Monday, June 24, 2024

ఈటల రాజేందర్ అడుగుల ఆంతర్యం ఏమిటి?

మాజీ మంత్రి ఈటర రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి శనివారంనాడు రాజీనామా సమర్పించిన రెండు గంటలలోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. రాజేందర్ విషయంలో జరిగినంత వేగంగా రాజకీయ నిర్ణయాలు మరెవ్వరి విషయంలోనూ జరగలేదంటూ అతిశయోక్తి కాదు.  ఏనుగు రవీంద్రరెడ్డి, తుల ఉమ వెంటరాగా ఉదయం అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత రాజీనామా లేఖను స్పీకర్ కి పంపించారు. పదిహేడు సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొనసాగిన రాజేందర్ ఇప్పుడు సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరు మాసాల లోపు జరగబోయే ఉపఎన్నిక కురు,పాండవ సంగ్రామాన్నీ, కురుక్షేత్రాన్నీ తలపిస్తుందని రాజేందర్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం నైతికంగా సమర్థనీయమైన చర్య. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల టిక్కెట్ల మీద గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనివారికంటే, మంత్రులుగా కొనసాగుతున్నవారికంటే రాజేందర్ నైతికంగా ఉన్నతుడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో తన పాత్ర ప్రజలకు తెలుసుననీ, నియంతను ఓడించడమే తన ఎజెండా అనీ రాజేందర్ చెప్పారు. ఫ్యూడల్ పాలనకు గోరీ కట్టడమే తన కర్తవ్యమని చాటారు.  మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి బీ-ఫాం టీఆర్ ఎస్ పార్టీ ఇచ్చినప్పటికీ తనను గెలిపించి శాసనసభకు పంపింది ప్రజలేనని చెప్పారు. సమాజానికీ, కేసీఆర్ కుటుంబానికీ మధ్య యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్న ధోరణిలోనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా మాట్లాడారు. కానీ దూకుడు పెంచారు. మాటల ఈటల పదును పెరిగింది. బీజేపీ నాయకుడు బండి సంజయ్ తరహాలో మాటలు దూసుకువస్తున్నాయి.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

తరుణ్ ఛుగ్ తో భేటీ

శుక్రవారంనాడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ ఛుగ్ ని కలుసుకొని రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, డాక్టర్ లక్ష్మణ్, తదితర నేతల సమక్షంలో రాజేందర్ తరుణ్ ఛుగ్ ని కలుసుకున్నారు. ఈటల చేయవలసిన పనులలో ఒకటి మిగిలిపోయింది. అది బీజేపీలో లాంఛనప్రాయంగా చేరడం. సోమవారంనాడు లేదా మంగళవారంనాడు దిల్లీలో పార్టీ కేంద్ర నాయకుల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నదని అంటున్నారు. అప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులలో ఒకరుగా, బీసీ నాయకులలో ఒకరుగా చెలామణి అవుతారు. బీజేపీలో చేరడం ద్వారా ఒక సువర్ణావకాశాన్ని రాజేందర్ వదులకున్నారని పరిశీలకుల భావన.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత రాజేందర్ పట్ల ప్రజలలో సానుభూతి ఉప్పోంగింది. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైన ప్రజలలో ఆగ్రహం కనిపించింది. అదే వైఖరిలో కొంతకాలం కొనసాగమని ప్రొఫెసర్ కోదండరాం, విశ్వేశ్వరరెడ్డి చెప్పిన సలహా పాటించి ఉంటే రాజేందర్  పరిస్థితి మరో రకంగా ఉండేది. బీజేపీలో చేరిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో రవీంద్ర రెడ్డి, తుల ఉమ వంటి నలుగురైదుగురు నాయకులతోనే కాషాయపార్టీలోకి పోవలసి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి పోరాడిన రాజేందర్ సహచరులు బీజేపీని బలపరిచేవారు కాదు. ఇంతకాలం తనతో కలసి నడిచినవాళ్ళూ, కష్టసుఖాలలో పాలుపంచుకున్నవాళ్ళూ బీజేపీకి భావజాలం రీత్యా వ్యతిరేకమైనవారు. తాను సైతం తీవ్రవాద వామపక్ష భావజాలంలో ఎదిగిన నాయకుడు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎంచుకోవలసివస్తే రాజేందర్ సహచరులు టీఆర్ఎస్ నే ఎంచుకుంటారు. బండి సంజయ్, కేసీఆర్ మధ్య ఎవరో ఒకరిని ఎన్నుకోవలసి వస్తే కేసీఆర్ నే ఎన్నుకుంటారు.

బీజేపీలో చేరడం వల్ల రాజేందర్ కు వచ్చిన ప్రయోజనం ఏమిటి, కలిగిన నష్టం ఏమిటి? తరుణ్ ఛుగ్ తో రాజేందర్ సంఘీభావం తెలిపిన నాడే బెంగాల్ లో బీజేపీ నుంచి ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ కు ‘ఘర్ వాపసీ’ వచ్చారు. బీజేపీలో కొత్తవారు సర్దుకొనిపోవడం కష్టమని చెప్పడానికి తాజా ఉదాహరణ ముకుల్ రాయ్. ఆయన బీజేపీ ఉపాధ్యక్ష పదవి వదులుకొని, ఏ పార్టీని తోసిరాజని బీజేపీలోకి వెళ్ళారో తిరిగి అదే పార్టీలో తిరిగి చేరారు. ఏ పార్టీ నాయకురాలిని తప్పుపడుతూ ప్రకటనలు ఇచ్చారో తిరిగి ఆ నాయకురాలికే విధేయత ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు. ముకుల్ రాయ్ అల్లాటప్పా నాయకుడు కాదు. తృణమూల్ కాంగ్రెస్ లో అగ్రనాయకుడుగా ఉండేవారు. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నాయకులు బీజేపీలోకి వలస వెళ్ళడం ముకుల్ రాయ్ తోనే మొదలయింది. అటువంటి వ్యక్తి ఎందుకు బీజేపీలో ఊపిరాడక బయటికి వచ్చారో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ఈటల వంటి నాయకులు ఆలోచించాలి. స్వాభిమానం కొంత చంపుకొని ఈ పని చేయవలసి వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. అంత ఇబ్బంది బీజేపీలో ఏమి వచ్చింది?

Also read: తెలంగాణలో అధ్యయనం అవసరం

కాంగ్రెస్ కంటే బీజేపీ బలంగా ఉన్నదా?

రాజేందర్ కు కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానం కూడా ఉంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిలో ఒకరైన భట్టివిక్రమార్కను కలిసి చర్చించారు. కాంగ్రెస్ కంటే బీజేపీ తెలంగాణలో బలంగా ఉన్నదనీ, టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వగలదనీ రాజేందర్ భావించి ఉంటారు. వాస్తవానికి ఈ రోజుకీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై శాతం ఓట్లు ఉన్నాయి. బీజేపీ అంత బలం లేదు. కాంగ్రెస్ అన్ని జిల్లాలలోనూ ఉంది. కొన్ని జిల్లాలలో బీజేపీకి పలుకున్న అభ్యర్థులు కూడా దొరకరు. కనుక కాంగ్రెస్ కంటే బీజేపీ తెలంగాణలో ఈరోజున బలంగా ఉన్నదనే వాదన నిలబడదు. దుబ్బాకలో గెలిచి ఉండవచ్చు. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఉండవచ్చు. కానీ నాగార్జనసాగర్ ఉపఎన్నికలో బీజేపీ ఎక్కడుంది? నల్లగొండ, ఖమ్మం వంటి పాత జిల్లాలలో బీజేపీకి పెద్దగా బలం లేదన్నది వాస్తవం. రేపటి సంగతి చెప్పడం కష్టం కానీ ఈ రోజు వరకూ ఓట్లవారీగా తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానం కాంగ్రెస్ దే. హుజూరాబాద్ లో సైతం 2018లో రాజేందర్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి.

మరి బలంలేని బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఎందుకు నిర్ణయించుకున్నారు? కాంగ్రెస్ తో ముఠాలు ఉన్నాయి. కొందరు స్వాగతం చెబుతుంటే మరికొందరు మూతులు విరుస్తున్నారు. పరోక్షంగా అభ్యంతరాలు చెబుతూ వ్యాఖ్యానిస్తున్నారు.  ఆ పార్టీ బహునాయకత్వంతో, నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. కేసీఆర్ పైన యుద్ధం చేయాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నయం. రాజేందర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా భూకబ్జా కేసులు పెడుతున్నారు. ఇంకా కొత్త కేసులు కూడా పెట్టవచ్చు. రాజేందర్ ఆర్థిక ప్రయోజనాలపైన దెబ్బతీసే చర్యలు తలపెట్టవచ్చు.  తనలో అభద్రతాభావం పెంచడానికి ఇంకా ఏమైనా చేయవచ్చు. రాజకీయాలలో తలపండిన కేసీఆర్ రాజేందర్ కు ఊపిరాడకుండా చేయగలరు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏమిటి ప్రయోజనం? టీఆర్ఎస్ అధినేతను ఎదుర్కునే స్తోమత ఆ పార్టీకి లేదు. తాను ఉద్యమం చేస్తే తనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉంటారేమో. అంతే కానీ తనకు రక్షణ కల్పించలేరు. అటువంటి అవకాశం బీజేపీ కి ఉంది. బెంగాల్ లో సువేందు అధికారి కుటుంబానికి ‘వై’ కేటగరీ సెక్యూరిటీ ఇచ్చినట్టు తనకు కూడా అవసరమైతే దేశీయాంగమంత్రి అమిత్ షా అటువంటి ఏర్పాటు చేయగలరు. బీజేపీ రూపంలో ఒక రక్షణ కవచం లభించినట్టు రాజేందర్ భావించి ఉంటారు.

ఏదైనా ఒక పార్టీలో చేరాలంటే కాంగ్రెస్ కంటే బీజేపీ నయమని రాజేందర్ ఆలోచించడంలోతప్పులేదు. కానీ ఏదైనా ఒక పార్టీలో చేరాలని అనుకోవడమే తప్పు. ప్రజాభిప్రాయాన్ని పొరబాటుగా అర్థం చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.  ధైర్యం చేసి, దీర్ఘకాలిక పోరాటం చేయాలని సంకల్పించుకొని, అన్ని సన్నాహాలు చేసుకొని, తెలంగాణవాదులందరినీ సంప్రదించి కొత్త పార్టీ పెట్టి ఉంటే రాజేందర్ కథ మరో విధంగా ఉండేది. బీజేపీలో రాజేందర్ కథానాయకుడు కాజాలరు. నాయకులలో ఒకరు మాత్రమే కాగలరు. సొంతపార్టీ పెట్టుకుంటే ఆయనే కథానాయకుడు. దాదాపు పదమూడు సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం నిజాయతీగా పోరాడి, తీరా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం దరిదాపుల్లోకి పోలేకుండా దూరంగా ఉన్నవారూ, కేసీఆర్ పైన మనసు కష్టం పెట్టుకున్నవారూ, అవకాశం ఉంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నవారూ తెలంగాణలో అనేకమంది ఉన్నారు.  కేసీఆర్ కైనా, మరో ముఖ్యమంత్రికైనా అందరికీ అవకాశం ఇవ్వడం కుదరదు. పైగా కులపరమైన సమీకరణాలు చూసుకునే ప్రయత్నంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అందువల్ల తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడినవారిలో కొందరికి  కేసీఆర్ పదవులు ఇవ్వలేకపోయారు. వారందరికీ ఈటల రాజేందర్ లో కొత్త నాయకుడు కనిపించేవారు. తొలిసారి తెలంగాణలో ఒక వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి, ప్రజాబలం కలిగిన వ్యక్తి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకున్న వ్యక్తి నాయకత్వంలో కొత్త పార్టీ వచ్చి ఉంటే రాజకీయాలు భిన్నంగా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టి, తర్వాత చిరంజీవి నాయకత్వంలోని పీఆర్ పీలో విలీనం చేశారు. అనంతరం చిరంజీవి పీఆర్ పీని కాంగ్రెస్ లో కలిపేశారు. నాడు దేవేందర్ కంటే ఈరోజు రాజేందర్ కి రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేవేందర్ గౌడ్ వెనుకబడిన కులానికి చెందిన నాయకుడే కానీ ఆయనకు ఉద్యమ నేపథ్యం లేదు. ఉద్యమ నాయకుడిగానూ, అవిచ్ఛిన్నంగా దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకుపైగా  శాసనసభ్యుడిగానూ, ఏడేళ్లకు పైగా మంత్రిగానూ, వైఎస్ రాజశేఖరరెడ్డిని శాసనసభలో ఎదుర్కొన్న టీఆర్ఎస్ నాయకుడిగానూ రాజేందర్ కు ఘనమైన చరిత్ర ఉన్నది.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

చారిత్రక అవకాశం జారవిడిచిన రాజేందర్

పోరాటనేపథ్యాన్నీ, నాయకత్వ లక్షణాలనూ ప్రాతిపదికగా చేసుకొని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అన్ని వర్గాలనూ సంప్రదించి ఒక విశాల వేదిక ఏర్పాటు చేసి కొత్తపార్టీ పెట్టి ఉంటే రాజేందర్ ప్రాసంగికత వేరే రకంగా ఉండేది. ఉద్యమ పార్టీలు చీలడం కొత్త కాదు. ద్రవిడ కజగం, ద్రవిడ మున్నేట్ర కజగంగానూ, ఆనక అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం గానూ చీలిపోయాయి. చీలిపోయిన విభాగానికి విజయావకాశాలు ఉంటాయి. ప్రజలు ఆమోదిస్తారు. మద్దతు ఇస్తారు. అదే ఫక్కీలో రాజేందర్ తెలంగాణవాదులతో కలసి కొత్త పార్టీ పెట్టి ఉంటే చరిత్ర సృష్టించేవారు. ఇతర నాయకులు పెట్టుకున్న చిన్న పార్టీలు కూడా రాజేందర్ పెట్టిన పార్టీలో చేరి ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు గట్టిపోటే ఇచ్చే అవకాశం ఉండేది. మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించినప్పుడు జాతీయ పార్టీలకు పెరుగుదల ఉండదు. కాంగ్రెస్, బీజేపీల కంటే రాజేందర్ నాయకత్వంలోని పార్టీకి జనాదరణ ఎక్కువ ఉండేది.  2023 ఎన్నికలలో టీఆర్ఎస్ ను ఓడించేవారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం కానీ తెలంగాణవాదాన్ని సొంతం చేసుకున్న రెండవ పార్టీగా, టీఆర్ఎస్ కి ప్రత్యామ్యాయంగా కొత్తపార్టీ నిలిచేది. అటువంటి చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఈటల రాజేందర్ తొందరపడి పోగొట్టుకున్నారు.  హుజూరాబాద్ ఉపఎన్నికల వరకూ రాజేందర్ పైన ప్రజల దృష్టి ఉంటుంది. ఆయన పోటీ చేసినా, భార్య జమునను పోటీకి నిలబెట్టినా గెలుపు అంత సులభం కాదు. కేసీఆర్ వ్యూహాలను తట్టుకొని, హరీష్ రావు ఆచరణశీలాన్ని ఎదొర్కొని హుజూరాబాద్ ఉపఎన్నికలలో గెలుపొందడం అంత తేలిక కాదు. అట్లాగని అది అసాధ్యం కూడా కాదు. గట్టిపోటీ ఉంటుంది. డబ్బు బాగా ఖర్చవుతుంది. హుజూరాబాద్ ఎన్నిక మినహా మరే విషయానికీ ఆర్నెళ్ళపాటు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వరు. దృష్టి యావత్తూ హూజూరాబాద్ మీదే ఉంటుంది. అన్ని చర్యలూ దానికి సంబంధించినవే ఉంటాయి. రాజేందర్ కారణంగా, ఉపఎన్నిక మూలంగా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారికి కేసీఆర్ పదువులు ఎక్కువగా ఇవ్వవచ్చు. హుజూరాబాద్ కు చెందిన బీసీలను అందలం ఎక్కించవచ్చు. ఇంతవరకూ రాజేందర్ కు సన్నిహితంగా మెలగినవారికి కేసీఆర్ తాయిలాలు ఇచ్చి తనవైపునకు ఆకర్షించవచ్చు. హుజూరాబాద్ లో కొత్త పథకాలు అమలు కావచ్చు. కొత్త హంగులు సమకూరవచ్చు. ఇక నుంచీ ఉపఎన్నికలు ముగిసే వరకూ హుజూరాబాద్ పైనే తెలంగాణ ప్రజల దృష్టి ఉంటుంది.

కానీ ఈ క్రమంలో రాజేందర్ కేసీఆర్ పని సులువు చేశారు. రాజేందర్ కొత్తపార్టీ పెడితే కేసీఆర్ కి తలనొప్పిగా పరిణమించేది. అది కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికకే పరిమితం అయ్యేది కాదు. టీఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్రించే పార్టీగా, 2023 ఎన్నికలలో అధికారపార్టీని సవాలు చేసే కొత్తపార్టీగా ఉండేది. ఆ పార్టీలో అగ్రభాగాన తెలంగాణవాదులు ఉండేవారు. బీజేపీలో చేరడం వల్ల రాజేందర్ వార్తలలో ఉండేది మరో ఆర్నెళ్ళపాటే. ఉపఎన్నిక ఫలితాలు వచ్చేవరకే రాజేందర్ కు ప్రాధాన్యం. అటు తర్వాత ఆయన అందరిలో ఒకరు మాత్రమే.

Also read: ఈటలపై వేటు ఇప్పుడే ఎందుకు పడింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles