Friday, April 26, 2024

డకౌట్ల ఊబిలో విరాట్ కొహ్లీ

  • టెస్టులే కాదు…టీ-20ల్లోనూ అదే సీన్
  • అత్యధిక డకౌట్ల భారత కెప్టెన్ గా కొహ్లీ

భారత కెప్టెన్, ఆధునిక క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ డకౌట్ల ఊబిలో కూరుకుపోయాడు. టెస్టులు, టీ-20 లు అన్నతేడా లేకుండా సున్నాపరుగులకే అవుటవుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన 2021 సీజన్ తొలి టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ లో సైతం కొహ్లీ డకౌటయ్యాడు.

కెప్టెన్ గా 14వ డకౌట్:

భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్పగొప్ప రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ ఈ మధ్యకాలంలో పలు చెత్తరికార్డులను సైతం తనపేరుతోనే మూటకట్టుకొంటున్నాడు.భారత కెప్టెన్ గా అత్యధిక డకౌట్లయిన ఆటగాడిగా సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్నరికార్డును అహ్మదాబాద్ వేదికగా ముగిసిన తొలి టీ-20లో విరాట్ కొహ్లీ  డకౌట్ కావడం ద్వారా అధిగమించాడు.ఓపెనర్ రాహుల్ అవుట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన కొహ్లీ కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో జోర్డాన్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు. భారత సారథిగా కొహ్లీ 14వసారి డకౌట్ కావడం విశేషం. సౌరవ్ గంగూలీ 13 డకౌట్లు కాగా కొహ్లీ ఆ చెత్త రికార్డును తెరమరుగు చేశాడు.

Also Read: విరాట్ డక్… భారత్ ఫట్

డకౌట్లు ఆటలో భాగమే…విరాట్

తమ అభిమాన ఆటగాడు విరాట్ కొహ్లీ సెంచరీలు బాదడం మాని డకౌట్లు కావడంతో ఓ వైపు అభిమానులు ఆందోళన చెందుతుంటే మరోవైపు కెప్టెన్ కొహ్లీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.సుదీర్ఘకాలం ఆడే ఆటగాళ్ల కెరియర్ లో డకౌట్లు సహజమేనని దానికి తానూ మినహాయింపు కాదని చెప్పాడు. మంచిస్కోరు సాధించాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ కు దిగుతామని బౌలర్ల వ్యూహాలు బౌలర్లకు ఉంటాయని తనదైన ధోరణిలో చెప్పాడు. డకౌట్లను తాను ఆటలో భాగంగానే పరిగణిస్తానని వివరించాడు.

15 మాసాలుగా వైఫల్యాలు:

 32 సంవత్సరాల వయసుకే 91 టెస్టులు ఆడి 27 శతకాలు, 29 అర్థశతకాలు, 7 వేల 490 పరుగులు సాధించిన ఘనుడు. 52.38 సగటు నమోదు చేసినా గత 15 మాసాలుగా కొహ్లీని వైఫల్యం వెంటాడుతోంది. మూడంకెల స్కోరు వెక్కిరిస్తోంది. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోనే కొహ్లీ రెండుసార్లు డకౌటయ్యాడు.

టెస్టు క్రికెట్లో 12 డకౌట్లు:

గత దశాబ్దకాలంగా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్న విరాట్ కొహ్లీని టెస్టు శతకం గత 15 మాసాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ దాగుడుమూతలు ఆడుతూ వస్తోంది.కొహ్లీతో సహవాసం చేస్తూ వచ్చిన మూడంకెల స్కోర్లు  2019 డే-నైట్ టెస్టు నుంచి మొకం చాటేస్తూ వస్తున్నాయి.ఇంగ్లండ్ తో ఆఖరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో సైతం విరాట్ పరుగులేవీ చేయకుండానే అవుటయ్యాడు.వన్ డౌన్ చతేశ్వర్ పూజారా అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన కొహ్లీ ఆచితూచి ఆడుతూ ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా చివరకు పేస్ బౌలర్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో..ఓ కళ్లు చెదిరే బంతికి చిక్కాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ పట్టిన క్యాచ్ తో డకౌటయ్యాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో కొహ్లీ డకౌట్ కావడం ఇది 12వసారి. అంతేకాదు భారత కెప్టెన్ గా తన 60వ టెస్టు ఆడిన కొహ్లీ ఖాతా తెరువకుండానే ఎనిమిదోసారి.

Also Read: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబై

సున్నా పరుగులకే వెనుదిరిగాడు:              

ప్రస్తుత సిరీస్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో కొహ్లీని ఇంగ్లండ్ స్పిన్నర్ మోయిన్ అలీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత సిరీస్ లోని ఆఖరిటెస్టుగా జరిగిన నాలుగోటెస్టు తొలిఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ బెన్ స్టోక్స్ అవుట్ చేయగలిగాడు. 2014 తర్వాత తొలిసారిగా పరుగులేవీ చేయకుండానే రెండుసార్లు అవుట్ కావడం ఇదే మొదటిసారి.విరాట్ కోహ్లికి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డ‌కౌట్‌. గ‌తంలో ధోనీ సైతం కెప్టెన్‌గా  ఎనిమిదిసార్లే డ‌కౌట‌య్యాడు. ఇప్పుడు కోహ్లి డకౌట్ కావడం ద్వారా ధోనీ సరసన నిలిచాడు.అత్యధికంగా 60 టెస్టుల్లో నాయకత్వం వహించడం ద్వారా ధోనీ పేరుతో ఉన్న రికార్డును స‌మం చేసిన కోహ్లి చివరకు డకౌట్లలోనూ సమఉజ్జీగా నిలిచాడు.

పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కంటే కూడా కోహ్లి ఎక్కువ‌సార్లు డ‌కౌటైన ఆటగాడిగా నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డ‌కౌట్ కాగా విరాట్ 12సార్లు డ‌కౌట‌య్యాడు. టెస్టుల్లో ఇషాంత్ శ‌ర్మ పేరుతోనే అత్యధికంగా 32 డ‌కౌట్ల‌ రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ డకౌట్ కావడం ఇదే మొదటిసారికాదు. ప్రస్తుత టెస్టుకు ముందు వరకూ పదిసార్లు డకౌట్ గా వెనుదిరిగిన రికార్డు కొహ్లీకి ఉంది.

Also Read: టీ-20 రికార్డుల వేటలో కొహ్లీ,రోహిత్                  

మూడు ఫార్మాట్లలోనూ 28 డకౌట్లు:

తన కెరియర్ లో ప్రస్తుత  అహ్మదాబాద్ తొలి టీ-20 మ్యాచ్ వరకూ 91 టెస్టులు, 251 వన్డేలు, 86 టీ-20 మ్యాచ్ లు ఆడి 70 శతకాలు, 19వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లికి మొత్తం 28 డకౌట్లున్నాయి. భారత కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ అత్యధికంగా 13 డకౌట్ల రికార్డు ను మూటగట్టుకొన్నాడు. చివరకు ఆ రికార్డును సైతం కొహ్లీ 14వ డకౌట్ తో అధిగమించాడు.సిరీస్ లోని మిగిలిన నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో నైనా కొహ్లీ పుంజుకొని తనదైనశైలిలో ఆడితే వ్యక్తిగతంగా విరాట్ కు, జట్టుకు, అభిమానులకు ఊరట కలిగినట్లే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles