Friday, April 26, 2024

పెరుగుతున్న ఆరోగ్యస్పృహ

(ప్రతీతాత్మక చిత్రం)

  • ఆయుష్షుతో పాటు అనారోగ్యం కూడా పెరుగుతోంది
  • భారతీయుల సగటు జీవిత కాలం 70 ఏళ్లు, కేరళలో 77
  • ఆహార నియమాలూ, యోగా, ధ్యానం పట్ల ఆసక్తి
మాశర్మ

భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగిందని తాజాగా విడుదలైన అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. 2019 నాటికి భారతీయుడి సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 1990 లో 60 ఏళ్ళు ఉండేది. ఈ 30 ఏళ్ళల్లో 10 సంవత్సరాలు పెరగడం సంతోషించదగిన పరిణామం.

కేరళలో సగటు జీవితకాలం అత్యధికంగా 77 ఏళ్ళు నమోదయ్యింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ “ది లాన్సెట్” లో తాజాగా ఈ నివేదిక ప్రచురించారు. సుమారు 200 దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. మరణాలకు గల కారణాలు, వ్యాధుల ప్రభావంపై పరిశోధనలు చేపట్టారు. పరిశోధక బృందం 369 వ్యాధులు, 286 కారణాలను కనిపెట్టింది. భారతదేశానికి సంబంధించినంత వరకూ పరిశీలిస్తే, జీవితకాలం పెరిగినప్పటికీ, ఆరోగ్యవంతమైన జీవితకాలాన్ని గడపడం లేదని తేలింది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఇదే తీరులో ఉన్నాయని చెప్పవచ్చు. ఎక్కువ కాలం జీవిస్తున్నారు కానీ, ఎక్కువ ఆరోగ్యంతో జీవించడంలేదన్నది సారాంశం. చాలావరకూ,  మందులతో పెరుగుతున్న కాలంగానే భావించాలి.

మందులు వాడకపోతేనే నిజమైన ఆరోగ్యం

ఏ మాత్ర, ఏ మందూ వాడకుండా గడిపితేనే, అది నిజమైన ఆరోగ్యమని భావించాలి. మందులవాడకం ఆపేస్తే, అసలు రంగు బయటపడుతుందని దీని అర్ధం. పెరిగిన 10 సంవత్సరాల జీవితకాలం వాపే కానీ, బలుపు కాదు. కాకపోతే, ఆరోగ్యస్పృహ పెరిగింది. పెరుగుతోంది. దీనివల్ల, ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం మొదలైన అంశాల పట్ల శ్రద్ధ, సాధనలు పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం. దీని వల్ల కూడా జీవిత కాలం పెరిగిఉంటుంది. ముఖ్యంగా, రెండు దశాబ్దాల పైనుండీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధాసక్తులు ఇటు పట్టణవాసుల్లోనూ, అటు గ్రామీణ వాసుల్లోనూ పెరుగుతున్నాయి. కరోనా వచ్చి నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టినా, మన అసలు రంగును బయటపెట్టడంతో, నేటి మనిషికి భయంతో కూడిన జాగ్రత్త పెరిగిందని చెప్పాలి. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, అలవాటు చేసుకుంటున్న మంచి అలవాట్ల వల్ల,  భవిష్యత్తులో నిజమైన  ఆరోగ్యభారత్ నిర్మాణం జరుగుతుంది.

హెచ్చుతున్న దీర్ఘకాలిక వ్యాధులు

గడచిన 30ఏళ్ళ కాలాన్ని గమనిస్తే, ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, మన దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేదు. వైఫల్యాలే కనిపిస్తున్నాయి. స్థూలకాయం, అధిక షుగర్, బ్లడ్ ప్రెషర్,  కాలుష్యం మొదలైనవి ప్రధాన అనారోగ్య కారకాలు. భారతదేశంలో ఆధునిక వైద్యం పెరుగుతున్నప్పటికీ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పోషకాహార లోపాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ లోపాల వల్ల, పిల్లలు, బాలింతలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు గుండె సంబంధిత వ్యాధులు ఐదవ స్థానంలో ఉండేవి. ప్రస్తుతం ప్రథమ స్థానంలోకి వచ్చేశాయి. సమాంతరంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు భారీగా పెరుగుతున్నారు. ఎక్కడో ఒక చోట ఉండే కాన్సర్ ఆస్పత్రుల స్థానంలో, నేడు అడుగడుగునా  స్థాపించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి.

అనారోగ్య సమస్యలకు, మరణాలకు ఒకప్పుడు అంటువ్యాధులు, పోషకాహార లోపాలు ఎక్కువగా కారణమయ్యేవి. మాతాశిశు మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి. అవి తగ్గిపోయాయి. ప్రస్తుతం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ సి డి) ఎక్కువ కారణమవుతున్నాయి. ఇవి గతంలో 29 శాతం ఉంటే,  ప్రస్తుతం 58 శాతంకు పెరిగాయి. అకాల మరణాలు కూడా 22 శాతం నుండి 55శాతానికి పెరిగాయి. గుండెజబ్బులు, మధుమేహం, కండరాల బలహీనత ప్రబలంగా నమోదవుతున్నాయి. మరణాలలో వాయుకాలుష్యం ప్రధానమైంది. 2019లోని మరణాలను విశ్లేషిస్తే, వాయుకాలుష్యం ద్వారా 16 లక్షలు, హైబీపీ ద్వారా 14.7 లక్షలు, పొగాకు వాడకం వల్ల 12.3 లక్షలు, ఆహారలేమి వల్ల 11.8 లక్షలు, బ్లడ్ షుగర్ వల్ల 11.2 లక్షల మరణాలు సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలలో రక్తపోటు మరణాలు

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా, 10 నుండి 20 శాతం అధిక రక్తపోటు కారణంతో మరణాలు నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నుండి బయటపడాలంటే ప్రధానంగా కాలుష్యం తగ్గించాలి. ప్రజారోగ్య వ్యవస్థలను ఇంకా మెరుగు పరచాలి. పోషకాహార లోపాల నుండి బయటపడాలి. ఆరోగ్యంపై అవగాహన పెరగాలి. ఈ బాధ్యతలు చేపట్టాల్సింది ప్రభుత్వాలే. నిత్య వ్యాయామం, యోగ సాధన, ధ్యానం, ఆహార, నిద్రా నియమాలు పాటించడం, పొగ మద్యం మొదలైన దురలవాట్ల నుండి బయటపడడం మొదలైనవి వ్యక్తి స్థాయిలో ఎవరికివారు పాటించాల్సిందే. ఎరువులతో (కెమికల్స్) పంటలు పండించినంతకాలం, మందులతో శరీరాన్ని మేనేజ్ చేసినంతకాలం ఆరోగ్యభారత్ నిర్మాణం పగటికలగానే మిగులుతుంది. ఆత్మావలోకనం చేసుకొని ముందుకు సాగితే, ఆరోగ్యవంతమైన ఆయుష్షు పెరుగుతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles