Tuesday, January 31, 2023

మరో మహా కర్షక పంచాయతీ!

  • ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్ళీ ఉద్యమం
  • కనీస ధరల నిర్ణయంలో తమ భాగస్వామ్యం కోసం పట్టు
  • విద్యుత్ సంస్కరణలపైనా తమతో సంప్రదించాలని షరతు

సుమారు 8 నెలల క్రితం వరకూ రైతు సంఘాల ఆందోళనలతో దేశ రాజధాని పరిసరాలు దద్దరిల్లిపోయాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరు పెను సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి అనుకూలమైన ప్రకటన చేయడంతో డిసెంబర్ 2021 లో ఆ యుద్ధం ఆగిపోయింది. రాకేష్ సింగ్ టికాయిత్ నాయకత్వంలో జరిగిన ఆ ఉద్యమం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. మంగళవారం నాడు మళ్ళీ దిల్లీ వీధులు రైతుల నినాదాలతో మార్మోగిపోయాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి ) చట్టం చేయాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని మొదలైన పలు డిమాండ్లతో ‘మహా పంచాయతీ’ పేరుతో ‘సంయుక్త కిసాన్ మోర్చా’ నిర్వహించిన ఆందోళనతో దిల్లీ అట్టుడికి పోయింది.

Also read: ‘ఆంధ్రకేసరి’ అవతరించి నూటాయాభై ఏళ్ళు

Kisan Mahapanchayat : Mahapanchayat of farmers' organizations in opposition  to the central authorities at Jantar Mantar; Delhi Police denied permission  » allmaa ‣ AllMaa
సోమవారంనాడు దిల్లీలో మహాపంచాయత్ సందర్భంగా రైతు నేతలు

వేలమంది రైతులు పాల్గొన్న మహాప్రదర్శన

కొన్ని వేలమంది రైతులు పాల్గొన్న  ఈ నిరసన కార్యక్రమం నిన్నటి వరకూ జరిగిన ఆందోళనల పర్వాన్ని మళ్ళీ గుర్తుచేసింది. గతంలో వలె నేడు కూడా ఏ రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక,మహారాష్ట్ర, ఒడిశా, కేరళ సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రాజధానికి కదిలి వచ్చారు. ఇది ప్రస్తుతానికి ఒక్కరోజు నిరసనే అయినప్పటికీ రోజుల తరబడి ఉండడానికి రైతులు సంసిద్ధమై వచ్చినట్లు కనిపించడం విశేషం. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రైతునేతలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.  అందులో ఆరు అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ పీకి చట్టబద్ధత కల్పించడం, రైతు రుణాలను మాఫీ చేయడం, విద్యుత్ ( సవరణ) బిల్లు -2022ను పార్లమెంట్ లో ఆమోదించడానికి ముందు అన్నదాతలతో సంప్రదింపులు జరపడం మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. ఈ రోజు పాల్గొన్న నాయకులలో రాకేష్ సింగ్ టికాయిత్ కనిపించలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో, తాజాగా మొన్న సోమవారం నాడు నాలుగు ఉపకమిటీలు ఏర్పడ్డాయి. మద్దతు ధరను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం సహా పలు కీలక అంశాలపై ఈ ఉపకమిటీలు సమాలోచనలు జరపాల్సివుంది. సెప్టెంబర్ చివర్లో ఎం ఎస్ పీ కమిటీ తుది సమావేశం జరగాల్సి వుంది. ఈ ఉపకమిటీల నియామకం జరిగిన మర్నాడే సంయుక్త కిసాన్ మోర్చా ‘మహా పంచాయతీ ‘ నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Also read: తెలుగు పిడుగు గిడుగు

మరికొన్ని మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు

మరి కొన్ని నెలల్లోనే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల గురించి కూడా రాజకీయ వేడి రాజుకుంటోంది. విపక్షాల ఐక్యత ఇంకా గందరగోళంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అగమ్యగోచరంగా ఉంది. ఆ స్థానంలో కూర్చోడానికి రాహుల్, ప్రియాంక ఇద్దరూ సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, బీహార్ లో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త ఘట్ బంధన్ ఏర్పడింది. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఆయన  బిజెపితో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. 2024ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, ఐతేగియితే విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తన పేరు ముందు వరుసలో చూసుకోవాలని నితీశ్ కుమార్ చూస్తున్నట్లు కొన్ని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. నిన్నటి వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా టికాయిత్ నాయకత్వంలోని రైతు సంఘాలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మళ్ళీ పెద్దఎత్తున రైతు సంఘాల ఆందోళనలు జరుగాతాయో లేదో తేలాల్సివుంది. టికాయత్ వంటి రైతు సంఘాల అగ్రనేతల పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాల్సివుంది. రైతు సమస్యలు గుదిబండ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంది.ఆందోళనల నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం అనివార్యం. దేశవ్యాప్తంగా రైతులను శాంతిపరచడం అత్యంత కీలకం. మిగిలిన ప్రతిపక్షాలు ఎట్లా ఉన్నా,అమ్ ఆద్మీ మంచి దూకుడు మీద ఉంది. బిజెపి/నరేంద్రమోదీని గద్దె దింపి తాను ప్రధానమంత్రి సింహాసనాన్ని అధిరోహించాలని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. రాజకీయాల్లో సమాంతర సంస్కృతిని తెస్తానంటూ దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. పంజాబ్ ను ఆక్రమించడంతో ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. తన సొంత రాష్ట్రం హరియాణాపై మొదటి నుంచీ కన్నుంది. కేంద్రంపై వచ్చే రైతు వ్యతిరేకతలను కూడా సొమ్ము చేసుకోవాలని అమ్ అద్మీ చూస్తోంది. కేజ్రీవాల్ కు దిల్లీ, పంజాబ్, హరియాణా మొదలైన రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం మద్దతు ఉంటాయన్నది అనుమానమే.

Also read: చిరంజీవి పీ వీ ఆర్ కె ప్రసాద్!

హ్యాట్రిక్ కోసం మోదీ విశ్వప్రయత్నం

నితీశ్ కుమార్ వంటి నేతల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందన్నది కూడా తెలియాలంటే ఆయన వ్యూహప్రతివ్యూహాలు,బలబలాలు ఇంకా తేలాల్సివుంది. 2024లోనూ విజయం సాధించి హాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రధానమంత్రి కావడం ఆషామాషీ కాదు. మోదీ -అమిత్ షా ద్వయం విజయం పట్ల అత్యంత విశ్వాసం ప్రదర్శిస్తోంది. అనుకున్న సంకల్పం నెరవేరాలంటే మిగిలిన అంశాలతో పాటు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనిపెట్టడం చాలా ముఖ్యం. ఎవరు అధికారంలోకి రావాలన్నా అన్నదాతల ఆశీస్సులు ముఖ్యం. ఈ 75 ఏళ్ళ పాలనలో అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగానికి చేసిన మేళ్లు తక్కువే. “వ్యవసాయం దండగమారి” అనే ఆలోచనలనే రైతన్నలకు తెప్పించారు. “వ్యవసాయం లాభసాటి రంగం” అనిపించడంలో అందరూ విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కుటుంబాలు వేరే ఆదాయమార్గాలను ఎంచుకుంటున్నాయి.  కనీస మద్దతు ధర… అనే నినాదం అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుగా మారిపోవడం అత్యంత విషాదం. ఇప్పటికీ సంఘంలో అతి తక్కువ ఆదాయాన్ని పొందేవారిలో రైతుదే అగ్రస్థానం. ఇప్పటికీ మన పల్లెలు ఎక్కువ పాళ్ళు వ్యవసాయ ఆధారితమైనవే. కరోనా కష్టకాలంలోనూ దేశాన్ని వ్యవసాయ రంగం ఆదుకుంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని విస్మరించడం మహాపాపం. కనీసం ఇప్పటికైనా ఏలికలు మేలుకొని రైతు సమస్యలకు చరమగీతం పాడాలి. రైతు సంఘాల ఆందోళనలు మళ్ళీ దద్దరిల్లకుండా దిల్లీ పెద్దలు చూడాలి.

Also read: సినిమాల బాయ్ కాట్ అవివేకం, అనర్థదాయకం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles