Thursday, April 25, 2024

శేషేంద్ర కవీంద్రుడు

శేషేన్.. బాగ రాసేన్ అని శ్రీశ్రీ అనేవాడు. శేషేంద్ర.. అని ఆత్మీయులు పిలిచేవారు.

ఆ కవీంద్ర చంద్రుని పూర్తి పేరు గుంటూరు శేషేంద్రశర్మ. ఇంటిపేరు గుంటూరు కానీ

ఆయనది నెల్లూరు సీమ.నిజం చెప్పాలంటే ఆ రెండూ కాదు. వారి పూర్వీకులది కశ్మీర్. కశ్మీర్ ప్రాంతం నుంచి తెలుగునేలకు ఎప్పుడో తరలి వచ్చిన ఈ కశ్మీర్ పండితుడు పండితకవిగా తెలుగు భాషను పండించిన తీరు అమోఘం. ఆయన కవిత్వం ఎంత అందంగా ఉంటుందో ఆయన కూడా అంత అందంగా ఉంటాడు.ఒక్కమాటలో చెప్పాలంటే కశ్మీర్ యాపిల్ పండులా ఉంటాడు. మనసు కూడా అంతే అందమైంది. అందుకే అంతటి ఆకర్షణ ఆయన సొత్తు. ‘జ్ఞానపీఠం’ తప్పిపోవచ్చు కానీ, మన హృదయపీఠంపైన ఆయన ఎప్పటికీ చిరంజీవి. సాహిత్య పీఠంపై ప్రతినిత్యం ప్రభవించే ప్రతిభా రవీంద్రుడు. నోబెల్ నామినేషన్  తృటిలో తప్పింది.జ్ఞాన్ పీఠ్  తప్పించారని ప్రచారంలో ఉంది. సాహిత్య ప్రపంచంలోనిఆ రాజకీయాలను అటుంచుదాం. ఆ బాధ ఆయనకు ఎంత ఉండేదో తెలియదు కానీ,ఆయన ప్రతిభ గురించి తెలిసినవారు ఎందరో ఇప్పటికీ ఎంతో బాధపడుతూ ఉంటారు.బాపు రూపొందించిన దృశ్యకావ్యం ‘ముత్యాలముగ్గు’.ఈ సినిమాకు ” నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది “.. అనే అద్భుతమైన పాటను శేషేంద్రశర్మ రాశారు.అదే ఆయన రాసిన తొలి, చివరి సినిమా పాట. ఇంకా రాద్దామనుకున్నారు. కానీ, ఆయన మనకు అందడు, అయనతో పాట రాయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుందంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. అలా,తెలుగు చిత్రసీమ ఆ కలం నుంచి కమనీయమైన గీతాలను ఎన్నింటినో పోగొట్టుకుంది.

జర్నలిస్టుగా జీవితం

జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అది తనకు చాలా ఇష్టమైన వృత్తి.మద్రాస్ లో ‘లా’ చదివే సమయంలో,పార్ట్ టైమ్ గా కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేశాడు.తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చే ‘జనవాణి’ పత్రికలో ఏరీకోరీ మరీ చేరాడు. తను అప్పటికే రాసిన ‘సొరాబు’ అనే కావ్యం ఈ అవకాశాన్ని అందించింది. శేషేంద్రశర్మకు తాపీ ధర్మారావు వేసిన మొట్టమొదటి ప్రశ్న: సొరాబు రాసింది మీరేనా? అవును అని చెప్పడంతో ఎంతో గౌరవించి కోరుకున్నట్లుగా 73రూపాయల జీతంతో జర్నలిస్ట్ గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ కావాల్సిందే అంటూ అప్పటి పార్లమెంట్ సభ్యుడు కోందండరామిరెడ్డి అప్పాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి శేషేంద్ర చేతిలో పెట్టేశాడు. దాంతో

ఆ పాత్రికేయ జీవితం అంతటితోనే ఆగిపోయింది. డాక్టర్ కావాలన్నది వాళ్ళ కుటుంబసభ్యుల కోరిక. తను చదువుకున్న కాంబినేషన్ కుదరక అదీ తప్పిపోయింది. అలా… డాక్టర్,జర్నలిస్ట్,లాయర్ కాకుండా కవిగా మిగిలిపోయాడు, మహాకవిగా వెలిగిపోయాడు. ఎన్ టి రామారావు, శేషేంద్రశర్మ గుంటూరు ఏసీ కాలేజీలో సహాధ్యాయులు, బెంచ్ మేట్స్ కూడా. సంప్రదాయవాదులు, అభ్యుదయవాదులు అందరూ శేషేంద్రను ప్రేమిస్తారు. అటు పద్య కవిత్వం- ఇటు వచన రచనలోనూ సమప్రతిభ, ప్రవేశం కలిగినవాడు. బహుకవితా వల్లభుడే కాదు,బహుభాషా కోవిదుడు కూడా. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగులో గొప్ప పండితుడు. ఈయన కవితలు అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.

నోబెల్ పురస్కారానికి నామినేషన్

 ‘నా దేశం -నా ప్రజలు’ 2004లో నోబెల్ సాహిత్య పురస్కారం నామినేషన్ దాకా వెళ్ళింది. అందరూ బాగుండాలనే విశ్వమానవ దృష్టితో కవితా సృష్టి చేసిన సులక్షణ కవితామూర్తి, విలక్షణ సుకీర్తి దీప్తి. “విశ్వశ్రేయః కావ్యం” అనే ఆర్యోక్తిని ఆచరణలో పెట్టిన ఆదర్శప్రాయుడు శేషేంద్ర.విశ్వనాథ సత్యనారాయణ అంటే ఇష్టమే. కానీ, రాయలప్రోలు సుబ్బారావు ప్రభావం తనపై చాలా ఎక్కువని చెప్పుకున్నాడు. “కవిత్వంలో  అత్యద్భుతంగా శిఖర స్థానం అందుకొని అక్కడ కూర్చొని కవితా సామ్రాజ్యాన్ని ఏలినవాడు రాయప్రోలు సుబ్బారావు, తదనంతర కవులపై రాయప్రోలు ప్రభావం చాలా ఎక్కువ” అని, ఒక ఇంటర్వ్యూలో శేషేంద్ర శర్మ వివరించారు.భవ్య కవితావేశంలో కొప్పరపు కవుల పట్ల తనకు మక్కువ ఎక్కువని, వారి పద్యాలు కొన్ని వందలు తన నోటికి వచ్చని,ఒక సందర్భంలో గుంటూరు శేషేంద్రశర్మ తెలిపారు. శ్రీశ్రీని ఇష్టపడుతూనే, శ్రీరంగం నారాయణబాబు వైపు ఒకింత మొగ్గు చూపించాడు. నారాయణబాబు కవిత్వంలో చిక్కదనం ఎక్కువని ‘రుధిరజ్యోతి’ కావ్యం దానికి ఉదాహరణగా నిలుస్తుందనే భావనలు శేషేంద్రకు ఉండేవి. వాల్మీకి, హర్షుడు, కాళిదాసుల కవిత్వాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన సాహిత్య స్ఫురణ్మూర్తిమత్వం శేషేద్ర కవితావ్యక్తిత్వం. వాల్మీకి రామాయణంలోని సుందరకాండకు,శ్రీహర్షుని నైషథానికి అద్భుతమైన వ్యాఖ్య కూడా రాశారు. ‘నైషధం విద్వదౌషధం’ అంటారు. ఆ మర్మాలు,ఆ మంత్రాలు తెలిసిన కవి శేషేంద్ర.జర్మనీ ఇండోలాజికల్  రీసెర్చ్ యూనివర్సిటీలో కాళిదాసు మేఘదూతనికి-వాల్మీకి రామాయణానికి మధ్య ఉన్న సంబంధంపై ఒక ప్రత్యేక పరిశోధనా వ్యాసం సమర్పించారు.  ‘ఇద్దరు ఋషులు-ఒక కవి’ అనే శీర్షికతో వాల్మీకి,వ్యాసుడు, కాళిదాసుల కవిత్వానుబంధాలపై మరో సందర్భంలో గొప్ప వ్యాసం రాశారు.ఉద్యోగంలో చేరిన తర్వాత జర్నలిజం పక్కకు వెళ్లినా, పత్రికలతో అనుబంధం పోలేదు. విశాలాంధ్ర పత్రిక అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న తొలినాళ్ళల్లో శేషేంద్రశర్మ మొదటి రచన అచ్చయింది.అది ఒక పాట. అలా,తొలి ముద్రణకు నోచుకున్నది ఒక పాట కావడం విశేషం. ఈ పాటలోని పంక్తులను తర్వాత, ‘ఆధునిక మహాభారతం’ లోని ఆదిపర్వంలో చేర్చారు. తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్న సందర్బంగా రాసిన మరో పాట కూడా విశాలాంధ్రలోనే అచ్చయింది.

బహుముఖంగా సాహితీ సృజన

కవితలు,పాటలు, పద్యాలు,వచన కవిత్వం, విమర్శలు,వ్యాసాలు మొదలు బహుముఖంగా సాహిత్య సృష్టి చేశారు.ఆయన రాసిన ఫ్రీవర్స్ బాగా ప్రసిద్ధం.పద్యం నుంచి మెల్లగా వచన కవిత్వంలోకి వచ్చినా సంప్రదాయ కవిత్వంపై రవ్వంత వ్యతిరేకతను ఎన్నడూ పెంచుకోలేదు,మమకారం చంపుకోలేదు.తన భావాలను బలంగా చెప్పడానికి అనువుగా సాహిత్య ప్రక్రియలను, రచనా శిల్పాన్ని సందర్భోచితంగా మార్చుకున్నాడు.బాణుడు రాసిన ‘కాదంబరి’లో అద్భుతమైన కవిత్వాన్ని దర్శనం చేసుకున్నాడు. దండి వచన కవిత్వం పట్ల దండిగా ప్రేమను పెంచుకున్నాడు. ఫ్రెంచ్ కవుల ప్రభావం కూడా శేషేంద్రపై ఉంది.సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చవచ్చు.. అనే బలమైన నమ్మకం శేషేంద్రకు ఉండేది. గుంటూరు శేషేంద్రశర్మ సృష్టించిన ‘కవి సేన మ్యానిఫెస్టో’ చాలా ప్రసిద్ధమైంది.పవన్ కల్యాణ్ కు గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వంఅంటే చాలా ఇష్టం.అందులో, ఆధునిక మహాభారతం మరీ ఇష్టం.తాను స్థాపించిన రాజకీయపార్టీకి ‘జనసేన’ అని పేరు పెట్టుకోవడంలో, బహుశా! శేషేంద్రశర్మ ‘ కవిసేన’ ప్రభావం ఉందేమో? ! అనిపిస్తోంది. “భారతీయ కావ్యశాస్త్ర పరంపర, గ్రీకు,రోమన్ సాహిత్య పద్దతులు, పశ్చిమ దేశాల నుంచి దిగుమతైన ఆధునిక సాహిత్య విమర్శ, మార్క్సిస్ట్ దృక్పథం -ఈ నాలుగింటి కలయికే,కవి సేన మ్యానిఫెస్టో ” అని ఒక సందర్బంగా శేషేంద్రశర్మ వివరించారు.గజల్స్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ‘చమత్కారికలు’ అనే పేరుతో తెలుగులో రాశారు.’శేషేంద్రజాలం’ శీర్షికలో అవి ప్రచారమయ్యాయి. పద్యకవిత్వం రాసినా,రుతుఘోష వంటి కవిత్వం రాసినా, పీడితుల పట్లనే నిల్చోవడం తన బాధ్యతగా భావించిన అభ్యుదయకవి శేషేంద్ర.     మండేసూర్యుడు,గొరిల్లా, ప్రేమలేఖలు,సముద్రం నా పేరు  వంటి రచనలు ఎన్నో  చేశాడు. షోడశి-రామాయణం రహస్యాలు, కాలరేఖ,మబ్బుల్లో దర్బార్, సాహిత్య కౌముది.. ఇలా అసంఖ్యాకంగా సాహిత్య సృష్టి చేశాడు.భారత ప్రభుత్వం ‘రాష్ట్రేంద్రు’ బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఘన గౌరవ సత్కారాలు పొందారు.సత్కావ్యాలు రచించారు.తన కవితా ప్రతిభతో నింగిని నేలను ఏకం చేశారు. కవిగా, సాహిత్యవేత్తగా ఆకాశమంత ఎత్తు ఎదిగినా తన హృదయాన్ని భూమిపైనే నిలుపుకొన్నారు. గుంటూరు శేషేంద్రశర్మ కవితా విశేషాలు అశేషం. ఆ ప్రతిభ నవనవోన్మేషం. అక్టోబర్ 20వ తేదీఈ మహనీయుని పుట్టినరోజు. సరస కవితా కన్యక అడుగడుగునా మెట్టినరోజు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles