Saturday, July 13, 2024

రావణ సుతుడు అక్షకుమారుడి వధ

రామాయణమ్ 152

తోరణము వద్ద కూర్చుని ఉన్న హనుమంతుని అక్షకుమారుడు సమీపించెను.

ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వరిల్లుతున్న హనుమంతుని చూసి అక్షకుమారుడు ఆశ్చర్యచకితుడై గౌరవముతొ చూసెను.

వచ్చీ రావడమే మూడు వాడి తూపులతో హనుమ ఫాలభాగమున  నాటుకోనునట్లుగా కొట్టాడు అక్షుడు.

Also read: అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ

వారివురి యుద్ధము పుట్టించే వేడి ముందు సూర్య ప్రతాపము చల్లగా అనిపించింది . వాయువు స్తంభించింది. గిరులు వణికాయి. చుక్కలు నేల రాలాయి. సకల భూతకోటి గజగజ వణక సాగింది. ఆకాశము అంతా  మ్రోతపుట్టింది.

అక్ష కుమారుడి చాపమునుండి విద్యుల్లతలు పుట్టి భూమండలమంతా వ్యాపించినవా అన్నట్లుగా ఉన్నది. అతని ఈ అద్భుత శరసంధాన నైపుణ్యానికి హనుమంతుడు అచ్చెరువొందాడు.

వాడి  వాడి శరాల తాకిడి వొడలంతా వేడిపుట్టించినా వీడు బాలుడే…అని తలచి వాని బాణములు తప్పించుకొని తిరుగుచుండెనే కానీ వానిని చంపే ప్రయత్నము మారుతి ఎంతకూ చేయకపోయెను.

అంతకంతకూ వాని పరాక్రమము హెచ్చి ఆంజనేయుని చీకాకు పెట్టగా అది తప్పించుకొనుటకు వాయుపుత్రుడు ఆకసమునకు ఎగసెను. వాడునూ ఈయన వెంట రధముతో సహా ఆకాశానికి ఎగురగా వాని రధమును పట్టుకొని మారుతి నేలపై కొట్టెను.  వాని, గుర్రములు రక్తముకక్కుకొని చనిపోగా క్రుద్ధుడైన అక్షుడు తాను ఒక్కడే ఆకాశములోకి ఎగిరి యుద్ధము చేయసాగెను.

Also read: హనుమపై రాక్షసమూక దాడి

ఇక లాభము లేదు వీనిని ఉపేక్షించరాదు అనుకుని చటుక్కున వాని కన్నా క్రిందుగా ఎగురుతూ వాని రెండుకాళ్ళూ పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలకేసి విసిరి కొట్టగా వాడి తొడలు విరిగి ,శరీరపు సంధులన్నీ ఊడి, భుజములు నలిగి శిరస్సు నూరువ్రక్కలై రక్తము ఉప్పొంగి మడులు కట్టి దిక్కుమాలిన చావు చచ్చాడు అక్షకుమారుడు.

మరల ప్రశాంతముగా ఎవరిని ఈ సారి పంపుతాడో రావణుడు అని  ఎదురుచూస్తూ తోరణము మీద కూర్చున్నాడు అనిలసుతుడు.

‘ఆశ్చర్యము.  అద్భుతము. అక్షకుమారుని వధ అనితరసాధ్యము ఒక్క హనుమంతుని వలననే అది సాధ్యపడినది’ అని దేవతలందరూ కూడా ఆ అనిలసుతుని పరాక్రమాన్ని వేనోళ్ళపొగడగా అవి ఏవీ పట్టనట్లుగా ప్రజలను సంహరించడానికి తీరిక చేసుకొని కూర్చున్న యముడివలే రాబోయే యోధులకొరకు స్వామి నిరీక్షిస్తూ ఉన్నాడు.

Also read: విధ్వంసమైన అశోకవనం, భీతిల్లిన రాక్షసగణం

అక్షకుమారుని మరణవార్త తక్షణమే రాక్షసరాజు చెవినబడ్డది. ఒక్కసారిగా ధిగ్గుమనిలేచాడు. కాసేపటికి మనస్సు కుదుట పరచుకొన్నాడు.  తీవ్రమైన కోపముతో ఇంద్రజిత్తు కేసి చూసి వెంటనే యుద్ధరంగానికి బయలు దేరమని ఆదేశించాడు.

‘‘కుమారా, నీవు శస్త్రాస్త్రకోవిదుడవు. నీ రణకౌశలాన్ని దేవతలుకూడా ఎరిగియున్నారు. భుజబలములో, తపోబలములో నీకు సాటి రాగలవాడు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు. ఏ దేశములో, ఏకాలములో ఏ పని చేయవలెనో ఎరిగిన వాడవు. కింకరులు పోయినారు తిరిగిరాలేదు.  జంబుమాలి జాడలేకుండా పోయినాడు. అమాత్యపుత్రులు రణమందు అణగిపోయినారు. నీ సోదరుడు అక్షుడు ఇప్పుడు యముడికి అతిథిగా పోయినాడు. వారెవరికీ నీకున్న బలము లేదు.  నా వారసుడవు నీవే!

‘‘నాయనా ఆ వానరుని బలాన్ని అంచనా వేయుటలో పొరపడకుము! నీ బలము అతని బలము బేరీజువేసుకొని మరీ యుద్ధము కొనసాగించు …విజయుడవై తిరిగిరా’’ అని తండ్రి పంపగా మహోత్సాహంతో ఉత్సవము చేసుకుంటూ హనుమంతుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు..

Also read: అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles