Thursday, May 2, 2024

అవిశ్వాస తీర్మానం అనుకున్నది సాధిస్తుందా?

ప్రధానిచేత మాట్లాడించాలన్న ప్రతిపక్షాల పంతం నెరవేరుతుందా?

మణిపూర్ మంటలు ఆర్పేందుకు నడుం బిగించరా?

మణిపూర్ అంశం మంటలు రగిలిస్తూనే వుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడి తీరాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. మణిపూర్ అంశంపై చర్చకు అవకాశమిస్తామని, పరిష్కారం చూపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపక్షాలకు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. ఒక మణిపూర్ అంశమే కాదు, ఏ ముఖ్యమైన అంశానికైనా చర్చకు తావు దొరకడం లేదనీ, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారానైనా ఆ అవకాశం వస్తుందనే వ్యూహంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానమనే అస్త్రాన్ని వదిలాయి. అత్యంత సంఖ్యాబలం కలిగిన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపలేమన్న విషయం విపక్షాలకు తెలియనది కాదు. అట్లే, సంఖ్యా పరంగా తమ బలహీనత తమకు బాగానే తెలుసు. ఏలినవారిని ఏదో విధంగా  ఇబ్బంది పెట్టాలి, మచ్చ మిగల్చాలని ప్రతిపక్ష నాయకులు ఈ చర్యకు సిద్ధమయ్యారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ పెట్టారు. అది వీగిపోయింది కూడా. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ఈసారి పార్లమెంట్  సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ్యుల గందరగోళం మధ్య వాయిదా పడుతూనే వున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ

వాజపేయి రూటే వేరు

2001లో వాజ్ పెయ్ ప్రధానమంత్రిగా వున్న సమయంలోనూ మణిపూర్ మంటలు పార్లమెంట్ లో అలజడి సృష్టించాయి. కాకపోతే వాజ్ పెయ్ రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. సాధారణ పరిస్థితులు నెలకోనేందుకు సహకరించాలని మణిపూర్ ప్రజలను అభ్యర్ధించారు. మోదీ ఆ తీరులో వ్యవహరించడం లేదని పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు. నేటి వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు  మీడియా ముఖంగా ప్రధాని మణిపూర్ లో అత్యాచార ఘట్టాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ సందర్శించి ఇరుపక్షాలవారితో మాట్లాడిన తర్వాత ఉద్రిక్తత కొంత తగ్గింది. మహిళా అత్యాచారం వీడియో బయటకు వచ్చాక, మళ్ళీ అలజడులు మొదలయ్యాయి. ఈ తరహా వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ మరింత అగ్గిని రగిలిస్తున్నాయి. ఇద్దరు మణిపూర్ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన వెలుగులోకి రాకపోతే ప్రధాని ఆ మాత్రమైనా నోరు విప్పేవారు కాదనే మాటలు వినపడుతున్నాయి. అవిశ్వాసం అంశం అటుంచగా, మరింత సున్నితంగా మారుతున్న మణిపూర్ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికార, విపక్షాలపైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన వుంది.

మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ

అవిశ్వాసం ఇదే మొదటిది కాదు

ఇందిరాగాంధీ నుంచి నరేంద్రమోదీ వరకూ చాలామంది ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. కాకపోతే గత ప్రధానులతో పోల్చుకుంటే, ముఖ్యంగా బిజెపి ప్రధానమంత్రి వాజ్ పెయ్ తో పోల్చుకుంటే నరేంద్రమోదీ తీరు నియంతృత్వానికి అద్దంపడుతోందని ప్రతిపక్షాలు చేసే అతిపెద్ద విమర్శ. అధికార-విపక్షాల మధ్య వైరుధ్యాలు, విభేదాలు, వివేదాలు సర్వ సాధారణం. కాకపోతే, ఈ తొమ్మిదేళ్ల మోదీ పాలన మరింత అప్రజాస్వామికంగా వుందన్నది విపక్షనేతల భావన. ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ప్రభుత్వం -ప్రతి పక్షాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రాతినిధ్యం కరవైంది. గతంలో పీవీ నరసింహారావు, చిదంబరం వంటివారు ఈ పాత్ర పోషించేవారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు కీలక భూమిక పోషించేవారు. ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించడం లేదన్నది మరో ముఖ్యమైన విమర్శ. ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి ఈ శాఖకు మంత్రిగా వున్నా, ప్రభావశీలమైన పాత్ర పోషించడం లేదన్నది వాస్తవం. ఈ తీరును గమనిస్తున్న ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. వాయిదాల మధ్య పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నదే చాలా తక్కువ రోజులు. 1952 తర్వాత ఇంత తక్కువ రోజులు సమావేశాలు జరిగింది ఈ 9 ఏళ్ళలోనే అని నివేదికలు చెబుతున్నాయి. ఎన్ని రోజులు జరిగాయన్న విషయం అట్లా ఉంచితే, సహేతుకంగా, ఫలవంతంగా సమావేశాలు జరగడం లేదన్నది కాదనలేని సత్యం.26ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో ఒక గొడుగు కిందకు వచ్చి పోరాటం మొదలుపెట్టాయి.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

ప్రధాని మౌనం వీడుతారా?

ఈ యుద్ధపర్వంలో అవిశ్వాస తీర్మానం మొదటి ఆశ్వాసం. ఈ వర్షాకాలం సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో కూడా చెప్పలేం. ప్రధాని మోదీ మౌనాన్ని వీడి మణిపూర్ పై విపక్షాలకు సమాధానం చెబుతారో లేదో చూడాలి. చర్చకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటల పట్ల కూడా విపక్షాలకు విశ్వాసం లేదు. మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలి, ఆ తర్వాత చర్చ జరగాలి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాల తరపున పట్టుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ కు బి ఆర్ ఎస్ కూడా జత కలిసింది. మోదీ ప్రభుత్వం 5 ఏళ్ళ క్రితం ఇదే జులైలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం గమనార్హం. ప్రభుత్వాలు, వాటిని నడిపే పాలకులు, రాజకీయ పార్టీలు ప్రజల ముందు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles