Monday, June 24, 2024

తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు స్థానం లేదా!

  • ఎన్టీఆర్ పార్టీలోకి రాడా!  రానివ్వరా!
  • అభిమానులను తొలిచివేస్తున్న ప్రశ్నలు
  • ఎన్టీఆర్ పార్టీకి జవసత్వాలు నింపుతాడని కార్యకర్తల ఆశ
  • కుప్పం రోడ్ షోలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు

పంచాయతీ ఎన్నికల్లో సొంత నియోజక వర్గం కుప్పంలో ఘోర పరాజయం అనంతరం మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఓవైపు సొంత నియోజకవర్గంలో వైసీపీ తిష్ట వేసుకుని కూర్చొని సవాల్ విసురుతోంది. పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తున్న  చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు భారీ షాక్ ఇచ్చారు.  ఓ వైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తల నినాదాలకు చంద్రబాబు మౌనంగా తల ఊపారు. అంతేకాని ఎన్టీఆర్ రాకపై చిన్న ప్రకటన కూడా చేయలేదు. ఇదే ఇపుడు రాష్ట్ర రాజకీయాలలో  తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా శాంతిపురం మండలం రోడ్ షోలో ఎన్టీఆర్ ని తీసుకురావాలి, జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు తన సహజ ధోరణితో కార్యకర్తల నినాదాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకు సాగారు.

చంద్రబాబు ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా ?

పార్టీ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను రాబోయే ఎన్నికల నాటికి పరిపూర్ణ రాజకీయవేత్తగా తీర్చిదిద్దనున్నారు. చంద్రబాబు తరువాత పార్టీ పగ్గాలు లోకేష్ చేతిలో పెట్టి కాబోయే సీఎం అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అయితే నేను లేదంటే లోకేష్ వస్తామని అన్నారు. 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీడీపీ సీఎం అభ్యర్థిగా  ఎన్టీఆర్ ను ప్రకటిస్తే కచ్చితంగా పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

పార్టీలో నంబర్ 2 లేనట్టేనా?

టీడీపీలో చంద్రబాబు తరువాత క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే పార్టీ కార్యకర్తలు నిర్మొహమాటంగా తడుకుకోకుండా చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్. వాక్చాతుర్యం, తెలుగు భాషపై పట్టు, అనర్గళంగా ప్రసంగించగల సామర్థ్యం అన్నిటికీ మించి తాతా ఆహార్యం ఎన్టీఆర్ సొంతం. అయితే పార్టీ లో నెంబర్ వన్ గా మెలిగే చంద్రబాబు మొదట నుంచీ నంబర్ టు కి స్థానం కల్పించలేదు. తను కాకుండా పాపులారిటీ ఉన్న మరోనేతను ఆయన అంగీకరించలేరన్నది జగమెరిగిన సత్యం.  2009 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కంటే ఎన్టీఆర్ రోడ్ షోలకు  మంచి ఆదరణ లభించిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.

ఇదీ చదవండి:చంద్రబాబు చిత్తూరు పర్యటన ఉద్రిక్తం

ఎన్టీఆర్ అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా!

సన్నిహిత వర్గాల సమాచారం బట్టి 2029 వరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆయన దృష్టంతా సినిమాలపైనే పెడుతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణను కోల్పోయినప్పటినుంచి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ తో కలిసి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఆయనలకు టీడీపీలో సముచిత స్థానం దక్కలేదని టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబాన్ని అభిమానించే వారు ఆరోపిస్తుంటారు. బహుశా అదే కారణంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయాల్లో ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహిస్తున్నారు. తెలుగు దేశం తన తాత స్థాపించిన పార్టీ అని ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏమందని ఎన్టీఆర్ అపుడపుడూ కామెంట్ చేస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఎన్టీఆర్ ను వాడుకునే వదిలేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి ఎన్టీఆర్ సన్నిహితులు ఇదే అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. విమర్శలపై స్పందించని ఎన్టీఆర్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు.  

అంధకారంలో టీడీపీ భవితవ్యం?

ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడానికి ఎంతో సమయం పట్టదని కరడుగట్టిన టీడీపీ అభిమానులే అంటున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవాలంటే ఇపుడున్న వనరులు టీడీపీకి సరిపోవు. టీడీపీ అధికారంలోకి రావాలంటే విశేష జనాదరణ గల వ్యక్తులతోనే సాధ్యమవుతుంది. చంద్రబాబు పట్టుదలకు పోకుండా పార్టీ పూర్తిగా కనుమరుగు కాకముందే మేల్కొని నష్టనివారణ చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: కుప్పంలో ఘోర ఓటమి-తమ్ముళ్లకు ధైర్యం నూరి పోస్తున్న చంద్రబాబు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles