Monday, April 22, 2024

నాన్న కంటే నాలుగు అడుగులు ‘లోపలికి…’ 

జాన్ సన్ చోరగుడి

ఎందుకు జగన్మోహన్ రెడ్డి సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన బెట్టుకుంటున్నాడు?’ నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పనిమాలా అక్కణ్ణించి మార్చి రాయాల్ని గుంటూరు వెళ్ళమని, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను ఆ స్థానంలో ప్రకటించినప్పుడు, ఎక్కువ మందికి కలిగిన అభిప్రాయమిది. కదపకుండా ఉంటే, రాయలు మళ్ళీ అక్కడ ఎటూ గెలుస్తాడు. కానీ, ఒక ఎంపీ సీటుకు భద్రత అనేది ఒక్కటే కాదు, జగన్ కు అక్కడ కావలసింది. అంతకు మించి పైకి కనిపించనిది వెతకాల్సింది మరింకేదో అక్కడ ఉంది! 

‘బ్రేక్’ పడింది!

రెండేళ్ల క్రితం గుంటూరు నుంచి విడిపోయి, నరసరావుపేట ఇప్పుడు పల్నాడు జిల్లా కేంద్రం అయింది. ఇప్పుడు అనిల్ యాదవ్ అక్కడ ఎంపీ అయితే బాపట్ల (ఎస్సీ) పోను, కృష్ణా మండలంలో అనిల్ తొలి బిసి ఎంపీ అవుతాడు. గత 40 ఏళ్లుగా రాజమండ్రి నుంచి నరసారావు పేట వరకు ‘జిటి రోడ్డు’ పొడవునా, పార్టీ ఏదైనా ఎంపీ సామాజిక వర్గం ‘కమ్మ’ మాత్రమే అయ్యేది. అయితే ఎప్పుడైనా కమ్మ ఇంటిపేరుతో బ్రాహ్మిన్ అయ్యారేమో? అనిల్ యాదవ్ రాకతో ఇప్పుడు దానికి ‘బ్రేక్’ పడింది!

ఇక్కడ కొంచెం శ్రద్ధపెట్టి గమనించాల్సింది ఏమంటే, కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న- ‘డెవలప్మెంట్ ప్రాసెస్’కు జగన్మోహన్ రెడ్డి తన సూక్ష్మ సామాజిక పరిశీలనతో చిన్నచిన్న మార్పులు చేస్తున్నాడు, అంతకు మించి ఆయన చేస్తున్నది అదనంగా ఏమీ లేదు. దాన్ని కొందరు- ‘సోషల్ ఇంజనీరింగ్’ అంటున్నారు. అయితే ఈ యాదవ్ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్)- ‘కోర్ ఏరియా’ సమీపానికి ‘రిజర్వేషన్’తో పనిలేకుండా, ఒక ప్రధాన ‘బిసి’ సామాజికవర్గం సరికొత్త ‘పవర్ సెంటర్’ కాబోతున్నది.

‘భద్రలోకం’ భగ్నమై…

నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల కోసం జగన్ పార్టీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలు- మాచెర్ల-( రెడ్డి) గురజాల-(రెడ్డి) నరసరావుపేట-(రెడ్డి) సత్తెనపల్లి-(కాపు) పెదకూరపాడు-(కమ్మ) చిలకలూరిపేట -(కాపు) వినుకొండ-(కమ్మ) ఇలా ఈ లోక్ సభ నియోజకవర్గం ముఖచిత్రం ఉంది. ఇప్పుడీ ఎంపి సీటు మార్పు కనుక జరిగి ఉండకపోతే, వెనుకబడిన కులాల ప్రాభల్యమున్న ఈ జిల్లా లేదా ఈ పార్లమెంట్ నియోజకవర్గం, ఎప్పటిలా అధిపత్య కులాల రాజకీయ అధికారంలోనే మరో ఐదేళ్లు ఉండేది. దీన్ని ‘బ్రేక్’ చేయాలని జగన్ పట్టుబట్టి ఈ మార్పు చేసాడు.

అయితే ఇన్నాళ్లూ అక్కడ అధికారాన్ని ఆస్వాదించిన ‘భద్రలోకం’ భగ్నమై, జగన్ రాజకీయాలపై- ‘విధ్వంసం’ అంటూ పుస్తకాలు కూడా రాస్తున్నారు. వాటి ఆవిష్కరణ సభలకు వామపక్ష నాయకులు మేధావులు సైతం హాజరవుతున్నారు కూడా. సందర్భం వచ్చింది కనుక చెప్పుకోవాలి… అస్సలు ఇక్కడ సమస్య ఏమంటే, కొందరు- ‘ఫ్లో’లో ఉండరు, జీవితంలో వారు ఏదో ఒక ‘చౌరస్తా’ వద్ద ఆగిపోతారు. ఆగి, వాళ్ళు ఆగిన చోటు నుంచే తమ మిగిలిన జీవిత కాలమంతా ప్రపంచాన్ని చూస్తారు, రాస్తారు. అయినా అందరికీ అన్నీ ఒకేలా అర్ధం కావాలని ‘రూలు’ ఏమీ ఉండదు. అందుకే పనిమాలా ఇప్పుడు జగన్ కి- ఎందుకీ- ‘దమ్ము’ పని అని కొందరికి అనిపిస్తున్నది.   

‘పార కొట్టుడు’

కృష్ణా మండలంలో ‘దమ్ము పని’ అంటే ఏమిటో ఇక్కడ చెప్పాలి. వరి చేలల్లో నాట్లకు ముందు, పాతరోజుల్లో- ‘మాన్యువల్’గా పొలం సిద్ధం చేస్తూ, నీళ్లు పెట్టిన పొలాన్ని పారలతో తిరగేస్తూ, మట్టి క్రింద లోతుల్లో ఉండే కలుపు మొక్కల దుబ్బుల్ని వేళ్ళతో సహా పెకలించి పీకి గట్ల మీద వేసేవారు. అలా మట్టిని తిరగేసే పనిని- ‘పార కొట్టుడు’ అనేవారు. ఆ కలుపు మొక్కలు ఎండిపోయి మట్టిలో కలిసేవి. అలాగే- రాజనీతి తంత్రంలో కూడా ఒక్కొక్క ప్రాంతానికి- “పొలం యాజమాన్య పద్ధతులు” ఒక్కొక్క మాదిరిగా ఉంటాయి. తన పొలంలో ఇకముందు కొత్త విత్తనాలు జల్లాలి, అనే ఏ రైతు అయినా ముందుగా చేసే పని ఇదే. 

ఒకప్పుడు యుద్దభూమి అయిన పల్నాడు జిల్లా, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యంతో పక్కకు నెట్టివేయబడిన ప్రాంతం. ఇక్కడి- సున్నపు రాయి, ఇతర ఖనిజాలు, పసుపు, మిర్చి, ప్రత్తి వంటి ముడిసరుకును ఇన్నాళ్లూ గుంటూరు జిల్లా ఆధిపత్య వర్గాలు తన- ‘ట్రేడ్ అండ్ కామర్స్’ కోసం వినియోగించుకుంది తప్ప, దాని నుంచి వచ్చే వాణిజ్య ప్రయోజనం పల్నాడు జిల్లా ప్రజల అభివృద్ధికి దోహదపడింది లేదు. మీకు- ‘కోటప్ప కొండ’ గుడి చాలు, ఏటా శివరాత్రికి ప్రభలతో వచ్చి, అక్కణ్ణించి తిరిగి మీ ఊళ్లకు వెనక్కి వెళ్ళండి. గుంటూరును మేము చూసుకుంటాం, అనేట్టుగా గీత గీసినట్టుగా ఒకప్పటి జిల్లా రాజకీయాలు సాగేయి.

అర్ధ జ్ఞానం

అక్కడొక ఎంపీ సీటు ఉంది కనుక, గుంటూరు నుంచి ఎవరో ఒక పెద్దాయన వచ్చి ఆర్దీవో ఆఫీసులో నామినేషన్ వేయడం వరకే అదొక నియోజకవర్గం. ఇప్పుడు నరసరావుపేట జిల్లా కావడంతో- ‘రాజ్యం’ ప్రతినిధిగా కలెక్టర్, ‘ప్రభుత్వం’ ప్రతినిధిగా ఎమ్మెల్యే/ఎంపీ లోపలికి చొచ్చుకు వెళ్లడం మొదలయింది. ఇకముందు ఇదొక అనివార్యత. కొందరు అంటారు, సంక్షేమం సరే అభివృద్ధి ఏదీ? అని. ఇదొక అర్ధ జ్ఞానపు మాట. అభివృద్ధి అనేది మనిషి కోసం అయినప్పుడు, మానవాభివృద్ధి- ‘వృద్ధి’ (‘గ్రోత్’)లో భాగం కాకుండా ఎలా ఉంటుంది, మళ్ళీ విడిగా అభివృద్ధి అంటే ఏమిటి?!

పదేళ్లు (2004-14) యూపిఏ ప్రభుత్వం అమలు చేసిన ఆర్ధిక సంస్కరణల రెండవ దశ కొనసాగింపు బాధ్యత 2014-2024 మధ్య ‘ఎన్డీఏ’ ప్రభుత్వం చేతికి వచ్చింది. బిజెపి- అదొక భాష-సంస్కృతి-జాతి వంటి సిద్ధాంతాలను నమ్మే రాజకీయ పార్టీ ప్రభుత్వం కనుక, మునుపటి ‘ఉపరితల రవాణా’ అభివృద్ధిని అది కొత్తగా- ‘పి.ఎం. గతిశక్తి’ అంటూ, కొత్త పేరుపెట్టి మునుపటి ‘మల్టి మోడల్ కనెక్టివిటీ’ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. 

దారి మళ్లించాలి

వాస్తవానికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే- ‘నడికుడి-శ్రీకాళహస్తి’ కొత్త రైల్వేలైన్ 2011-2012 లో ప్రతిపాదించారు. అది పూర్తయి ఇప్పుడు విద్యుదీకరణ జరుగుతున్నది. అయితే, అభివృద్ధి అనేది అదీ రాష్ట్ర విభజన తర్వాత తీరాంధ్ర విషయంలో, అది ఆగేది ఎంత మాత్రం కాదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది జరగలిసిందే. ఎటొచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధి ఫలాలు అన్ని సామాజిక సమూహాలకు చేరేట్టుగా ఆ ప్రగతి ప్రవాహాన్ని (‘ఛానలైజ్’) దారి మళ్లించాలి.

సరే ఇప్పుడు రైలు మార్గం ఏర్పడింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. “ఈ సారి ఇక్కడ ‘కమ్మ’ కాదు, అనిల్ యాదవ్ నరసరావుపేటకు మా ఎంపీ అభ్యర్థి” అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎన్నికల ముందు ఫిబ్రవరి 1న బడ్జెట్లో నిర్మల సీతారామన్- “మా ప్రధాని మోడీ ప్రభుత్వంలో కొత్తగా- ‘ఎనర్జీ’, ‘మినరల్’ ‘సిమెంట్’ రైల్వే కారిడార్లు వస్తున్నాయి” అని ప్రకటించింది. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా- ‘మినరల్’ ‘సిమెంట్’ రెండు కొత్త కారిడార్లు పల్నాడు జిల్లాలో వస్తాయి. అక్కడనుంచి జరగపోయే నౌకా రవాణాకు రామాయపట్నం, బందరు పోర్టులు సిద్ధం అవుతున్నాయి. ఆ జిల్లాలోని అత్యధికులైన యాదవ సామాజికవర్గం నుంచి ఇప్పుడు అక్కడ యాదవ్ ‘ఎంపీ’ రాబోతున్నాడు!  

రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles