Thursday, November 30, 2023

రోలుగుంట మండలంలోని ఆదివాసీల భూమి సమస్యలకు పరిష్కారం చూపండి

జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రాలు సమర్పించిన అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం సభ్యులు

 ‘జగనన్నకు చెప్పుకుందాం’ అనే పేరుతో మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం నాడు రోలుగుంట మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పిఎస్ అజయ్ కుమార్ జాతీయ కార్యదర్శి, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, మాట్లాడుతూ, మండల కేంద్రాలలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా నాలుగు అంశాలను జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

1. కొoతలం గ్రామంలో పేదల సాగులో ఉన్న భూములకు డిఫారం పట్టాలి ఇచ్చిన వాటిని ఆన్ లైన్ 1B లో నమోదు చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాలైన సహాయాలను పొందలేకపోతున్నారని జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.

2. రోలుగుంట మండలంలోని పెద్ద పేట గ్రామంలో ప్రభుత్వ ఇచ్చిన డి ఫారం పట్టాదారులు సాగులో లేరని గత 20 సంవత్సరాలుగా పెద్ద పేట గ్రామానికి చెందిన ఆదివాసీలు ఆ భూములు సాగు చేస్తూ జీడి మామిడి తోటలు పెంచారని ఆయన అన్నారు. జగనన్న భూ రక్ష పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో వీరి సాగు అనుభవాన్ని గుర్తించారనీ, ఫోటోలు తీసుకున్నారనీ, ఆధార్ కార్డు సేకరించారనీ, కానీ కార్యాలయానికి వచ్చిన తర్వాత సాగులో ఉన్న పేర్లన్నీ తీసివేసి ఏనాడు భూమిని సాగు చేయని వారిని పట్టాదారుగా సాగుదారుగా చూపిస్తూ రికార్డులను నమోదు చేశారనీ, దీనిపై విచారణ జరపమని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదనీ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి అజయ్ కుమార్ తీసుకువచ్చారు.

3. రోలుగుంట మండలంలోని అడ్డసారం గ్రామంలో దువ్వూరి సూర్యప్రకాశం అనే బ్రాహ్మణ మహిళ పేరుతో ఉన్న భూములను ఎలమంచిలికి చెందిన ఒక భూమి బ్రోకర్ పేరుతో 2018 వ సంవత్సరంలో అప్పటి         తాసిల్దార్ రికార్డ్ మార్చేశారని, దానిపై అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గ్రామానికి స్వయంగా వచ్చి విచారణ జరిపిన విషయాన్ని ఆయన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తాసిల్దార్ చేసిన మార్పులను రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ రద్దు చేయగా దానిపై భూమి బ్రోకర్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద అప్పిలు దాఖలు చేశారని సదరు అప్పీలు 2019 నుంచి విచారణకు నోచుకోకుండా ఉందని కనుక వెంటనే విచారణ ప్రారంభించాలని ఆయన జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు.

4. మొఖసా కొత్తపట్నం గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 139 లోని 10 ఎకరాల మెట్టు భూమిలో ఆరు కుటుంబాల     గదబ ఆదివాసీలు సాగు అనుభవంలో ఉన్నారనీ, వారి అనుభవాన్ని రికార్డులో నమోదు చేశారనీ కానీ గత సంవత్సరం, అనగా 2022, నవంబర్ నెలలో, అప్పటి తాసిల్దార్ కే వెంకటేశ్వర్ రావు ఆదివాసీల పేర్లను ఏకపక్షంగా తొలగించారనీ ఇది అన్యాయమనీ ఆయన సాక్ష్యాధారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వివరించారు. 2016 నుండి ఆదివాసీల పేర్లు నమోదైన రికార్డును, 2022 నవంబర్లో వారి పేర్లను తీసివేసిన రికార్డును ఆయన జాయింట్ కలెక్టర్ కు చూపించారు. ఆదివాసీల పేర్లను రికార్డు నుండి తొలగించే సమయంలో అప్పటి తాసిల్దార్ K. వెంకటేశ్వర్రావు ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదనీ, భూమి బ్రోకర్లకు ఉపయోగపడే విధంగా చట్టవిరుద్ధంగా  రికార్డు మార్చేశారనీ ఆయన వివరించారు. దీనిపై ఆదివాసీలు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ నేటి వరకు ఎలాంటి విచారణ ప్రారంభించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా విచారణ చేపట్టాలని ఆయన కోరారు.

అజయ్ కుమార్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆదివాసీల కోసం ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, నిజానికి కాకినాడ జిల్లా కంటే అనకాపల్లి జిల్లాలోని ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారని కనుక జిల్లా కలెక్టర్ గారు నెలలో ఒకసారి ఆదివాసీల కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

వినతి పత్రాల స్వీకరించిన అధికారులు వీటన్నిటినీ పరిశీలన చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మోసూరి రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,

అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, అనకాపల్లి జిల్లా

అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles