Wednesday, April 24, 2024

తెలంగాణలో అధ్యయనం అవసరం

సుదీర్ఘమైన ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో అరవై అయిదేళ్ళ కిందట విలీనం చేసినప్పుడే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు. వారు భయపడినట్టే పరిణామాలు సంభవించాయి. భిన్నమైన నేపథ్యాలు కలిగిన తెలుగువారు ఒకే రాష్ట్రంలో ఇమడలేరనీ, ప్రశాంతంగా సహజీవనం చేయలేరనీ, రెండు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య సాధ్యం కాదనీ అనుభవంలో తెలిసివచ్చింది. తెలంగాణ మలి ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్ ) నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఏర్పడింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పోరాటం జరిగింది.  ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాయాల విద్యార్థుల పోరాడారు.  తెలంగాణ సమాజంలో సమస్తరంగాలకు చెందిన ప్రజలు ఉద్యమంలో ఊరేగారు.  వందలమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ప్రాణత్యాగం చేశారు. ఇంతమంది కృషి ఫలితంగానే తెలంగాణ  కల నెరవేరింది. ఉద్యమంలో ప్రజలు అనేక సంకల్పాలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పాలకులు ఆత్మగౌవరానికి పెద్దపీట వేస్తారనీ, తమను భాగస్వాములుగా పరిగణిస్తారనీ, తమను సంప్రదించి ప్రగతిబాటలు వేస్తారనీ, అంతా సమష్టిగా సాగుతామనీ ప్రజలు ఆశించారు. అది వారి తప్పు కాదు. ఉద్యమంలో నాయకులు ఇచ్చిన హామీలూ, చేసిన ప్రతిజ్ఞలూ ప్రజలకు అటువంటి అభిప్రాయం కలిగించాయి. ఏరు దాటేవరకూ ఓడ మల్లయ్య అంటారనీ ఏరు దాటిన తర్వాత బోడ మల్లయ్య అంటారనీ వారు ఊహించలేదు.

Also read: పెరుగుట విరుగుటకొరకే

తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా చర్చకు వచ్చినవి మూడు అంశాలు – నిధులు, నీళ్ళు, నియామకాలు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మగౌరవం. తెలంగాణ రాష్రం ఏర్పడి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పని ప్రారంభించిన తర్వాత ప్రజలకూ, పాలకులకూ మధ్య ప్రజలు ఆశించిన సంబంధం ఏర్పడలేదు.  మాటలలో ఏమి చెప్పినప్పటికీ చేతలలో పాలకులు దాతలుగా ప్రజలు దాసులుగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకంటే కూడా కఠినంగా వ్యవహరించగలరని నిరూపించారు. అనుకుంటే వారికంటే ఉదారంగా కూడా వ్యవహరించగలరు. ఇదివరకటి రాజులు తమకు ఇష్టమైనవారికి మాన్యాలు ఇచ్చినట్టు, తమను వ్యతిరేకించినవారికి శిరచ్ఛేదం చేసినట్టు కేసీఆర్ కూడా తన ఇష్టయిష్టాలకు అనుగుణంగా వ్యవహరించగలరు. రాజకీయ ధురంధరుడు కనుక ఏమి చేసినా సమర్థించుకోగలుగుతున్నారు. దీనికి తెలంగాణ సమాజం స్వభావం కూడా తోడయింది.

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు

స్వాతంత్ర్యానికి ముందు నిజామాంధ్రలో ఉన్న తెలుగువారి అక్షరాస్యత పదిశాతంలో లోపే. బ్రిటీషాంధ్ర ప్రజలతో పోల్చితే అన్ని రంగాలలోనూ వెనుకబాటే. అక్కడున్న స్వేచ్ఛ ఇక్కడ లేదు. అక్కడ స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతుంటే ఇక్కడ నిజాం పాలన కింద మగ్గుతూ, ఉర్దూ, మరాఠీ భాషల ఆధిక్యానికి తల వొగ్గుతూ బతుకులీడ్చేవారు.  1930 దశకంలో జోగిపేటలో మొదలైన ఆంధ్రమహాసభల కారణంగా ప్రజలలో చైతన్యం మొదలయింది. కమ్యూనిస్టులు బలపడిన ఫలితంగా అవగాహన పెరిగింది. అప్పటి వరకూ ‘బాంచెన్  దొర’ అంటూ బానిస బతుకిన ప్రజలు రెండు దశాబ్దాలు దాటకుండానే బందూకులు పట్టి అదే దొరలపైన తిరుగుబాటు చేశారు. మలి తెలంగాణ ఉద్యమంలో సరైన నాయకత్వం అందుబాటులోకి రావడంతో తెలంగాణ ప్రజలు మరోసారి మహోద్యమం సాగించారు. ఉద్యమం విజయం సాధించి, ఉద్యమ ఫలం అందిన తర్వాత మళ్ళీ ఎవరి పనులలోకి వారు వెళ్ళిపోయారు. నాటి ఉద్యమ విలువలు కానీ ఉద్యమ స్పృహ కానీ ఇప్పుడు లేవు. ఉంటే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను వ్యతిరేకించేవారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకోని అనేక చర్యలను తీసుకునేవిధంగా ఒత్తిడి తెచ్చేవారు. ఉద్యమాన్ని వ్యతిరేకించి ఉద్యమకారులను తరిమికొట్టినవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినా మాట్లాడని ప్రజలు, ప్రతిపక్షాలకు చెందిన ఎంఎల్ఏలను కొనుగోలు చేసినా అదేమని ప్రశ్నించని ప్రజలు ఉన్నప్పుడు పాలకులకు వెరపు ఎందుకుంటుంది?

Also read: తెలుగువారి ఆత్మగౌరవ పతాక

తమను సంప్రతించకుండా, తమను భాగస్వాములను చేయకుండా, తమ ఆత్మగౌరవానికి విలువ ఇవ్వకుండా పరిపాలన సాగిపోతున్నా ప్రశ్నించని ఈ ప్రజలేనా నాడు సాయుధ పోరాటాన్నీ, ఇటీవల ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్నీ నడిపించారు అని ఆశ్చర్యం కలగకమానదు.

ఏడు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను సమీక్షించుకునేందుకు తెలంగాణ ఆవిర్భావదినం సరైన సందర్భం. ప్రజలు ఏమి ఆశించారో, పాలకులు ఏమి చేస్తున్నారో సమీక్షించుకోవలసిన సమయం. ఈ ఏడు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజారంజకమైన పనులేమిటో, ప్రజావ్యతిరేకమైన పనులేమిటో అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కేసీఆర్ చేసిన పనులలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అగ్రగణ్యమైనది. దీని వెనుక నిధుల ఉండవచ్చు. అవినీతి అనివార్యం కావచ్చు. కానీ ఒక పెద్ద ప్రాజెక్టు గోదావరి నీటిని ఎత్తిపోసి తెలంగాణను మాగాణి చేయడానికి ఆవిర్భవించడం చరిత్రాత్మకమైన పరిణామం. వేదాద్రిపైన వందలకోట్లు ఖర్చుచేయడం ఒక భక్తిపర్యాటక ప్రాజెక్టుపైన పెట్టుబడి పెట్టడంగా అర్థం చేసుకోవచ్చు. మిషన్ భగీరథ కారణంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయినందుకు సంతోషించవచ్చు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

ఏడేళ్ళుగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేయవలసినంత చేసిందా? సచివాలయానికి రాకుండా పరిపాలన చేసే ముఖ్యమంత్రి దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఉన్నారా? అధికారంలోకి రాగానే పోలీసు శాఖలో నియామకాలు చేశారు కానీ ఇతర శాఖలలో ఖాళీలను భర్తీ చేశారా? విద్య, వైద్య రంగాలను పట్టించుకున్నారా? అధ్యాపకుల, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులను నియమించారా? వాటిలో ప్రాథమిక వసతులు ఉన్నాయో లేవో పట్టించుకున్నారా? కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పించే లఘు,మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించారా? ప్రజల జీవన స్థితిగతులు మెరుగయ్యేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? కరోనా మొదటి, రెండు తరంగాలలో ప్రజలు ఇంత బాధపడవలసిన, నష్టపోవలసిన అవసరం ఉన్నదా? విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిష్క్రమించడం వల్ల ఎంత అనర్థం జరిగిందో గ్రహించారా? జరిగిన తప్పులకు దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి.

Also read: ధన్యజీవి చేకూరి కాశయ్య

కార్యకారణ సంబంధాలు ప్రజలు తెలుసుకున్నప్పుడే పాలకులు అప్రమత్తంగా ఉంటారు. కార్యకారణ సంబంధాలను విడమరిచి చెప్పవలసిన బాధ్యత సమాజంలో చదువుకున్నవారిదీ, మేధావి వర్గానిదీ. ఇది మీడియాకు మాత్రమే వదిలిపెట్టవలసిన కార్యక్రమం కాదు. మీడియా సమస్యలు మీడియాకు ఉన్నాయి. అత్యధిక మీడియా సంస్థలకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. మీడియా అధిపతులకు రాజకీయ నేతలతో సంబంధాలు, అనుబంధాలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఉన్నవి లేనట్టూ, లేనివి ఉన్నట్టూ రాయడానికి ఏమాత్రం సంకోచించని మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. మీడియాతో నిమిత్తం లేకుండా పౌరసమాజంలో చురుకైనవారు కొందరు ప్రభుత్వం పనితీరును పరిశీలించి ఒక నివేదిక తయారు చేయాలి. ఇందుకు కొంతమందిని ప్రత్యేకంగా నియమించి నిర్దుష్టమైన విధానాలను అనుసరించి శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అధ్యయనం చేయాలి. కడచిన ఏడు సంవత్సరాలలో ఏ వర్గాలకి మేలు జరిగిందో, ఎవరికి నష్టం జరిగిందో తెలుసుకోవాలి. ఎవరి ఆదాయాలు పెరిగాయో ఎవరి ఆదాయాలు తగ్గాయో పరిశీలించాలి.

Also read: ఏమున్నది గర్వకారణం?

సరైన సమాచారాన్ని ప్రజలకు అందజేస్తే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో వారికి చెప్పనక్కరలేదు. ఉద్యమం చేయండి అనగానే ప్రజలు వీధులలోకి ఉరకరు. వారి జీవితాలు వారికి ముఖ్యం. ఎందుకు ఉద్యమం చేయాలో, ఉద్యమించవలసిన అగత్యం ఎందుకు వచ్చిందో వారికి అర్థం అయ్యేవిధంగా చెప్పగలిగితే వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. దేనికైనా సమయం, సందర్భం రావాలి.

ఉద్యమం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపడానికి ఉద్దేశించింది కాదు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోతే నష్టపోతారు సుమా అని హెచ్చరించడం సైతం ఉద్యమ లక్ష్యం కావచ్చు. టీఆర్ఎస్ కి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం కూడా అనివార్యం కావచ్చు. ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు చెప్పవలసిన సంస్థలు ఆ పని చేయడం లేదు కనుక అందుకు ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలలో ఏమి జరుగుతోందో ప్రజలకు చెప్పాలి. వారు ఎంత దోపిడికి ఎందుకు గురి అవుతున్నారో విడమరచి చెప్పాలి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయంటే ప్రభుత్వాలు జాగ్రత్త పడతాయి. కేవలం ప్రచారంతో, ప్రాచారసాధనాలను కట్టడి చేయడంతో, వాటిని వినియోగించుకోవడంతో నిజాలు దాచి, అసత్యాలు ప్రచారం చేయడం ఎప్పటికీ సాగదనే విషయం అందరికీ తెలియాలి. అందుకోసం సత్యశోధన విధిగా జరగాలి.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles