Friday, June 14, 2024

గ్రేటర్ పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు

  • ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు
  • మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ పట్టుదల
  • ఈ సారి విజయం మాదేనంటున్న బీజేపీ
  • ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తామంటున్న టీడీపీ
  • విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అప్రతిహతంగా సాగుతున్న టీఆర్ఎస్ విజయానికి దుబ్బాక విజయంతో బ్రేకులు వేశామంటున్న బీజేపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రభావం బల్దియా ఎన్నికలపై ఖచ్చితంగా చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంచలన విజయంతో విజేతగా నిలిచిన బీజేపీ. స్వల్ప తేడాతో ఓటమి పాలైన అధికార టీఆర్ఎస్, పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్,  అసలు పోటీ చేయని టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలపడేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఎంఐఎంతో దోస్తీ టీఆర్ఎస్ కు కలిసొస్తుందా..!

గత ఎన్నికల్లో ఎంఐఎం భాగస్వామ్యంతో ఒంటి చేత్తో  విజయాన్ని అందుకుంది టీఆర్ఎస్. కాని ప్రస్తుత పరిస్థితులు వేరు. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జోరు మీద ఉన్న బీజేపీ గ్రేటర్ లో పాగా వేసేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెరలేపింది. ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలైనా టీఆర్ఎస్ కు ఇప్పటిదాకా ఎదురు లేకుండా పోయింది. వరుస విజయాలతో ఊపు మీదున్న కారు దుబ్బాక ఉప ఎన్నికతో ఖంగుతింది. అయితే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని లైట్ తీసుకుంటే  బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైకి బీరాలు పలుకుతున్నా దుబ్బాక  ఓటమిని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని పార్టీలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ప్రభావం పడకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

బల్దియా లో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు

తెలంగాణకు ఆయువుపట్టైన హైదరాబాద్ లో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీదున్న బీజేపీ బల్ధియాలో బల ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ప్రత్యర్థిని మానసికంగా బలహీనపరిచి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వ్యూహరచన చేస్తోంది.  ఎంతో కాలం నుంచి పట్టుకోసం ఎదురుచూస్తున్న బీజేపీ ఇపుడు తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు  కదుపుతున్నారు.  దుబ్బాక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని  గ్రేటర్ ఎన్నికల్లోను విజయం సాధిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పాతబస్తీపై బీజేపీ కసరత్తు

గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లుంటే.. అందులో 50 దాకా పాతబస్తీ పరిధిలోనివే. అలాంటి పరిస్థితిలో పాతబస్తీలో గణనీయమైన విజయాలు సాధించకుండా గ్రేటర్ లో కాషాయ జెండా రెపరెపలాడటం సాధ్యం కాదన్నది జగమెరిగిన సత్యం. కానీ పాతబస్తీలో బీజేపీ సానుకూల ఫలితాలను రాబట్టేందుకు బీజేపీ పకడ్బందీ  ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ట్రిపుల్ తలాక్ వంటి కీలకాంశాలను పాతబస్తీ ప్రచారంలో విరివిగా వాడుకొని ముస్లిం మహిళల ఓట్లను రాబట్టాలన్న వ్యూహంలో  బీజేపీ నేతులు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ మీదున్న వ్యతిరేకతపై విస్తృత ప్రచారం చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది.

దుబ్బాక వ్యూహాలే బల్దియాలోనూ

దుబ్బాక ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాలనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకోసం అధికార టీఆర్ఎస్ ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గోషామహల్‌ ఎమ్మెల్యే , సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు మినహా ఎక్కడా బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేదు.  టీఆర్ఎస్ పార్టీ, అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌ ఓవైసీ సోదరులను వెంట పెట్టుకొని హైదరాబాద్‌ మొత్తం తిరిగినా బల్దియా ఎన్నికల్లో విజయం సాధించేది  బీజేపీనే అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు బీజీపీ నేతలు.

‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెరలేపిన బీజేపీ

ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ కాంగ్రెస్, టీఆర్ఎస్ లలోని అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గెలుపు గుర్రాలను బరిలోకి దించి 75 స్థానాలకుపైగా విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా పార్టీ ముఖ్య నేతలంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. డబుల్ బెడ్ రూం  ఇళ్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ బల్దియా ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకుందని బీజేపీ ఆరోపిస్తోంది.  లక్షల్లో దరఖాస్తులు తీసుకుని వేలల్లో కూడా ఇళ్లు మంజూరు చేయలేకపోయిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

దుబ్బాక ఓటమితో అయోమయంలో కాంగ్రెస్

దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ఇక బతికి బట్టకడుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కుమారుడిని తెరపైకి తెచ్చి గెలుపు గుర్రం ఎక్కాలనుకున్న కాంగ్రెస్‌ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రేవంత్ విచిత్ర పరిస్థితి

రాష్ట్ర ఇంఛార్జిలను మార్చినా  తెలంగాణలో  కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఎంపీగా గెలిచాక సిట్టింగ్ సీటు హుజూర్‌ నగర్‌ ని నిలబెట్టుకోలేకపోయింది. టీడీపీని వీడి కాంగ్రెస్‌ లో కొచ్చిన రేవంత్‌ రెడ్డి వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీలో దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో చేరాక ఆపార్టీ నేతలు అడుగు అడుగునా బ్రేకులు వేస్తున్నారనే చెప్పొచ్చు.

దుబ్బాక ఉప ఎన్నికలో పరాజయం తరువాత కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రేటర్‌ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరి మొహం చూపించి ఓట్లడగాలో పార్టీ నేతలకు అంతుపట్టటం లేదు.  నేతల మధ్య అంతర్గత కలహాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. దీనికి తోడు పార్టీనకి ఇపుడు వలసల భయం పట్టుకుంది. విజయశాంతి తో పాటు మరికొంత మంది నేతలు బీజేపీలో చేరతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

బల్దియా బరిలో టీడీపీ

మరో వైపు టీడీపీ కూడా బల్దియా ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటారు. హైదరాబాద్ లో ఉన్న  ఎకో సిస్టం ఎక్కడా లేదని చెబుతారు. తమ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన జీనోమ్‌ వ్యాలీ, నల్సార్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు వంటి వ్యవస్థల వల్లనే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోందని చంద్రబాబు వివరించారు. వీటన్నింటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సూచించారు.  రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో కాన్ఫరెన్సు ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు బల్దియా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు వివరించారు..  జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, రాష్ట్రస్థాయి నాయకులతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకోవాలని వారికి చంద్రబాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ తెలంగాణ జనసమితి, వామపక్షాలను కలుపుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రత్యర్థి విజయావకాశాలను మాత్రం దారుణంగా దెబ్బతీయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పారదర్శకంగా ఎన్నికలు : ఎన్నికల కమిషన్

జీహెచ్ ఎంసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు లాంటి అంశాలను ఆయన చర్చించారు. 150 వార్డులకు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబరు 7 న ఉప కమిషనర్లు ప్రచురించారని పార్థ సారధి తెలిపారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలను విడుదల చేసిన అనంతరం వాటిమీద అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు

పటిష్టంగా కోడ్ అమలు :

నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని పార్థసారధి తెలపారు. 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్ ఇపుడూ కొనసాగుతాయని తెలిపారు. ఓటరు జాబితాలు సక్రమంగా తయారు చేశాకే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles