Monday, February 26, 2024

సాహిత్య నోబెల్ అందని ద్రాక్షేనా?

రవీంద్రుని అనంతరం అటువంటి సాహితీవేత్తలు లేరా?

ప్రపంచ స్థాయి సాహిత్య సృష్టి జరగడం లేదా?

భారత భాషలలోని సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించకపోవడమే లోపమా?

ప్రభుత్వాలు పట్టించుకొని గ్రంథాలయాలను పునరుద్ధరించాలి

మాశర్మ

సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం గురువారం ప్రకటించారు. 2019 సంవత్సరానికి సంబంధించిన పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్ గ్లక్ ను వరించింది. ఆమె కనెక్టికట్ లోని యాలే యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 1968 నుండి కవితా లోకంలో గౌరవ, మర్యాదలు పొందుతూ వున్నారు. సాహిత్య రంగంలో ఈమె చేసిన అపారమైన కృషి ఈ అత్యంత విలువైన పురస్కారాన్ని తెచ్చి పెట్టింది.

16 మంది మాత్రమే మహిళలు

నోబెల్ ప్రైజ్ స్థాపించినప్పటి నుండీ ఇప్పటి వరకూ ఎంపికైనవారిలో 16 మంది స్త్రీమూర్తులే కావడం విశేషం. లూయిస్ ఇంగ్లీష్ భాషలో సాహిత్య సృజన చేశారు. 2018, 2019  రెండు సంవత్సరాల పురస్కార గ్రహీతలను ఒకేసారి ఇప్పుడు ప్రకటించారు. 2018 సంవత్సరం పురస్కారం పోలాండ్ కవయిత్రి ఓల్గాకు దక్కింది. ఇద్దరూ మహిళామణులు కావడం విశేషం. భారతదేశం నుండి ఎప్పుడో 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ కు దక్కింది. ఆ తర్వాత, ఈ 107 సంవత్సరాల్లో ఒక్క భారతీయునికీ సాహిత్యంలో నోబెల్ రాకపోవడం చాలా బాధాకరం. ఆలోచనాత్మకం. ఒక్క సాహిత్యం తప్ప మిగిలిన విభాగాల్లో మనకు అనేకసార్లు వచ్చాయి. వారందరూ భారతదేశ  ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో నిలిపారు. ఇది మనకు గర్వకారణం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్ & శాంతి, సాహిత్యం మొదలైన 5 విభాగాల్లో కృషి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ ను నిర్ణయించారు. 1901లో నోబెల్ పురస్కారం స్థాపించారు. భారతదేశం నుండే కాక, ఆసియా ఖండం నుండే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్న ఘనత కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ దే. శాంతి విభాగంలో మదర్ థెరీసా మొట్టమొదటి స్త్రీమూర్తి కావడం  విశేషం.

జాతి రత్నాలు

భారతీయులు, భారత మూలాలు కలిగినవారు, భారతదేశంలో పుట్టినవారందరూ కలిసి ఇప్పటి వరకూ 13 మంది ఈ ఘన గౌరవాన్ని పొందారు. మహితాత్ముడు అరవిందయోగి 1943 & 1950లో సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ కు ఎంపిక కావాల్సివుంది. కానీ,రెండు సార్లు తప్పిపోయింది. 1937 నుండి 1947 మధ్య కాలంలో శాంతి విభాగంలోమహాత్మాగాంధీకి దక్కాల్సింది. ఐదు సార్లు ఈ ప్రక్రియ జరిగింది, కానీ తృటిలో తప్పిపోయిందని చెప్పాలి. నోబెల్ కమిటీ కార్యదర్శి 2006లో ఒక మాట అన్నాడు.” ఈ 106ఏళ్ళ నోబెల్ చరిత్రలో దీన్ని ప్రత్యేక మినహాయింపుగా చూడాలి”, అని వ్యాఖ్య చేశాడు.సాహిత్యం తప్ప మిగిలిన విభాగాల్లో, సివి రామన్, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి, రాజేంద్ర కె పచౌరీ, హర్ గోవింద్ ఖురానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకి రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీ, దలైలామా మొదలైన వారు  భారతదేశం నుండి నోబెల్ గ్రహించి, దేశ ప్రతిష్ఠను పెంచిన మహనీయులు. వీరి ప్రతిభ, సృజన, సేవ నిరుపమానమైనవి. వీరందరూ భారత జాతిరత్నాలుగా మన తలపుల్లో ఎప్పుడూ ఉంటారు. ప్రతిభకు, సృజనకు, కృషికి, సేవకు భారతదేశం ఏ మాత్రం తక్కువ కాదని వీరందరూ నిరూపించారు.కేవలం శాస్త్రాలు, శాంతి సేవ తప్ప సాహిత్యంలో భారతదేశం వెనకపడిందా? అనే  ప్రశ్న మనలో ఎందరినో వెంటాడుతూనే ఉంది.భారతదేశం జ్ఞానభూమి.వేద భూమి.సకల శాస్త్రాలు, సాహిత్యం పరమోన్నతంగా సృష్టించిన మహనీయులు తాండవమాడిన గురుపీఠం, ఋషి పీఠం. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, ఆదిశంకరాచార్యులు వంటి మహర్షులైన మహాకవులు చేసిన సారస్వత సృష్టి సామాన్యమైంది కాదు. అది గత చారిత్రక వైభవం. నన్నయ తిక్కనాదులు, పోతన, శ్రీనాథుడు వెలయించిన కవిత్వాన్ని కొలిచే తూకపురాళ్లు లేవు. వీరందరూ పూర్వులు. నోబెల్ పురస్కారం పుట్టక ముందు పుట్టిన మహాత్ములు.  సుబ్రహ్మణ్యభారతి, కె ఎం మున్షీ వంటి తమిళ, హిందీ కవులు, విశ్వనాథ, శ్రీ శ్రీ వంటి ఆధునిక తెలుగు కవులు తక్కువవారు కారు. గుంటూరు శేషేంద్ర శర్మ పేరు ఒకసారి నోబెల్ నామినేషన్ పరిశీలనకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆయన చేసిన సృష్టి, బహుభాషా ప్రతిభ,  ముఖ్యంగా ఆధునిక మహాభారతం కావ్య సృజన  శేషేంద్రశర్మకు ఆ ఖ్యాతి, ఆ అవకాశం దక్కించి ఉంటాయి.

శేషేంద్ర కవి నోబెల్ సందడి

నామినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనా మన శేషేంద్రశర్మ అక్కడ కాస్త సందడి చేయడం మనకు ఆనందదాయకం. ప్రతి భాషలోనూ  మహాకవులు అవతరించారు.వారు సృష్టించిన సాహిత్యం అపురూపం.నోబెల్ పురస్కారం స్థాపించిన 1901 నాటి నుండి,  భారతీయ భాషల్లో సాహిత్య సృజన జరుగలేదా, అంటే, ఎందుకు జరుగలేదు,  జరిగింది. ఇప్పటి వరకూ నోబెల్ పురస్కారం గ్రహించిన సాహిత్యవేత్తల కంటే భారతీయులు ప్రతిభలోనూ, రసావిష్కరంలోనూ, కావ్యసృష్టి ప్రయోజనంలోనూ ఏమాత్రం తక్కువవారు కాదు. ఉన్న సమస్యల్లా… భాష. ఇప్పటి వరకూ 117 పురస్కారాలు సాహిత్యానికి దక్కాయి.అందులో ఇంగ్లీష్ -30, ఫ్రెంచ్, జర్నన్ భాషలు చెరి 14 ఉన్నాయి. సాహిత్యంలో మొట్టమొదటి పురస్కారం ఫ్రెంచ్ భాష కైవసం చేసుకుంది.రెండవ పురస్కారాన్ని జర్నన్ వశపరచుకుంది. నార్వే, ఇటాలియన్, స్పానిష్, డానిష్, రష్యన్,  హంగేరియన్, టర్కిష్.. స్వీడిష్ ఇలా అనేక భాషల వారు గెలుచుకున్నారు.  భారతదేశానికి చెంది,  రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఒక్కటే ఇప్పటి వరకూ నోబెల్ దక్కించుకుంది. అది కూడా ఇంగ్లీష్ లోనే  వుంది. బెంగాలీని కూడా చేర్చారు. దీని తర్వాత భారతీయ భాషల్లో అంతటి సాహిత్య సృష్టి జరగలేదన్నది అవాస్తవం. గీతాంజలి తర్వాత మనకు  ఎందుకు రాలేదో, విశ్లేషిస్తే  నోబెల్ కమిటీ నిర్ణయించిన, నిర్దేశించిన పారా మీటర్లకు తగ్గట్టుగా మన సాహిత్య సృష్టి జరుగడం లేదన్నది ప్రధానమైన వాదన.ఇందులో ప్రధానమైనది  భాష. రెండవది దృక్పథం.మూడవది స్థాయి అని చెప్పవచ్చు.

భారతీయ భాషల నుంచి ఇంగ్లీషులోకి తర్జుమా అవసరం

నోబెల్ పురస్కారాన్ని నెలకొల్పిన వారు స్వీడిష్ జాతీయుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ మహనీయుని పేరునే ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.స్వీడిష్ భాషీయులకు పలుమార్లు ఈ అవార్డు దక్కినప్పటికీ, ఇంగ్లిష్ భాష అగ్రస్థానంలో  నిలిచింది. భారతదేశం విభిన్న భాషల సమ్మేళనం. ఈ భాషలన్నీ మిగిలినవారికి చేరవు. నోబెల్ పురస్కారం ఎంపిక ప్రక్రియకు ఇదొక ప్రధాన అవరోధంగా చెప్పాలి.మనకు అనుకూలమైన భాష ఇంగ్లీష్ మాత్రమే.భారతీయులు నోబెల్ సాహిత్య పురస్కారం పొందాలంటే ఇంగ్లీష్ లోనే  రాయాలి.లేదా రాసిన తర్వాత అందులోకి తర్జుమా జరగాలి.  అమెరికన్, బ్రిటిష్ ప్రమాణాలలో ఆ ఇంగ్లీష్  ఉండాలి. ప్రపంచ మానవాళిని, జీవరాశిని దృష్టిలో పెట్టుకొని వస్తు నిర్దేశం చేసుకోవాలి.శాంతి స్థాపన ప్రధాన ఆలంబనగా సాగాలి. భాషలో, వస్తువులో, వ్యక్తీకరణలో, భావంలో, రసంలో అంత సృష్టి జరగాలి. ఇవన్నీ కుదిరితే కానీ మనకు నోబెల్ దక్కదు. ఈ 107 సంవత్సరాల్లో ఆ స్థాయిలో సృష్టి జరగలేదన్నది  విశ్లేషకుల అభిప్రాయం.1913లో ఈ పురస్కారం గెలుచుకున్న రవీంద్ర నాథ్ ఠాగూర్ తీరు  వేరు. అతన్ని సగం ఆంగ్లేయుడుగా అభివర్ణిస్తారు.ఇంగ్లీష్ వారిలో ఆయనకున్న ప్రతిష్ఠ, అప్పటి  పరిస్థితులు వేరు.అనేక కారణాల వల్ల రవీంద్రునికి నోబెల్ దక్కిందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం.నోబెల్ అందుకోవడంలో  శాస్త్రపరమైన అంశాల్లో ఆ స్థాయిని అందుకో గలిగాము కానీ, ఇంగ్లీష్ సాహిత్య సృష్టిలో అందుకోలేక పోయామన్న విషయం మనం ఒప్పుకొని తీరాలి.

ప్రతిభ ఉంది, ప్రచారం లేదు కాళిదాస్ సమ్మాన్, జ్ఞాన్ పీఠ్, కేంద్ర సాహిత్య అకాడెమి మొదలైన పురస్కారాలు పొందిన సాహిత్య వేత్తల ప్రతిభను తక్కువగా అంచనా వెయ్యలేము. కానీ, నోబెల్ స్థాయికి చేరలేక పొయ్యామనేది అగ్రశ్రేణి పరిశీలకుల అభిప్రాయం. దీనిపై సాహిత్య వేత్తలు, భాషావేత్తలు ఇప్పటికైనా దృష్టి సారించాలి. ఆ స్థాయిని  చేరుకునేట్టుగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. బ్రిటిష్,   వాషింగ్ టన్, ఆక్సఫర్డ్, యాలే యూనివర్సిటీ, వాటికన్, వెనిస్, బోస్టన్, ఒట్టావా,      న్యూయార్క్ లైబ్రరీలు ప్రపంచంలో చాలా గొప్పవి. ఈ స్థాయి లైబ్రరీలను ఏర్పాటుచేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.మన సాహిత్యాన్ని  అనువాదం జరిపి, ప్రపంచంలోని ప్రధానమైన గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఇంగ్లిష్ లో మన స్థాయి ఇంకా ఎన్నో రేట్లు పెరగాలి. ఆలోచన, సృజన స్థాయిలు విశ్వమానవుని స్థాయికి, నోబెల్ పారామీటర్ల స్థాయికి ఎదగాలి. అప్పుడు భారతీయులకూ సాహిత్యంలో నోబెల్ దక్కుతుంది. నోబెల్ పురస్కారం గెలుచుకోవడం మనకు  కొత్తకాదు.సాహిత్య రంగంలో మాత్రమే ఉన్న ఆ ఒక్క వెలితిని తీర్చుకోవాలి.భాషా సాహిత్యాల కృషి, సృజనకు ప్రభుత్వాల నుండి ప్రోత్సాహం, మద్దతు, వనరుల  సహకారం పెద్ద ఎత్తున లభించాలి. ఇవ్వన్నీ జరిగిననాడు మనం మళ్ళీ సాహిత్యానికి నోబెల్ దక్కించుకుంటాం. దక్కించుకుంటూనే ఉంటాం. ఈ దిశగా ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మావలోకనం, సాధన  కూడా పెంచుకుందాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles