Sunday, September 15, 2024

భారతీయ సోషలిజం, సోషలిస్టుల చరిత్ర రాయాలి: రామచంద్రగుహా

ప్రముఖ న్యాయవాది, రచయిత అవధానం రఘుకుమార్ ‘‘రీవిజిటింగ్ రామమనోహర్ లోహియా: చాలెంజెస్ టు ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అల్టర్నేటివ్ సోషలిజం’’ పేరుతో రాసిన పుస్తకాన్ని ప్రఖ్యాత చరిత్రకారుడు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ రామచంద్రగుహా శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశమందిరంలో సభ జరిగింది.

ప్రారంభంలొనే సభికులకు తన పుస్తకాన్ని రఘుకుమార్ పరిచయం చేశారు. ఐఏఎస్ అధికారి, ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు మాటల్లో చెప్పాలంటే, ‘‘ముఖ్యంగా ప్రపంచమంతటా పెట్టుబడిదారీ విధానంతో పాటు మార్క్సిజం కూడా ఒక సంక్షోభానికి లోనవుతూ ఉన్నదనీ, ఈ స్థితిలో ప్రజల, పాలితుల, శ్రామికుల ప్రయోజనాల్ని కాపాడే ఒక సామాజిక తాత్వికత అవసరం ఉందనీ, కానీ పాశ్చాత్యదేశాలు అటువంటి ప్రత్యామ్నాయ ధోరణులకు అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారనీ, కానీ లోహియాని చదివినపుడు అటువంటి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించవచ్చునని అనిపించిందని అందుకే తాను ఈ పుస్తకం రాశాననీ’’ రఘుకుమార్ చప్పారు.

రామచంద్రగుహా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకీ, బీజేపీ, ఆరెస్సెస్ లకీ, కమ్యూనిస్టులకూ వాటి గురించి రాసే చరిత్రకారులు అందుబాటులో ఉన్నారనీ, సోషలిస్టులకు ఎవ్వరూ లేరనీ, ముప్పయ్, నలబైలలో ఉన్న స్వతంత్ర చరిత్రకారులు భారత దేశంలో ఒక వెలుగు వెలిగిన సోషలిస్టుల చరిత్ర రాయాలనీ చెప్పారు. సోషలిస్టు పార్టీ పుట్టిన 1934 తో ప్రారంభించి ఆ పార్టీ చీలికపేలికలైన 1990ల వరకూ రాయాలని అన్నారు. లోహియా గురించీ, రఘుకుమార్ రాసిన పుస్తకం గురించీ క్లుప్తంగా మాట్లాడిన తర్వాత భారత దేశంలో సోషలిస్టుల భావజాలం గురించీ, సోషలిజాన్ని దేశంలో అమలు చేసిన తీరుతెన్నుల గురించీ వివరించారు.  భారత దేశంలో కమ్యూనిస్టులకూ, సోషలిస్టులకు మూడు అంశాలపైన భేదాభిప్రాయాలు ఉండేవనీ, కమ్యూనిస్టులు జాతీయోద్యమానికి దూరంగా ఉండగా, సోషలిస్టులు అందులో మమేకమైనారనీ, విప్లవం అనేది హింసాత్మకంగా రావాలని కమ్యూనిస్టులు తలపోయగా, అహింసా మార్గంలోనే మార్పు సాధించాలని సోషలిస్టులు భావించారనీ, కమ్యూనిస్టులు ఆర్థిక కేంద్రీకరణ కోరుకోగా సోషలిస్టులు వికేంద్రీకరణ కోరుకున్నారనీ గుహా చెప్పారు. కమ్యూనిస్టుల విశ్వాసం స్వదేశంలో కాకుండా విదేశాలలో ఉండేదనీ, కొంతమందికి సోవియెట్ యూనియన్ లో, మరికొంతమందికి చైనాలో, ఇంకొంతమందికి క్యూబాలో, వెనిజుయెలాలో మూలాలు ఉన్నాయనీ, ఇందుకు భిన్నంగా సోషలిస్టులు భారతీయ మూలాలకే కట్టుబడి ఉన్నారని కూడా తెలియజేశారు. ఇంగ్లీషు భాషను ప్రోత్సహించకుండా స్థానిక భాషలకు పట్టం కట్టాలని లోహియా కోరుకున్నారని అన్నారు. సోషలిస్టుల ఆలోచనలలో పర్యావరణ స్పృహ కనిపించేదనీ అన్నారు.

మాజీ సంపాదకులు రామచంద్రమూర్తి లోహియా, అంబేడ్కర్ లు కులాల ప్రసక్తిపైన రచనలు చేయడం విశేషమనీ, ఇతిహాసాలపట్ల లోహియా విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నదనీ చెప్పారు. మంచి పుస్తకం రాసినందుకు రఘుకుమార్ ను అభినందించారు. శుక్రవారం సాయంత్రం మంథన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ, అక్కడ రామచంద్రగుహాని ఒక మహిళ అడిగిన ప్రశ్నను గుర్తు చేశారు.ప్రజామేధావులు అన్ని పార్టీలనూ సమానంగా విమర్శిస్తూ ఉంటే ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేయాలో సామాన్యులకు అర్థం కాదనీ, సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసే విధంగా మేధావుల విశ్లేషణ ఉండాలనీ అన్నారు. నరేంద్రమోదీనీ, రాహుల్ గాంధీనీ ఒకే స్థాయిలో విమర్శించడం వల్ల ప్రజలు ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకోవడం కష్టం అవుతుందనీ, వీరిలో ఎవరు తక్కువ ప్రమాదకారులో చెప్పవలసిన బాధ్యత మేధావులపైన ఉన్నదనీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా శశిథరూర్ ఎన్నికైతే బాగుండేదనీ, కానీ అన్నీ మేధావులు ఊహించినట్టూ, ఆశించినట్టూ జరగవు కనుక ఉన్న పరిస్థితిలో ఎవరికి ఓటే వేయడం ఉత్తమమో చెప్పగలగాలని అన్నారు.

చివరగా ప్రసంగించిన మధ్యప్రదేశ్ కు చెందిన సోషలిస్టు నాయకుడూ, విద్యావేత్త ప్రొఫెసర్ రామశంకర్ సింగ్ అద్భుతంగా ప్రసంగించారు. ఆయనకు లోహియాతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది. వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల లోహియా గురించి ఇతరులకు తెలియని అనేక విషయాలు వెల్లడించారు. గాంధీ, నెహ్రూ, ఇత్యాదులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడారనీ, లోహియామాత్రం బ్రిటిషు, పోర్చుగీసు, నేపాలీ, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పోరాడారనీ చెప్పారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత, గాంధీ నిర్యాణం అనంతరం సత్యాగ్రహ ఆయుధాన్ని కొనసాగించిన నాయకుడిగా లోహియాను చెప్పుకోవాలనీ, నెహ్రూ అనుసరించిన ఆధిపత్య ధోరణులపైన కూడా ఆయన సత్యాగ్రహం చేసి, అనేక విడతల జైలుకు వెళ్ళారని తెలిపారు.

లోహియామంచ్ అధ్యక్షుడు గోపాల్ ఠాకూర్ సమావేశంలో సమన్వయకర్తగా వ్యవహరించారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా (ఎడమ నుంచి కుడికి) గ్రంథ రచయిత రఘుకుమార్, మధ్యప్రదేశ్ సోషలిస్టు నాయకుడు రమాశంకర్, రామచంద్రరగుహ, రామచంద్రమూర్తి, గోపాల్ ఠాకూర్

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles