Friday, October 4, 2024

కనులుమూసినా నీ రూపే

భగవద్గీత – 68

గురుశిష్యులు ఇద్దరు ఒక ఊరికి బయలుదేరారు. గురువుగారు సన్యాసాశ్రమం స్వీకరించి నియమబద్ధమైన జీవితం గడిపే వ్యక్తి. అడవి గుండా వెళ్ళి ఒక నదిని దాటితే కాని వారు వెళ్ళవలసిన ఊరు రాదు. ఇద్దరూ ప్రయాణం ప్రారంభించారు. అడవిదాటి నది ఒడ్డుకు వచ్చారు. ఆ నది ఒడ్డున ఒక ఇరవైఏళ్ళ అందమైన, అపురూప సౌందర్యరాశి అయిన స్త్రీ నిలబడి ఉన్నది. ఆవిడను పట్టించుకోకుండా నది దాటడం కోసం వారిరువురూ సన్నద్ధులవుతున్నారు. నది చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ఆ స్త్రీ వీరిరువురి వద్దకు వచ్చి తాను నది దాటలేక పొద్దుటినుండి అక్కడే వేచి ఉన్నానని తెలిపి నది దాటడానికి వారిరువురినీ సహాయం చేయమన్నది.

Also read: అత్యాశ వినాశకారిణి

శిష్యుడు ససేమిరా అన్నాడు. `నేను బ్రహ్మచారిని స్త్రీ స్పర్శ కూడా భరించలేను` అని చెప్పాడు. అప్పుడు సన్యాసి అయిన ఆ గురువుగారు వేరే ఏమీ మాట్లాడకుండా ఆవిడను పొదివిపట్టుకుని తన భుజాలమీద కూర్చుండబెట్టుకుని నదిలో దిగాడు.  (నీటిలో తడుస్తున్న శరీరాలు కదా… !) వారిరువురినీ నిర్ఘాంతపోయి అలానే చూసుకుంటూ తాను కూడా నదిదాటాడు శిష్యుడు. ఆవలి ఒడ్డుకు చేరగనే ఆవిడను తన భుజాలమీదనుండి దింపివేశారు గురువుగారు. ఆవిడదారిన ఆవిడ వెళ్ళిపోయింది.  మరల గురుశిష్యలిరువురూ నడవటం ప్రారంభించారు. శిష్యుడు అంతకుమునుపు ఉన్నట్లుగా లేడు. లోపల కుతకుత ఉడికి పోతున్నాడు. ఒక సన్యాసి చేయవలసిన పనేనా ఇది అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు.  వారు నదిదాటి చాలా సమయం గడచిపోయింది. సాయంకాలం దాకా నడుస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతున్నది.

Also read: భోగాలు రోగాలకు దారితీస్తాయి

చీకటిపడింది, అనువైన చోటు ఒకటిచూసుకొని ఆ రాత్రికి విశ్రమించి, మరల తెల్లవారి నడక సాగించి ఊరికి వెళ్ళి తమ పని పూర్తిచేసుకొని తిరిగి తమ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రయాణానికి వారికి వారం రోజులు పట్టింది. ఈ వారంరోజులు కూడా గురువుగారి ప్రవర్తన గురించే ఆలోచిస్తూ మథనపడుతున్నాడు శిష్యుడు. శిష్యుడు అదోలా ఉండటం గమనించి గురువుగారు దగ్గరకు పిలిచి `ఏమిటినాయనా నీవు ఇదివరలా ఉండటంలేదు. నీ ప్రవర్తనలో ఏదో మార్పు ఉన్నది. ఏమిటి కారణం?` అని అడిగాడు.

`ప్రవర్తనలో మార్పు నాదికాదు, మీదే` అని సమాధానమిచ్చాడు శిష్యుడు. నివ్వెరపోయిన గురువుగారు `నాదా? నేను మామూలుగానే ఉన్నానే. అసలు సంగతి ఏమిటి నాయనా చెప్పు?` అని అడిగారాయన. `మీరు సన్యాసి అయిఉండి ఆ పని చేయడం బాగా లేదు` శిష్యుడు అన్నాడు.

గురువు: ఏ పని?

శిష్యుడు: అదే ఆ రోజు నది దగ్గర…

గురువు: ఏ రోజు? ఏనది? ఏ పని?

శిష్యుడు: మొన్ననది దాటినప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకున్నారే?

Also read: విషయాలపై ఆసక్తి పతన హేతువు

గురువు: ఏ అమ్మాయి? (గురువుగారికి గుర్తురాలేదు)

అప్పుడు సవివరంగా ఆ అమ్మాయి అందచందాలతో సహా వర్ణించి చెప్పాడు శిష్యుడు. `ఓ! ఆ రోజా! నాయనా ఆ అమ్మాయిని ఆవలి ఒడ్డుకు చేర్చిన వెంటనే ఆమెను దింపేశాను. అప్పుడే ఆ సంగతి మర్చిపోయాను. నీవు మాత్రం ఆ అమ్మాయిని ఈ పదిరోజులూ మోస్తూనే ఉన్నావు. నీ మనస్సు ఇంకా మోస్తూనే ఉన్నది` అని గురువుగారు అన్నారు.

మనము బయటకు వెళ్ళి ఒక అందమైన వస్తువును చూసి ఇంటికి వచ్చిన తరువాత కన్నుమూసినా తెరిచినా ఆ వస్తువే కనపడ్డదనుకోండి… అర్ధమేమిటి? చూసేది కన్నుకాదు. మనసని కదా! అనగా మన మనస్సు మన ఇంద్రియాలతో అనుసంధానమయింది అని కదా అర్ధం! వీటికి అనగా మనస్సుకు, ఇంద్రియాలకు మధ్యనగల ఆ లింకు తెగగొట్టాలి. ఆ లింకు తెగకపోతే అంతా వ్యర్ధమే.

అందుకే పరమాత్మ అంటున్నారు…

నువ్వు అడవికి వెళ్ళి కళ్ళు, ముక్కు అన్నీమూసుకొని తపస్సుచేసినా మనస్సు వాటితో అనుసంధానమయి ఉన్నంతకాలమూ నీవు డంబాచారివే, మిథ్యాచారివే.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌

ఇంద్రియార్ధాన్‌ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే !( 3-6)

Also read: నరకంలో ప్రవేశించేందుకు మూడు ద్వారాలు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles