Thursday, December 8, 2022

కృష్ణదేవరాయల అస్తమయం తేదీ వెలుగులోకి తెచ్చిన శిలాఫలకం

  • హొన్ననహల్లిలో దొరికిన శిలాఫలకంలో 17 అక్టోబర్ 1529లో రాయలు మృతి చెందినట్టు ధ్రువీకరణ
  • కర్ణాటకకు చెందిన నరసింహన్, మునిరత్నంరెడ్డి వెల్లడి

ఉద్యోగ విరమణ చేసిన ప్రొఫెసర్ కె.ఆర్. నరసింహన్ బెంగళూరు నగరంలోని ఎలహంకలో నివాసం ఉంటారు. ఒక శిలాఫలకం ఫొటో ఆయన దృష్టికి వస్తే దాన్ని అధ్యయనం చేసి ద్రువీకరణకోసం మైసూరులో ఉన్న పురావస్తుపరిశోధన శాఖకు చెందిన శాసనాల లిపిశాస్త్రం (ఎపిగ్రఫీ) విభాగానికి పంపించారు. ఆ శాఖ సంచాలకుడు కె. మునిరత్నం రెడ్డి ఆ శాసనాన్నిపరిశీలించి అందరికీ ఆశ్చర్యం గొలిపే విషయాన్నివెల్లడించారు. అందులో దక్షిణాదిలో మహమ్మదీయుల పరిపాలనను ప్రతిఘటించి మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన మహారాజు చనిపోయిన తేదీ ఉన్నది. ఈ వివరం వెల్లడి కావడం ఇదే ప్రథమం.

శిలాఫలకం

ఈ శిలాఫలకం ప్రకారం కృష్ణదేవరాయలు 17 అక్టోబర్ 1529న ఆదివారంనాడు మరణించాడు. అదే రోజు చంద్రగ్రహణం ఉండటం యాదృచ్ఛికం. అంటే ఈ ఆదివారం (17 అక్టోబర్ 2021)న ఆయన 492వ వర్థంతి. తుమకూరు జిల్లాలోని హొన్నెనహల్లిలో గోపాలకృష్ణ దేవాలయంలో ఉత్తరం వైపు ఉన్న శిలపైన ఈ విషయం చెక్కి ఉంది. కన్నడ లిపిలో ఉన్న  ఈ శిలాశాసనాన్ని 2021 ఫిబ్రవరిలో కనుగొన్నారు. కృష్ణదేవరాయల మరణాన్ని ఈ శాసనం నమోదు చేసిందని ప్రొఫెసర్ నరసింహ తెలియజేశారు. (వీరకృష్ణరాయమహారాయలయితతాతియితయాల్వయఅస్తమయరాగాలు)-శక 1451లో విరోధి, సు. 15, చంద్రగ్రహణం. అంటే అది ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం 17 అక్టోబర్ 1529 అవుతోంది. తుముకూరు జిల్లాలో హొన్నేనహల్లి గ్రామాన్ని తుమకూరులోని వీరప్రసన్న హనుమంత ఆలయంలో పూజలూ, ఇతర విధులూ నిర్వహించేందుకు బహుమతిగా ఇచ్చినట్టు కూడా ఆ శిలాశాసనంలో ఉంది.

ప్రొఫెసర్ మునిరత్నం, ప్రొఫెసర్ నరసింహన్ ఇద్దరూ శ్రీకాళహస్తి శిలాశాసనం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కృష్ణదేవరాయ మరణం తర్వాత ఆయన స్థానంలో సోదరుడు అచ్యుతదేవరాయలు 21 అక్టోబర్ 1529న పట్టాభిషిక్తుడైనట్టు ఆ శాసనంలో తేదీతో సహా స్పష్టంగా ఉంది.

ఈ శాసనాన్ని కనుగొన్న ఖ్యాతి బస్ డ్రైవర్ ధన్ పాల్ కు దక్కుతుంది.  బెంగళూరు మెట్రొపాలిటన్ కార్పొరేషన్ లో ధన్ పాల్ పని చేస్తాడు. అతడికి శిలాశాసనం ఏది కంటబడినా దానిమీద ఉన్న దుమ్ము దులిపి ఫొటో తీయడం ఒక అరుదైన, ఆసక్తికరమైన అలవాటు. అటువంటి శిలాశాసనాల ఫొటోలు తీసి ప్రొఫెసర్ నరసింహన్ కు పంపడం ఆనవాయితీ. సాధారణంగా శిలాశాసనాలలో రాజులు మరణం గురించి వివరాలు ఉండవనీ, ఇది మాత్రం అత్యంత అరుదైన శాసనమనీ ప్రొఫెసర్ నరసింహం అన్నారు.

శ్రీకాళహస్తిలో  లభించిన శిలాశాసనంలో కృష్ణదేవరాయుడి తమ్ముడు అచ్యుతదేవరాయలు నాలుగవ తులూ వంశ రాజుగా 21 అక్టోబర్ 1529న చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయ ప్రాంగణంలో పట్టాభిషేకం చేసుకున్నట్టు కన్నడ, దేవనాగరి లిపిలో రాసి ఉన్నదని లిపిశాఖ సంచాలకుడు కె. మునిరత్నం రెడ్డి వివరించారు. అయితే, శ్రీకాళహస్తిలో దొరికిన శిలాశాసనంలో కృష్ణదేవరాయుడు ఏ రోజు మరణించిందీ పేర్కొనలేదనీ, హొన్నెనహల్లి శిలాశాసనం లభించిన తర్వాత కృష్ణదేవరాయుడు అస్తమించిన తర్వాత నాలుగో రోజున తమ్ముడు అచ్యుత దేవరాయల పట్టాభిషేకం జరిగిందని ధ్రువీకరించవచ్చుననీ ఆయన అన్నారు.

కృష్ణదేవరాయలు

హొన్నెనహల్లి శిలాశాసనాన్ని కనుగొన్నది డ్రైవర్ గా పని చేస్తున్న ధన్ పాల్ అని నరసింహం ‘తెలంగాణ టుడే’ దినపత్రికకు తెలియజేశారు. ఎస్ఎస్ సీ వరకు మాత్రమే చదువుకున్న ధన్ పాల్ తాను కనుగొన్న శిలాశాసనం గురించి తన మిత్రుడు నరసింహన్ కు తెలియజేశారు. నరసింహన్ శాసనం చదివి విషయం తెలుసుకున్నారు. తను కనుగొన్న అంశాలను ధ్రువీకరించేందుక లిపిశాఖ సంచాలకుడికి ఈ శాసనం పంపించారు. ఈ శాసనంలో కృష్ణదేవరాయ మరణానికి దారితీసిన కారణం ఏమిటో పేర్కొనలేదు. సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి మరణించినట్టు ఇతర శాసనాలనూ, గ్రంథాలను చదివితే తెలిసిందని అంటారు.

కృష్ణదేవారాయల పాలన కీ.శ. 1509లో ప్రారంభమై 1529 వరకూ రెండు దశాబ్దాలపాటు దేదీప్యమానంగా సాగింది. విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నిర్మించాడు. ‘కన్నడ రాజ్య రమారమణ’ అనీ, ‘మూరు రాయరగండ (ముగ్గురు రాజులకు రారాజు)’ అనీ కన్నడలో బిరుదాలు ఉన్నాయి. తెలుగులో ఆంధ్రభోజుడు అనే ప్రశస్తి ఉంది. తన అధీనంలో ఉన్న పెద్ద సైన్యాన్ని లాఘవంగా, కుశాగ్రబుద్ధితో వినియోగించి తనకు ఉత్తర దిశగా ఉన్న రాజ్యాలపైన చేసిన ప్రతియుద్ధంలోనూ విజయం సాధించారని ఎన్ సైక్లొపిడియాలో వివరంగా ఉంది.

శ్రీనివాసరెడ్డి

కృష్ణదేవరాయలు చేసిన యుద్ధాలను ఎన్ సైక్లొపిడియా ఈ విధంగా అభివర్ణించింది: ‘‘విజయనగర చరిత్రలో జయప్రదమైన కాలంలో కృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆయన సైన్యం ప్రతి యుద్ధంలోనూ గెలుపొందింది. అప్పుడప్పుడు రాజు తన యుద్ధవ్యూహాన్నియుద్ధమధ్యంలో అకస్మాత్తుగా మార్చివేసేవారు. ఓడిపోయేట్టు కనిపించే యుద్ధాన్ని అంతిమంగా గెలిచేవారు. ఆయన పాలనలో మొదటి దశాబ్దం అంతా ముట్టడులూ, రక్తసిక్తమైన యుద్ధాలూ, విజయాలతో గడిచిపోయింది. ఒడిశాలో గజపతులు ఆగర్భశత్రువులు. సాలువ నరసింహదేవరాయల పాలన నుంచి గజపతులతో పోరాటం  సాగుతూ ఉండేది. బహమనీ సుల్తానులు అయిదు చిన్న రాజ్యాలుగా చీలిపోయినప్పటికీ వారి నుంచి కూడా విజయనగర సామ్రాజ్యానికి ఎల్లప్పుడూ ముప్పు పొంచుకొని ఉండేది. పోర్చుగీసువారు సముద్రజలాలపైన పోరాటయోధులుగా, వాణిజ్య ప్రముఖులుగా  ఎదిగారు. సముద్రమార్గాలు వారి చెప్పుచేతల్లో ఉండేవి. ఉమ్మటూరు సంస్థానాధీశులూ, కొండవీడు రెడ్డిరాజులూ, భువనగిరి వెలమరాజులూ విజయనగర రాజుల పాలనపైన పదేపదే తిరుగుబాటు చేసేవారు. అప్పుడే భారత దేశ పశ్చిమతీరంలోకి  వచ్చి పుంజుకుంటున్న పోర్చుగీసువారితో కృష్ణదేవరాయలు దౌత్యం నెరపాడు. పోర్చుగీసువారితో సంయుక్తంగా పోరాడుదామన్న ఇతర రాజుల ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించేవాడు. గుర్రాలను సమీకరించేవాడు. విజయనగరంలోకి నీరు తీసుకురావడానికి అవసరమైన పరిజ్ఞానం సంపాదించాడు.

కృష్ణదేవరాయ సామ్రాజ్యంలో సంపద దండిగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఓడించిన రాజులు కట్టే కప్పంతోనే ఆ సంపద సమకూరింది. ఒడిశాలో గజపతి రాజులూ, రాయచూరులో దోయబ్ రాజులూ, దక్కన్ సుల్తాన్ లూ సామంత రాజులుగా ఉండేవారు.

19 మే 1520న కృష్ణదేవరాయుడు సాధించిన విజయం అత్యంత ఘనమైనదిగా పరిగణిస్తారు. బీజాపూర్ రాజు ఇస్మాయిల్ అదిల్ షా చేతుల్లో నుంచి రాయచోటి కోటను కృష్ణదేవరాయలు హస్తగతం చేసుకున్నాడు. ఆ ముట్టడిలో 16 వేలమంది విజయనగరం సైనికులు నేలకూలారు. రాయచూరు యుద్ధంలో విజయం సాధించడానికి అసాధారణమైన ప్రజ్ఞాపాటవాలూ, వ్యూహరచనా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలూ, ధైర్యసాహసాలూ ప్రదర్శించినందుకు ప్రధాన సైన్యాధికారి పెమ్మసాని రామలింగ నాయుడిని కృష్ణదేవరాయలు ఘనంగా సన్మానించాడు. ఈ యుద్ధంలో 703,000 పదాతిసైనికులూ, 32,600 అశ్వాలూ, 551 గజాలూ పాల్గొన్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ యుద్ధం బహమనీ సుల్తాన్ ల పాలనకు చరమగీతం పాడింది. గుల్బర్గా దుర్గం నేలమట్టమైంది.

కృష్ణదేవరాయలు తన సంపదలో అత్యధిక భాగాన్ని దేవాలయాల నిర్మాణానికీ, సాహిత్యకారుల, పండితుల ప్రోత్సాహానికీ వెచ్చించారు. కృష్ణదేవరాయలు స్వయంగా  కవి, గోదాదేవి చరిత్రను ‘ఆముక్తమాల్యద’ పేరుతో రచించారు. వటపత్రసాయికి పూలహారాలు సమర్పించడానికి ముందు గోదాదేవి వాటిని తన మెడలో ధరించేది. తాను నాధుడుగా భావించే  రంగనాథుడికి దూరం కావడంలోని వియోగం తాలూకు విరహ వేదనని కృష్ణదేవరాయలు ఆ గ్రంథంలో అద్భుతంగా వర్ణించారు.

అమెరికాలో విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఆసియా భాషల, సంస్కృతుల కృష్ణదేవరాయ పీఠం ఉన్నది. దానికి అధిపతిగా ప్రముఖ సాహితీవేత్త వెల్చేరు నారాయణరావు ఉండేవారు. విశ్వవిద్యాలయాలకూ, వీధులకూ, పరిపాలనా విభాగాలకూ కృష్ణదేవరాయల పేర్లు ఉన్నాయి.

పండితుడూ, సంగీతవిద్వాంసుడూ శ్రీనివాసరెడ్డి రచించిన కృష్ణదేవరాయల జీవితకథను స్క్రోల్.ఇన్ సమీక్షించింది. రాయలవారి జీవితాన్ని సర్వసంమగ్రంగా చిత్రించారని సమీక్షకుడు రచయితకు కితాబు ఇచ్చారు. రాయల వైభవోతమైన పరిపాలనకు సాక్ష్యాలుగా అనేక ఉదంతాలను ఉటంకించారని చెప్పారు.

గుర్రాల వ్యాపారులూ, ముత్యాల వ్యాపారులూ, దౌత్యవేత్తలూ వివిధ భాషలలో కృష్ణదేవరాయల జీవితకథను రచించారు. ఇటాలియన్ భాషలో నికొలో కాంటీ,  తైమూరు కుమారుడి దర్బార్ నుంచి వచ్చిన అరబిక్ రచయిత అబుర్రజాక్ (ఆయన పశ్చిమతీరంలో అనేక నగరాలను సందర్శించారు), కొత్తగా నెలకొల్పిన గోవా నుంచి వచ్చిన పోర్చుగీస్ వారు డొమంగో పేస్, ఫెర్నో న్యూన్స్ పోర్చుగీసులో (వీరిద్దరు వెల్లడించిన అంశాలను రాబర్ట్ ఇ సెవెల్ రాసిన విజయనగర చరిత్రలో ఉటంకించారు.) రచనలు చేశారు. ‘ఆముక్తమాల్యద’నూ (గివర్ ఆఫ్ ది వార్న్ గార్లాండ్), కాళిదాడు విరచితమైన ‘మేఘదూతం,’ ‘మాలవికాగ్నిమిత్రం’ అనే కావ్యాలనూ శ్రీనివాసరెడ్డి ఇంగ్లీషులోకి అనువదించారు.

రాజుకి ఇష్టమైన ముగ్గురు పేడివారి అదుపాజ్ఞలలో 40 వేల పదాతి సైనికులూ, వెయ్యి గుర్రాలూ, 15 ఏనుగులూ ఉండేవట. రాజుకోసం తమలపాకులు తెచ్చే సేవకుడి దగ్గర 15వేలమంది సైనికులూ, 200 గుర్రాలూ ఉండేవట. రాజుకి వ్యక్తిగత రక్షకదళంలో 40 వేల మంది విలుకాండ్లు, ఆరు వేల గుర్రాలూ, 300 అత్యుత్తమ జాతి ఏనుగులూ ఉండేవి. ఎందుకంటే తన సామ్రాజ్యంలో ఉన్న అన్ని రాజ్యాల నుంచి తనకు నచ్చిన ఏనుగులను తెప్పించుకునేవారు. అందరు చెప్పిన లెక్కలూ కూడితే కృష్ణదేవరాయలు దగ్గర అయిదు లక్షల మంది కాల్బలం,  30 వేల గుర్రాలు, 500 ఏనుగులు ఉండేవని తేలుతోంది. అది అతిశయోక్తి అనడంలో సందేహం లేదు. కానీ ‘నరపతి’ అనే బిరుదు కృష్ణదేవరాయుడికి ఊరకే రాలేదు.

కృష్ణదేవరాయుడికి యవనరాజ్యస్థాపనాచార్య అనే బిరుదు కూడా ఉండేది. యవనులు అంటే ఇక్కడ ముస్లింలు. ముస్లింల రాజ్యం నెలకొల్పినవాడు అని అర్థం. అదిల్ షాను ఓడించిన తర్వాత బహమనీ సుల్తాన్ ముహమద్ తన రాజధాని బీదర్ లో పట్టాభిషేకం చేసుకోవడాన్ని పెద్దన మనుచరిత్రలో రాశాడు. అనేక శిలాశాసనాలలో సైతం కృష్ణదేవరాయుడిని యవన రాజ్యస్థాపకుడిగా అభివర్ణించడం కనిపిస్తుంది.

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

  1. చాలా మంచి వ్యాసం. మాడభూషి గారు రాసే పద్ధతి నాకు చాలా నచ్చుతుంది . ఎందుకంటే పరిశీలిన ద్వారా తెలిసిన విశేషాలు ఒక్ క్రమం లో రాస్తారు.

    విహాయనగర రాజు శ్రీకృష్ణదేవరాయ గురించి మేమందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునము .ఆయనకు టెలూ సాహిత్యం మీద ఉన్న అనురాగం తెలిసిన విషయమే..
    విజయనగర సామ్రాజ్యం గురించి వివరంగా రాసిన మాడభూషి శ్రీధర్ గారికి ధన్యవాదాలు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles