోక్ సభ సభ్యులు లేకపోయినా రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలినవారికి ఎట్లా ఉన్నా టీజి వెంకటేష్ కు దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జివిఎల్ నరసింహారావు పేరు కూడా వినపడింది. ఉత్తరప్రదేశ్ నుంచి సభ్యత్వం పొందినా ఇతనికి దక్కివుంటే  తెలుగువానికి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి దక్కినట్లుండేది. కానీ అది జరుగలేదు. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా పదోన్నతి లభించడం తెలుగువారికి హర్షదాయకమే. సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ‘సహకార మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటుచేయాలని ప్రధాని నిర్ణయించారు. ఆ శాఖ కూడా అమిత్ షాకు జతచేశారు. కిషన్ రెడ్డికి ఈ శాఖను కేటాయిస్తారని ఊహాగానాలు వచ్చాయి.

Also read: విశాఖ ఉక్కు దక్కదా?

తెలుగు రాష్ట్రాలపై శీతకన్ను

మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు మిజోరాం గవర్నర్ గా పదవి లభించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర మంత్రి పదవి హుళక్కేనని కొందరు అంచనా కూడా వేశారు. అలాగే జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎక్కువ ప్రచారం జరిగింది. అంతర్గతంగా ఏమి జరిగిందో ఆ ఊసే లేదు. మంత్రుల సగటు వయస్సు 60 నుంచి 58కి తగ్గడం ఒక విశేషం. ఆ విధంగా, మంత్రివర్గం సగటు వయస్సులో యవ్వనత్వం పెరిగింది. ఇది మంచి పరిణామామే. వయసు మళ్ళిన ముదుసలికంటే యువకులు ఎక్కువ శక్తివంతంగా పనిచేయడానికి శారీరక ఆరోగ్యం కలిసొచ్చే అంశం. అదే సమయంలో పరిణతి, అనుభవం కూడా ముఖ్యం. నేటి విస్తరణతో ఆ సమతుల్యత పెరిగింది. ప్రకాష్ జావడేకర్,రవిశంకర్ ప్రసాద్ వంటివారు పదవులను కోల్పోవడం విస్మయానికి గురి చేస్తోంది. వారు అధిష్టానానికి అత్యంత విశ్వాసపాత్రులు, అనుభవజ్నులు, సమర్థులు కూడా. బహుశా వారిని పార్టీ బలోపేతానికి సద్వినియోగం చేసుకుంటారెమో.  కరోనా వైఫల్యంతో కేంద్ర ప్రభుత్వంపై వచ్చిన విమర్శల వేటుకు వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బలయ్యారు. ఆ షాక్ నేరుగా అతనికి తగిలింది. పనితీరు బాగాలేకపోవడం వల్ల మిగిలినవారిని తప్పించారు. అనారోగ్యం నేపథ్యంలో కొందరిని తప్పించారు. కరోనా ప్రభావం వల్ల ఆరోగ్య రంగం ఎంత దెబ్బతిన్నదో, ఆర్ధిక రంగం కూడా అంతే దెబ్బతిన్నది. ఆ లెక్కన నిర్మలా సీతారామన్ ను కూడా తొలగించాలి. కానీ అలా జరుగలేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ కు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కు,ఈశాన్య రాష్ట్రాలకు కూడా న్యాయం బాగానే జరిగింది. మహారాష్ట్రలో ఊహించిన సంఖ్య, ఆశించినవారికి దక్కలేదు.

Also read: భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు

రాణేకు పదవిపై విమర్శలు

నారాయణ రాణేకు మంత్రిపదవిని కేటాయించడం పలు విమర్శలకు తావిస్తోంది. శివసేన నుంచి కాంగ్రెస్, అక్కడ నుంచి బిజెపికి పార్టీలు మారడమే కాక  భూములు దురాక్రమించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలను లేవనెత్తింది కూడా ఒకప్పుడు బిజెపినే. అటువంటి వ్యక్తికి కేటాయించడం సరియైన చర్యకాదని చెప్పాలి. మధ్యప్రదేశ్ లో, జ్యోతిరాదిత్య సింధియాకు ముందు నుంచీ ఊహించినట్టుగానే,చోటు లభించింది.బీహార్ లో, రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడికి దెబ్బకొట్టి, లోక్ జనశక్తి పార్టీని చేతుల్లోకి తీసుకున్న పశుపతి కుమార్ పరాస్ కు మంత్రిపదవిని కేటాయించారు. ఆ విధంగా చిరాగ్ పాశ్వాన్ (రామ్ విలాస్ కుమారుడు) కు మరో దెబ్బ తగిలింది. బిజెపి అధిష్టానానికి దగ్గరివాడిగా అతనికి నిన్నటి ఎన్నికల వరకూ పేరుండేది ఈ దెబ్బతో అది తేలిపోయింది. జేడీయూ 4 సీట్లు డిమాండ్ చేసింది కానీ ఒకటే దక్కింది. పోయినసారి రెండు సీట్లు కోరుకుంటే దక్కలేదని నితీశ్ కుమార్ బిజెపి కూటమి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం  తన పార్టీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఈసారి సరిపెట్టుకున్నట్లు భావించాలి. అస్సాంలో  ఊహించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ కు పదవి దక్కింది.

Also read: కశ్మీర్ లో కింకర్తవ్యం?

బీజేపీదే అగ్రభాగం

ఎన్ డి ఏ అనే పేరు ఉన్నప్పటికీ,అందులో బిజెపిదే అగ్ర భాగస్వామ్యం.ఆకాళీదళ్, శివసేన మొదలైన పార్టీలు ఇప్పటికే బయటకు వచ్చేశాయి. చిన్నాచితకా పార్టీలను కలుపుకొని  బిజెపి సింహభాగంగా ఉండి ఎన్ డి ఏ నడుస్తోంది. నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ ఇప్పటి వరకూ బలంగానే ఉంది. కరోనా కష్టాలు, అధికధరలు, ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం, ఉపాధిలేమి మొదలైన వాటితో భారతదేశ ప్రజలు మిక్కిలి కష్టాల్లో ఉన్నారు, మానసికంగా విసిగెత్తి వున్నారు. త్వరలో జరుగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్లల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాటి ప్రభావం తప్పక ఉంటుంది. నేడు జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణను గేమ్ ఛేంజర్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. సమూల్యమైన ప్రక్షాళనగా మరికొందరు భాష్యం చెబుతున్నారు. పాలకులుగా, దిల్లీలో మంత్రులుగా ఎవరున్నారన్నది ముఖ్యం కాదు.ప్రజలకు అందే మేళ్లు, పొందే సేవలు, అనుభవించే స్వేచ్ఛ, సమభావం, అభివృద్ధి, జీవితంలో వెలుగులు ముఖ్యం.కొత్త మంత్రివర్గం పనితీరు ఎట్లాగూ కొన్ని నెలల్లో తేలిపోతుంది.

Also read: దేశానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభం పీవీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles