Wednesday, May 8, 2024

కమ్యూనిస్ట్ ల మూలాలను ప్రశ్నించిన దత్తోపంత్ తెంగడి

డా. దాసరి శ్రీనివాసులు  

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను డా. కేశవ బలిరాం హెడ్గేవార్ ప్రారంభిస్తే, దానికి విస్తృతమైన తాత్విక భూమికను గురూ జీ గోల్వాకర్ ఏర్పర్చితే, కార్మిక, కర్షక, ఆర్ధిక, సామజిక రంగాలలో బలమైన తాత్విక పునాదులు ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేసింది దత్తోపంత్ తెంగడి అనిచెప్పవచ్చు .

ఆర్ ఎస్ ఎస్ భావజాలానికి సైద్ధాంతిక పునాది

సామాజిక, రాజకీయ రంగాలలో ఆర్ ఎస్ ఎస్ భావజాలంకు బలమైన సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేశారు తెంగడి. ఎటువంటి ఆవేశం, ఉద్వేగం లేకుండా ప్రశాంతమైన జీవనం గడుపుతూ మౌలికమైన సైద్ధాంతిక పునాదులు ఏర్పాటు చేయడంలో ఆయన అపరిమితమైన ప్రతిభను చూపారు.

నవంబర్ 10, 1920న మహారాష్ట్రలోని వార్ధా సమీపంలోని ఆర్వీ గ్రామంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే విశేషమైన నాయకత్వ సామర్ధ్యాన్ని  ప్రదర్శించారు. 15 ఏళ్ళ వయస్సులో తన గ్రామంలోని మునిసిపల్ హైస్కూల్ విద్యార్థి సంఘం వానర సేన అధ్యక్షుడిగా రాణించారు. 1936 నుండి హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యునిగా స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.

గోల్వాల్కర్ ప్రభావం  

గురూజిగా పిలువబడే గోల్వాల్కర్ తో విశేషంగా ప్రభావితమైన ఆయన  డా. బి ఆర్ అంబెడ్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి విశిష్టమైన వ్యక్తులతో సన్నిహితంగా పనిచేశారు. 1942 నుండి ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా తన జీవితం మొత్తాన్ని సామజిక సేవకే వినియోగించారు.  కేరళ, బెంగాల్ లలో ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలు విస్తరింప చేయడంలో ప్రధాన భూమిక వహించారు.

భారతీయ ఆలోచనలతో బలమైన కార్మిక సంఘం ఏర్పాటు చేయాలని ఆర్ ఎస్ ఎస్ నిర్ణయించినప్పుడు ఆయన స్వయంగా కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐ ఎన్ టి యు సి లో చేరి, మధ్య ప్రదేశ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేసి రాణించారు. కమ్యూనిస్ట్ లకు అనుబంధంగా ఉన్న రైల్వే, పోస్టల్ యూనియన్ లలో కూడా పనిచేశారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్మాణం

చివరకు భారతీయ మజ్దూర్ సంఘంను 1955లో ప్రారంభించారు. 12 ఏళ్ళ పాటు జాతీయస్థాయి కమిటీ లేకుండా దేశంలో అనేక చోట్ల మజ్దూర్ సంఘ్ కి అనుబంధ కార్మిక సంఘాలు నెలకొల్పారు. ఆనాడు కార్మిక రంగంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న కమ్యూనిస్ట్, సోషలిస్ట్ కార్మిక సంఘాలకు భిన్నంగా నడిపారు. చివరికి 1980 దశకం నాటికి దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది.

మిగిలిన కార్మిక సంఘాలకు వలే రాజకీయ పార్టీలకు అనుబంధం కాకుండా, పారిశ్రామిక వేత్తల నుండి విరాళాలు వసూలు చేయకుండా, కేవలం కార్మికులు ఇచ్చే విరాళాలతో ఈ సంస్థను ఇప్పటికి దేశ వ్యాప్తంగా నడుపుతున్నారు. ఆ తర్వాత 1979లో భారతీయ కిసాన్ సంఘ్, 1991లో స్వదేశీ జాగరణ్ మంచ్ లను ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని రాజకీయ పక్షాలు పెట్టుబడిదారీ, సామ్యవాద ఆర్ధిక విధానాలను విదేశాల నుండి దిగుమతి చేయూసుకొంటూ ప్రభావితమైన సమయంలో “మూడో మార్గం”గా స్వదేశీ ఆర్ధిక విధానాలను దేశం ముందుంచారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ మూలం ఆయనదే

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చిన `ఆత్మ నిర్భర్ భారత్’కు భూమిక ఆయన ప్రవచించిన విధానాలే. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ దేశం ముందుంచిన ఏకాత్మ మానవతా వాదం, అంత్యోదయలకు విస్తృతమైన భాష్యం  చెబుతూ, కార్యాచరణలో విధానాలు రూపొందించగలిగారు.

ఇక సమాజంలో వివక్షతకు, నిర్లక్ష్యానికి గురవుతున్న ఎస్సి, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలవారిని జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడంకోసం విశేషంగా కృషి చేశారు. ఆయన సారథ్యంలోనే సామజిక సమరసతా మంచ్, సర్వపంథ్ సమాదార్ మంచ్ వంటి వేదికలు ఆవిర్భవించాయి. నేడు దేశంలో అతిపెద్ద విద్యార్హ్ది ఉద్యమంగా కొనసాగుతున్న అఖిల భారతీయ విద్యార్షి పరిషద్ కు ఆయన వ్యవస్థాపక సభ్యులు.

అనేక సంస్థల నిర్మాణం

అదే విధంగా అఖిల్ భారతీయ అధివక్త పరిషద్, అఖిల్ భారతీయ గ్రాహక పంచాయత్ వంటి వేదికల ఏర్పాటులో కీలక భూమిక వహించారు. విశిష్టమైన ఆలోచనాపరుల వేదికగా భారతీయ విచార కేంద్ర ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర వహించారు. 1964 నుండి 1976 వరకు పుష్కరకాలం పాటు రాజ్యసభ సభ్యునిగా కీలక పాత్ర వహించారు. 1968-70లో రాజ్య సభ వైస్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. సామజిక కార్యకర్తగా దేశంలో అన్ని జిల్లాలలలో పలు సార్లు పర్యటనలు జరపగా, కార్మిక నేతగా, పార్లమెంట్ సభ్యునిగా అనేక విదేశాలలో విస్తృతమైన పర్యటనలు జరిపారు.

అత్యవసర పరిస్థితి సమయంలో లోక్ సంఘర్ష్ సమితి కార్యదర్శిగా ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ ఏర్పాటు, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో సహితం క్రియాశీలంగా వ్యవహరించారు. కాంగ్రెస్సేతర రాజకీయ పక్షాలను ఒక చోటకు తీసుకు రావడంలో విశేషమైన కృషి చేశారు.

ఆత్యయిక పరిస్థితిలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకై పోరాటం

ప్రజాస్వామ్య పునరుద్ధరణతో పాటు దేశంలో పౌరహక్కుల పరిరక్షణకు సహితం ఆయన ఎంతగానో కృషి చేసారు. జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన పౌరహక్కుల ప్రజా సంఘం (పీయుసీఎల్) వ్యవస్థాపక సభ్యులు కూడా.  ఆర్ ఎస్ ఎస్ అంటే అల్లంత దూరంలో ఉండే కమ్యూనిస్ట్ లతో సహా కార్మిక ఉద్యమాలలో కలసి పనిచేశారు. పలువురు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటూ ఉండెడివి. పలు రాష్ట్రాలలో ప్రతి నెల కమ్యూనిస్ట్, సోషలిస్ట్ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి బిఎంఎస్ ప్రతినిధులు సమావేశమై కార్మిక సమస్యలపై సమాలోచనలు జరిపే వరవడిని ఏర్పాటు చేశారు.

సాధికార వక్త

సామజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై సాధికారికతతో, అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన 100కు పైగా గ్రంధాలు రచించారు. వాటిల్లో “థర్డ్ వే” (మూడో మార్గం), “కార్యకర్త”, “ఆన్ రెవల్యూషన్”, “హిందూ ఆర్ధిక విధానం” గ్రంధాలు విశేషంగా ప్రాచూర్యం పొందాయి. భారతీయ తాత్విక చింతనకు, విదేశీ ఆలోచలకు గల మౌలికమైన తేడాల గురించి పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రసంగాలు చేశారు.

సైద్ధాంతిక అంశాలలో రాజీలేని ధోరణి ఆవలంభించారు. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా ఉంటూ వాజపేయి ప్రభుత్వపు మార్కెట్ ఆర్ధిక విధానాలను సవాల్ చేశారు. ఆయన కారణంగానే నాటి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హాను ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి ఆ మరుసటి సంవత్సరం వాజపేయి మార్చవలసి వచ్చింది. అయితే తెంగడి ప్రైవేట్ పెట్టుబడులకు వ్యతిరేకం కాదు. కార్పొరేట్ లకు దాసోహమనడాన్నే వ్యతిరేకించారు. ఎమ్ఎస్ఎమ్ఇ లను ప్రోత్సహించాలని, రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలు కాపాడాలని బలమైన వాదనలు వినిపించారు.

కమ్యూనిస్టుల మూలలపై దెబ్బ

“ఎర్ర కోటపై ఎర్ర జెండాను ఎగరవేస్తాం” అంటూ కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన ఉద్యమాల ద్వారా కమ్యూనిస్ట్ లు  భారత దేశంలో  నినాదాలు ఇస్తున్న సమయంలో ఆయా రంగాలలో బలమైన భారతీయ ఉద్యమాలను నిర్మించడం ద్వారా కమ్యూనిస్ట్ ల ప్రభావాన్ని పరిమితం చేయడంలో తెంగడి నిర్ణయాత్మక పాత్ర వహించారు.

కమ్యూనిస్ట్ ల వర్గ పోరాట నినాదాన్ని తిప్పి కొడుతూ వర్గాల మధ్య సహకారం, సామరస్యం అవసరమనే వాదనను దేశం ముందుంచారు. సైద్ధాంతికంగా భారత దేశంలో వామపక్షాల  మూలాలను నిర్వీర్యం చేయడంలో తెంగడీ ప్రముఖ పాత్ర పోషించారు.

ముందు చూపున్న ద్రష్ట

అందుకనే సంఘ్ పరివార్ లోని వారెందరో ఆయనను ఎంతో ముందు చూపున్న ఒక ద్రష్టగా భావిస్తారు. కమ్యూనిస్ట్ లకు ఏవిధంగా కారల్ మార్క్స్ సైద్ధాంతిక స్ఫూర్తి కేంద్రంగా ఉంటారో, అందుకు ప్రత్యామ్న్యాయంగా సైద్ధాంతిక ఆలోచనలు అందజేయడమే కాకుండా, కార్యాచరణలో చూపించిన కార్యసాధకుడిగా తెంగడిని సదా గుర్తుంచుకుంటారు. ఆయన అనారోగ్యంతో అక్టోబర్ 14, 2004లో మృతి చెందారు. అయినా ఆయన నెలకొల్పిన సంస్థలు అన్ని నేడు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలుగా మన్ననలు పొందుతున్నాయి.

నవంబర్ 10 : శతజయంతి నివాళి

(రచయిత విశ్రాంత ఐఏఎస్ అధికారి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles