Friday, June 2, 2023

దాశరథి – కవితా పయోనిథి

  • నిజాంరాజు తరతరాలబూజు అని నినదించాడు
  • తెలంగాణ రైతులదే అని ప్రకటించాడు

అగ్నిధారలు సృష్టించాడు, అమృత ధారలు కురిపించాడు. పారిజాతాలు పూయించాడు, ప్రేమగీతాలు వినిపించాడు ఆంధ్రకవితా సారథి దాశరథి. నిజాం నిరంకుశ పాలనపై పద్యాన్ని ఆయుధంగా మలచి ఎక్కుపెట్టిన దాశరథి పోరాటయోధుడు, కవితా సముద్రుడు. ఆ చల్లని సముద్ర గర్భంలో ఎన్నో అగ్నిధారాలు భగ్గుమని పైకి లేచాయి. తియ్యని పలకరింపులు చెలియలి కట్ట దాటి ప్రవహించాయి. దాశరథి కవిత్వంలో వీర, శృంగార రసాలు ధారలై పారాయి. కవిగా, సినిమాకవిగా నవరసాలు పలికించినా, ఎక్కువగా చిలికించింది, ఒలికించింది వీర, శృంగారాలే. దాశరథి బాల్యమిత్రుడు డి.రామలింగం అన్నట్లు దాశరథిలో అంగారం, శృంగారం కలిసి రంగరించాయి. ఈ మాటను దాశరథి స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. మల్లెలు, మోదుగులు నా హృదయాన్ని పొంగిస్తాయంటాడు.

అగ్నిధారతో ఆరంభం

దాశరథి రచనలలో మొట్టమొదటిగా అచ్చయిన పుస్తకం ‘అగ్నిధార’. 1949లో సాహితీ మేఖల సంస్థ తరపున దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు ఈ ముద్రణ వేయించారు. సాహిత్య జీవితంలో తొలి నుంచీ ప్రోత్సహించినవారు దేవులపల్లి రామానుజరావు. ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలకు అనేకసార్లు ఆహ్వానించి, కవి సమ్మేళనాలలో పాల్గొనేలా చేశారు. తెలంగాణాలో పుట్టిన ఈ తెలుగుకవి ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్ లో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడు. ఉర్దూ, ఇంగ్లిష్ సాహిత్యాలను బాగా అధ్యయనం చేసినా, చిన్నప్పటి నుంచీ తెలుగు పద్యంపైనే మక్కువ ఎక్కువగా పెంచుకున్నాడు. చిన్ననాడే పద్యాలను అల్లడం ఆరంభించాడు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా,ఎక్కువ కాలం అక్కడ ఇమడలేక బయటకు వచ్చాడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభువులు చేసిన అరాచకాలు ఆన్నీఇన్నీ కావు. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశాడు. ఆ పోరులో జైలు పాలయ్యాడు. జైలులో దెబ్బలు తిన్నాడు. యాతనలు అనుభవించాడు. ఏ కష్టం అతన్ని లొంగతీసుకోలేక పోయింది. హృదయం పొంగినప్పుడల్లా కవిత్వమై పొంగి పొరలింది. అగ్నిధారగా అది ఆకృతి దాల్చింది.”నిజాం రాజు తరతరాల బూజు” అంటూ నినదించాడు. మా తెలంగాణ ప్రజల నరాలు తెంపి, అగ్నిలో ముంచిన ఓ నిజాం పిశాచమా, అని అగ్నివర్షం కురిపించాడు. నా తెలంగాణ… కోటి రతనాల వీణ అన్నాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాశరథి ఉరిమి ఉరికి సాగాడు. మలిదశ తెలంగాణ పోరాటం వరకూ మడమ తిప్పలేదు. కవిత్వాన్ని ఆసరాగా చేసుకొని పోరాటం సాగించాడు. విముక్తి సాధించిన తెలంగాణ ఎవరికి దక్కాలో స్పష్టంగా చెప్పాడు. ‘తెలంగాణ’ రైతులదే అన్నాడు. మహ్మద్ ఇక్బాల్ విప్లవగీతంలోని “ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి – ఆ పొలమున గల పంటను కాల్చేయండి” అనే వాక్యాలను స్ఫూర్తిగా నింపుకున్నాడు. అగ్నిధార కావ్య ఖండికలో మానవ పరిణామం, భూమి పుట్టుక, ఖగోళ, సముద్ర, జీవ, భౌతిక శాస్త్రాలు, చరిత్ర, రాజకీయాలు, కులమతాల చుట్టూ తిరిగి సామాజిక శాస్త్రాలన్నీ వివరించాడు.ఒక్క మాటలో చెప్పాలంటే,అనేక శాస్త్రాలను కవితామయం చేసి,అద్భుతంగా ప్రకటించాడు. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం తెచ్చిన వారిలో దాశరథి ప్రథమ శ్రేణిలో ఉంటారు. గాలిబ్ ఉర్దూ గజళ్ళను గాలిబ్ గీతాలుగా తెలుగులోకి అనువాదం చేశారు. రుద్రవీణ, తిమిరంతో సమరం మొదలైన అనేక రచనలు చాలా ప్రసిద్ధం. సుప్రసిధ్ధ హిందీ కవి సుమిత్రానందన్ పంత్ రాసిన కవిత్వంలోని ” పావక్ కే ప్రవాహ్ సీ” అనే ప్రయోగం తన అగ్నిధార పద ప్రయోగానికి దగ్గరగా ఉందని ఎంతో ఆనంద పడేవాడు. ఎందుకంటే, ఆనాడు అనేకమంది “అగ్నిధార” పద ప్రయోగాన్ని తప్పుపట్టారు. దాశరథి కవిమిత్రులలో ఒకరైన మఖ్దూమ్ మోహీయుద్దీన్ కవిత్వంలో ఎంతటి విప్లవం ఉందో, అంతటి శృంగారం ఉందని భావిస్తూ, తన కవిత్వంలోని శృంగార, వీర రసాలను తలచుకొనేవాడు. వట్టికోట ఆళ్వారుస్వామి కూడా వీరితో పాటు జైల్లో ఉండేవారు. దాశరథి కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఓ నిజాము పిశాచమా, అనే దాశరథి పద్యాన్ని జైలు గోడలపై ఆళ్వారుస్వామి బొగ్గుతో రాసేవాడు. రాసింది దాశరథి అని, జైలు అధికారులు భావించేవారు. స్నేహచిహ్నంగా తన కవితా ఖండికను వట్టికోట ఆళ్వారు స్వామికి అంకితం చేశాడు. దాశరథి ఎంతటి పోరాటయోధుడో, అంతటి ప్రేమస్వరూపుడు. స్నేహానికి ప్రాణమిచ్చే స్వభావం అతని సొంతం. డాక్టర్ సి.నారాయణరెడ్డిని దాశరథి ఎంతో ప్రేమించాడు. అనేక కవి సమ్మేళనాలలో ప్రోత్సహించాడు. దాశరథిని అగ్రజుడుగా సినారె భావించేవాడు. సంబోధించేవాడు.

నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి

నా పేరు ప్రజా కోటి… నా ఊరు ప్రజా వాటి.. అన్నాడు దాశరథి. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటుచేశాడు. తాను రాసిన ‘కవితా పుష్పం’ ఆంధ్ర సాహిత్య అకాడెమి, ‘తిమిరంతో సమరం’ కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాలు తెచ్చి పెట్టాయి.తెలంగాణ ప్రాంతంలో పోరాట కవియోధుడుగా ఎంత పేరు ఉందో.. సినిమా కవిగా యావత్తు తెలుగునాట అంతటి పేరుంది. అద్భుతమైన గీతాలు అందించాడు. నవరసాలు ఒలికించాడు. ‘ఇద్దరు మిత్రులు’ సినిమాతో చిత్రరంగంలో (1961) ప్రవేశించాడు. ఖుషీ ఖుషీగా నవ్వుతూ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గోదారి గట్టుంది, నడిరేయి ఏ జామునో, రారా కృష్ణయ్య, మదిలో వీణలు మ్రోగే, పాడెద నీ నామమే గోపాల…  ఇలా ఎన్నో వాణిమాణిక్యాలు అందించాడు.             ‘మనసు మాంగల్యం’ సినిమాలో ఆవేశం రావాలి-ఆవేదన కావాలి,అని ఆయనే అన్నట్టుగా ఆయనకు ఆవేశం,ఆవేదన రెండూ ఎక్కువే. ఇంకా ఎంతో పేరు రావాల్సి వుంది.ఇంకా ఎంతోకాలం జీవించి ఉండాల్సింది.62ఏళ్లకే (1987)  ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.లోకంపోకడలన్నీ కవిత్వంలో చూపించాడు కానీ,నిజ జీవితంలో లౌక్యం పెద్దగా తెలియని వ్యక్తి. ఉద్యమ పోరాటంలో నిజాయితీ,కవితా జీవితంలో ప్రతిభల ద్వారానే జీవితాంతం సాగాడు. ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన నైజం. కేవలం ప్రతిభ ద్వారానే గుర్తింపు పొందాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ తో  గౌరవించింది. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి లిట్’తో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆస్థానకవి’గా నియమించి, దాశరథిపై తనకున్న భక్తిని చాటుకుంది. 1977నుండి 1983వరకూ ఆ పదవిలో కొనసాగాడు. 1883లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆస్థాన పదవులను,అకాడమీలను రద్దు చేసింది. ఈ సంఘటన దాశరథిని ఎంతగానో కలచి వేసింది. గాయపడిన ఆ కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఉన్నాయి. కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి,  ఆంధ్రకవితా సారథి మొదలైన ఎన్నో బిరుదులు  పొందారు. పదవులు ఆశాశ్వతమైనా, తెలుగువారి పెదవులపై, హృదయాలపై ఆ కవి పదాలు దొరలుతూనే ఉంటాయి. ఎవరు కాకతి-ఎవరు రుద్రమ,ఎవరు రాయలు- ఎవరు సింగన, అంతా నేనే -ఆన్నీ నేనే, వెలుగు నేనే… తెలుగు నేనే,అని చెప్పిన ఈ కవిరాయడు తెలుగునేలపై మ్రోయించిన కోటి వీణలు ఎప్పటికీ వినిపిస్తూనే  ఉంటాయి.

(జులై 22 మహాకవి దాశరథి శతజయంతి)

(దాశరథి పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఏటా ఆయన జయంతి నాడు పురస్కార ప్రదానం చేస్తున్నది. ఈ సంవత్సరం ప్రముఖ కవి వేణు సంకోజుకు ఈ పురస్కారం ఇస్తున్నారు.)

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles