Thursday, June 13, 2024

జస్టిస్ రమణకు ధోకా లేదు

  • సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానానికి దుష్యంత్ దవే ‘నో’
  • ‘తప్పు చేసిన న్యాయమూర్తులపై చర్య తీసుకోవడం లేదు’
  • ‘ఆరోపణలు రుజువు కాకపోతే జగన్ పై సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి’
  • జస్టిస్ రమణను సమర్థిస్తూ 3 న్యాయవాదుల సంఘాల తీర్మానాలు

కె. రామచంద్రమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే ఏప్రిలో లో పదోన్నతి పొందనున్న జస్టిస్ ఎన్.వి. రమణకు దేశవ్యాప్తంగా న్యాయవాదుల మద్దతు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపైనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరిపైనా, మరి కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా-సీజేఐ)కి రాసిన లేఖ వల్ల జస్టిస్ రమణకు నష్టం జరిగే అవకాశం కనిపించడం లేదని న్యాయవ్యవస్థలోని కొందరు పెద్దల అభిప్రాయం.

ఇదివరకు దేశవ్యాప్తంగా న్యాయమూర్తులలో, అడ్వకేట్లలో వామపక్ష భావజాలం ఉన్నవారు అధికంగా ఉండేవారు. ఇప్పుడు మితవాద భావాలు ఉన్నవారు ఎక్కువ. సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్  ఆన్ రికార్డ్  అసోసియేషన్   చాలా పెద్ద, శక్తిమంతమైన సంఘం. ఇందులో సభ్యుల దేశవ్యాప్తంగా ఉంటారు. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే, ఉపాధ్యక్షుడు కైలాష్ వాసుదేవ్ లు ఈ వివాదంలో తటస్థంగా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా అసోసియేషన్ కార్యదర్శి, ఇతర నిర్వాహకులు జస్టిస్ రమణను పూర్తిగా సమర్థిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ సంఘం సాధారణంగా ఇద్దరు ప్రముఖ న్యాయవాదుల మధ్య చీలి ఉండేది. ఒకరు, అరుణ్ జైట్లీ. ఆయన స్వయంగా ప్రసిద్ధ న్యాయవాది. బీజేపీ ప్రభుత్వంలో రెండు, మూడు స్థానాలను అలంకిరంచిన రాజకీయ నాయకుడు. రెండవ వ్యక్తి, కపిల్ శిబ్బల్. కాంగ్రెస్ వాది. ప్రముఖ న్యాయవాది. యూపీఏ ప్రభుత్వంలోని ముఖ్యమైన మంత్రులలో ఒకరు. అరుణ్ జైట్లీ కాలం చేసినా ఆయన భావజాలానికి చెందిన న్యాయవాదుల ప్రాబల్యం ఈ సంఘంలో పెరిగింది.  

అడ్వకేట్ల సంఘాలన్నీ జస్టిస్ రమణ పక్షమే

దిల్లీ బార్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సభ్యులు – అంటే దేశంలో అడ్వకేట్లకు చెందిన మూడు ప్రధానమైన సంఘాలు – ముక్తకంఠంతో జస్టిస్ రమణను సమర్థించారంటే కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ కూడా అదే పంథాలో ఆలోచిస్తున్నదని అర్థం చేసుకోవాలి.భ ఈ మూడు సంఘాలూ తమ ప్రకటనలలో జస్టిస్ రమణను సమర్థించడమే కాకుండా ఆయనపైన ఆరోపణలు సంధిస్తూ సీజేఐకి లేఖ రాసినందుకు జగన్ మోహన్ రెడ్డిని దుయ్యపట్టారు.

సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ తీర్మానంపైన తాత్కాలిక కార్యదర్శి రోహిత్ పాండే సంతకం చేశారు. 16 అక్టోబర్ న అసోసియేషన్ కార్యదర్శివర్గం సమావేశం జరిగిందనీ, జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాత్రమే తీర్మానంలో ఉంది. రాజ్యంగబద్ధంగా పని చేయవలసిన వ్యక్తులు అటువంటి లేఖ రాయడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రభావం పడుతుందనీ, రాజ్యాంగం నిర్దేశించిన విధంగా న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా పనిచేయడానికి ఆటంకంగా మారుతుందనీ తీర్మానం అభిప్రాయం వెలిబుచ్చింది. కార్యవర్గంలో మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 16 మంది విడియో సమావేశానికి (వర్ట్యువల్ మీటింగ్) హాజరైనారు.

‘న్యాయమూర్తులూ, న్యాయవాదులూ మౌన ప్రేక్షకులు’

‘మీరు సమావేశం ఉన్నదనే సందేశం పంపినారు. కానీ సారీ. నేను మొదటి నుంచీ ఇటువంటి తీర్మానాన్ని కార్యవర్గం ఆమోదించడం పట్ల వ్యతిరేకత ఉన్నవాడిని. ఈ తీర్మానాన్ని  సూత్రప్రాతిపదికగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను,’ అంటూ దుష్యంత్ దవే రోహిత్ పాండేకి సందేశం పంపించారు.  ‘జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల నిజానిజాలు మనకు తెలియదు. ఈ దశలో లేఖను ఖండించడం ద్వారా విచారణను అడ్డుకున్నట్టు అవుతుంది. విచారణ పూర్తయిన తర్వాత నిజం నిగ్గు తేలుతుంది. ఆరోపణలు అసత్యాలని తేలితే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిపైన కోర్టు ధిక్కార నేరం కింద విచారణ చేపట్టాలి. ఈ దశలో తీర్మానం ఆమోదించడం తొందరపాటు అవుతుంది,’ అంటూ దవే స్పష్టం చేశారు.

ఇటీవల సుప్రీంకోర్టు అనేక వివాదాలలో ఇరుక్కొని బురద అంటకుండా బయటపడటంలో విఫలమైన విషయం ఆయన గుర్తు చేశారు. ‘న్యాయస్థానం రాజ్యాంగంలో ఒక అస్పష్టమైన భాగం.  తప్పు చేసిన న్యాయమూర్తులపైన చర్య తీసుకోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన నోట్ లో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వారిద్దరూ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తులైనారు. నిస్సహాయురాలైన ఒకానొక మహిల తనపైన లైంగిక అత్యాచారం జరిగిందంటూ చేసిన ఫిర్యాదులో అప్పటి సీజేఐపైన  నేరుగా ఆరోపణ ఉన్నది. సుప్రీంకోర్టు కల్లబొల్లి విచారణ జరిపి సీజీఐ తప్పు చేయలేదంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి, తప్పుడు క్రిమినల్ కేసు పెట్టి, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేక ఆమెను విడుదల చేశారు. ఫిర్యాదును కూడా వాపసు తీసుకున్నారు. ఇంత జరిగినా న్యాయమూర్తులు కానీ, న్యాయవాదుల సంఘాలు కానీ మౌనప్రేక్షక పాత్రనే పోషించారు, ’ అని దవే గుర్తు చేశారు.

‘న్యాయస్థానంలో రోజూ అనేక కలత కలిగించే ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఎవ్వరూ నోరెత్తరు. పలుకుబడి ఉన్న న్యాయవాదుల కేసులు విచారణకు వస్తున్నాయనీ, తమ కేసులు రావడం లేదనీ జూనియర్ లాయర్లు నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకూ నేను వారికి సాయం చేస్తున్నాను. ఇదంతా దేనిని సూచిస్తున్నది? న్యాయమూర్తులు చాలా విషయాలపై వివరణ ఇవ్వవలసి ఉంది. కానీ న్యాయవాదులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. న్యాయస్థానాలనూ, న్యాయపరిపాలన వ్యవస్థనూ ఎట్లా పటిష్టం చేయాలో మనమంతా ఆలోచించాలి, ’ అంటూ దవే వాదించారు.

సీజేఐకి లేఖ రాయడాన్ని తాము వ్యతిరేకించడం లేదనీ, దానిని వెల్లడించడాన్ని వ్యతిరేకిస్తున్నామనీ న్యాయవాదుల సంఘం తీర్మానం స్పష్టం చేసింది.  

న్యాయమూర్తి అభిభాషణ

జస్టిస్ రమణకు ఏ మాత్రం నష్టం జరగలేదనడానికి తాజా తార్కాణం శనివారంనాడు ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఆర్. లక్ష్మణన్ సంతాపసభలో వీడియా సందేశం ద్వారా చెప్పిన మాటలు. జగన్ లేఖ ఉదంతం తర్వాత జస్టిస్ రమణ నోటి నుంచి వెలువడిన తొలి మాటలు ఇవి. ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు గొప్ప బలమనీ, న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు చేయాలనీ ఆయన చెప్పారు. న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలంటూ ఆయన సంతాప సందేశంలో ఉద్ఘాటించారు. ఒత్తిళ్ళూ, అటంకాలూ, అన్ని రకాల ఇబ్బందులనూ ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. న్యాయవ్యవస్థకు ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావనీ, వాటిని సంపాదించుకోవాలనీ, మన విలువలేమనకున్న గొప్ప సంపద అనీ అన్నారు.

 రాముడే ఆదర్శం

‘‘ ఓ మహానుభావుడు చెప్పిన మాటలు  నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రజలు రాముడిని కొలవాల్సింది ఆయన విజయాలను చూసి కాదు. అత్యంత కష్టసమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి. అదే విలువలకిచ్చే గౌరవం. ఒకరి జీవితంలో అత్యంత గొప్ప లక్షణాలు అవే. నీకు ఎంత ఉన్నదని ఇక్కడ ప్రశ్నకాదు. నీవు ఏం చేశావు? దాని వల్ల ఏ జరిగింది? ఏం జరగలేదు? ఏలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటిని నీవు ఎలా ఎదుర్కొన్నావన్నదే ముఖ్యం. అదే నీ సత్తా ఏంటో నిర్ణయిస్తుంది,’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

సీజేఐ నియామక ప్రక్రియ

భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం ప్రక్రియ ఆనవాయితీగా అమలు జరుగుతున్నది. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తన స్థానంలో ఎవరిని నియమించాలో నెల రోజులు ముందుగానే ప్రధానమంత్రికి సిఫార్సు చేస్తారు. సర్వసాధారణంగా తన తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి పేరు సిఫార్సు చేస్తారు. నంబర్ 2 స్థానంలో జస్టిస్ రమణ ఉన్నారు. ఆయన పేరే సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. నంబంర్ 3లో ఉన్న ఆర్.ఎఫ్. నారిమన్ స్వతంత్ర భావాలు కలిగిన న్యాయమూర్తి. మైనారిటీలకు న్యాయం జరగాలంటూ భావించే వ్యక్తి. జస్టిస్ రమణకు పదవి ఇవ్వకుండా నంబర్ 3 స్థానంలో ఉన్న న్యాయమూర్తికి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ ఆలోచించే అవకాశమే లేదు. జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా 26 ఆగస్టు 2022 వరకూ ఉంటారు. ఆ తర్వాత ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకొని కేవలం మూడు మాసాలు ఉంటారు. అయిదో స్థానంలో ఉన్న జస్టిస్ ఖల్వీకర్, ఏడో స్థానంలో ఉన్న జస్టిస్ అశోక్ భూషణ్, ఎనిమిదో స్థానంలో ఉన్నజస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ఉన్న కాలంలోనే పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్ లలిత 08 నవంబర్ 2022 నాడు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా డి.వై. చంద్రచూడ్ వస్తారు. ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ, 10 నవంబర్ 2024 వరకూ సర్వోన్నత న్యాయమూర్తిగా కొనసాగుతారు. మొత్తంమీద జస్టిస్ రమణను కాదని జస్టిస్ నారిమన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని మోదీ భావించే అవకాశం లేదు. జస్టిస్ రమణనూ, జస్టిస్ నారిమన్ నూ కాదని, వీరిద్దరినీ సూపర్ సీడ్ చేసి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ని భారత ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే ఏప్రిల్ లోనే నియమించవచ్చు. కానీ ఇందుకోసం వివాదం కొనితెచ్చుకోవలసిన అవసరం మోదీకి లేదు. జస్టిస్ రమణ తనకు కానీ తన ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారని మోదీ భావించడానికి కారణాలు ఏమీ లేవు. స్వతహాగా సౌమ్యుడైన జస్టిస్ రమణ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. లెఫ్టిస్ట్, రైటిస్ట్ భావజాలాల ప్రభావం సైతం జస్టిస్ రమణపైన ఉండే అవకాశం లేదు కాబట్టి ఆయన వివాదాలకు అతీతంగా న్యాయపరిపాలన చేసే అవకాశం ఉన్నదని ప్రధాని భావించే అవకాశాలే ఉన్నాయి. జస్టిస్ రమణ హయాంలోనే ప్రధాని సంకల్పిస్తున్న ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ వంటి ఎన్నికల సంస్కరణలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

పెరుగుతున్న అసహనం

జగన్ మోహన్ రెడ్డి లేఖపైన మాజీ న్యాయమూర్తులు ఎక్కువ మంది మాట్లాడలేదు. జస్టిస్ గంగూలీ ఒక్కరే  ఆ లేఖ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచించి, నిర్ణయించే అధికారం, అవకాశం సీజేఐ జస్టిస్ బాబ్డేకు మాత్రమే ఉన్నాయని మాత్రం వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని సమర్థించలేదు. కానీ ఆయనపైన కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖతో సంబంధం లేని విశ్రాంత న్యయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జస్టిస్ రమణను సమర్థించడంలో తప్పు లేదు. ఆయనపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపితేనే న్యాయవ్యవస్థ పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయనీ, జస్టిస్ రమణకు కూడా వ్యక్తిగతంగా శోభాయమానంగా ఉంటుందనీ  నిజాయతీగా అభిప్రాయం వెలిబుచ్చినవారిపైన కూడా దాడి చేయడం శోచనీయం. పెరుగుతున్న అసహనానికి ఇది నిదర్శనం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles