Saturday, April 27, 2024

గంజాయి సాగుపై ఉక్కుపాదం:పోలీసు అధికారులకు కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలో  గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు.

గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని నివేదికలు వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని  సిఎం అన్నారు.  పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, ఉన్నతస్థాయి సమావేశంలో విస్త్రుతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

అందరూ ప్రశంసిస్తున్నారు

‘‘సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం.  అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. వ్యవసాయంలో వచ్చిన అభివృధ్ది వల్ల కోటి 30 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం పంజాబ్ ను మించిపోతున్నది. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలలోని మారుమూల  గ్రామాలకు సైతం పరిశుభ్ర జలాలందిస్తున్నాము. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం.  ఉద్యమ సమయంలో ఏవేవి ఆకాంక్షించామో వాటన్నింటిని నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నాము.  జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలలో 99 శాతం సంస్థలు మనదగ్గర భారీ పెట్టుబడులను పెడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం వల్లనే పెట్టుబడులు మన రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయని’’ సిఎం పెర్కోన్నారు. 

 ‘‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి.  వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్రం యొక్క గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది.  ఒక వైపు  రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం’’ అని అన్నారు.

విజయాలు నిర్వర్యమైపోతాయి

‘‘ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది.  ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాను. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్ లు అందజేసుకుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమాయకులైన యువకులు తెలిసీ తెలియక వీళ్ల బారిన పడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం వుంటుంది. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ.  దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గంజాయి మాఫియాను అణిచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదు’’ అని  సిఎం అన్నారు. 

డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణ

గంజాయిని నిరోధించడానికి డిజి స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు.  ఎన్ ఫోర్స్ మెంట్ ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్  అహ్మద్ ను ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. బార్డర్లలో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మంచి పేరు నిలబెట్టుకోండి

‘‘తెలంగాణ పోలీస్ కు బెస్ట్ పోలీస్ అనే పేరుంది. దాన్ని నిలబెట్టుకోండి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో సమర్ధవంతంగా గంజాయి నియంత్రణ జరిగిన అనుభవాలను పరిశీలించండి. రాష్ట్రంలో గుడుంబా, గ్యాంబ్లింగ్ తిరిగి తలెత్తుతున్నాయి. గతంలో పేకాట నిషేధం అమలయిన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోండి.  పేకాట ఆగిపోవాలి. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ గా పేరు తెచ్చుకున్నాం.  రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలి.  మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో హోంమంతి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు  రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  హోం శాఖ సలహాదారు అనురాగ్ శర్మ, డిజీపి మహేందర్  రెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, భూపాల్ రెడ్డి, రాజశేఖర్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles