Friday, April 19, 2024

అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్

  • తొలి నల్లజాతి, భారత సంతతి ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్
  • స్వేతభవనంలో ప్రవేశిస్తున్న అతిపెద్ద వయస్కుడు బైడెన్
  • ఓటమి అంగీకరించకుండా అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ట్రంప్ 

జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ డొనాల్డ్ ట్రంప్ పైన విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. కోవిడ్ మహమ్మారి నుంచీ, గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచీ, లోతుగా చీలిన రాజకీయ వ్యవస్థ నుంచీ అమెరికాను కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

పెన్సిల్వేనియా విజయంతో అంతమైన సందిగ్థం

యుద్ధభూమిగా పిలిచే రాష్ట్రాలలో ఒకటైన పెన్సెల్వేనియాలో విజయం సాధించి 284 ఎలక్టొరల్ కొలేజీ ఓట్లకు చేరుకున్న జో బైడెన్ గెలిచినట్టేనని అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్, ఎన్ బీసీ సంస్థలు ప్రకటించాయి. ఈ ఎన్నికలలో చాలా చారిత్రిక ఘటనలు జరిగాయి. అనేక రికార్డులు సృష్టించబడ్డాయి.  అమెరికా చరిత్రలో అతిపెద్ద వయస్కుడైనా అధ్యక్షుడుగా 77 ఏళ్ళ బైడెన్ రికార్డు సృష్టించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన మొట్టమొదటి మహిళగా, మొట్టమొదటి నల్ల మహిళగా, తొట్టతొలి ఆఫ్రికన్, ఇండియన్ సంతతి మహిళగా, ఇండియన్-అమెరికన్ మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. ఆమె వయస్సు 56 సంవత్సరాలు.

రెండు దశాబ్దాలలో అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఓడిపోవడం ఇదే ప్రథమం

బిల్ క్లింటన్ సీనియర్ బుష్ ని ఒక టరమ్ అయిన తర్వాత రెండో టరమ్ లేకుండా 1992లో ఓడించిన అనంతరం మళ్ళీ అధికారంలో ఉన్న అధ్యక్షుడికి రెండవ టరమ్ దక్కకుండా ఓడించడం ఇదే ప్రథమం. దాదాపు రెండు దశాబ్దాల చరిత్రలో సంభవించిన తొలి ఘటన. ప్రెసిడెంట్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని నిరాధారమైన ఆరోపణలు చేయడంతో అమెరికా ప్రజలలో చీలికను సజీవంగా ఉంచుతున్నారు. ఇదే రకమైన ఆరోపణలు పదే పదే చేస్తున్న ట్రంప్ మీడియా సమావేశాన్ని మీడియా ప్రతినిధులే  శుక్రవారంనాడు అర్ధంతరంగా రద్దు చేశారు. అమెరికా సెనేట్ లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కొనసాగితే ఆ మేరకు జో బైడెన్ పని కష్టం అవుతుంది. సంపన్నులపైనా, కార్పొరేట్ సంస్థల పైనా పన్నులు పెంచాలన్న బైడెన్ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకుండా సెనేట్ అడ్డుకుండే అవకాశం ఉంది.

బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలు బైడెన్ వశం

బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలన్నిటిలోనూ ట్రంప్ ఆధిక్యం ఉన్నట్టు శనివారం వరకూ వార్తలు వచ్చాయి. కానీ ఆదివారంనాటికి బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలలో మిషిగన్, విస్కాన్సిన్ , పెన్సిల్వేనియా రాష్ట్రాలను బైడెన్ గెలుచుకున్నారు.  ఈ రాష్ట్రాలన్నిటిలోనూ 2016లో ట్రంప్ గెలుపొందారు. శనివారం ఉదయానికల్లా  దేశవ్యాప్తంగా బైడెన్ కి ట్రంప్ కంటే నలభై లక్షల ఓట్లు లభించాయి. ట్రంప్ కి ఏడు కోట్ల ఓట్లు వస్తే , బైడెన్ కు 7.4 కోట్ల ఓట్లు వచ్చాయి.

ఓటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు

చాలా చోట్ల ఓటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపించారు. ఒక్క ఆదారం కూడా చూపలేకపోతున్నారు. ‘నేను ఈ ఎన్నికలలో పెద్ద మెజారిటీతో విజయం సాధించాను,’ అంటూ శనివారం ఉదయం ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు కానీ ఒక్క పిటిషన్ కూడా ఆయనను ఆదుకునే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆర్థిక పరిస్థితులు డీలా పడిపోవడం కారణంగా ట్రంప్ రెండవ పర్యాయం ఎన్నికలలో గెలవలేకపోయారని చెప్పవచ్చు. ట్రంప్ మాస్క్ దరించకుండా, వైరస్ అంతా బోగస్ అని దబాయిస్తూ అమెరికా ప్రజల ఆగ్రహాన్ని కొనితెచ్చుకున్నారు.

కోవిద్ పై సమరానికి బైడెన్ ప్రాధాన్యం

ఇందుకు భిన్నంగా, కోవిద్ మహమ్మారిపైన యుద్ధం చేయడం తన ప్రథమ కర్తవ్యమని బైడెన్ ప్రకటించారు. అదే విధంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ కోవిడ్ 97 లక్షల మంది అమెరికన్లను సోకింది. రెండు లక్షల ముప్పయ్ ఆరు వేల మంది అమెరికన్లు కోవిద్ కారణంగా మరణించారు.

వీసాలపై పరిమితులు రద్దయ్యే అవకాశం

ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలను కాంగ్రెస్ తో నిమిత్తం లేకుండా తానే స్వయంగా అధ్యక్షుడి స్థాయిలో రద్దు చేయగలనని బైడెన్ ప్రకటించారు. ముస్లిం దేశాల నుంచి వలసలపైన విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తాననీ, ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్ళీ అమెరికా చేరుతుందనీ బైడెన్ ప్రకటించారు. భారతీయుల, ఇతర దేశీయుల వీసాలపైన విధించిన పరిమితులను కూడా బైడెన్ ఎత్తివేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ హామీ ఇచ్చారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles