Sunday, April 28, 2024

తెలుగును వెలిగించిన తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన ఏకైక తెలుగు రచయిత

ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన 24 మందిలో తెలుగు రచయిత పతంజలి శాస్త్రి ఒక్కరే ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త డా. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి సాహిత్య అకాడమీ-2023 సంవత్సర జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. చిన్న కథలు క్యాటగిరిలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. 2024 మార్చి 12న న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్ లో ఉన్న కామని ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద తామ్ర పతకం, రూ. లక్ష నగదు పురస్కారం అందజేస్తారు. సాహిత్య అకాడమీ డిసెంబర్ 20 న వివిధ భాషారచనలకు ఈ అవార్డులు ప్రకటించింది. 9 కవిత సంకలనాలు, 6 నవలలు, 5 చిన్నకథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనం రచించిన కవులు, రచయితలు అవార్డులు అందుకోబోయేవారిలో ఉన్నాయి. 2017 జనవరి నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలంలో మొదటి ప్రచురణ జరిగిన పుస్తకాలను ఈ అవార్డుకు ఎంపిక కోసం పరిశీలించారు. 24 భాషలకు చెందిన ప్రసిద్ధ జ్యురీ సభ్యులు, ప్రతి భాషకు ముగ్గురు వంతున పరిశీలించి చేసిన సిఫారసు మేరకు అవార్డులను ప్రకటించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

పతంజలి శాస్త్రి 1945లో కృత్తివాస తీర్థులు, మహాలక్ష్మి దంపతులకు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురంలో జన్మించారు. తిరుపతి ఎస్ వీ విశ్వవిద్యాలయంలో పురావస్తుశాస్త్రంలో ఎంఏ చేశారు.పుణె లోని డెక్కన్ కళాశాల నుంచి పీహెచ్ డీ చేశారు. పతంజలిశాస్త్రి కొంతకాలం (1970-80 ప్రాంతంలో) ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్న అమలాపురంలోని ఎస్ కేబీఆర్ కాలేజిలో అధ్యాపకుడుగా పని చేశారు. అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పి పర్యావరణ పరిరక్షణకోసం రాజమహేంద్రవరం కేంద్రంలో మూడున్నర దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దానితో పాటు సాహిత్య వ్యాసంగం కొనసాగించారు. రావిశాస్త్రి, శ్రీపా, సోమసుందర్ పేరు మీద ఉన్న పురస్కారాలనూ, అరసం, అజోవిభో, తదితర సంస్థల అవార్డులను అందుకున్నారు. అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్యం పురస్కారం ఇచ్చింది. పతంజలిశాస్త్రి కథలు, వడ్ల చిలుకలు, మాధవి, తదితర రచనలు చేశారు.గాథా సప్తశతిలోని  వంద కథలనూ ‘అడవిపూలు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కవిత్వం, నాటకాలు, నవలలు రాశారు. ప్రముఖ జర్నలిస్టు శివాజీకి పతంజలి అన్నగారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles