Wednesday, December 6, 2023

సైలెంట్ కిల్ల‌ర్‌ డ‌యాబెటిస్‌

చక్కెర వ్యాధి. ఈ వ్యాధికి పేరులోనే చక్కెర. దాని ఫలితం ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపుగా దూరమైపోయినట్లే. షుగర్‌ వ్యాధిని ఆధునిక యుగపు మహమ్మారిగా భావించవచ్చు. అత్యంత వేగంగా పరుగెడుతున్న కాలంతో పాటే అనివార్యంగా జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే షుగర్‌ వ్యాధికి అసలు కారణం. మౌలికంగా ఇది జీవన శైలి సమస్య.

వేద‌కాలంలోనూ మ‌ధుమేహ ప్ర‌స్తావ‌న‌

వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది. ఆ కాలంలో మధుమేహాన్ని ‘అశ్రవ’ అనే పేరుతో గుర్తించారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత, శుశ్రవ సంహిత, నాగభట్ట గ్రంథాలలో వివరించారు. క్రీస్తు శకానికి వెయ్యి సంవత్సరాల కిందటనే ఈ వ్యాధి వర్ణన ఉండడం విశేషం. యజ్ఞ సమయాలలో దేవతలకు సమర్పించే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు పేర్కొన్నారు. దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది.

ఆరో శ‌తాబ్దంలోనే వినియోగంలో ‘మ‌ధుమేహ’ ప‌దం

 క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన. 1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధిని పత్యం, ఔషధం, వ్యాయామంతో క్రమబద్ధీకరించవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం దాదాపుగాద అదే కావడం గమనార్హం.

ఇన్సులిన్ ఆవిష్క‌ర్త జ‌న్మ‌దిన‌మే ‘డ‌యాబెటిన్ డే’

అంత ర్జాతీయ మధుమేహ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థలు 1991 నుండి ప్రతి సంవత్సరం నవంబరు 14వ తేదిని మధుమేహ దినంగా పాటిస్తున్నాయి. 1922లో ఇన్సులిన్‌ హార్మోన్‌ను కనుగొన్న ఫ్రెడరిక్‌ బేంటింగ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లి ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న, ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహ దినాన్ని ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్ని అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది , దానివలం వచ్చే ముప్పు ఏమిటి , రాకుండా ఏమి చేయాలి , వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీలుకోవాలి అనే అంశాలను ప్రచారం చేయడమే ఈ డయాబెటిక్ డే  ముఖ్య ఉద్దేశం.

మ‌ధుమేహ రాజ‌ధానిగా భార‌త్‌

ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్‌ మారిపోయింది. మధుమేహ సమస్య భారత్‌లో అత్యధికంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 15 కోట్ల మంది, మన దేశంలో 4 కోట్ల మంది, ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. 2025 నాటికి భారత దేశంలో ఈ వ్యాధిపీడితుల సంఖ్య ఏడు కోట్లకు చేరుకోగలదని భావిస్తున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. మధుమేహం, సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది మరణిస్తున్నారు. మధుమేహం ను నిశ్శబ్దహంతకిగా అభివర్ణిస్తారు. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

అతి మూత్రం..అతి దాహం ముఖ్య ల‌క్ష‌ణాలు

మధుమేహాన్ని వైద్యభాషలో ”డయాబెటిస్‌ మెల్లిటస్‌” అని వ్యవహరిస్తారు. డయాబెటిస్‌ అని కూడా వ్యవహరించే ఈ వ్యాధి, ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), అతిగా ఆకలి వేయడము (పాలీ ఫేజియా), మంద గించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. 1921లో ఇన్సులిన్‌ అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహారపు టలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, యాంటీ డయాబెటిక్‌ మందుల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్‌ వాడకం వల్ల నియంత్రించవచ్చు. చక్కెర శాతం 400 మి.గ్రా. కన్నా ఎక్కువ కావడం – దీనినే డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ అని కూడా అంటారు. ఈ స్థితిలో ఎక్కువగా దాహం, నాలుక తడారి పోవడం, మత్తుగా ఉండడం, వాంతులు, పొత్తి కడుపునొప్పి, తలనొ ప్పి, తలతిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ దశలో కూడా తాత్సారం చేస్తే మరణానికి దారి తీయవచ్చు.

ఎట్లా నిర్దారిస్తారు?

రక్తంలో చక్కెర శాతం 60 మి.గ్రా కన్నా తగ్గడం..షుగర్ లేదా హైపోగ్లైసి మియా అంటారు. మధుమేహ వ్యాధిని రక్త, మూత్ర పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి.గ్రా. వరకు ఉంటుంది. ఇంత కన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఖాళీ కడుపుతో ఉన్న ప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ / డీఎల్‌, తిన్న తరువాత 110 నుంచి 140 ఎంజీ / డీఎల్‌ ఉండాలి. ఇంతకన్నా ఎక్కు వ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. చక్కెర వ్యాధికి ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి.

ష‌డ్రుచులు వ‌ద్దు త్రిరుచులు ముద్దు

 భారతీయ ఆహారంలో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం లాంటి ఆరు రుచుల గురించి ప్రధానంగా పేర్కొన్నారు. ఆహారంలో తప్పని సరిగా ఆరు రుచులు ఉండాలన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు కారం, వగరు, చేదు, రసాలు కలిగిన కూరగాయలు బాగా తీసుకోవలసి ఉంటుంది. శక్తిని ఇచ్చే అన్నం ఎక్కువగా తీసు కోకుండా, పొట్టు కలిగిన జొన్నరొట్టె, గోధుమ పుల్కాలు, సజ్జ రొట్టె తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది.

అలజడి, కోపం తగ్గించుకొని మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. యోగా, ధ్యానం, నడక లాంటివి చక్కెర వ్యాధి రాకుండా నిరోధిస్తాయి.

(నవంబర్ 14… మధుమేహ దినం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles