Tuesday, April 23, 2024

మొతేరాలో స్పిన్నర్లే విన్నర్లు

  • గత రికార్డులు చెబుతున్న అసలు నిజం
  • ఆఖరిటెస్టుకు పిచ్ పై జోరుగా ఊహాగానాలు

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడోటెస్టు కేవలం రెండురోజుల్లోనే ముగియటం, టెస్ట్ మ్యాచ్ తొలిగంట ఆట నుంచే బంతి బొంగరంలా తిరగడం, ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేయడం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. స్పిన్ పిచ్ పైన రెండురోజుల్లో రెండు సార్లు ఆలౌటైన జట్టుగా రికార్డుల కెక్కిన ఇంగ్లండ్ మాత్రం 10 వికెట్ల పరాజయం నుంచి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. దీనికితోడు ఇంగ్లీష్ మీడియా, మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్, కెవిన్ పీటర్సన్…వీరూ చాలరన్నట్లుగా విఖ్యాత కామెంటీటర్ డేవిడ్ లాయిడ్ , మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్..పిచ్ తీరును తప్పుపడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఐదురోజులపాటు ఆడాల్సిన టెస్టు మ్యాచ్ ను రెండురోజుల్లో ముగిసేలా నాసిరకం పిచ్ ను తయారు చేయటం ద్వారా భారత జట్టు తొండీఆట ఆడుతోందంటూ మండిపడుతున్నారు. ఐసీసీ జోక్యం చేసుకోవాలంటూ లబోదిబోమంటున్నారు.

స్పిన్ బౌలర్ల అడ్డా మొతేరా!

భారత ఉపఖండ దేశాల పిచ్ లు అంటేనే స్పిన్ బౌలర్లకు అనువుగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. పైగా స్పిన్ బౌలింగ్ కు పుట్టినల్లులాంటి భారత్ నుంచే ప్రపంచ మేటి స్పిన్ బౌలర్లు వినూ మన్కడ్, జాసూ పటేల్, ఇరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, వీవీ కుమార్, బిషిన్ సింగ్ బేడీ, శ్రీనివాస వెంకట్రాఘవన్, మనిందర్ సింగ్, హర్భజన్ సింగ్, అనీల్ కుంబ్లే ప్రపంచ క్రికెట్లోకి అడుగుపెట్టి భారత స్పిన్ బౌలింగ్ కే వన్నె తెచ్చారు. వారి వారసులుగా నేటితరం స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా రికార్డుల మోత మోగిస్తున్నారు.

ఇదీ చదవండి: టెస్టు ర్యాంకింగ్స్ 3వ స్థానంలో అశ్విన్

టెస్ట్ లీగ్ తో స్పిన్ ప్రాభవం

దారితప్పిన సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను గాడిలో పెట్టడం కోసం ఐసీసీ తొలిసారిగా టెస్టులీగ్ ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా జరిగిన ఇంగ్లండ్- భారతజట్ల ప్రస్తుత సిరీస్ ద్వారానే స్పిన్ బౌలింగ్ కు మరోసారి ప్రాభవం వచ్చింది. చెన్నైలో ముగిసిన రెండోటెస్టు, అహ్మదాబాద్ లో జరిగిన డే- నైట్ టెస్టుల్లో స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. పేస్ బౌలర్లు నామమాత్రంగా మిగిలిపోయారు. చెన్నైటెస్టు ద్వారా అరంగేట్రం చేసిన లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండుటెస్టులు, మూడుఇన్నింగ్స్ లో 22 వికెట్లు పడగొట్టడం ప్రస్తుత సిరీస్ కే హైలైట్ గా మిగిలిపోతుంది. అంతేకాదు అహ్మదాబాద్ టెస్టు మొదటిరెండురోజుల్లోనే 30 వికెట్లు కుప్పకూలడం, అందులో స్పిన్నర్లే సింహభాగం వికెట్లు తీయడం క్రికెట్ వర్గాలలో మిశ్రమస్పందన కలిగించింది. అహ్మదాబాద్ మోతేరా పిచ్ గత రికార్డులను చూస్తే ఆది నుంచే స్పిన్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తూ వస్తున్నారు.

పటేల్ స్టేడియం నుంచి మోడీ స్టేడియం వరకు

అహ్మదాబాద్ మోతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియం నేటి నరేంద్ర మోడీ స్టేడియంగా పరివర్తన చెందే వరకూ 12 టెస్టుమ్యాచ్ లు మాత్రమే జరిగాయి. 1983 నుంచి 2021 సిరీస్ మ్యాచ్ వరకూ మోతేరా పిచ్ పైన స్పిన్ బౌలర్లే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా ఉన్నారు. మొత్తం వికెట్లలో 60 శాతం స్పిన్నర్ల ఖాతాలోనే చేరిపోయాయి. అయితే ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత మాత్రం పేస్ బౌలర్ కపిల్ దేవ్ కే దక్కుతుంది. వెస్టిండీస్ తో జరిగిన 1983 సిరీస్ మ్యాచ్ లో కపిల్ 83 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 12 టెస్టుల్లోని మూడుమ్యాచ్ ల్లో మాత్రమే…స్పిన్ బౌలర్లు 10 వికెట్లు, అంతకంటే తక్కువ పడగొట్టగలిగారు. 2005 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగినమ్యాచ్ లో స్పిన్ బౌలర్లు అత్యధికంగా 29 వికెట్లు సాధించారు. 1994 సిరీస్ లో శ్రీలంకతో మ్యాచ్ లో 26 వికెట్లు, 2001 ఇంగ్లండ్ సిరీస్ మ్యాచ్ లో 25 వికెట్లు స్పిన్నర్లకే దక్కడం విశేషం. ప్రస్తుత సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లో ముగిసిన మ్యాచ్ లో కూలిన మొత్తం 30 వికెట్లలో 28 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి.

5 టెస్టుల్లోనే పేసర్ల హవా

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొత్తం 12 టెస్టుల్లో కేవలం ఐదుటెస్టుల్లోనే ఫాస్ట్ బౌలర్లు 10 కి పైగా వికెట్లు పడగొట్టగలిగారు. 2001 సిరీస్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 90 పరుగుల భారీవిజయం సాధించింది. 2008 సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో ఫాస్ట్ బౌలర్లే 21 వికెట్లు సాధించారు. సఫారీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మోతేరా పిచ్ పైన అత్యంత విజయవంతమైన విదేశీ పేస్ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

ఇంగ్లండ్ రికార్డు అంతంత మాత్రమే

మోతేరా వేదికగా ఆడిన టెస్టుల్లో ఇంగ్లండ్ కు ఏమంత గొప్పరికార్డు లేదు. 2001 సిరీస్ లోని మ్యాచ్ ను డ్రాగా ముగించిన ఇంగ్లండ్ 2012, 2021 సిరీస్ మ్యాచ్ ల్లో మాత్రం ఘోరపరాజయాలు చవిచూడక తప్పలేదు. ఇంగ్లండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ 8 పరుగులకే 5 వికెట్లు, యాష్లే గైల్స్ 67 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ కు చెందిన ఏ ఒక్క పేస్ బౌలర్లూ 5 వికెట్ల ఘనతను సాధించలేకపోయారు. 2005 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన టెస్టులో హర్భజన్ సింగ్ 62 పరుగులిచ్చి 7 వికెట్లు, 2001 సిరీస్ లో అనీల్ కుంబ్లే 115 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించారు. ప్రస్తుత సిరీస్ లోని డే-నైట్ టెస్టులో అక్షర్ పటేల్ 11 వికెట్లు, అశ్విన్ 7 వికెట్లు పడగొట్టారు. మొత్తం మీద అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోని మోతేరా పిచ్ సాంప్రదాయంగా స్పిన్ బౌలింగ్ కే అనుకూలమని గత 12 టెస్టుల గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.

ఇదీ చదవండి: టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు భారత్ చేరితే ఆసియాకప్ వాయిదా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles