Monday, December 9, 2024

మనిషి నిజనైజం పోరాడడమే!

ద వోల్డ్ మ్యాన్ అండ్ ద సీ, రచయిత హెమింగ్వే

ప్రకృతితో మనిషికి శత్రుత్వమైతే లేదు కాని, పోరాటం మాత్రం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.  తనదైన శైలిలో ప్రకృతితో జరిపే పోరాటమే మానవ నాగరకత బీజం. ఫలితంపై దృష్టి పెట్టకుండా పోరాటం కొనసాగిస్తుండడమే మానవ వికాస చరిత్రకు ప్రాణవాయువు. ఈ భీకర సంగ్రామంలో జయాపజయాలు లెక్కచేస్తే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఆ నిరంతర పోరు ఫలితమే. ఆ పరంపరను కొనసాగిస్తూ మనం జరుపుతున్న కృషి భావితరాలకు మరెంతో స్ఫూర్తి. ఈ శృంఖలం ఇలా కొనసాగవలసిందే. దీన్నే ఒక నవలికగా రాసిన ఒక రచయితకు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమానం అందించారు. ఆ రచయిత పేరు ఎర్నెస్ట్ హెమింగ్ వే. ఆ నవలిక పేరు ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ.

Also read: తప్పు ఎక్కడ జరిగింది!

1899 లో ఇలినాయిస్ లో పుట్టిన హెమింగ్వే అక్కడా ఇక్కడా యుద్ధాల్లో పాల్గొన్నా, చివరకు జర్నలిజంలో స్థిరపడ్డాడు. 1926లో “సూర్యుడు కూడా ఉదయిస్తాడు” (ది సన్ ఆల్సో రైజెస్) అనే నవలతో అమెరికన్ సాహిత్యంలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. “అయుధాలకు వీడ్కోలు” (ఫేర్ వెల్ టు ఆర్మ్స్), “ఈ ఘంటానాదం ఎవరి కోసమో” (ఫర్ హూమ్ ద బెల్ టోల్స్) అనే నవలల ద్వారా ఆ స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. 1952లో ప్రచురితమైన “వృద్ధుడూ సముద్రమూ” (ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ) అనే నవల అతడికి పులిట్జర్ బహుమతితోపాటు నోబెల్ బహుమానాన్ని కూడా సంపాదించిపెట్టింది. దీంతో ప్రపంచ సాహిత్యంలోనే హెమింగ్వే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

Also read:: మింగమన్నా కోపమే, కక్కమన్నా కోపమే!

రచన, జీవితం వేర్వేరు కావు 

On Ernest Hemingway's The Old Man And The Sea 🌊 ⛵️ | by Arihant Verma | The  Writing Cooperative

తన రచనల్లోని ప్రధాన పాత్రల్లాగే హెమింగ్వే జీవితం కూడా చాలా సాహసోపేతంగా, ప్రమాదకరంగా గడిచిందనే చెప్పుకోవాలి. కొన్ని యుద్ధాలు, బతుకు తెరువుకోసం ఎన్నో పత్రికలలో ఉద్యోగాలు, ఉన్నచోట ఉండకుండా అనేక దేశాల ప్రయాణాలు, స్థిరం లేకుండా పెళ్లి తరువాత పెళ్లి చొప్పున నాలుగైదు పెళ్లిళ్లు, కేవలం రచనా వ్యాసంగం కొనసాగించడానికే వళ్లు గగుర్పొడిచే ప్రమాదభరితమైన ప్రయాణపుటలవాట్లు… ఇలా ఈ రచయిత జీవితమంతా మన నెహ్రూ ఎప్పుడూ చెప్పే ‘లివ్ డేంజరస్ లీ’ అనే మాటకు చాలా దగ్గరగా వుంటుంది. 1961 లో ఆత్మహత్య చేసుకునేంతవరకు దాదాపు ఇలానే గడిపిన హెమింగ్ వే ఏ నవలలోనూ తాను ఎరగని జీవితం గురించి రాయలేదు. బుల్ ఫైట్ గురించి రాసినా, సముద్రం గురించి రాసినా, విమాన యానం గురించి రాసినా, యుద్ధం గురించి రాసినా తను చూసిందీ, ఎరిగిందీ, అనుభవించిందీ మాత్రమే నిబద్ధంగా అక్షరబద్దం చేశాడు. వేటగాడు, జూదగాడు, తిరుగుబోతు, తాగుబోతు, స్త్రీలోలుడు అయిన హెమింగ్వే జీవితం కూడా అతని రచనల్లాగానే చాలా ఆసక్తికరంగా గడిచింది.

Also read: సైన్యం చేసిన హత్యలకు శిక్షల్లేవా?

‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవల తొలిసారిగా 1952 సెప్టెంబరులో ‘లైఫ్’ పత్రికలో ప్రచురితమైనప్పుడు మొదటి రెండు రోజుల్లోనే యాభై మూడు లక్షల ‘లైఫ్’ ప్రతులు అమ్ముడయ్యాయంటే పాశ్చాత్య పాఠకులు ఈ నవలను ఎంత సాదరంగా ఆహ్వానించారో అర్థమవుతుంది. కథగా చెప్పుకుంటే ఈ నవలలో పెద్ద కథేమీ ఉండదు. శాంటియాగో పేరుగల వృద్ధ బెస్తవాడు ఒంటరిగా సముద్రంలో చేపల వేటకు పోతాడు. ఎనభై నాలుగు రోజులుగా అతడి వలలో కనీసం ఒక్క చేపైనా పడదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఎనభై అయిదో రోజుకూడా వేటకు బయలుదేరుతాడు. ఊహించడానికి వీలుకానంత ఒక పెద్ద చేప తన వలలో పడుతుంది. అయితే ఆ భారీ మీనాన్ని ఒడ్డుకు తెచ్చేలోపు కొన్ని షార్క్ చేపలు దానిని తినేస్తాయి. కేవలం ఆ పెద్ద చేప అస్తిపంజరాన్ని వెంటపెట్టుకుని వచ్చిన ముసలాడిని లోకం తెలీని పసిపిల్లలు ఆటపట్టిస్తారు. విషయం తెలిసిన వూరువూరంతా అతడు సలిపిన పోరాటానికి విస్తుపోతుంది. ఇంతే కథ.

Also read: ‘జైైభీమ్’ సినిమా మన ఆలోచనను మారుస్తుందా!

కనపడని పాత్ర సముద్రం 

Gaurav (India)'s review of The Old Man and the Sea

ఇందులో మనకు పరిచయమయ్యే పాత్రలు రెండే రెండు. ఒకటి వృద్ధుడు శాంటియాగో. రెండోది తన దగ్గర వేట మెళకువలు నేర్చుకోవాలని పరితపించే బాలుడు మానోలిన్. ఇక అసలు మాట్లాడకుండా మనకు పరిచయమయ్యే మరో పెద్ద పాత్ర సముద్రం. నవల చదవడం పూర్తిచేసేసరికల్లా చేపతో పోరాడి పోరాడీ వృద్ధుడు శారీరకంగా అలసిపోతే, అతడిలాగే మనం కూడా శాంత గంభీర స్వరూపురాలయిన సముద్రంతో అలసిపోతాం. శాంటియాగో నాలుగు రోజులుగా ఆ పెద్ద మార్లిన్ చేపతో పోరాడి అలసిపోతాడు. ముసలివాణ్ణించి మరి తప్పించుకోలేని పెద్ద చేప చివరకు చనిపోతుంది. ఆ పెద్ద చేప గాయాలనుండి కారిన రక్తం ఎన్నో షార్క్ చేపలను ఆకర్షిస్తుంది. భయంకర షార్క్ చేపల దాడినుంచి తన పెద్ద చేపను రక్షించుకోవడానికి ఆ వృద్ధుడు మళ్లీ పోరాటం ప్రారంభిస్తాడు. ఆ పెనుగులాటలో కొన్ని షార్క్ చేపలను సంహరించినా, వాటి సంఖ్య ఎక్కువైపోయి ముసలివాడి శక్తులు వుడిగిపోయి డస్సిపోతాడు. షార్క్ చేపల దాడుల తరువాత చివరకు పెద్ద చేప ఏమీ మిగలదు. కేవలం పెద్ద తల, తోక, ఎముకుల గూడు మిగులుతాయి. అయితే ఇదంతా మనిషి తన జీవికలో భాగంగా చేసిన పోరాటంగానే గుర్తుంచుకోవాలి.

Also read: మూడు రాజధానులు లేనట్టేనా!

నిజానికి ఈ నవలను ఆశాజనకంగా కూడా రచయిత ముగించవచ్చు. కానీ రచయిత ఉద్దేశం వేరు. ఆ చేపను యథాతథంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మాంసం అమ్మి, చాలా డబ్బు సంపాదించి తనను ఇన్నాళ్లూ చులకనగా చూసినవారిని ఎద్దేవా చేయవచ్చు. రెండు మూడు నెలలుగా తన వలలో పడడంలేదని చెప్పి, తనకో దురదృష్టవంతుడనే ముద్ర వేసి, తనతో వేటకు పంపడంవలన ఏమీ నేర్చుకోలేడని మానోలిన్ తల్లిదండ్రులు ఆ బాలుడ్ని ఇంకెవరితోనో వేటకు పంపిస్తారు. వారికి కూడా బుద్ధి చెప్పవచ్చు. కానీ అందుకు భిన్నంగా, చాలా సహజంగా, ఈ నవలను రచయిత నడిపిస్తాడు. ప్రకృతిని గెలవడంలో ఉండే పోరాట పటిమను, స్ఫూర్తిని పాఠకులలో రగిలించడం ద్వారా ఇంకా ఉన్నత సాహితీ ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఇలా అంచనా వేసినప్పుడు ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవల గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకంగా కూడా గోచరిస్తుంది. పర్సనాలిటీ డెవలప్ మెంట్ సిరీస్ పుస్తకాలు రాసేవారు, చదివేవారు కూడా పరిగణించాల్సిన అంశమిది. “నీవు గొప్ప శక్తిమంతుడవు. లే. లే.” అని ఊదరగొట్టేకంటే ఇలా కథ రూపంలో వ్యక్తిత్వ ప్రభను మెరుగుపరచాలనుకోవడం ఉత్తమమైన విధానం.

Also read: రోజురోజుకూ అడుగు కిందకు… 

గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకం 

నవల సారాంశాన్నంతటినీ గొప్ప వాక్యంతో రచయిత స్పష్టంగా సూచిస్తాడు. “మనిషి మరణిస్తాడే కాని ఓడిపోడుజ” ఈ మధ్య తామరతంపరగా వస్తున్న మన వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో తప్పుదోవ పట్టించే ఫిలాసఫి చెప్తున్నారు. ఏదో ఒకటి సాధించడం (ముఖ్యంగా డబ్బు సంపాదించడం) లోనే గెలుపు వుందని కారుకూతలు కూస్తున్నారు. విజయం సాధనలో లేదు. సాధించే ప్రయత్నంలో వుంది. నిజానికి ఫలితం మీద ధ్యాస పెట్టకుండా ప్రయత్నం మీదే మనసు లగ్నం చేసినప్పుడు మార్గాలు పెడతోవ పట్టకుండా నీతిమంతంగా బతకడానికి వీలుంటుంది. దురదృష్టవశాత్తూ తెలుగులో ఇటీవల వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాస్తున్న వాళ్లంతా ఫిలసాఫికల్ గా అంత డెప్త్ లేనివాళ్లే. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి రచననొక వృత్తిగా ఎంచుకున్నవాళ్లే.

Also read: వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?

ఈ నవలలో శాంటియాగో వృద్ధుడు కాబట్టి మనసులో అనుకుంటున్న మాటలను బయటకు మాట్లాడేస్తూ వుంటాడు. బాలుడితోనే కాక, మార్లిన్ చేపతోనూ, సముద్ర పక్షులతోనూ, షార్క్ చేపలతోనూ, సముద్రంతోనూ మాట్లాడుతూ వుంటాడు. అలనాటి మేటి బేస్ బాల్ క్రీడాకారుడు డి మాగియో గురించి మనకు చెప్తాడు. ఈ నవలను ప్రేరణగా తీసుకుని సముద్రానికి బదులు అడవి నేపథ్యంలో, చేపకు బదులు అడవి పందుల వేటతో ఇదే జీవన పోరాట సూత్రాన్ని వర్ణించే కథాంశంతో డాక్టర్ కె. కేశవరెడ్డి “అతడు అడవిని జయించాడు” అనే నవలను తెలుగులో రాశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్, సీనియర్ అనువాదకులు సి ఎల్ ఎల్ జయప్రదగారు ఈ నవలను ఇంగ్లిషులోకి అనువదించగా మ్యాక్ మిలన్ సంస్థ ప్రచురించింది. ఇప్పుడు ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవలను తెలుగులోకి కూడా తెచ్చారు. 

Also read: దక్షిణాదిలో బహుజన రాజకీయాలు బలపడనున్నాయా?

-దుప్పల రవికుమార్ 

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles