Saturday, October 16, 2021

రాజ్యాంగలక్ష్యాలను కాలదన్నే కార్యక్రమం

మానిటైజేషన్ (నగదీకరణ) విధానాన్ని ప్రకటిస్తున్న కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మలాసీతారామన్

  • జాతీయ వనరుల అద్దె ఓ విఫల విధానం
  • పలు దేశాలలో విఫలమైన నమూనా

వనరులు అద్దెకిచ్చే ప్రయత్నాలు విదేశాల్లో విఫలమైన అనుభవాలు ఉన్నాయి. 2013లో ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో కెంబ్లా రేవును, బోటానీ రేవును అద్దెకిచ్చింది. కాని అక్కడ అసెట్ మానిటైజేషన్ ప్రయోగం అంతగా విజయవంతం కాలేదు. అక్కడి రెండు రాష్ట్రాలు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశాయి. మిగతా రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని వినియోగించి ఈ ‘సంస్కరణ’ మాకొద్దన్నాయి. అక్కడ పవర్ గ్రిడ్ ను, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి వనరులను 49 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. మిగతా వనరుల అద్దెకు బిడ్ లలో పాల్గొనడానికి అంతగా ముందుకు వచ్చిన వారు తక్కువే. ఆస్ట్రేలియాలో క్వీన్స్ లాండ్ వంటి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు పక్క రాష్ట్రాలలో వనరులను అద్దెకు తీసుకోవడానికి బిడ్ లలో పాల్గొన్నాయి. అబుదాబీ, కువైట్ వంటి విదేశీ ప్రభుత్వాలు కూడా కొన్ని వనరులను అద్దెకు తీసుకున్నాయి. కెనడాకు చెందిన కొందరు వర్తకులు కూడా వచ్చారు.  కొన్నింటిని అద్దెకుతీసుకోవడానికి చైనా ముందుకు వచ్చింది. కాని సెక్యూరిటీ కారణాల వల్ల వారికి అప్పగించలేదు.

ఆస్ట్రేలియాలో అట్టర్ ఫ్లాప్

ఆస్ట్రేలియాలో ఈ వనరుల అద్దె పథకం అమలయిన ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. వినియోగదారుల సమస్యలు మిన్నుముట్టాయి. నిరుద్యోగం పెరిగింది. ఆదాయం అనుకున్నంత వచ్చిందో లేదో లెక్క తేలలేదు. భారతీయ వనరులను ఈ విధంగా ఇతర దేశాలు లేదా ఆదేశాల వర్తకులు కంపినీలు అద్దెకు తీసుకోవడం ఈ దేశానికి మంచిదా? మనశత్రువులు పరోక్షంగా వేరే కంపినీల ముసుగులో మన వనరులను అద్దెకు తీసుకుని పెత్తనం సాధిస్తే మన భద్రత గతేమిటి? ‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి మార్కెంటింగ్ ఆఫ్ ఇండియాకు వైపు నడుస్తున్నామా?

ప్రజోపయోగకరమైన వనరులపై పెత్తనాన్ని విచక్షణారహితంగా అసమర్థ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే సామాన్య ప్రజ నష్టపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ రాడ్ సిమ్స్ భారతదేశానికి ఒక హెచ్చరిక చేసారు. ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి ప్రయివేటీకరించండి. లేదా ప్రయివేటీకరించడం మానేయండి అని సలహా ఇచ్చారు.

న్యూసౌత్ వేల్స్ లో సమస్యలు

న్యూసౌత్ వేల్స్ లో కూడా సమస్యలు వచ్చాయి. ఎలక్ట్రిసిటీ లైన్లు స్తంభాలు ప్రయివేటీకరించారు. దాని ఫలితం కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ప్రజాప్రయోజనాలు ఎందుకు చూస్తారు. వేలంలో ఎక్కువ రేటుకు కంట్రాక్టు సంపాదించిన వాడికి ప్రజల బాగోగులు పట్టవు కదా. మనం కూడా కరెంటు స్తంభాలు ప్రయివేటీకరించిన తరువాత ఇక్కడ మామూలు జనం గతి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు కరెంటు రేట్లు పెంచితే భరించలేక ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయిన చరిత్ర, ప్రభుత్వాలను మార్చిన చరిత్ర మనది.

సింగపూర్లో రైళ్ల ఆరళ్లు

సింగపూర్లో సబర్బన్ రైళ్లను సిగ్నలింగ్ వ్యవస్థను ప్రయివేట్ ఆపరేటర్లకు ఇచ్చారు. వారు డబ్బులేకనో, అనుభవంలేకనో సరిగ్గా పెట్టుబడులు పెట్టలేక, నడపలేకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. రైళ్లు ఆగిపోవడం, కదుల్తాయోలేదో తెలియకపోవడం, ప్రయాణీకులు ఆగ్రహోదగ్రులు కావడం వారి అనుభవాలు. కాని ఈ పాఠాలు అర్థం చేసుకునే ప్రయత్నమే లేదు.

సంస్కృతి,  స్వత్వం, జాతీయత అని నీతులు చెప్పడానికి రాజనీతికి సంబంధం లేదనుకోవాలా? ఇక మనందరి మూతులకు గుడ్డలు (మాస్క్) కట్టి నోళ్లు మూసి ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ సంపన్నులకు దేశ సంపదను కట్టబెట్టే దుర్మార్గాన్ని హాయిగా అమలు చేస్తే మన ఆర్థికవ్యవస్థ ఏమవుతుంది?మాస్క్ ల వెనుక మాట పెగలడం లేదా? కొత్త, పాత కేసుల్లో కూరుకుపోయిన రాష్ట్రాధినేతలు తమ పదవులు కాపాడుకోవడం కోసం డిల్లీ సుల్తాన్ లకు దాసోహం అంటే రాష్ట్రాలలో వ్యవస్థల గతి ఏమిటి? డిమానిటైజేషన్ తో ప్రతి సామాన్యుడి బతుకును అల్లకల్లోలం కావడం చూశాం. ఇప్పుడు మానిటైజేషన్ తో జాతి సంపద అద్దెకిస్తా కార్యక్రమం ఈ ఏడాదినుంచే అమలు కాబోతున్నది. ఇది ముఖ్యమంత్రులకు, ఎంపీలకు, ఇతర ప్రతిపక్ష రాజకీయనాయకులకు అర్థమయ్యే లోగా చేయిదాటే పోతుందా? ఇంకా వివరాలు లోతుగా పరిశోధించడం అవసరం. 

బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్

ఇదివరకే వ్యవస్థాపితమైన మౌలిక వనరులను బదిలీ చేసి కొత్త వనరులను సృష్టించడాన్ని ఇంగ్లీషులో బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు అంటారు. సొంతంగా పెట్టుబడులు పెట్టి కొత్తగా వనరులు నిర్మించడాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. దశాబ్దాలుగా నిర్మించిన ఆస్తులు అమ్ముకొని పప్పుబెల్లాలు తినడాన్ని ఏమంటారో ఇంకా తెలియదు. అప్పు చేసి పప్పుకూడు అన్న తెలుగు నుడికారం ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఇది అమ్ముకోవడం కనుక. అదనంగా మౌలిక వనరుల సంపద సృష్టించడానికి, ఇప్పుడున్న జాతీయ మౌలిక వనరులపై అదుపును, యాజమాన్యాన్ని, లాభాలు చేసుకునే అధికారాన్ని ప్రయివేటు వ్యక్తులు లేదా సంస్థల పరం చేయడమే మానిటైజేషన్. చట్టం ప్రకారం అమ్మినా, అద్దెకిచ్చినా, బహుమతిగా ఇచ్చినా ఆస్తి బదిలీ అన్నట్టే. అమ్ముకోవడం అంటే బాగుండదని నగదీకరణ అంటున్నారు. సామాన్యుడు మరణిస్తే పత్రికలు శవం అంటాయి. అదే గొప్ప నాయకుడు పోతే ‘పార్థివదేహం’ అంటారు. ‘పార్థివదేహం’ వంటి అందమైన ప్రత్యామ్నాయ పదాలు ఈ అద్దెకిస్తా అనే సరికొత్త ఆర్థిక విప్లవాత్మక సంస్కరణకు తగిలిస్తున్నారు.

ఆగస్టు 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ నగదీకరణ ప్రణాళిక (పైప్ లైన్)ను ప్రకటించినప్పడినుంచి సోషల్ మీడియాలో రకరకాల జోకులు, కార్టూన్లు, వ్యంగ్యవ్యాఖ్యలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ఇప్పడినుంచి నాలుగేళ్లలో 6 లక్షల (5.96 లక్షల) కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ నగదీకరణ అలియాస్ అద్దె, తాకట్టు, ఆస్తిబదిలీ, పెత్తన బదిలీ లేదా లాభార్జనానుమతి ద్వారా సమకూర్చుకుంటారన్నమాట. ఇంత సొమ్ము దేనికి అంటే కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులకు అంటే మౌలిక వనరుల నిర్మాణానికి అని చెబుతున్నారు. దీన్ని అసెట్ రీసైకిలింగ్ అని కూడా అంటున్నారు. ప్రభుత్వ వనరులకు సామాన్యప్రజలే వినియోగదారులు. వారికి ఏం జరుగుతుందో తెలియాలి. ఇటువంటి వనరుల బదిలీ విధానాలు పారదర్శకంగా ఉండాలి. వారి పైన పడే ప్రభావం ఏమిటో తెలియాలి. ఆస్ట్రేలియా తదితర దేశాల అనుభవాలు పరిశీలిస్తే అది అసాధ్యం అని అర్థం కావడం లేదా? లేదు మనం ఆస్ట్రేలియా కన్న సమర్థులం కనుక ఆరులక్షల కోట్లు సంపాదిస్తామనే అనుకుందామా.

ఆ వైఫల్యంలోంచి మన నేతల తలల్లో అద్దెకిస్తా ఆలోచన ఉదయించింది. రెడ్ టేప్ అంటే మన దేశాన్ని తలచుకోవలసిందే. మన బాబూగణ్ నిద్రలేచేసరికి పైదేశాల్లో ప్రతిపాదనలు తుదిరూపులో ఉంటాయి. వాళ్ల ఆస్తులు వారు సమర్థవంతంగా దేశానికి నష్టం రాకుండా అమ్ముకోగలుగుతారు. మనం నిద్రలేచేసమయానికి కొనుక్కునే వాడు ఉండడు. లేదా వాడిదగ్గర డబ్బు ఉండదు. ఇదంతా ఎందుకు? మన నేతల తపన అంతా మనవారికి దేశ సంపదను ఎంతో భక్తితో కట్టబెట్టడానికే కదా. అసలు ఇదేనా దేశ భక్తి?

మన రాజ్యాంగం ఏమంటోంది?

ఆర్టికిల్ 37. రాజ్యాంగం పార్ట్ 4లో ఉన్నఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల్లో అమలు చేయడానికి వీల్లేదు కానీ ఈ సూత్రాలు దేశ పరిపాలనలో మౌలిక సూత్రాలని మరువరాదు. చట్టాలు (విధానాలు) చేసేటప్పుడు ఈ సూత్రాలను వర్తింపజేయడం ప్రభుత్వాల బాధ్యత. (Article 37. The provisions contained in this Part shall not be enforceable by any court, but the principles therein laid down are nevertheless fundamental in the governance of the country and it shall be the duty of the State to apply these principles in making laws)

ఆర్టికిల్ 38(1) ప్రజా సంక్షేమం కోసం పాటుపడడం ఎంత ముఖ్యం అంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ఒక సాంఘిక వ్యవస్థను నెలకొల్పేంత. జాతీయ జీవనంలో పొందుపరచవలసిన బాధ్యత. (2) ముఖ్యంగా ఆదాయాల్లో అసమానతలు తొలగించాలి. హొదా, వనరులు, సౌకర్యాలు, అవకాశాలు విషయంలో వ్యక్తుల మధ్య వర్గాల మధ్య అసమానతలను తొలగించడానికి రాజ్యం కృషి చేయాలి. [Article 38. 1 (1) The State shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political, shall inform all the institutions of the national life. 2 (2) The State shall, in particular, strive to minimise the inequalities in income, and endeavour to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst individuals but also amongst groups of people residing in different areas or engaged in different vocations.]

ఆర్టికిల్ 39: పౌరులు- అంటే మగవారు, మహిళలు సమానంగా సరిపోయేంతగా జీవనోపాథి మార్గాలు కలిగి ఉండేట్టు చూడడం, మానవ సమాజానికి చెందిన మౌలిక వనరుల యాజమాన్యం అదుపు జనబాహుళ్యపు ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా పంపిణీ చేయాలి. ఆర్థికవ్యవస్థను ఏ విధంగా నిర్వహించాలంటే జాతి సంపద, ఉత్పత్తి వనరులు ఉమ్మడి ప్రయోజనాలను విఘాతం కలిగించే విధంగా కేంద్రీకృతం కాకూడదు. (Article 39. The State shall, in particular, direct its policy towards securing— (a) that the citizens, men and women equally, have the right to an adequate means of livelihood; (b) that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good; (c) that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment]

ఈ మూడు ప్రాథమిక ఆదేశిక పాలనా  రాజ్యాంగ సూత్రాలను ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను అద్దెకివ్వడం అనే మానిటైజేషన్ పూర్తిగా ఉల్లంఘిస్తూ ప్రజలకు నష్టదాయకం అని గుర్తించవలసి ఉంది. ఇదిగాక సమానతా హక్కుకు ఇది పూర్తిగా విరుద్ధం. భారతరాజ్యాంగ పీఠికలో లక్ష్యాలను కాలదన్నే కార్యక్రమం.

మాడభూషి శ్రీధర్, డీన్ (లా) మహింద్రా యూనివర్సిటీ, హైదరాబాద్, మాజీకేంద్ర సమాచార కమిష్నర్

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles