Saturday, April 20, 2024

‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?

భారత దేశానికి ముస్లింలు రాకపూర్వం, అంటే క్రీ.పూ. 1000 (బిసీఇ) నుండి క్రీ.శ. 1200 (సి.ఇ) మధ్య కాలంలో భారత దేశంలో స్వర్ణయుగం కొనసాగిందని, ఆ కాలంలో శాస్త్రసాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ది సాధించాయని హిందుత్వవాదులు వాదిస్తారు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకు అందుబాటులోకి వచ్చిన విమానాలు, ఇంటర్నెట్, మూలకణ పరిశోధనలు, ప్లాస్టిక్ సర్జరీ వంటివన్నీ అప్పుడే, ఆ స్వర్ణయుగంలోనే భారత దేశంలో ఉండేవని…దబాయిస్తారు. అదే నిజమైతే అవి ఎవరు కనిపెట్టారు? ఎవరు అభివృద్ది చేశారో చెప్పాలి కదా? ఆ జ్ఞానవంతులెవరో వారు ఎక్కడ చదువుకుని జ్ఞానులయ్యారో చెప్పాలికదా? పైగా పురాతన గాథలకు, పురాణ  పాత్రలకు వాటిని అన్వయించి చెపుతారు. అవన్నీ వాస్తవాలుగా మనం స్వీకరించాలని ఆశపడుతుంటారు. ఆధారాలు చూపకుండా మొండి వాదనల్ని జనం ఎలా ఒప్పుకుంటారు? ఏ కొద్దిపాటి వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్నవారైనా, ఇప్పుడు దేశంలో మనకు అందుబాటులోకి వచ్చిన శాస్త్రపరిజ్ఞానం, పరికరాలు అన్నీ 18-20 శతాబ్దాల మధ్య కాలంలో యూరొప్ దేశాలు ప్రపంచానికి అందించినవేనన్నది గ్రహిస్తారు.

ఎక్కడున్నది స్వర్ణయుగం?

భారత దేశంలో దిల్లీ సల్తనత్-ముస్లిం సుల్తానుల పరిపాలన సిఇలో 320 సంవత్సరాలపాటు (1206-1526)కొనసాగింది. మామ్లక్ రాజవంశం (1206-1290), ఖిల్జీ రాజవంశం (1290-1320), తుగ్లక్ రాజవంశం (1320-1414), సయ్యీద్ రాజవంశం (14141451), ఆఫ్ఘాన్-లోది రాజవంశాలు (1451-1526) రాజ్యమేలాయి. ఆ కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లో కొంత భాగం భారతదేశంలో అంతర్భాగాలుగా ఉండేవి.  ఆ తర్వాత తొలి మొఘల్ చక్రవర్తి బాబార్ పరిపాలన సిఇ 1526లో ప్రారంభమై 1530 వరకూ కొనసాగింది. అతని తర్వాత అతని వారసులు వరుసగా 1857 వరకూ రాజ్యమేలారు. ఆయా కాలాలకు సంబంధించిన నాటి చరిత్రకారులు విషయాలన్నీ గ్రంథస్థం చేసే ఉంచారు కాబట్టి, ఆ కాలానికి సంబంధించి అబద్ధాలు అల్లడానికి వీలు లేదు. అందుకే హిందుత్వ వాదులు 1000 బిసిఇ నుండి 1200 మధ్య కాలాన్ని కావాలనే ఎంచుకున్నారు. ఈ సున్నితమైన అంశం పాఠకుల దృష్టికి తీసుకురావడానికే నేనిక్కడ ముస్లిం రాజుల ప్రవేశానికి సంబంధించిన వివరాలు విపులంగా ఇచ్చాను. ముస్లిం సుల్తానులు దేశంలోకి రాకపూర్వమే ఇక్కడ స్వర్ణయుగం కొనసాగి ఉంటే-దాని ప్రభావం, దాని ఛాయలు దిల్లీ సల్తనత్ కాలంలో కనిపించాలి కదా? ఇంటర్నెట్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి వైజ్ఞానిక సౌకర్యాలన్నీ మొఘలులు ఎందుకు వాడుకోలేకపోయారూ? వాటిని ముస్లిం పాలకులు సర్వనాశనం చేశారని హిందుత్వవాదులు చెప్పినా చెపుతారు. ఆశ్చర్యం లేదు. కానీ, అందుబాటులో ఉన్న  సౌకర్యాల్ని ఎవరైనా ఎందుకు నాశనం చేసుకుంటారూ? ఆలోచించాల్సిన విషయం కాదా?

పరాయివారి పీడన సరే, మన పీడన సంగతేమిటి?

మరో అవాస్తవమేమంటే-ముస్లిం రాజులు పరిపాలన సాగించినంత కాలం హిందువులు పీడనకు గురయ్యారని, బానిసల్లా జీవించారని చెపుతారు. సమకాలీనంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య ద్వేషాగ్ని రగిలించడానికి ఇది ఉపయోగపడే అబద్ధమే తప్ప, అందులో నిజం లేదు. దేశచరిత్రలో అశోకుడు ‘ద గ్రేట్’ ఎలా అయ్యాడు. తర్వాత కాలంలో అక్బర్ ‘ద గ్రేట్’ అని ఎలా పిలిపించుకున్నాడూ? ముస్లింలతో తాము అణచివేయబడ్డామని, బ్రిటిష్ వారితో తాము అణచివేయబడ్డామని అరిచి గీపెట్టేముందు తామేం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవడం మంచింది. పరిపాలకులు ఎవరైనా, చిన్నాచితకా సంఘటలను జరుగుతూనే ఉంటాయి. వాటికి అంత ప్రాముఖ్యమివ్వాల్సిన పని లేదు. అంటరాని తనాన్ని ప్రవేశపెట్టి, జనాన్ని నాలుగు వర్ణాలుగా విభజించి, కింది కులాలవారిని చిత్రహింసలకు గురిచేయడం ఎవరు మరచిపోయారనీ? చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు వందల ఏళ్ళుగా గొంతెత్తి న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా?

వివిధ జాతుల సమ్మేళనం

భారతదేశంలో వివిధ జాతుల సమ్మేళనం, వివిధ సంస్కృతుల సమ్మేళనం కామన్ ఎరాలోని ఒకటిరెండు శతాబ్దాలలో జరిగిందని చరిత్రకారుల పరిశీలనలు, జన్యుశాస్త్రవేత్తల పరిశోధనలు అన్నీ తేటతెల్లం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా హిందుత్వ సిద్ధాంతకర్తలు భారత ఉపఖండమంతా ‘‘ముందు నుండే ఆర్య సంస్కృతి వెల్లివిరిస్తోందనీ…’ దాన్నే ఇంకా ఇంకా సంరక్షించుకోవాల్సి ఉందనీ అబద్ధాలు చెపుతుంటారు. పురావస్తు పరిశోధనలు గానీ, జన్యుశాస్త్ర సంబంధమైన సాక్ష్యాలు గాని చెపుతున్నదేమంటే, ఉత్తర భారతీయులు ఇరాన్, మధ్యఆసియా జాతులతో సమ్మిళితమైనట్లు నిగ్గుతేల్చాయి. అంటే, వివిధ జాతులు భారతదేశంలోకి వలస వచ్చిన విషయం రూఢి అయ్యింది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తప్ప – హిందుత్వవాదులు చెప్తున్న బలహీనమైన, అబద్ధపు వాదనను ఏ మాత్రం పట్టించుకోగూడదు.

హిందూమహా సభ నుంచి హిందుత్వ వరకూ…

ఇంతకీ ఈ ‘హిందుత్వ’ అనే మాట ఎలా వాడుకలోకి వచ్చిందీ? ముందు అది అర్థం చేసుకోవాలి! లౌకిక జాతీయవాద సంస్థ అయిన భారత జాతీయ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధిగా పని చేసింది. స్వాతంత్ర్య సమరంలొ అందరూ భుజం భుజం కలిపి పోరాడారు. అప్పటికి వారి మధ్య హిందూ, ముస్లిం అనే భేదాలు లేవు. తాము వేరు,  తమ జాతులు వేరు, తమ మతాలు, విశ్వాసాలు వేరువేరనే అభిప్రాయం 1920లలో బలపడింది. సుమారుగా ఆ కాలంలోనే రెండు వాదాలు తలెత్తాయి. మహ్మదీయ భూస్వాములూ, మధ్యతరగతి విద్యావంతులు కలిసి 30 డిసెంబర్ 1906న ఢాకా (బంగ్లాదేశ్), అంటే నాటి బ్రిటిష్ ఇండియాలో, ‘ముస్లింలీగ్’ను స్థాపించారు. దాని వెనక మహ్మదాలి జిన్నా, ఫజుల్ హక్, ఆగాఖాన్ వగైరాలున్నారు. ముస్లిం జాతీయవాదంగా అది ముందుకొచ్చింది. 1947లో పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా విడిపోవడంలో ముస్లింలీగ్ ప్రధాన పాత్ర పోషించింది కూడా! అదే సమయంలో మరోవైపు హిందూ అగ్రజాతి వర్ణాలవారు, మధ్యతరగతి విద్యావంతులూ కలిసి, ‘హిందూ మహాసభ’ను1915లో స్థాపించారు. తమది హిందూ జాతీయవాదమని ప్రకటించుకున్నారు. దాని వెనక పండిత మదన్ మోహన్ మాలవ్యా, సావర్కర్ మొదలైనవారున్నారు.

బ్రిటిష్ పాలకులతో అంటకాగారు

తమది జాతీయవాదమని చెప్పుకున్నారే గాని, బ్రిటిష్ కు ఎదురు తిరిగి పోరాడలేదు. వారికి లొంగిపోయి, స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న నాటి భారతీయ యువతను తప్పుదారి పట్టించారు. స్వదేశీయుల్ని అడ్డుకుంటూ బ్రిటిష్ కి మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ముస్లింలీగ్ ప్రభావంతో ఒక ముస్లిం రాజ్యం ‘పాకిస్తాన్’ ఎలా ఏర్పడిందో – అలాగే ఇక్కడ భారత దేశాన్ని హిందుమహాసభ ఆధ్వర్యంలో ఒక హిందూ రాజ్యంగా మార్చాలని తహతహలాడారు. హిందూ మహాసభ తర్వాత కాలంలో కేబి హెడ్గేవార్ నాయకత్వోం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)గా 1925లో రూపం మార్చుకుంది. దాని నుండే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1980లో ఆవిర్భవించింది. దాని నేపథ్యంలో ఎ.బి. వాజపేయి, ఎల్ కె అడ్వాణీలు ఉన్నారు. 1947లోనైనా 2021లోనైనా ఈ హిందుత్వవాదుల ఎజండా ఒకటే! లౌకిక ప్రజాస్వామ్యదేశమైన భారతదేశాన్ని ఎలాగైనా ఒక హిందూరాజ్యంగా మార్చాలని! ఆ ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు ప్రస్తుత బీజేపీ పాలనలో స్పష్టమౌతూనే ఉంది. దేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు గనక, ఆ హిందూ మెజారిటీ వాదాన్ని చట్టబద్ధం చేయడానికి వారు ఏర్పరచుకున్న దృక్పథమే ‘హిందుత్వ’గా పిలవబడుతూ ఉంది.

ఫాసిజాన్ని అరువు తెచ్చుకోవడానికి సిగ్గులేదు

జేమ్స్ మిల్ (JAMES MILL) రాసిన బ్రిటిష్ ఇండియా చరిత్ర (THE HISTORY OF BRITISH INDIA) 1817లో అచ్చయ్యింది. ఆ కాలంనాటి అనేక అంశాల్ని  ఆ గ్రంథం విపులంగా చర్చించింది. ఆ రచయిత హిందూ-ముస్లిం-బ్రిటిష్ – మూడు విభిన్న దృక్పథాల గురించి వివరించాడు. పైగా హిందూ-ముస్లింలు రెండు వేర్వేరు జాతులవారని…వారి మధ్య నిరంతరం ఘర్షణలు సాగుతూ వచ్చాయనీ రాశాడు. అందుకే హిందుత్వవాదులు అతని గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ అర్ధశతాబ్దంలో చరిత్రకారులు, జన్యుశాస్త్ర పరిశోధకులు, పురావస్తు పరిశీలకులు అందరికందరూ జేమ్స్ మిల్ వాదనని తప్పుపట్టారు. హిందూ-ముస్లిం-బ్రిటిష్ అంటూ వైజ్ఞానికంగా మానవ జాతిని విభజించే పద్దతి సరికాదని దుయ్యబట్టారు. మానవజాతి అంతా ఒక్కటేనని చెపుతూ, లెక్కలేనన్ని ఆధారాలు చూపారు. ఆధారాలు లేని వాదనలు, మనిషిని మనిషి నుండి విడగొట్టే కుట్రలు, రాజకీయాలు ఇప్పుడిక సాగవు. మతవిశ్వాసాలు ఎప్పుడూ వ్యక్తిగతమే! విశ్వాసాల ఆధారంగా చట్టాలుండవు. పరిపాలన సాగదు. ‘ఆర్య’ అనే శబ్దానికి గౌరవనీయుడనే అర్థం ఉంది కాబట్టి, మిగతావారి కన్నా హిందువులు ‘ఎక్కువ గౌరవనీయులు’ అనే అభిప్రాయం స్థాపించాలని వారి ప్రయత్నం. అందుకు 1930 నాటి జర్మన్, ఇటాలియన్ ఫాసిజాల భావజాలం అరువు తెచ్చుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడరు-

మతం మిగిల్చేది భీభత్సాలనీ, మారణహోమాలనే

దేవాలయాల్లోని గుప్తనిధుల కోసం ముస్లింలు దేవాలయాల్ని కొల్లగొట్టింది నిజమే. అయితే, అక్కడ హిందూ మతాన్ని నాశనం చేసి, ముస్లింమతాన్ని స్థాపంచాలన్న ఆకాంక్ష లేదు. సంపదను, నిధులను దోచుకోవడానికి హిందూ ఆలయాలపై హిందూ పాలకులే దాడి చేసిన ఉదంతాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అది గమనించుకోవాల్సిన అంశం. అంటే ఏమిటీ?అక్కడ సంపదకు ప్రాముఖ్యం ఉందే కానీ మతానికి కాదు. హిందూ మత ఛాందసులు వేలవేలమంది బౌద్ధుల్ని నరికి చంపి భీభత్సం సృష్టించారు కదా? మరి అక్కడ సంపద దోచుకోవడం కాదు. మత మార్పిడే ముఖ్యమయ్యింది. దీనిలో మనకు మళ్ళీ యూరప్ లో జనాన్ని బలవంతంగా క్రైస్తవంలోకి లాక్కోవడానికి  క్రైస్తవులు చేసిన భీభత్సం గుర్తుకొస్తుంది. మతం ఎప్పుడూ ఎక్కడా శాంతిని స్థాపించలేదు. భీభత్సాల్ని, మారణహోమాల్ని మాత్రమే మిగిల్చింది.

అగ్రవర్ణాల అఘాయిత్యాల మాటేమిటి?

వేరేవేరు జాతుల మధ్య ఘర్షణలు జరిగాయంటే దానికి వేరువేరు కారణాలు ఉండొచ్చు. వాటిని అలా ఉండనివ్వండి. మరి ఒక మతానికే చెందిన హిందువుల్లో కొందరు అగ్రవర్ణంవారు, మరికొందరు నిమ్నవర్గంవారు ఎలా అయ్యారు? విద్య, ఆర్థిక స్థోమత, సమాజంలో  ఉన్నతమైన స్థాయీ ఆ అగ్రవర్ణాలవారికే ఉండాలని, మిగతావారికి అవి సమకూరగూడదని ఎందుకు ప్రయత్నించినట్టూ? చెరువులోని నీళ్ళు తాగడానికీ, పుట్టుకకూ సంబంధమేమిటి? దేశంలోని అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా – జంతువులకంటే హీనంగా ఎందుకు చూసినట్టూ? అస్పృశ్యులుగా మార్చి, వారిని సమాజంలో  ఎందుకు వెలివేసినట్టూ? వెట్టిచాకిరి ఎందుకు చేయించుకున్నట్టూ? ఇంతటి వివక్ష, హింస భరించలేకనే కదా ఈ దేశ మూలవాసులు ఇతర మతాలు స్వీకరించారూ? విశాల భావాలతో ప్రజాస్వామ్యబద్ధంగా మెలిగితే ఆ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు వారు సమాధానమైనా చెప్పగలగాలి. లేదా బుద్ధుడికి, చార్వాకులకూ  క్షమాపణలు చెప్పి సన్మార్గంలో హేతుబద్ధంగానైనా నడవడానికి ప్రయత్నించాలి. మరో మార్గం లేదు – అతిగా చేస్తే ఎ మతమైనా సరే ఉగ్రవాదంలోకే దారి తీస్తుంది. ఈ దేశానికి వైజ్ఞానిక స్పృహ నందించిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కావాలనే కనుమరుగు చేయాలని చూస్తున్న హిందుత్వ వాదుల కుట్రల్ని భారతీయ యువత అర్థం చేసుకుంటోంది. మూర్ఖుల్ని ఎవరూ ఎద్దేవా చేయనవసరంలేదు. వారి మూర్ఖత్వమే వారిని నవ్వుల పాలు చేస్తుంది. రాబోయే వైజ్ఞానిక తరం ఇక మూర్ఖపు – అజ్ఞానపు – మత భావనల్ని ఎంతమాత్రమూ సహించబోదు.

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles