Monday, May 20, 2024

ఏకాదశ రుద్రుల సమావేశమే…ప్రభల తీర్థం!

వోలేటి దివాకర్

అదృష్టవశాత్తు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనసీమలోని ప్రభల తీర్థాన్ని దర్శించుకునే అవకాశం దక్కింది. నేను, మరో ఇద్దరు మిత్రులు కలిసి ప్రభల తీర్థానికి వెళ్ళాము. సంక్రాంతి రోజున కొత్తపేటలో…కనుమ రోజున జగ్గన్నతోట లో ప్రభల తీర్ధాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభలను మోసేందుకు విద్యావంతులైన యువత కూడా పోటీ పడటం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా కొబ్బరి తోటల్లోనే కొట్లు వెలిశాయి. అయితే ఈసారి సంక్రాంతికి కోనసీమ జిల్లాలో గుండాట..రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ, ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన కోనసీమ వాసులు నిరాశకు గురై  జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాలేదని..కనుమ రోజే చాలా మందివెళ్లిపోయారని సీనియర్ జర్నలిస్ట్, మాకు ఆతిధ్యం ఇచ్చిన నిమ్మకాయల సతీష్ వెల్లడించారు.

Also read: బాబు పల్లకీని పవన్ మోస్తారా?….బాబు సీఎం పదవిని త్యాగం చేస్తారా?

ప్రభల తీర్థాల ప్రాముఖ్యతను తెలుసుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వాహకులు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఈ తీర్థాలు జాతీయ స్థాయిని ఆకర్షించాయి.  ఏడాది కోనసీమ ప్రభలను ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శించనున్నారు.

వరిపొలంలో ప్రభ

పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉంటారని..మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారని నమ్మకం. అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని భావిస్తారు. వారు: వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు, కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు, ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు, వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు, నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి. అలాగే ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు, మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు, పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు, గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు. వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.

Also read: చిన్నారి చిరునవ్వు కోసం….

సంక్రాంతి నాడు ఆరంభమై ముక్కనుమ వరకు కోనసీమలో వివిధ ప్రాంతాల్లో 90 వరకు తీర్థాలు జరుగుతాయి. తీర్థాల నిర్వహణ వెనుక పురాణ, అధ్యాత్మిక ఆధారాలు, చరిత్ర ఉంది. నాటి రాజుల కాలంలోను.. ఆ తరువాత బ్రిటీష్‌ కాలంలోను.. నేటి ప్రజా పాలనలోను ఈ తీర్థాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. కోనసీమలోని అంబాజీపేట మండలం జగన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన శివారు వేట్లపాలెం వద్ద జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవి.

జనసందోహం

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి- ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం. అనంతరం మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరతారు.

Also read: బెదిరించి…తరలించి… సాధించిందేమిటీ?

ప్రభలను  ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి, ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు. ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి- రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు.

Also read: అమరావతి రైతులకు అరసవిల్లి వెళ్లే భాగ్యం లేదా?!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles