Tuesday, June 25, 2024

మరో భయంకర కరోనా

  • అవగాహన పెంచుకొని, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టనివారణ

కొత్త రకం కరోనా వైరస్  చుట్టూ ఇప్పుడు ప్రపంచం ఆలోచిస్తోంది. బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ వల్ల అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. కోవిడ్ -19 నేర్పిన అనుభవంతో ముందు జాగ్రత్త చర్యలు పాటించే పనిలో పడ్డారు. కరోనాకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఒకప్పటి సాధారణ పరిస్థితులు  వచ్చేస్తున్నాయని అందరూ అనందంగా ఊపిరి పీల్చుకుంటూ పండుగ వేళలకు సిద్ధమవుతున్న వేళ, కొత్త కరోనా వైరస్ వ్యాప్తి వార్త అందరినీ ఆలోచనలో పడేసింది.

విమాన సర్వీసుల నిలుపుదల

మన దేశంలోని విమానాశ్రయాలలోనూ అప్రమత్తం చేశారు. విదేశాల నుండి వచ్చినవారిని క్వారన్టైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ -బ్రిటన్ మధ్య విమానాలను ఈ డిసెంబర్ వరకూ నిలుపుదల కూడా చేశారు. ఈ తరుణంలో,  కొద్ది రోజుల క్రితమే యుకె నుండి చెన్నైకి వచ్చిన ఒక వ్యక్తికి ఈ మంగళవారం నాడు కరోనా సోకింది. ఆ వ్యక్తి ఢిల్లీ నుండి చెన్నై చేరుకున్నాడు. ఈ పరిణామంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంట్రాక్టు ట్రేసింగ్ ను మొదలుపెట్టారు. అయితే, ఈ వ్యక్తికి సోకింది కొత్త వైరసా? పాతదా? తేలాల్సివుంది. పుణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి  పరీక్ష నిమిత్తం నమూనాను పంపారు.

మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

ఇదే క్రమంలో, లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణీకుల్లో ఐదుగురికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వస్తేకానీ, మిగిలిన వివరాలు తెలియదు. బ్రిటన్ నుండి వచ్చిన వారిలోనే ఈ విధంగా ఉండడం వల్ల, యూకె విషయంలో భారత్ మరింత అప్రమత్తమైంది. కొత్త రకం వైరస్ ఇటలీకి కూడా పాకింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పురపాలక సంఘాల ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలను చేపట్టనున్నాయో కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. మిగిలిన దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి.

Also Read : స్తబ్ధకోశం

పండుగల సీజన్ లో జాగ్రత్తలు

ఇది పండుగ సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండడం మంచిదే. అయితే, అదే సమయంలో, ఈ కొత్త రకం వైరస్ గురించి ఇంత బయ భ్రాంతులకు గురికావాల్సిన అవసరం ఉందా? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఈ కొత్త రకం కరోనాను గమనిస్తే, ప్రస్తుతానికి కొన్ని విషయాలు అర్ధమవుతున్నాయి. (1) పాత వైరస్ కంటే 70శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది (2) దీనివల్ల జలుబు, జ్వరం మొదలైనవి వేగంగా సంభవిస్తున్నాయి (3) పాత దానితో పోల్చుకుంటే ఇది ప్రాణంతకమైంది కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. సహజంగా ప్రతి జీవికి స్వయంగా తనలాంటి మరో జీవిని సృష్టించుకోవాలనే కోరిక ఉంటుంది. అది మనిషి నుండి కంటికి కనిపించని ఇటువంటి జీవి వరకూ ఉంటుంది. ఇది చాలా సహజసిద్ధమైన జీవప్రవృత్తి. అందులో భాగంగానే, కోవిడ్ -19కూడా ఉత్పత్తికి సిద్ధమైంది. ఇలా కొత్తరకంగా పుట్టుకురావడమే మ్యుటేషన్.దాన్నే మార్పులు చెందడం అంటారు. ఈ వైరస్ కు సంబంధించిన మార్పులను గమనిస్తే, మొదట పుట్టిన వైరస్ లో ఉండే శక్తి కంటే దీని శక్తి చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

పాత కంటే కొత్త రకం కరోనా నయం

వ్యాప్తిలో వేగం తప్ప, దీని దుష్ప్రభావం పాత రకాని కంటే ఎంతో తక్కువగా ఉంటుందనీ, మరీ ముఖ్యంగా ఇది ప్రాణాంతకం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కొత్త రకం కరోనా వైరస్ “ఎన్ 501వై” అనే ఉత్పరివర్తన కారణంగా ఉత్పన్నమైందని భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా వైరాలాజిస్ట్ ఆచార్య శేషాద్రి వాసన్ చెబుతున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్యం కలుగుతుందనడానికి ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే తయారై వున్న వ్యాక్సిన్ల సమర్ధత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. 

Also Read : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా స్ట్రెయిన్

జన్యుక్రమావిష్కరణ

కాకపోతే, ఈ కొత్త రకం వ్యాక్సిన్ సోకుతున్నవారిలో జన్యు క్రమాన్ని ఆవిష్కరించడం ముఖ్యమని పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఇదే క్రమంలో, దక్షిణ ఆఫ్రికాలో గుర్తించిన కొత్త రకం వైరస్ యువతలో వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. మొత్తంమీద సారాంశం ఏంటంటే, కొత్త రకం కరోనా వైరస్ గురించి భీభత్సంగా భయాందోళనలకు గురికానక్కర్లేదని  పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో, త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు ఇటువంటి కొత్త రకాలను అడ్డుకునే శక్తి కలిగిఉంటాయాని నిపుణులు  విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.సరియైన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడమే మనకు రక్షణకవచాలు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles