Wednesday, February 1, 2023

ఎయిడ్స్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఏపీ ముఖ్యమంత్రికి కూటికుప్పల విజ్ఞప్తి

  • అసమానతలు తొలగించండి, ఎయిడ్స్ కు అంతం పలకండి అనే నినాదంతో ఉద్యమం
  • అలోపతిలోనే సరైన వైద్యం ఉన్నదని ఉద్ఘాటన

ఎయిడ్స్ సోకగానే జీవితం ముగిసిపోదనీ, హెచ్ఐవీ నేడు చికిత్సకు పూర్తిగా లొంగే వ్యాధి అనీ పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చిందనీ, ఆయుర్వేదం, పసర మందుల ద్వారా నయం అవుతుందని చెప్పే మాయమాటలను నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోవద్దనీ ఎయిడ్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రజలకు హితవు చెప్పారు. అవగాహన లేని వైద్యం వల్ల రోగనిరోధకశక్తి పూర్తిగా క్షీణించి లివర్, కిడ్నీ, అనేక అవయవాలు పాడైపోయి క్యాన్సర్ లాంటి రోగాలు సోకిన తర్వాత వైద్యులవద్దకు రావడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోందని డాక్టర్ కూటికుప్పల హెచ్చరించారు.

డాక్టర్ కూటికుప్పల సూర్యారావు

ప్రపంచ వ్యాప్తంగా అత్యాధుని వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు నాలుగు లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారంటే ఇది ఆందోళన చెందవలసిన విషయమేనని డాక్టర్ కూటికుప్పల అన్నారు. హెచ్ఐవీ సోకిందని తెలియగానే అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలో హార్ట్ థిరపీ ద్వారా రోజుకి రూ.35ల ఖర్చుతో అందరిలా ఆరోగ్యంగా 75 ఏళ్ళు నాణ్యమైన జీవితాన్ని సాగించవచ్చునని ఆయన వివరించారు. ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఎ.ఆర్.టి మందులు ఉచితంగా లభిస్తున్నాయని అన్నారు.  ఎయిడ్స్ రోగులు కూడా షుగర్, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఒక్క టాబ్లెట్ తో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని చెప్పారు.

ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ (టీకా మందు) పరిశోధన దశలో ఉన్నప్పటికీ నివారించేందుకు అవగాహన, జాగ్రత్తలతో మాత్రమే మనిషి సురక్షితంగా ఉండగలరని అన్నారు. హెచ్ఐవీ ఎవరికైనా సోకవచ్చుననీ, ఇది అంటువ్యాధి కాదనీ, హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపట్ల ప్రేమతో, ఆదరణతో ఉండటం మనుషులందరి కనీస కర్తవ్యమనీ డాక్టర్ కూటికుప్పల గుర్తుచేశారు. అసమానతలు తొలగించండి, ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయండి అనే నినాదంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1 గురువారంనాడు జరుపుకుంటున్నామని చెప్పారు. వివిధ వ్యాధులు…వైద్య పరీక్షలను ఆరోగ్యశ్రీ పథకం లో ప్రవేశపెట్టి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎయిడ్స్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో గుర్తించాలని ఎయిడ్స్ సందర్భంగా డాక్టర్ కూటికుప్పల సూర్యారావు విజ్ఞప్తి చేశారు. వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం, అపోహలు, పేదరికం కారణంగా చాలామంది హెచ్ఐవీ రోగులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారనీ, ఈ దశలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలందరికీ ఉన్నదని కూడా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి డాక్టర్ సిహెచ్ కొండలరావు, ఎన్ ఆర్ఐ మెడికల్ కాలేజికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ డిఎస్ దేవి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ అచ్చుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ కవిత, లారస్ ల్యాబ్స్ మేనేజర్ జి శేఖర్, మైలాన్ ముంబై నేషనల్ సేల్స్ హెడ్ గజేంద్ర యాదవ్, మైలాన్ జోనల్ బ్రాంచ్ మేనేజర్ సంతోష్ సింగ్ కర్కి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్ కత్తా కు చెందిన నృత్యకారులు ప్రదర్శించిన రిబ్బన్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles