Thursday, April 18, 2024

దేశంలో ప్రబలుతున్న అశాస్త్రీయ ధోరణులు

జస్టిస్ ఓ.చిన్నప్పరెడ్డి

జస్టిస్ చిన్నప్పరెడ్డి ప్రఖ్యాత న్యాయమూర్తి. మన దేశంలో పెరుగుతున్న మూఢనమ్మకాలను ఖండిస్తూ ఆయన రాసిన వ్యాసం ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఇది రాసింది ఏ సంస్థ కోసమో, ఎక్కడ, ఎప్పుడు ప్రచురించారో తెలియదు. సోషల్ మీడియాలో తిరుగుతున్నది. ఈ వ్యాసం అన్ని వేళలా, అందరికీ జ్ఞానబోధ చేసే ఉదాత్తమైన లక్షణం కలిగినది.  జనవిజ్ఞానం కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రచురిస్తున్నాం- సంపాదకుడు.

  • చప్పట్లు కొట్టి వైరస్ ను చంపెయ్యమని పిలుపు నిచ్చే నేతలు ఉన్న దేశంలో  క్షుద్ర హత్యలు కాక వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? నరబలులు కాక నోబెల్ ప్రైజ్ లు దక్కుతాయా?
  • విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పూర్తిని పెంచే శాస్త్రీయ విద్యావిధానం కోసం పోరాడుదాం!

మిత్రులారా!

కరోనా వైరస్ ను చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి,పళ్ళాలు మోగించి చంపెయ్యమని ప్రజలకు పిలుపునిచ్చిన నేతలు ఉన్న దేశంలో, అంతరిక్షంలోకి పంపే రాకెట్ నమూనాను తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి పూజ చేసి కానీ ప్రయోగించలేని ఇస్రో సైంటిస్టున్న దేశంలో,రోడ్డు మీద పసుపు అంటిన నిమ్మకాయనో, మిరపకాయనో చూసి జడుసుకొని చెమటలు పట్టే ప్రొఫెసర్స్ ఉన్న దేశంలో,భూమ్మీద పుట్టిన పిల్లలకి ఆకాశంలో నక్షత్రాలు చూసి పేర్లు పెట్టే

డాక్టర్లున్న దేశంలో,  పేరులో స్పెల్లింగ్ మారిస్తే సినిమా హిట్ అయిపోద్ది అని నమ్మే యాక్టర్లున్న దేశంలో… ‘క్షుద్ర హత్యలు’ కాక వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? ‘నరబలులు’ కాక నోబెల్ ప్రైజులు దక్కుతాయా?

“ప్రస్తుత సమాజంలో దిగ్ర్భాంతి కల్గించే వైరుధ్యాలు కనిపిస్తాయి. అత్యాధునిక జీవన శైలితో బ్రతుకుతున్న ఈ తరం మానసికంగా ఆటవిక దశలో ఉందనే సత్యాన్ని మనం గుర్తించాలి” అని కొడవటిగంటి రోహిణి ప్రసాద్ అనే శాస్త్రవేత్త అన్నట్లు శాస్త్ర,   సాంకేతిక రంగాల్లో పురోగమిస్తూనే రాతియుగ భావాలతో మన ప్రగతి పయనిస్తుందన్న కఠోర సత్యాన్ని ఒప్పుకొని తీరాలి. సైన్సును కేవలం పరీక్షల్లో రాసే జవాబులుగా భట్టీ పట్టి మార్కులు, ర్యాంకులు సాధించి, ఆపై ఉద్యోగాలు పొందే సబ్జెక్టుగానే భావించడం వలన, శాస్త్రీయ చింతన, విచక్షణ, వివేకాలు     లేకుండానే మన జీవితాలు సాగిపోతున్నాయనే నిష్ఠూరాన్ని మనం అంగీకరించాల్సిందే! వీటికి ఉదాహరణే మదనపల్లిలోని ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు ‘పునర్జన్మ’ల మీద నమ్మకంతో కన్నకూతుళ్లనే కడతేర్చిన ఘటన.

ఉన్నత చదువులు చదివినా ఉన్మత్త చర్య

ఉన్నత చదువులు చదివిన ఆ తల్లిదండ్రులు స్వయంగా హత్య చేసి, తమ పిల్లలు తిరిగి వస్తారనే భ్రమలోనే ఇంకా ఉన్నారు. తల్లి పద్మజ గణితంలో గోల్డ్ మెడలిస్ట్, ఒక విద్యా సంస్థకి కరస్పాండెంట్. తండ్రి పురుషోత్తంనాయుడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్. పెద్దమ్మాయి అలేఖ్య(27) మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గా పనిచేసి రాజీనామా చేసి,  ఇంటి దగ్గరే సివిల్స్ కు సన్నద్ధమౌతోంది. చిన్నమ్మాయి సాయిదివ్య (22) ఎంబిఏ పూర్తి చేసి చెన్నైలో ఏఆర్ ఇనిస్టిట్యూట్ లో సంగీత శిక్షణ పొందుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మరణించిన ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల పునర్జన్మల విశ్వాసంతో ఏకీభవించి హత్యకు గురయ్యారు. గొప్ప విద్యావంతులుగా సమాజ హోదా కల్గిన ఆ కుటుంబం మితిమీరిన మూఢవిశ్వాసాలు, మంత్రతంత్రాల మీద నమ్మకాలకు బలైపోయిన ఉదంతం ఇది. ఇవే గాక శివుడు కలలో కనిపించి నేత్రదానం చెయ్యమన్నాడని కళ్ళు పెరుక్కునేవారు, మరణించిన కుటుంబ సభ్యుల్ని ఏసు తిరిగి బతికిస్తాడని మృతదేహం పక్కన కూర్చొని ప్రార్థనలు చేసేవారు, దేవుడు పిలుస్తున్నాడంటూ కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకునేవారు, స్వాములు, బాబాల మాటలు నమ్మి కన్న బిడ్డలని నరబలి యిచ్చేవారు…. దేశవ్యాప్తంగా జరిగే ఈ తరహా ఘటనలలో అనేకమంది బలైపోతున్నారు.

అశాస్త్రీయత నిండిన చదువులు

అశాస్త్రీయత నిండిన మన చదువులతో డిగ్రీ పట్టాలు, అరకొర ఉద్యోగాలు వస్తాయే తప్ప జ్ఞానం, వివేకం, విచక్షణ వస్తాయనుకుంటే, దీనికి మించిన మూఢనమ్మకం మరోటి లేదు. ఈ ప్రపంచం మొత్తం రసాయనిక సమ్మేళనాల మిశ్రమం అనే ప్రాథమిక సూత్రాన్ని   కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన పురుషోత్తంనాయుడు మరిచిపోయాడంటే మన విద్యావిధానం ఎంత యాంత్రికతతో కూడుకున్నదో అర్థమౌతుంది. గణితంలో   గోల్డ్ మెడల్ సాధించడానికి అవసరమైన తెలివితేటలున్న పద్మజ విచక్షణ లేకుండా కన్నబిడ్డని డంబెల్ తో కొట్టి చంపేయడం అనేది మన మధ్య ఇంటిలిజెంట్స్ గా చలామణీ అయ్యే వారంతా వివేకవంతులు కారనే సత్యాన్ని బయటపెట్టింది. అయితే వీరి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, విచక్షణలేని హంతకులుగా మారడానికి కారణం ఎవరు?                  వీటి మూలాలెక్కడున్నాయి?  అజ్ఞానం, మూఢత్వం నలుచెరగులా వ్యాపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పాలకులు కాదా?!

పుష్పక విమానం, మూలకణాల వైద్యం

రామాయణంలో పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా మరొకరికి ఖాళీ ఉండేదని, రావణాసురుడు 24 రకాల విమానాలు వాడే వాడని, వాటికి లంకలో విమానాశ్రయాలు కూడా ఉండేవని, భారతంలో వందమంది కౌరవుల జననం వెనుక ఆ కాలానికే మూలకణాల వైద్య సాంకేతికత అమలులో ఉందనీ,  టెస్ట్యూబ్ బేబీ సాంకేతికత మన పురణాలకు కొత్తకాదని, సీత కూడా టెస్ట్యూబ్ బేబీయేనని, వినాయకుని తల అతికించటం అంటే ప్లాస్టిక్ సర్జరీయేనని, అన్నీ వేదాలలోనే ఉన్నాయనీ….. ఇలా మన ప్రధానమంత్రి నుండి ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల దాకా సూడో సైన్సునే సైన్సుగా ప్రచారం చేస్తున్నారు. ఒక సెక్యులర్ దేశంగా మత విశ్వాసాలకు, మత  సంబంధిత కార్యక్రమాలకు ప్రభుత్వాలు, పాలకవర్గాలు దూరంగా వుండాలని; 51ఎ (హెచ్) అధికరణం ప్రకారం ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశీలనా దృష్టినీ,సంస్కరణా వాదాన్ని పెంపొందించాలని రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించినప్పటికీ, ప్రజలలో మూఢవిశ్వాసాలను పెంచి పోషించేందుకు ప్రభుత్వాలే స్వయంగా పుష్కరాలు,  చండీయాగాలు, జాతరలు, కుంభమేళాలు, ఛార్‌ధామ్ యాత్రలూ నిర్వహించి  ప్రజల అజ్ఞానానికి కారణమవుతున్నాయి. అజ్ఞానం చీకటి కంటే గాఢమైనది. అందుకే పాలకవర్గాలెప్పుడూ ప్రజలను అజ్ఞానమనే చీకటిలో ఉంచేందుకే ఇష్టపడతారు. మూఢ విశ్వాసాలను పెంచే బాబాలు, స్వామీజీలను ప్రోత్సహిస్తారు. అశాస్త్రీయమైన  భావజాలాన్ని ప్రజల మెదళ్ళలో గుప్పిస్తారు. స్వాతంత్ర్యానంతర కాలం నుండి పాలకవర్గాలు సామ్రాజ్యవాద, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబించటం వలన పేదరికం, ఆకలిచావులు, నిరుద్యోగం,నిత్యావసర ధరలు, రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశంలోని సంపద పిడికిడు మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవ్వడం వలన ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగి అత్యధిక ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన మగ్గిపోతున్నారు. పెరుగుతున్న రాజకీయార్థిక సంక్షోభం ప్రభావంతో ప్రతినిత్యం అభద్రత, అశాంతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజలలో సహజంగా పెల్లుబికే అసంతృప్తి,ఆగ్రహావేశాలు రాజకీయ నిరసనలుగా, తిరుగుబాట్లుగా మారకుండా ఉండేందుకు ఇహలోక ఈతిబాధలకు పరలోక పరిష్కారాలు చూపే మతాన్ని పాలకులు ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రజల జీవన సమస్యలకు వాస్తు మారిస్తేనో, రుద్రాక్షలు ధరిస్తేనో, ప్రార్థనలు జరిపిస్తేనో, హజ్ యాత్రలు చేస్తేనో,  పాస్టర్ల, లామాల మలమూత్రాలు సేవిస్తేనో స్వస్థత చేకూరుతుందనీ, భద్రత, శాంతిని పొందవచ్చని చెప్పే బాబాలు, పాస్టర్లు, ముల్లాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల  సామాజిక సమస్యలే ముడిసరుకుగా, వారి మత విశ్వాసాలు, వెనుకబాటుతననాన్ని పెట్టుబడిగా, వారి ఆశలు, ఆకాంక్షలే వ్యాపార మార్కెట్టుగా మారుస్తూ భక్తిని ఒక పరిశ్రమగా పాలకవర్గాలు తీర్చిదిద్దుతున్నాయి.

అజ్ఞానాన్ని పెంచిపోషిస్తున్న పాలకులు

ప్రజలలో అజ్ఞానాన్నీ, మూఢ విశ్వాసాలను, మత మౌఢ్యాన్ని పెంచే పాలకుల విధానాలను, అభివృద్ధి నిరోధక ఫాసిస్టు శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రజల జీవితాలలో మెరుగుదలకు తోడ్పడే సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచే విధానాల అమలు కోసం, విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ, హేతువాద దృక్పథంతో అందించే శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాల్సిన అవసరం వుంది.నమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచారాలు పేరిట అశాస్త్రీయ భావాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటూ, బాణామతి, చేతబడి, చిల్లంగి(బ్లాక్ మేజిక్) పేరుతో దాడులు చేసే వారిని, నరబలులు యివ్వమని ప్రోత్సహించే వారిని, బాబాల ముసుగులో లైంగిక అకృత్యాలకు పాల్పడే వారిని శిక్షించే విధంగా మూఢ నమ్మకాల నిరోధకచట్టం తీసుకువచ్చేందుకు డిమాండ్ చెయ్యాలని విద్యార్థి, యువకులకు, హేతువాదులకు, లౌకికవాదులకు, ప్రజాతంత్రవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

లౌకిక నిజాయితీ లేని విద్యావిధానం

మన ప్రస్తుత విద్యావిధానానికీ, లౌకిక నిజాయితీకి సంబంధం లేదు. దానికి శాస్త్రీయత లేదు, చారిత్రక దృక్పథం లేదు. గతం నుండి వారసత్వంగా వచ్చిన బూర్జువా తత్త్వము, ప్రగతి నిరోధక భావాలు,     చాదస్తాలు,  మూఢనమ్మకాలు విద్యావిధానంలో ప్రబలి యున్నవి. మానవజాతి స్పేస్ యుగంలో ప్రవేశించినా భారత జాతి వైజ్ఞానిక   దృక్పథం అలవర్చుకోలేదు.  వైజ్ఞానిక దృక్పథానికి     బదులు పునరుద్ధరణవాదం ప్రబలమౌతున్నది. మూఢాచారాలలో లేని లోతులు వెదకి, గూఢార్థాలు కల్పించుకుంటున్నారు. బూజుపట్టిన భావాలకు,  జీర్ణించిన వ్యవస్థలకు భారతీయ సంస్కృతి పేరిట పునర్జీవం పోస్తున్నారు. ఈ రివైవలిజమ్ నుండి ఉద్భవించినవే జాతి, మత, కుల, భాష, ప్రాంతీయ దురభిమానాలు. ఈ కపటతత్వాల నుండి ఛాందసత్వం నుండి మన ప్రజాబాహుళ్యాన్ని విముక్తి  చేసి హేతుసమ్మతమైన, శాస్త్రగతమైన దృక్పథం అలవరిచే విద్యావిధానం అనుసరించడం మన దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. విద్యావిధానం జాతి జీవితంలో, ప్రజల అవసరాలతో, ఆశయాలతో, ఐక్యత నొంది, శాస్త్రీయంగా, ప్రజాస్వామికంగా సాంఘిక, ఆర్థిక మార్పులు తేగల పరికరంగా ఉండాలి.

Related Articles

2 COMMENTS

  1. సకలం పత్రికకు PDSO విజ్ఞప్తి

    ఈ వ్యాసం విద్యావంతులుగా
    మనం తప్పక చదవాలి.హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఓ. చిన్నప రెడ్డి గారు రాసిన అద్భుతమైన శాస్త్రీయ వ్యాసం” అన్న పేరుతో ఒక వ్యాసం facebook, whatsapp వంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.దానిని ‘సకలం’ పత్రికలో 11-05-2022 తేదీన ప్రచురించారు.దానికి సంబంధించిన వివరణ ఇది.

    మొదటగా ఆ వ్యాసం జస్టిస్ చిన్నప రెడ్డి గారు రాసినది కాదు. ఆయన 14-04-2013 లోనే మరణించారు. కరోనా పైన కానీ, మదనపల్లె ఘటన పైన కానీ ఆయన స్పందించే అవకాశం లేదని గమనించగలరు.ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు ‘పునర్జన్మ’ల మీద నమ్మకంతో కన్నకూతుళ్ళును కడతేర్చిన మదన పల్లె ఘటనపై స్పందిస్తూ PDSO విద్యార్థి సంస్థ కరపత్రం రాసి 02-02-2021 తేదీన ప్రచురించాము.కరపత్రం ఆఖరిలో చిన్నప రెడ్డి గారి వ్యాఖ్యను జోడించాము. కానీ ఎవరో కరపత్రం రాసి, ప్రచురించిన సంస్థ పేరున తొలగించి చిన్నపరెడ్డి గారు రాసిన వ్యాసంగా సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేయటం మూలాన అది చిన్నపరెడ్డి గారు రాసిన వ్యాసంగా ప్రచారం అవుతుంది. ఆ వ్యాసం చిన్నపరెడ్డి గారు రాసినది కాదని, పిడిఎస్ఓ సంస్థవారు రాసి, ప్రచురించారని ఈ పొరపాటుని గమనించవలసినదిగా ‘సకలం’ సంపాదకునికీ తెలియజేస్తున్నాం.

    ఎ.సురేష్,
    రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
    ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
    ఆంధ్రప్రదేశ్
    ఫోన్.నెం:9701924714

    తేదీ:19-05-2022,విజయవాడ

  2. చిన్నప రెడ్డి గారు రాసిన వ్యాసం సోషల్ మీడియా నుంచి సేకరించి ప్రచురించారు. అది ఆయన రాసిన వ్యాసం కాదు. PDSO అనే వామపక్ష విధ్యార్షిసంస్థ కరపత్రం అది. ఆ కరపత్రంలో చివర చిన్నపరెడ్డి గారి quotation పెట్టారు. అది కరపత్రంలో ఆఖరి para. చిన్నపరెడ్డి గారు మరణించిన తరువాత సంఘటనలు గురించి ఆ కరపత్రంలో ప్రస్తావించారు. కనుక ఈ వాస్తవాన్ని మీరు ప్రచురించి తప్పు సరిదిద్దండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles