Saturday, April 27, 2024

కాఫీ కబుర్లు

కాఫీ నాకు ఘనంగా  ఇష్టమైన ద్రవపదార్ధం. జొన్నవిత్తులగారు గొప్ప దండకం కూడా రాశారు. బ్రిటిష్ వాళ్లు భారతీయులకు ఈ కాఫీని అలవాటు చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా మన దక్షిణాదివారికి బాగా ఇష్టం. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో చాయ్ కు ఎక్కువ గిరాకీ. ఈ విషయం అలా పక్కన పెడదాం. కాఫీగత ప్రాణులు మనలో చాలామంది ఉన్నారు. కాఫీల్లో ఫిల్టర్ కాఫీదే అగ్రస్థానం. చకోరీ అనేమాట చాలామందికి గుర్తు ఉంటుంది. నరసరావుపేటలో నా చిన్నప్పుడు మా సరోజిని అత్తయ్య కాఫీ పౌడర్ కోసం నన్నే పంపేది. కాపీపొడి, చకోరి 60:40నిష్పత్తిలో తెమ్మనేది. వాళ్ళ పిల్లలకు పొద్దున ఒక్కసారే కాఫీ. మా అత్తయ్య, మామయ్యతో పాటు నాకు రెండవసారి కూడా ఇచ్చేవారు. ఒక్కొక్కసారి మూడవసారి కూడా! మా అత్తయ్య ప్రత్యేకంగా నాకు ఇచ్చేది. కిరాణా సరుకులకు ఎక్కువసార్లు నన్నే పంపేది,  జాగ్రత్తగా తెస్తానని నమ్మకం. అలా తెచ్చినందుకు నాకు కొంచెం డబ్బులు ఇచ్చేది.

అదే నా మొదటి సంపాదన

నిజం చెప్పాలంటే  (11-12ఏళ్ళ వయస్సులో) నా మొదటి సంపాదన అదే. లంచం కాదు కానీ, ప్రోత్సాహకం. ఎప్పుడైనా బ్రూ కాఫీ, నెస్ కెఫీ త్రాగేవాళ్ళం. మా ఊర్లోనూ, నరసరావుపేటలో మా మేనమామగారికీ చాలాకాలం సొంతపాడి ఉండేది. మాది పచ్చి పల్లెటూరు(కుగ్రాతి కుగ్రామం) కాబట్టి సొంతపాడికి ఢోకాలేదు. చిక్కని చక్కని కాఫీ ఉండేది. మా నాన్నగారు కరణం, మునసబుగా ఉండేవారు. మా ఊర్లో టీచర్లు almost ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్లేవారు. మాఊరు గుండా పక్క ఊరుకు వెళ్లే అధికారులు, బంధు, మిత్రువర్గం కూడా మా ఇంట్లో కాఫీ తాగి వెళ్లేవారు. అదొక మర్యాద. మా నాన్నగారికి మా ఇంట్లో కాఫీ కంటే పక్కఊరు కరణంగారింట్లో కాఫీ అంటే చాలా ఇష్టం. వాళ్లు సింగంపల్లివాళ్లు. మాకు దగ్గర బంధువులే. మామలు, బావల వరుస అవుతారు మా ఇంటిపేరు మాచవరం. సింగంపల్లి-మాచవరం రెండు కుటుంబాలు ఇచ్చిపుచ్చుకునేవారు పిల్లతో పాటు కాఫీని కూడా.మా నాన్నగారు కాఫీ కోసం సింగంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్లడం మా పెదనాన్నగారికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. వెళ్ళొద్దని చెప్పినా వెళ్లడం, మా పెదనాన్నతో తిట్లు తినడం చాలా common గా జరిగిపోయేది(ఈ విషయాలు మా నాన్నగారే నాకు చెప్పారు). మా పెదనాన్నగారు జీవించి వున్నప్పుడు నేను పుట్టలేదు.

 మా తండ్రి అమాయక చక్రవర్తి

మా నాన్నగారి కంటే ముందు మా పెదనాన్నగారే మాఊరి కరణం, మునసబు. ఆయనకు ఆత్మగౌరవం, కోపం చాలా ఎక్కువ అని చెప్పేవారు. మా నాన్నగారికి అమాయక చక్రవర్తిగా చాలా పేరుంది. అందులో కాఫీ కూడా భాగస్వామ్యం అయింది. మాకు అప్పుడు కొంత పొలం పుట్రా బాగానే ఉండేది. కౌలుకు ఇచ్చేవాళ్ళం. గద్దె, పిన్నిక, గంటా,తన్నీరు మొదలైన ఇంటి పేర్లుగల రైతులు మా ఊర్లో ఉండేవారు. మా పొలాలు వాళ్లే చేసేవారు.కౌలు  అంటే అప్పుడు డబ్బు రూపంలో తక్కువగా ఉండేది. ఎక్కువ పంట షేర్ చేసుకోవడమే. ఆ ధాన్యం ఊర్లో కోమట్లకు అమ్మి మాకు కావాల్సిన సరుకులు, డబ్బులు తీసుకొనేవాళ్ళం. పేరుకే కౌలు. వసూళ్లు నామ మాత్రంగా ఉండేవి. కౌలు అడగడానికి కూడా మా నాన్నగారు మొహమాటపడేవారు. మా అమ్మ గొడవచేస్తే వెళ్లేవారు.

కులాలకు అతీతంగా ఆప్యాయత

ఆ రైతుల ఇంటికి వెళ్ళగానే : మామా! అత్త బాగుందా? అంటూ క్షేమ సమాచారాలు అడిగేవారు. వాళ్ళ పిల్లలు వచ్చి మా నాన్నగారికి పాద నమస్కారం చేసేవారు. అరమోచెయ్యి సైజ్ లో ఉండే రాగి గ్లాసు/గలాసుతో కాఫీ ఇచ్చేవారు. మామా!నువ్వు పొలం ఎప్పుడు అమ్మినా నాకే అమ్మాలి అని అంటుండేవారు. ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ డైలాగ్.. ఈ రైతులంతా ఎక్కువ కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. కులాలకు అతీతంగా ఆప్యాయంగా మామా,కక్కయ్యా /బాబాయ్ అని పిలిచేవారు. (మా నాన్నగారిది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరు అనే గ్రామం) ఈ పలకరింపులు, కాఫీ మర్యాదల మధ్య మా నాన్నగారు కౌలు విషయం మరచిపోయి వచ్చేవారు అదీ కాఫీ పవర్!! ఇలా కాఫీ మొహమాటంతో చాలా డబ్బులు, పొలాలు పోగొట్టుకున్నాం. అయినా మేము మారలేదు. కాఫీపైన  మా యావ చావలేదు. కుదిరితే, ఓ కప్పు కాఫీ తాగి, మళ్ళీ ఇంకోసారి  ఈ కాఫీపురాణం మాట్లాడుకుందాం. ఈ సందర్బంగా మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని ఒకసారి తలచుకుందాం.  మల్లాదివారు ఒకసారి మూడురోజులు అపస్మారకం/కోమాలోకి వెళ్లిపోయారు. డాక్టర్ అయనకు ఈ విషయం చెప్పాడు. దానికి మల్లాదివారి స్పందన: పాపం! నేను కాఫీ తాగి మూడు రోజులైందా? That is coffee.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles