Tuesday, November 5, 2024

ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన సంచాలకుడు సర్ సంఘ్ చాలక్ ప్రతి ఏటా విజయదశమినాడు సంఘ్ ప్రధాన కేంద్రం నాగపూర్ లో అభిభాషణ చేస్తారు. ఏడాది మొత్తం మీద అది చాలా ముఖ్యమైన సందర్భం. వేగంగా రూపు దిద్దుకుంటున్న హిందూ రాష్ట్రంలో పౌరులుగా ఎదిగే యువతీయువకులకు తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఏ విధంగా ఆలోచించాలో ఉద్బోధించేందుకు ఈ ఉపన్యాసాన్ని ఉద్దేశిస్తారు. ఆర్ ఎస్ ఎస్ ఉద్యమం వ్యవస్థాపక దినోత్సవంలో వారికి భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగించే ప్రణాళికను, అజెండాను అందజేస్తారు. ఈ వ్యవహారంతో బొత్తిగా సంబంధం లేని మనబోటివాళ్ళకు వచ్చే సంవత్సరం వారు చేయబోయే కార్యక్రమాల నేపథ్యం, ఏ సమాచారం ఆధారంగా వారు కార్యక్రమాలను రూపొందించుకున్నారు అనే విషయం తెలియడానికి సర్ సంఘ్ చాలక్ ఉపన్యాసం దోహదం చేస్తుంది. ఒక సమాజంగా, ఒక రిపబ్లిక్ గా భారత దేశం ఎదుర్కొంటున్న పెను సవాళ్ళలో వేటిని గురించి ప్రస్తావిస్తారో, వేటిని మినహాయిస్తారో కూడా తెలుసుకోవచ్చు. సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవతి విజయదశమి ప్రసంగం నాకు ఏ విధంగా అర్థమైందో మీతో పంచుకుంటాను. దీనికోసం నేను ఆర్ ఎస్ ఎస్ వెబ్ సైట్ లో పెట్టిన ప్రసంగపాఠంపై ఆధారపడ్డాను. మీరు కూడా దాన్ని చదవండి. మీ సమయం వృథాకాదు.

Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్

రెండు అంశాలపైన నా అభిప్రాయం ఇదీ

విజయదశమి ప్రసంగంలో సర్ సంఘ్ చాలక్ స్పృశించిన అన్ని అంశాలు విశేషమైనవే అయినప్పటికీ ప్రధానంగా  రెండు అంశాలపైన నా అభిప్రాయం చెబుతాను. అవి జనాభా విధానం, ఆర్థిక విధానం. ప్రసంగంలో ఆర్థిక పరిస్థితి, కోవిద్ పై పోరాటం, ఆరోగ్యంపైన భారతీయ దృక్పథం వంటి అంశాలను ప్రత్యేక విభాగాలుగా విభజించారు. మన వాయవ్య సరిహద్దులో పరిస్థితి గురించి ప్రత్యేక విభాగం ఒకటి ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరిగిన వైనం, గ్రామీణ ప్రాంతాలలో నిర్వేదం, దేశంలో వేలకోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకోవడం, కోవిద్ కారణంగా మరణించినవారి మృతదేహాలు గంగా నదిలో తేలియాడటం, మన భూభాగంలోకి చైనీయులు చొరబడటం వంటి అంశాలు ప్రస్తావనకు అర్హమైనవని సర్ సంఘ్ చాలక్ భావించలేదు.

జనాభా విధానానికి కేటాయించిన విభాగంలో ‘‘దేశ అభివృద్ధి గురించి పునరాలోచించినప్పుడు ఒక సందేహం ఎదురౌతుంది. అది అందరినీ ఆలోచింపజేస్తుంది. దేశ జనాభా వేగంగా పెరగడం వల్ల సమీప భవిష్యత్తులో అనేక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది’’ అంటూ ఈ అంశం ప్రస్తావన ప్రారంభించారు.

జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది

దేశ జనాభా నిజంగా వేగంగా పెరగడం లేదన్నది స్పష్టం. మనం 2.1 పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్ –టీఎఫ్ఆర్) చేరుకున్నాం. నిరుడు భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో దేశం ప్రతిక్షేపన స్థాయి చేరుకున్నదని తెలియజేసింది. జనాభా పెరుగుదల గురించి అసలు సందేహమే లేనప్పుడు ఆందోళన చెందుతున్నవారు ఎవరో మనకు తెలియదు. 2015లో రాంచీలో జరిగిన అఖిల భారతీయ కార్యకారిణి మండల్ ఆమోదించిన తీర్మానంలో నుంచి ఉటంకించడం ప్రారంభించిన తర్వాత ఆయన అసలు ఉద్దేశం బయటపడింది. ‘‘వివిధ మతాలకు చెందిన సమూహాల పెరుగుదల రేట్లలో  విస్తృతమైన వ్యత్యాసాలు ఉండటం, దేశంలోకి చొరబాట్లు జరగడం, మతమార్పిడులు జరగడం వల్ల జనాభా నిష్పత్తిలో అసమానతలు ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో దేశసమైక్యతకూ, సమగ్రతకూ, సాంస్కృతిక అస్థిత్వానికీ భంగం వాటిల్లే ప్రమాదం ఉంది,’’ అని హెచ్చరించారు.

కార్యకారిణి మండలి తీర్మానంలో మూడు అంశాలు ఉన్నాయి. వివిధ మత సమూహాల జనాభా వృద్ధి రేటులో చాలా వ్యత్యాసం ఉన్నదనేది మొదటిది. విదేశాల నుంచి చొరబాట్లు అనేది రెండో విషయం. మూడోది మతమార్పిడి.  మతస్వేచ్ఛకు సంబంధించిన దృక్పథం నుంచి మతమార్పిడిపైన చర్యలు తీసుకోవచ్చు.

Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…

గణాంకాలు ఏమంటున్నాయి?

కాబట్టి మొదటి అంశాన్ని మొట్టమొదట తీసుకుందాం. దాంతో పాటుగానే మూడో అంశాన్ని కూడా పరిశీలిద్దాం. పునరుత్పత్తి రేటుకు సంబంధించిన గణాంకాలు మన దగ్గర 1950 నుంచీ అందుబాటులో ఉన్నాయి. సంతానోత్పత్తి వయస్సులో మహిళలు ప్రసవించే మొత్తం పిల్లల సంఖ్య సగటు తీసి దానిని సంతానోత్పత్తి రేటుగా పరిగణిస్తున్నారు. ఇవిగో అంకెలు. వీటిని జాగ్రత్తగా గమనించండి. 1950లో టీఎఫ్ ఆర్ 5.9 ఉంది. 1956లొనూ అక్కడే 5.9 దగ్గరే ఉంది. 1957లో స్వల్పంగా 0.1 తగ్గింది. 1965 వరకూ అది 5.7 దగ్గరే ఉంది. తర్వాత తగ్గడం నెమ్మదిగా ప్రారంభమై క్రమంగా  వేగం పుంజుకుంది. 1992 నాటికి అది 3.9 దగ్గరికి తగ్గింది. 2002లో 2.9కి పడిపోయింది. ఈ రోజు టీఎఫ్ఆర్ 2.179. ప్రతిక్షేపన స్థాయికి కాస్త ఎక్కువ. ప్రతిక్షేపన స్థాయి 2.1. ప్రతిక్షేపన స్థాయి అంటే భార్యాభర్త కలిసి ఇద్దరిని (2.1)ని కంటే వారిద్దరి బదులు ఈ లోకంలోకి సరిగ్గా ఇద్దరిని తీసుకొని రావడం. టీఎఫ్ఆర్ 2 కంటే తక్కువ ఉంటే జనాభా  తగ్గడం మొదలవుతుంది. దానివల్ల జటిలమైన సమస్యలు ఉత్పన్నమౌతాయి. సర్ సంఘ్ చాలక్ జనభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువకి తగ్గాలని అనుకుంటే తప్ప జనాభా గురించి ఆందోళన చెందనవసరం లేనే లేదు. ఎందుకంటే అటువంటి పెరుగుదుల ఏమీ లేదు.

బహుశా హిందువులూ, ముస్లింల టీఎఫ్ఆర్ లో అసమానతలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయేమో. ముస్లింలు ఎక్కువమంది సంతానం కని వారి జనాభా హిందువుల జనాభాను మించిపోతే సాంస్కృ తిక అస్థిత్వానికి ముప్పువాటిల్లుతుందని అనుకుంటున్నారేమో. గణాంకాలు ఏమి చెబుతున్నాయి? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) అయిదో రౌండ్ (ఎన్ఎఫ్ హెచ్ఎస్-5) ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ హిందువుల, ముస్లింల సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. మతంతో నిమిత్తం లేకుండా నిరుపేదలూ, నిరక్షరాస్యులలో సంతానోత్పత్తి రేటు అధికమని సర్వేలో తేలింది. ఏ రాష్ట్రంలో  కూడా సంతానోత్పత్తి రేటు ఒక స్థాయిలో ఉండటం కానీ పెరగడం కానీ జరగలేదు. ప్రతిక్షేపన రేటును (2.1) మొత్తం 22 రాష్ట్రాలకు గాను 19 రాష్ట్రాలలో సాధించాం. మూడు రాష్ట్రాలలో మాత్రం – మణిపూర్ 2.2, మేఘాలయ 2.9, బిహార్ 3.0 ప్రతిక్షేపన రేటు కంటే ఎక్కువ జననాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో కూడా రేట్లు మరీ అంత ఎక్కువగా ఏమీ లేవు. అక్కడ కూడా ఈ రేటు తగ్గుముఖంగానే ఉంది. కోవిద్ మహమ్మారి కారణంగా ఇతర రాష్ట్రాలలో సర్వేను నిలిపివేశారు.

ఉత్తర ప్రదేశ్ లో కూడా టీఎఫ్ఆర్ తగ్గుతోంది

ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా సర్ సంఘ్ చాలక్ ఆందోళన చెందవలసిన పరిస్థితులు లేవు. ఆ రాష్ట్రంలో తేలిన లెక్కలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. 2001 నుంచి 2011 వరకూ హిందువుల పునరుత్పత్తి రేటు 1.5 తగ్గింది. 4.1 నుంచి 2.6కు తగ్గింది. అదే కాలంలో ముస్లింల టీఎఫ్ఆర్ 1.9 శాతం తగ్గింది. 4.8 నుంచి 2.9 వరకూ పడిపోయింది. టీఎఫ్ఆర్ కు సంబంధించినంతవరకూ హిందువులకూ, ముస్లింలకూ మద్య అంతరం వేగంగా తగ్గుతూ వచ్చింది. రెండు మతాలవారి మధ్య వ్యత్యాసం 2001లో 0.7 ఉంటే 2011లో 0.3కు తగ్గింది. 2011కూ, ఇప్పటికీ మధ్య పరిస్థతి మరింత మెరుగై ఉంటుంది. తాజా ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 ను కోవిద్ కారణంగా ఉత్తరప్రదేశ్ లో నిర్వహించలేదు. ఆ సర్వే జరిపినప్పుడు దాని ఫలితాలను పరిశీలిస్తే సర్ సంఘ్ చాలక్ కు ప్రయోజనం కలుగుతుంది. అంతకంటే ముందుగా 2020 చివరిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ను చూడాలి. ‘‘మేమిద్దరం, మాకిద్దరు’’ అనే విధానాన్ని అమలు జరుగుపుతున్న తీరు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం-పిల్)కి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో దేశంలో టీఎఫ్ఆర్ తగ్గుతోందని స్పష్టంగా పేర్కొన్నది. 2018నాటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం ఇండియాలో టీఎఫ్ఆర్ 2.2 కి పడిపోయిందని ప్రకటించింది. ఇవన్నీ బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న లెక్కలు. సర్ సంఘ్ చాలక్ ఈ లెక్కలను తెప్పించుకొని చూడలేదని అనుకోవాలి. సలహాదారులు ఆయనను తప్పుదారి పట్టించి ఉండవచ్చు. ఏది చెబితే అది నమ్మే అమాయక జనులకు హిందూ మతం ప్రమాదంలో ఉన్నదని చెప్పి నమ్మించే కొంటె ప్రయత్నం కూడా కావచ్చు.

మత మార్పిడులపైన ఆందోళన

ఇక మతమార్పిడుల గురించి సర్ సంఘ్ చాలక్ ప్రదర్శించిన ఆందోళన గురించి ఆలోచిద్దాం. ఈ ఏడాది ఆయన ప్రసంగం నుంచి రెండు ప్రస్తావనలు ఇస్తాను. వాటిని జాగ్రత్తగా గమనించండి. మొదటిది ఈ విధంగా ఉంది:

‘‘భారత దేశంలో విభిన్నమైన భాషాపరమైన, మతపరమైన, ప్రాతాలపరమైన సంప్రదాయాలను కలిపి సమగ్రమైన పరంపరగా నిర్మించడం, పరస్పర సహకారాన్నా పెంపొందించడం, అందరినీ సమానులుగా పరిగణించడం, అందరికీ అభివృద్ధి చెందే అవకాశాలు సమానంగా ఉండేలా చూడటం మన సంస్కృతి.’’

ఇక రెండోది ఇలా ఉంది: ‘‘తనకు తగిన పూజా విధానాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ  ప్రతి ఒక్కరికీ ఉంది. విదేశీ దురాక్రమణదారులతో పాటు చాలా మతాలు  మనదేశంలో ప్రవేశించాయన్నది చారిత్రక వాస్తవం. అయితే గతంలో దురాక్రమణ చేసినవారితో ఇప్పుడు ఆయా మతాలను అనుసరించేవారికి సంబంధం లేదు. ఆ దురాక్రమణదారులను ప్రతిఘటించి పోరాడిన మన పూర్వీకులతోనే వారికి సంబంధం ఉంది.’’

జనాభాకూ, ప్రార్థనకూ సంబంధం ఏమిటి?

అన్ని మతాల, సంప్రదాయాల మధ్య సహకారాన్ని పెంపొందించాలనీ, అందరి అభివృద్ధికీ సమానమైన, ఒకే విధమైన అవకాశాలు ఇచ్చి వారిని గౌరవించాలని  సర్ సంఘ్ చాలక్ కోరుకుంటున్నట్టు  మొదటి ఉటంకింపు చెబుతోంది. అతడు లేదా ఆమె ఏ రకమైన ప్రార్థన చేయాలని కోరుకుంటే ఆ రకమైన దానిని ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నదని రెండో ఉటంకింపులో చెప్పారు. వివిధ మతాలను అనుసరించేవారు హిందూ పూర్వీకులకు సంబంధించినవారేనని అన్నారు. వారందరిదీ ఒకే వారసత్వం అయితే, ప్రార్థన చేయడానికి వేర్వేరు పద్ధతులను ఎంచుకుంటే సర్ సంఘ్ చాలక్ కు అభ్యంతరం ఎందుకు ఉండాలి? పైన ఉటంకించిన అంశంతో పాటు కింద వాక్యాన్ని కూడా ఆయన అన్నారు:

‘‘సంకుచితమైన రాజకీయ, మతైక, కులప్రాతిదిక కారణంగా వేర్వేరు ప్రార్థనా పద్ధతులను ఎంపిక చేసుకోవడంలో మనకున్న గర్వాన్ని, అహంభావాన్ని మనం కరిగించుకోవాలి.’’

ఆయన అన్న విషయాలను నిజంగానే మనస్ఫూర్తిగా అన్నారా? లేక దేశంలో ఒకే విధమైన మత అస్థిత్వాన్ని సాధించాలనే దుర్మార్గమైన ఆలోచనను దాచిపెట్టడానికి, ఉన్నతంగా, ఆదర్శంగా కనిపించడానికి ఉదాత్తమైన మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయా? ఏది ఏమైనా జాతీయ జనాభా విధానానికీ ప్రార్థన చేసుకునే తీరుకూ ఏమిటి సంబంధం?

‘‘ఆర్థిక పరిస్థితిపై మన దృక్ఫథం’’ అంటూ సర్ సంఘ్ చాలక్ చెప్పిన విభాగం గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తాను. గందరగోళమైన, అస్పష్టమైన ఆర్థిక ఆలోచన ఎట్లా ఉంటుందో చూపించడానికి ఒక మంచి ఉదాహరణ మీకు ఇవ్వాలి. ఆయన ఏమన్నారంటే, ‘‘వస్తు వినియోగాన్ని నియంత్రించాలని మన ఆర్థిక విధానం నొక్కి చెబుతోంది. వస్తుసంపదకు మనిషి ఒక ట్రస్టీ మాత్రమే. యజమాని కాదు. సృష్టిలో అన్ని జీవరాసులతో పాటు మనిషి కూడా ఒక భాగమనీ, తన మనుగడ కోసం ప్రకృతి ఇచ్చేది స్వీకరించవచ్చుననీ, ప్రకృతిని పరిరక్షించే, కాపాడే బాధ్యత కూడా మనిషిదే అన్నది మనలో బాగా పాతుకొని పోయిన విశ్వాసం. ఈ దృక్పథం ఒంటరిది కాదు, ఏకపక్షమైనది కాదు.’’

ప్రపంచం యావత్తూ భారత్ వైపు చూస్తున్నదా?

ఆర్థిక వ్యవహారాలలో కొత్త ఆలోచన కోసం ప్రపంచం యావత్తూ భారత దేశం వైపు చూస్తున్నదనే విశ్వాసంతో ఈ బ్రహ్మాండమైన దార్శనికతను నిర్దేశిస్తున్నారు. ఈ వివేకంలో వాస్తవంగా ఇమిడి ఉన్న అంశాలు ఇవి:

‘‘ఆర్థిక వ్యవస్థ, ప్రగతి ఎట్లా ఉండాలో, ఏ పద్ధతిలో, ఏయే అంశాల ఆధారంగా ఉండాలో తెలుసుకోవడం కోసం మొత్తం ప్రపంచం భారత్ వైపు చూస్తున్నది. తరతరాల జీవన అనుభవం నుంచి, విశ్వవ్యాప్తంగా ఉన్న ఆర్థిక విధానాలూ, ఆలోచనలను  దృష్టిలో పెట్టుకొని మన ప్రత్యేకమైన ఆర్థిక దృక్పథం రూపొందింది. అనంత ఆనందానికి వస్తుపరమైన అంశాలు వనరులు కావు. భౌతిక సుఖాలకే ఆనందం పరిమితం కాదు. శరీరాన్నీ, మనసునీ, మేథస్సునీ, ఆత్మని కలిపి సమగ్ర దృష్టితో దర్శించడానికీ, సమతుల్యమైన వైయక్తిక, సామూహిక, ప్రకృతిపరమైన అభివృద్ధి సాధనకు సర్వోన్నత పరిజ్ఞానం అందించే దైవ శక్తిని సాధించే విధానాన్ని తెలుసుకునే గ్రహింపు రావడానికి దోహదం చేయడానికి, సరళమైన ధర్మ సూత్రాన్ని అమలు చేయడం ద్వారా ప్రగతి, సంతోషాల కోసం చేసే కృషిలో అత్యున్నతమైన స్వేచ్ఛా శిఖరాలు అనుభవంలోకి తెచ్చిన మానవ స్ఫూర్తి ప్రదర్శనకు దోహదం చేసే ఆర్థిక నమూనా ఆదర్శవంతమైదని మన నాగరికత చెబుతోంది.’’

ఈ మొత్తం విభాగం ఎంతో విలువైన ఆర్థిక దృష్టిని ప్రసాదిస్తుంది. మీకు సమయం దొరికినప్పుడు మొత్తం ప్రసంగం చదవండి. ఈ బ్రహ్మాండమైన ఆర్థిక దృక్పధాన్ని అన్వయిచడం నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సంబంధమైన మంత్రిత్వ శాఖల, మొత్తం కేంద్ర ప్రభుత్వ సభ్యుల బాధ్యత. అన్వయించడం ద్వారానే మహోదాత్తమైన ఆర్థిక దృష్టి లక్ష్యాన్ని సాధించేందుకు వార్షిక ప్రణాళికలు రచించవలసిందీ వారే.

రాజకీయాలపై పెరుగుతున్న పట్టు

ఆర్ఎస్ఎస్ ఈ రోజు మహాసంస్థ. నాలుగేళ్ళలో అది శతజయంతి ఉత్సవాలను జరుపుకోబోతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎగువ సభ అధ్యక్షులు, దిగువసభ అధిపతి (స్పీకర్), ప్రధాని, కేంద్రమంత్రులలో చాలామంది, పార్లమెంటు సభ్యులలో అధిక సంఖ్యాకులు, రాష్ట్ర స్థాయి మంత్రులూ, శాసనసభ్యులూ ఈ సంస్థ తీర్చిదిద్దినవారే. దేశ రాజకీయాలపైన దాని పట్టు పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం. ఈ సంస్థ కార్యకలాపాలు ఎట్లా పెరిగాయో, ప్రభావం ఎంతగా విస్తరించిందో రేఖామాత్రంగా తెలుసుకోవాలంటే ఈ సంస్థ వార్షిక నివేదిక ‘ప్రతివేదన్’ 2021 చదవాలి. స్వాతంత్ర్య సమరంలో ఎక్కడా లేకుండా, బ్రిటిష్ ప్రభుత్వంతో కుమ్మక్కు కానప్పుడు ఉద్యమానికి దూరంగా ఉన్న సంస్థ స్వతంత్ర భారత రాజకీయ, సాంస్కృతిక రంగాల అంచుల నుంచి శ్రమించి దేశ సాంస్కృతిక, రాజకీయ రంగాలలో పశుబలాన్ని విడుదల చేసే కళకు అంకితమైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ప్రబలమైన సంస్థ. సంశయాత్మకమైన గతం ఉన్నప్పటికీ ఈ సంస్థ దేశభక్తి కలిగిన సంస్థగా ముద్ర వేసుకున్నది. ఈ సంస్థ బలం పెరిగే కొద్దీ దాని దృష్టి సంకుచితం అవుతూ వస్తోంది. తప్పుదారి పడుతోంది. బహుశా అది అంతకంటే భిన్నంగా ఉండజాలదేమో!

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles