Tuesday, June 25, 2024

అవధాన, ఆశుకవితా చక్రవర్తులు

అవధాన, ఆశుకవితా సామ్రాజ్యానికి చక్రవర్తులు,పద్యసీమలో వీర విహారం చేసిన  కవిసింహాలు కొప్పరపు కవులు. కొప్పరపు సోదర కవులుగా సుప్రసిద్ధులైన ఈ జంటకవులలో పెద్దవారు వేంకటసుబ్బరాయకవి. సుబ్బరాయకవి అన్నింటా పెద్దవారే. ఈ మహాకవి  పుట్టి 135ఏళ్ళు పూర్తవుతోంది. ఈయన మరణించి దాదాపు 90ఏళ్ళు అవుతోంది. 46ఏళ్ళ వయస్సులోనే లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. జీవించింది తక్కువ కాలమే అయినా, ప్రతిక్షణం పద్యంతో ప్రభవించాడు.

అవధానాన్నిఅందలం ఎక్కించిన ఆశుకవి

అవధానాన్ని, ఆశుకవిత్వాన్ని అందలమెక్కించాడు.ఈ కవి అధిరోహించిన శిఖరాన్ని ఎవ్వరూ అందుకోలేరని మహాకవి,పండితులందరితో  అనిపించాడు.కొప్పరపు వేంకటసుబ్బరాయకవి నవంబర్ 12వతేదీ, 1885లో గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొప్పరంలో జన్మించాడు. తల్లిదండ్రులు వేంకటసుబ్బమాంబ, వేంకటరాయలు.తొలి గురువు వేంకటరాయలు.అవధాన విద్యా గురువు పోతరాజు రామకవి. సంస్కృతవిద్యా గురుదేవుడు నరసరావుపేటకు చెందిన రామడుగు రామకృష్ణకవి.పోతరాజు రామకవి స్వగ్రామం కొప్పరంకు కాస్త దగ్గరలో ఉండే ఏల్చూరు.పోతరాజువారు కొప్పరపువారికి మాతామహ వంశీకులు. ప్రస్తుత కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామికి   (పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి) రామకవి ముత్తాతగారే. పోతరాజు రామకవి 20కళలలో నిష్ణాతులు. వేంకట సుబ్బరాయకవి ఇంతటి మహనీయుని దగ్గర అవధాన విద్యాభ్యాసం చేసి, కవన రంగంలోకి అడుగుపెట్టాడు.

ప్రబంధాలను సృష్టించిన కవివంశం

కొప్పరపు కవులది కవివంశం. పూర్వీకులెందరో ప్రబంధాలను సృష్టించారు. “కవిత పుట్టిల్లు సోదరకవుల ఇల్లు” అనే నానుడి  సాహిత్యలోకంలో ప్రసిద్ధం. సుబ్బరాయకవి ఐదేళ్ల ప్రాయం నుండే కవితలు అల్లడం ప్రారంభించాడు. ఎనిమిదేళ్లకే శతక రచన ఆరంభించాడు. నరసరావుపేట పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో, 11వ ఏట మొట్టమొదటి అష్టావధానం చేశాడు. తొలి శతావధానం 16ఏళ్ళ వయస్సులో చేశాడు. అవధానాలతోపాటు ఆశువుగా కావ్యాలను చెప్పడం ప్రారంభించాడు. పలనాడు, కొండవీటి సీమలో ఆరంభించిన కవితా యాత్ర, తెలంగాణ, నెల్లూరుసీమలు  దాటి,  మద్రాస్ వరకూ చకచకా సాగింది. హైదరాబాద్ లోని అలవాల లష్కరులో ఆదిరాజు తిరుమలరావు భవనంలో తొలి ఆశుకవిత్వ మహాసభ జరిగింది. ముంగాలికి బిరుదు తొడిగించుకొని , ఘన సత్కారం పొందాడు. తెలంగాణలోని  మణికొండ ఆస్థానంలో జమిందార్  తాటిరెడ్డి గోపాలరెడ్డి సుబ్బరాయకవికి  “బాలసరస్వతి” బిరుదును సమర్పించారు.ఇదే వీరు అందుకున్న మొట్టమొదటి బిరుదు. అప్పటికి వీరి వయస్సు 20ఏళ్ళలోపే.వెనువెంటనే నెల్లూరుసీమ నుండి వరుసగా ఆహ్వానాలు వచ్చాయి.

ఆశుకవీంద్రసింహ, ఆశుకవి చక్రవర్తి

నెల్లూరులో జరిగిన ఆశుకవితా మహాసభకు జయంతి రామయ్య పంతులు అధ్యక్షత వహించారు. వేదం వేంకటరాయశాస్త్రి సన్నిధిలో “ఆశుకవీంద్ర సింహ” అనే బిరుద భూషణం సుబ్బరాయకవి కీర్తి కిరీటంలోకి చేరింది. ఆ వెంటనే, బెజవాడ గోపాలరెడ్డి తండ్రి పట్టాభిరామిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో అవధాన, ఆశుకవిత్వ సభలు ఏర్పాటు చేసి, సువర్ణ విజయ ఘంటికలు  తొడిగారు. ఆయనే తోడుగా ఉండి, మద్రాస్ తీసుకెళ్లారు.  విజ్ఞాన చంద్రికామండలి ఆధ్వర్యంలో కొమర్రాజు లక్ష్మణరావు మద్రాస్ లో, కొప్పరపు కవిచే అనేక సభలు చేయించి,  ఆశుకవిచక్రవర్తి బిరుదును ప్రదానం చేశారు. ఇలా,  కొప్పరపు వేంకటసుబ్బరాయకవి ఒక్కడే అతితక్కువ కాలంలోనే   అనేక కవితా యాత్రలు చేసి, అద్భుతమైన యశస్సు ఆర్జించాడు.

emperors kopparapu kavulu

గండపెండేర, గజారోహణ సత్కారాలు

తమ్ముడు వేంకటరమణకవిని కూడా తనతో కలుపుకొని, వీర విజృంభణ చేశాడు.కుగ్రామాలు, పట్టణాలు, మహానగరాలు, రాజాస్థానాలు, ఒకటేమిటి తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అవధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు కొన్ని వందలు చేశారు. అఖండమైన ఖ్యాతిని గడించారు. ఈ రంగాల్లో తమకు ఎదురులేదని చాటిచెప్పారు. గండపెండేర, గజారోహణ సత్కార, సమ్మానలు లెక్కకు మించి పొందారు. కొన్ని లక్షల పద్యాలు అశువుగా వృష్టించారు. వీరి కవితా వేగం అనన్య సామాన్యం. ఒక్కరోజులోనే మహా శతావధానం చేసేవారు. గంట వ్యవధిలోనే ఆశువుగా కావ్యం చెప్పేవారు. కాశీనాథుని నాగేశ్వరావు పంతులు ఒకసారి విజయవాడలో అత్యంత వేగంగా రాసే పదిమంది రాయసగాళ్ళను కూర్చోబెట్టి, కొప్పరపు కవులను పద్యాలు చెప్పామన్నారు. పదిమంది కలిసి కూడా పట్టుమని పది పద్యాలు రాసుకోలేక పొయ్యారు. ఈ వేగం అనితర సాధ్యమని ప్రశంసించి కాశీనాథునివారు కొప్పరపు కవులను ఘనంగా సత్కరించారు. ఇటువంటి సంఘటనలు, సంబరాలు ఈ మహాకవుల జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. కొప్పరపు కవుల అవధాన

నివ్వెరబోయిన కవిపండితులు

ప్రదర్శన అత్యంత ఆకర్షణగా సాగేది. అవధాన పద్యాలు కూడా ప్రబంధ పద్యాల వలె అల్లిక జిగిబిగితో ఉంటాయి. సమకాలిక మహాకవి, పండితులందరూ కొప్పరపువారి సభల్లో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి మహనీయుడూ వీరి ప్రతిభకు నివ్వెరపోయి, ప్రశంసలు, ఆశీస్సులు కురిపించారు. కొప్పరపు కవుల ప్రేరణతో ఎందరో అవధానకవులు, జంటకవులు, పద్యకవులు ఆంధ్రదేశమంతా తయారయ్యారు. ఇప్పటికీ అవధాన విద్య ఇంత వైభవంగా సాగుతోందంటే, అప్పుడు కొప్పరపు కవులు వేసిన పునాదులే. ఈ మహాకవులు ఎన్నో కావ్యాలు,  శతకాలు కూడా రాశారు. చిన్ననాడే మరణించడం, ఆ కాలంలో రికార్డింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా సాహిత్య సంపద మృగ్యమైపోయింది. కొన్ని అవధానాలు, మరికొన్ని ఆశుకవితలు, దైవసంకల్పం కావ్యం, సుబ్బరాయశతకం నేడు అందుబాటులో ఉన్నాయి.

పద్యాన్ని ఊరేగించిన మహాకవులు

కొప్పరపు కవుల సభల్లో పాల్గొని,మహాకవి పండితులు చెప్పిన ప్రశంసా పద్యాలు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ మహాకవుల మహాప్రతిభను మూల్యంకనం చెయ్యడానికి ఇవి తూకపురాళ్లు కావు. ఆ సాహిత్య సౌరభం కాస్తంతైనా  అనుభవించడానికి  వీచికగా, ఆ కవితా కాంతిని కొంతైనా దర్శించడానికి దీపికలా మనకు ఉపయోగపడుతుంది. తెలుగు’వాడి’కే సొంతమైన  పద్యాన్ని , తెలుగువారి సంతకమైన అవధానాన్ని ఊరూవాడా ఊరేగించిన కొప్పరపు మహాకవుల ఋణం  తీర్చుకోలేనిది. ఈ అసమాన తేజోమూర్తులకు అంజలి ఘటిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles