Friday, April 26, 2024

సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ

‘ఆంధ్రపత్రిక’ వీరాజీగా జగమెరిగిన జర్నలిస్ట్ కన్నుమూశారు. ఆంధ్రపత్రిక గ్రూప్ తో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న వారిలో వీరు విశిష్టులు. వీరిపై అయ్యవారి ప్రేరణ, ప్రభావం చాలా ఎక్కువ. అయ్యవారంటే శివలెంక శంభుప్రసాద్. ‘‘అయ్యవారికి నేను ఏకలవ్య శిష్యుడిని,’’ అని వీరాజీ గర్వంగా చెప్పుకునేవారు. కాశీనాథుని నాగేశ్వరావుపంతులు, ఆంధ్రపత్రిక అంటే ఆయనకు వల్లమాలిన గౌరవం. ఆ పేర్లు వింటే ఉద్వేగభరితమవుతారు. ఆ అనుబంధం అంత గొప్పది. 1961 నుంచి 1991లో పత్రిక మూతపడేంత వరకూ అంకితభావంతో పనిచేశారు.

Also read: మహామహితాత్ముడు మాస్టర్ ఇకె

బహుముఖ ప్రజ్ఞాశాలి

వీరాజీ గొప్ప పాత్రికేయుడు, కథకుడు, నవలా రచయిత, కాలమిస్ట్. పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ నాలెడ్జి పుస్తకాలు కూడా ఎన్నో తెచ్చారు. ‘అరచేతిలో విశ్వజ్ఞానం’ గా ఆ రచనలు చాలా ప్రసిద్ధి. గైడ్స్ కూడా రాశారు. 20ఏళ్ళకు పైగా అవి యువతపై గొప్ప ముద్ర వేశాయి.యువతలో సాంఘికస్పృహ పెరగాలని అహరహం తపన పడేవారు. ఈ అంశంపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, వ్యాసాలు రాశారు.వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు.విశ్వనాథ సత్యనారాయణ, జొన్నలగడ్డవారి శిష్యరికం తెలుగు,ఇంగ్లిష్ ఉభయ భాషల్లో ప్రావీణ్యం సంపాయించడానికి ఎంతగానో ఉపకరించింది.అటు సంప్రదాయ సారస్వతాన్ని – ఇటు ఆధునిక సాహిత్యాన్ని సమంగా ప్రేమించారు. మహీధరవారిని గురువుగా భావించేవారు. లోపల జర్నలిస్ట్ – బయట నావలిస్ట్… అని వీరాజీ చెప్పుకున్నా, ఆయనకు ఇష్టమైన అంశాలు అనేకం ఉన్నాయి. ప్రాచుర్యం, ప్రసిద్ధి ఈ రెండు క్షేత్రాల్లో రావడం వల్ల బహుశా ఆయన అలా చెప్పుకొని ఉంటారు. పొయిట్రీపై ‘కలంచిందులు’ అనే శీర్షిక అద్భుతంగా నిర్వహించడం ఆయనలోని మరోకోణం. అనేక నవలలు రాయడమే కాక, ఆ ప్రక్రియపై సాధికారికమైన పరిశోధన చేసిన మనిషి. కృష్ణా జిల్లా రచయితల మహాసభ సందర్భంగా ఆయన రాసిన  60 పేజీల సినాప్సిస్ చదివితే ఆయన పరిజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. కథలకు, నవలలకు, పత్రికలో శీర్షికలకు ఆయన పెట్టె పేర్లు చాలా విభిన్నంగా ఉండేవి. సామాన్యుడిని కనెక్ట్ చేసేవి. ‘సామాన్యుడి సణుగుడు’ పేరుతో ఆయన రాసిన కాలమ్స్ కు జనం నుంచి విపరీతమైన ఆదరణ వచ్చేది. ‘మునగచెట్టు’ నవలకు ఎంతో ప్రాచుర్యం వచ్చింది. యూనివర్సిటీ క్యాంపస్ భూమికగా రాసిన ‘తొలి మలుపు’ విలక్షణమైన నవలగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. రష్యన్, బెంగాలీ భాషల్లోకి కూడా అనువాదమైంది. క్యాంపస్ వేదికగా వచ్చిన తొలి నవలగా దానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘ఇద్దరం ఒకటే’ ఇటాలియన్ భాషలోకి అనువాదమై ఖండాంతర ఖ్యాతిని అందించింది. ‘విధి వీడని చిక్కులు’ ఆనాటి యువ రచయితలపై ఎంతో ప్రభావం చూపించింది. ప్రేమ కథలు రాస్తూ యువకులను చెడగొడుతున్నావా? అంటూ ఆత్మీయులు ఛలోక్తులు విసిరేవారు. మంజుశ్రీ ( అక్కిరాజు రమాపతిరావు) వంటి ఆత్మీయులు కొన్నిపేర్లు  సూచించినా,ఆయన పద్ధతిలోనే పేర్లు పెట్టుకొనేవారు.

Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు

వారపత్రిక సంపాదకుడిగా విశేషప్రజ్ఞ

‘ఆంధ్రవారపత్రిక’ ఎదుగుదలలో వీరాజీ పాత్ర చిరస్మరణీయం. సంపాదకుడుగా కొత్త పుంతలు తొక్కించారు. ఆయనకు సినిమారంగంపై ఉన్న మక్కువ, పరిచయాలు పత్రిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయి.’తెరమీద – తెరవెనుక’ శీర్షిక చాలా పేరు తెచ్చిపెట్టింది. సినిమా ప్రముఖులకు సంబంధించిన విశేషాలు,ఇంటర్వ్యూలు పాఠకులను విశేషంగా ఆకట్టుకొనేవి.ఎన్టీఆర్ మొదలు అగ్రనటులందరినీ ఆయన ఇంటర్వ్యూ చేశారు. కొత్త సినిమాలపై చేసే సమీక్షలు సంచలనంగా ఆకర్షించేవి. పన్నెండేళ్ల  వయస్సు నుంచే రచనాకళ వంటపట్టింది. అది ఇటు జర్నలిజంలోనూ-అటు నవలారంగంలోనూ -ఇటు విజ్ఞానరంగంలోనూ రాణించేట్లు చేసింది.వీరాజీయం,  స్మృతిలయలు, బెజవాడ బాతాఖానీ, వార్తావ్యాఖ్య మొదలైనవి ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.ఆహ్వానం మేరకు రష్యా పర్యటించి  ఆ విశేషాలన్నీ ‘యాత్రానందం’ పేరుతో అక్షరబద్ధం చేశారు.’ఆకాశవాణి’తోనూ ఎంతో అనుబంధం ఉంది. ఫిక్షన్,డ్రామా,చర్చలు,వార్తలు మొదలైనవాటితో ఎందరో శ్రోతలను అభిమానపాత్రులను చేసుకున్నారు. 1991లో ఆంధ్రపత్రిక మూసివేసిన తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా అనేక పత్రికలకు కాలమ్స్ రాశారు. ‘భవాన్స్’ జర్నలిజం విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పేవారు. తొలినాళ్లలో కొన్నాళ్ళు ‘ఆనందవాణి’ పత్రికలో పనిచేసినా, 1961 నుంచి 1991 వరకూ సుదీర్ఘమైన ప్రయాణం ‘ఆంధ్రపత్రిక’ తోనే సాగింది. ‘ఆంధ్రపత్రిక వీరాజీ’ గా వచ్చిన పేరుకు ఎంతో ఆనందపడేవారు. ఆంధ్రపత్రిక గ్రూప్ లో ఉద్యోగంలోకి చేరకముందే,’భారతి ‘ సాహిత్య పత్రికలో ఆయన రచనలు వచ్చాయి. అలా ఆ కుటుంబానికి ముందుగానే దగ్గరయ్యానని ఆనందపడేవారు. ఆయనతో కలిసి పనిచేసినవారు ఎందరో ఇంకా మన మధ్య ఉన్నారు. ఆయన ఎప్పుడూ ‘ఇంకా బోలెడుంది … ‘ అంటుండేవారు. ఆయన అన్నట్లుగానే, ఆయన గురించి  రాయాల్సింది, చెప్పుకోవాల్సింది బోలెడుంది. ఆంధ్రపత్రిక కుటుంబసభ్యుడిని కోల్పోయింది.పాఠకులలో వీరాజీ చిరంజీవిగా నిలిచే ఉంటారు.

Also read: కవికోకిల జాషువా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. వీరాజీ గారికి స్రద్ధాంజలి. యువ రచయితల కి ఆయన ఇచ్చిన ప్రొత్సాహమ్ చిరస్మరనీయమ్. ఆయన ఆత్మ శాంతికి ప్రార్ధన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles