Monday, October 7, 2024

టెలికాం వైతాళికుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి

  • దేశంలోని ప్రధాన నగరాలలో తన ముద్ర వేసిన దార్శనికుడు
  • ప్రజలను వ్యవస్థీకృతం చేయాలని తపించిన ప్రవీణుడు
  • అరవై ఏళ్ళుగా టెలికాం రంగంలో ఎదురులేని ధీరుడు
  • ఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్న మహనీయుడు

త్రిపురనేని హనుమాన్ చౌదరి అద్భుతమైన వ్యక్తి. ఒక ఆదర్శమూర్తి. జాతీయ స్థాయిలో ఆయన పేరుప్రఖ్యాతులు చాలా గొప్పవి. తీరాలను అధిగమించి ఆలోచించడం, మనుషుల గురించీ, గ్రామాల గురించీ, దేశం గురించీ పరితపించడం ఆయన ప్రవృత్తి. ఆయన అసాధారణ వ్యక్తిగా దేశ ప్రజల హృదయాలలో నిలిచిపోయారనడంలో ఆశ్చర్యం లేదు. అరవై ఏళ్ళుగా ఆయన కీర్తిశిఖరాలపై నిలిచి ఉన్నారు.

త్రిపురనేని కుటుంబీకుడు కనుక ఆయన ఆలోచనాపరుడూ, సంస్కర్త. హనుమాన్ అని పేరు పెట్టారు కనుక దృఢదీక్ష ఉంది. చౌదరి కనుక క్షేత్రస్థాయి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. వారి అవసరాలు తెలుసు. ఏటికి ఎదురీదగలమనీ, గాలికి ఎదురేగగలమనీ చేసి చూపించారు. ఆయన కొత్త దారులు వేశారు. ఉన్న దారులను మార్చారు. దశాబ్దాలుగా చాలామందిని ప్రభావితుల్ని చేశారు.

13 ఏప్రిల్ 2017న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వికరిస్తున్న త్రిపురనేని హనుమాన్ చౌదరిి

50 ఏళ్ళ కిందటే దేశంలో టెలికాంకు పునాది

యాభై ఏళ్ళ కిందట దేశంలో ఎవ్వరూ టెలికాం ప్రాధ్యాన్యాన్ని గుర్తించడానికి ముందే మారు మూలన ఉన్న ప్రజలను సైతం చేరడానికి, వారితో సంబంధాలు నెరపడానికీ, ఒక వ్యవస్థను నెలకొల్పేందుకు బంగారు బాటను వేసి చూపించిన అరుదైన వ్యక్తి హనుమాన్ చౌదరి. ప్రజల సామాజికార్థిక స్థాయి ఎటువంటిదైనా వారిని ఈ వ్యవస్థతో జోడించేవారు. ఒక జిల్లాలో ఒక మూల నుంచి మరో మూలకు అందరికీ ఒకే రేటు (లోకల్ కాల్)లో టెలిఫోన్ కాల్ చేసుకునే సదుపాయం కల్పించారు.

లైన్ మెన్ నుంచి సాంకేతిక నిపుణులనూ, ప్రభుత్వాధికారులనూ, రాష్ట్రాలలో మంత్రులనూ, దిల్లీ పీఠంలో మంత్రులనూ ప్రభావితం చేశారు. ఎట్లా సవినియంగా, సరళంగా, మానవీయంగా వ్యవహరించాలో చెప్పారు. ఒక నమస్కారంతో ఎట్లా అద్భుతాలు సాధించవచ్చునో చేసి చూపించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా నివేదికలు రూపొందించడం, టెలికాంలో సాధించిన విజయాలను నమోదు చేసి, వాటిని ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు టెలికాం కుటుంబంలో మరెవ్వరు కూడా చౌదరి చేసినంత విస్తృతంగా చేయలేదు. దశబ్దాల కాలంలో ఆయన చాలా ప్రచురణలను సాకారం చేసి ఉంటారు. ఇప్పటికీ ఆయన అదే పనిగా చదువుతారు. ధారావాహికంగా రాస్తారు.

హనుమాన్ చౌదరి గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి తెలుసుకునే అన్వేషణలో (ఖోజ్ మిషన్) ఉన్నారు. ఆయన చేసిన పనులలో చాలావాటికి గుర్తింపు కానీ ప్రచారం కానీ రావలసినంతగా రాలేదు. ఆ విషయాన్ని ఆయన పట్టించుకున్నది కూడా లేదు. దేశానికి మంచి అని తాను విశ్వసిస్తున్నదాన్ని అందరికీ చెప్పడం, అందరితో వాదించడం, అందరినీ కార్యోన్ముఖుల్ని చేయడం ఆయనకు ప్రధానం.

విక్రమ్ సారాభాయ్ లాగానే…

టీవీ బ్రాడ్ కాస్టింగ్ ని విస్తృతం చేయడానికీ, సమాంతరంగా ఇతర విధులకు సైతం ఉపయోగపడే విధంగా ఉపగ్రహాలను వినియోగించాలని విక్రమ్ సారాభాయ్ ఏకోన్ముఖ దీక్షతో కృషి చేసినట్టే సాంకేతికరంగాన్ని ప్రజాస్వామీకరించేందుకు దోహదం చేయడంలోనూ, అక్షరాలా అందరికీ అందుబాటులోకి తేవడంలోనూ హనుమాన్ చౌదరి అటువంటి గొప్ప కృషే చేశారు.  

ఎక్కడ ఏ హోదాలో పని చేసినా హనుమాన్ చౌదరి ప్రతిభ కనబరిచేవారు. కోల్ కతాలో, అహ్మదాబాద్ లో, పుణెలో, హైదరాబాద్ లో, ముంబయ్ లో, దిల్లీలో అన్ని చోట్లా ఆయన మన్ననలు పొందారు. స్థానిక ప్రజల ఆలోచనలనూ, వారి సమస్యలనూ, సంస్కృతినీ ఆయన  అవగాహన చేసుకొని సొంతం చేసుకునేవారు. పరిస్థితులను మెరుగుపరచి మరో చోటికి వెళ్ళేవారు. తన మధుర జ్ఞాపకాలను మిగిల్చేవారు. దిల్లీలో తప్ప ఆయన పని చేసిన ప్రతిచోటా ఆయన సేవలను ఎన్నటికీ మరచిపోలేదు. తంతి, తపాలా శాఖ సోషల్ ఆడిట్ సంఘం కన్వీనర్ హోదాలో ముప్పయ్ ఏళ్ళ కిందట దేశవ్యాప్తంగా నేను పర్యటించినప్పుడు టెలికాం రంగంలో చౌదరి ఎటువంటి ఘనకార్యాలు చేశారో స్వయంగా చూశాను. ఆ సంఘంలో సభ్యులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ భగవతి, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి బీజీ దేశ్ ముఖ్ , ప్రసిద్ధ పాత్రికేయుడూ, రచయిత కుష్వంత్ సింగ్ నాతో పాటు పర్యటించి టెలికాం సిబ్బందితోనూ, సాధారణ ప్రజలతోనూ సంభాషణలలో పాల్గొనేవారు. అహ్మదాబాద్ టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ గా ఉండగా చౌదరితో తన పరిచయాన్ని గుర్తుచేసుకొని జస్టిస్ భగవతి చాలా గొప్పగా మాట్లాడేవారు. హనుమాన్ చౌదరి అంటే జస్టిస్ భగవతికి ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

దార్శనికుడూ, ప్రబోధకుడూ

దార్శనికుడుగా, వైతాళికుడిగా హనుమాన్ చౌదరి ఒక వ్యవస్థ. ఒక దశాబ్దం క్రితం కాలం చేసిన ఆయన భార్య మణి కూడా ఆయన భాగస్వామిగానే ఉంటారనుకోండి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో  పది కాలాల పాటు ఉంటూ మనందరికీ ప్రేరణ అందించాలని కోరుకుంటున్నాను. దేశ వ్యాప్తంగా ఆయన క్షేమం కాంక్షించేవారు, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించేవారు చాలామంది ఇప్పటికే చాలామంది ఉన్నారు.

ప్రజలకు టెలిఫోన్ ను చేరువ చేయడంలో ప్రధాన పాత్ర

సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు టెలిఫోన్ ని చేరువ చేయడానికి ఆయన చేస్తున్న విప్లవాత్మకమైన ప్రయోగాల గురించి అరవై ఏళ్ళ కిందట విద్యార్థిగా ఉన్నప్పుడు విన్నాను. ప్రతి ఇంటికీ టెలిఫోన్ పెట్టుకోవాలనీ, గ్రామంలో ఒక టెలిఫోన్ ఎక్స్ చేంజి పెట్టుకోవారనీ మా గ్రామంలో ప్రజలను హనుమాన్ చౌదరి  ప్రోత్సహించడం స్వయంగా చూశాను. జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఫోన్ చేసినా దానిని లోకల్ ఫోన్ గానే పరిగణించాలని ఆ రోజుల్లోనే వాదించేవారు ఆయన. గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో జీవితాలను టెలికాం ఏ విధంగా సంధిస్తుందో, వారి జీవితాలను ఏ విధంగా మార్చివేస్తున్నదో వివరిస్తూ ఆయన రాసిన వ్యాసాలు అనేకం నలభై, యాభై ఏళ్ళ కిందటే చదివాను. ఈ రోజున టెలికాం రంగంలో ఏమి జరుగుతోందో దానిని మనుమాన్ చౌదరి ఆ రోజుల్లోనే దర్శించి చెప్పేవారు.

(18 అక్టోబర్ 2021 త్రిపురనేని హనుమాన్ చౌదరి 90వ జన్మదినం)  

డాక్టర్ ఎన్. భాస్కరరావు అయిదు దశాబ్దాలుగా దిల్లీలో సామాజికాంశాలపై పరిశోధనాత్మక వ్యాసంగం కొనసాగిస్తున్నారు.)

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles