Friday, April 26, 2024

యుద్ధానికి సిద్ధం అవుతున్న దళపతి

తమిళులు “తలైవర్” (అధిపతి/దళపతి) గా పిలుచుకునే సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు,  ప్రత్యక్ష రాజకీయాల్లోకి  కాలు మోపుతున్నట్లు ప్రకటించారు. మరో ఐదు నెలల్లో  తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ ప్రకటన రాజకీయ రంగస్థలంలో  పెను సంచలనంగా మారింది. రజనీ వీరాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ పేరు ఇంకా నామకరణం చేయవలసి వుంది. ఈ డిసెంబర్ నెలాఖరున ప్రకటించే అవకాశం ఉంది. 2021 ప్రథమార్ధంలో జరుగబోయే ఎన్నికల్లో రజినీకాంత్ స్థాపించబోయే పార్టీ బరిలో నిలువనుంది. “ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరుగదు” అని రజనీకాంత్ తాజాగా రాసిన వాక్యం తమిళనాట వేడి పుట్టిస్తోంది. రజనీ స్వయంగా ఎన్నికల్లో నిల్చుంటారా, కింగ్ మేకర్ గా ఉంటారా ఇంకా తేలాల్సివుంది.

ప్రాబల్యంలో రజినీకాంత్ దే అగ్రస్థానం

ఒకటి మాత్రం నిజం! తమిళనాట జనాకర్షణ కలిగిన స్టార్ డమ్ లో రజినీకాంత్ దే అగ్రస్థానం. అదే విధంగా రాజకీయంగానూ “శూన్యత” ఉంది. మొన్నటి వరకూ తమిళనాడును శాసించిన జయలలిత, తమిళులను కదిలించిన కరుణానిధి నేడు లేరు. ఆ  స్థానం తనకు దక్కుతుందనే  విశ్వాసమే  రజనీకాంత్ ను రాజకీయాలవైపు  మళ్లించి ఉంటుంది. మరో స్టార్ కమల్ హసన్ కూడా రాజకీయాల్లో ఉన్నా, రజనీకి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ అతనికి లేదు. తమిళనాడులో ఎప్పటి నుండో చక్రం తిప్పుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు రెండే రెండు. ఒకటి  డి ఎం కె, రెండోది అన్నా డి ఎం కె. ప్రస్తుతం అన్నా డి ఎం కె అధికారంలో ఉంది. అది కూడా బిజెపి, ఇతర మిత్ర పక్షాల సహకారంతోనే కాలం వెళ్లబుచ్చుతోంది.

పళని, పన్నీరు ఇద్దరూ బలహీనులే

ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి, ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం ఇద్దరూ బలహీనమైన నాయకులే. ఇద్దరూ జయలలిత “తల్లి” చాటుబిడ్డలే. ముఖ్యంగా పన్నీరు సెల్వం. పళనిస్వామి శశికళ అండతోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇద్దరు నాయకులూ నరేంద్రమోదీ దగ్గర పోటీపడి సాగిలపడి, అధికార పీఠంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి “గాడ్ మదర్” శశికళ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆన్నీ కలిసివస్తే, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటే, జనవరిలో జైలు నుండి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో తేలాల్సివుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కసి ఆమెకు బాగానే ఉంది. పోయినసారి  తప్పిపోయింది. ఇప్పుడు  ఊరుకుంటుందా? అన్నది సందేహం.

పళనిస్వామి పదవి వదులుకుంటారా?

 పళనిస్వామి ఇప్పటికే పదవి రుచికి అలవాటు పడ్డాడు. రేపు ఈమె కోసం త్యాగం చేస్తాడా, ససేమిరా అంటాడా చూడాలి. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంకు పోయినసారి ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఎట్టకేలకు రాజీపడి, పళనిస్వామితో సర్దుకుంటున్నాడు. ఎంత సర్దుకున్నా, వీరిద్దరివీ రెండు గ్రూపులు. రజనీకాంత్ పార్టీ  ఎన్నికల బరిలో నిలుచున్న విధానాన్ని బట్టి , శశికళ, పళనిస్వామి కదలికలు అనుసరించి, పన్నీరు సెల్వం వర్గం నిర్ణయాలు ఉంటాయని భావించాలి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న రెండవ పెద్ద పార్టీ డి ఎం కె. దీనికి ప్రధాన నాయకుడుగా స్టాలిన్ వున్నారు. ఈ పార్టీకి ఇతనే ప్రధానమైన ఆకర్షణ కూడా. సోదరుడు అళగిరి రూపంలో ఇంటిపోరు ఉన్నా, స్టాలిన్ ను బలమైన నాయకుడుగానే చెప్పాలి.

స్టాలిన్ వారసుడు సిద్ధం

వ్యక్తిగతంగా ఆరోగ్యం అంతగా బాగాలేదు. అందుకే కొడుకు  ఉదయనిధి స్టాలిన్ ను కూడా రంగంలో దింపారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, పార్టీ యువవిభాగానికి నేతగా ప్రచారంలో తిరిగాడు. ఇతను సినిమా నటుడు, నిర్మాత కూడా. తాత కరుణానిధి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతనికి ఇప్పటి వరకూ చెప్పుకోతగ్గ గుర్తింపు ఏమీ లేదు. తండ్రి చాటు బిడ్డయే. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే, డి ఎం కె పార్టీకి, స్టాలిన్ బృందానికి ఈసారి ఎన్నికల్లో గెలవడానికి కొంత అవకాశాలు ఉండేవి. ప్రస్తుత వాతావరణంలో  కష్టమే అనిపిస్తోంది. అత్యంత బలమైన నేత  జయలలిత  లేకపోవడం, ప్రత్యర్థి పార్టీ నాయకులైన పళనిస్వామి, పన్నీరు సెల్వం బలహీనమైన నాయకులై ఉండడం, డి ఎం కె పార్టీ అధికారానికి కొంతకాలం నుండి దూరంకావడం మొదలైన కారణాలు స్టాలిన్ బృందానికి కలిసొచ్చే అంశాలుగా నిన్నటి దాకా చెప్పుకున్నారు. ఇప్పుడు దృశ్యం మారనుంది. అదే సమయంలో కరుణానిధికున్న స్టార్ డమ్ స్టాలిన్ కు లేదు. చెడ్డపేరు కూడా బాగానే మూట కట్టుకున్నాడు.

రెండు ద్రవిడ పార్టీలతో విసిగిపోయిన తమిళులు

నిజం చెప్పాలంటే, డి ఎం కె, అన్నా డి ఎం కె తో తమిళ ప్రజలు చాలా వరకూ విసుగెత్తివున్నారు. ఇటువంటి తరుణంలో, రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమే. మార్పును కోరుకుంటున్న ప్రజలకు ఆపద్బాంధవుడిలా రజనీ ఎదురుగా కనిపిస్తున్నాడు. తలైవర్  రజినీకి  అభిమానుల సహకారం ఎలాగూ ఉంటుంది. తాజాగా, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధృవీకరించే విధంగా ప్రకటన  చేసినప్పటికీ,  అనేక సందేహాలు, అనుమానాలు, సవాళ్లు కనిపిస్తున్నాయి. వైదిక వ్యవస్థను, సనాతన హిందూ ధర్మాన్ని బలంగా విశ్వసించే రజనీకాంత్ -సమానధర్మాలు కలిగిన బిజెపి మధ్య రసాయనం (కెమిస్ట్రీ), ప్రయాణం ఎలా ఉంటాయో, ఎన్నికల్లో  ఇరు పార్టీలు కలిసి సాగుతాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బీజేపీ భవిష్యత్తు బాట ఏది?

ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నా డి ఎం కె తో బిజెపి  కలిసి సాగుతోంది. ఈ బంధం తెగుతుందా లేదా ఈ పక్షాలన్నీ కలిసి రజనీకాంత్ వైపు నిల్చొని, డి ఎం కె ను అధికారంలోకి రాకుండా చేస్తాయా అనే అనుమానాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అధికారం దక్కించుకోవాలనే కోరికలు, వ్యూహాలు బిజెపికి ఉన్నాయి. బిజెపి పొత్తు లేకుండా  ఒంటరిగానే తన సత్తా ఏమిటో చూపించుకోవాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్లుగా తమిళనాట వినిపిస్తోంది. కమల్, రజనీకాంత్ కలిసి సాగే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే రెండూ భిన్న ధృవాలు. కమల్ నాస్తికుడు, రజనీ ఆస్తికుడు. ఆధ్యాత్మిక, సెక్యూలర్  కలబోతగా రజనీకాంత్ పార్టీ ఉండబోతోంది, అనే మాటలు కూడా బలంగా వినపడుతున్నాయి.

వివాదరహితుడు, అగ్రనటుడు

రజినీకాంత్ అగ్రనటుడు. కోట్లాదిమంది అభిమానధనం బలంగా కలిగినవాడు. వివాదరహితుడు. అటు కరుణానిధి -ఇటు జయలలితతోనూ సఖ్యతగా మెలిగినవాడు. అతనిపై ఇంతవరకూ ఎటువంటి ఆరోపణలు కూడా లేవు. “మిస్టర్ క్లీన్” గానే అభివర్ణించాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, నేతలపై ఉన్న వ్యతిరేకతలు ఇతనికి కలిసొచ్చే అంశాలు. ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. (1) 70ఏళ్ళ వయస్సు, అనారోగ్యం (2) ఎన్నికలకు కేవలం ఐదు నెలల లోపే సమయం ఉండడం. ఇంత తక్కువ సమయంలో బూత్ స్థాయి నుండి నిర్మాణం చేసుకోవాలి (3) మిగిలిన పార్టీలు దశాబ్దాల నుండి వ్యవస్థాగతంగా వేళ్లూనుకొని ఉన్నాయి (4) సమాజం కోవిడ్ నుండి పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. ఇటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రచారం అంత ఆషామాషీ కాదు (5) రజనీ  మరాఠీవాడనే భావనలు కూడా కొందరిలో ఉన్నాయి. కుల సమీకరణాలు కూడా తమిళనాట ఎక్కువే. ఇవన్నీ సవాళ్లు.

ఎన్టీఆర్ లాగా అద్భుతం చేయగలరా?

ఆంధ్రప్రదేశ్ లో 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ప్రభంజనం సృష్టించారు. ఎన్టీఆర్ లాగా తను కూడా తక్కువ సమయంలోనే అద్భుతాలు చేసి చూపించగలననే ఆత్మవిశ్వాసం రజినీకాంత్ కు కూడా ఉన్నట్లుగా  భావించాలి. అప్పటి రాజకీయ, సామాజిక, మీడియా పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. రజినీకాంత్  పార్టీ స్థాపించి, విధి విధానాలు తెలియజేసి, ఎన్నికల వ్యూహం    ప్రకటమైతే తప్ప  చాలా ప్రశ్నలకు, సందేహాలకు, అనుమానాలకు జవాబులు దొరకవు. తన సినిమా  అభిమానుల “రజనీ మక్కళ్ మండ్రమ్” ప్రస్తుతం ప్రధాన వేదికగా ఉంది. ఇంకా  మహానిర్మాణం జరగాలి. మరో సీనియర్ నటుడు విజయకాంత్ డి ఎం డి కె పేరుతో పార్టీ స్థాపించి, రాజకీయాల్లో ఉన్నాడు. ఇతని పాత్ర లేదా భాగస్వామ్యం ఎలా ఉండబోతోందో కూడా చూడాలి.

తలైవర్ గా మంచిపేరు తెచ్చుకున్న రజిని

ఇప్పటి వరకూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని,  “తలైవర్ ” గా జేజేలు కొట్టించుకుంటున్న రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం స్వాగతనీయమే. రాజకీయ సంస్కృతి మారి, ప్రజలకు మేలు జరిగితే, విభిన్న నాయకుడిగా రజనీకాంత్ కీర్తి చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది. సినిమా స్టార్ నుండి ముఖ్యమంత్రిగా మారిన ఎం జి ఆర్ కు ఇప్పటికీ తమిళనాడులోనే గాక, దేశ రాజకీయాల్లోనూ ఎంతో మంచిపేరు ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, తనదైన ముద్ర వేసుకుంటాడని భావిస్తూ, తలైవర్ ను అభినందిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles