Friday, April 26, 2024

రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి

రామాయణమ్210

‘‘నాయనా రామచంద్రా, శత్రుసంహారము చేసి విజయము సాధించుటకై నీకు ఒక పరమ రహస్యమైన స్తోత్రమును తెలిపెదను. అక్షయమైన ఫలమునిచ్చు మంగళప్రదమైన స్తోత్రమిది. దీనిని ఆదిత్యహృదయము అందురు. ఈ స్తోత్రము ఏ చింతలను చెంతకు రానీయదు. ఏ కోశానా మనిషి శోకమునకు లోనుకాడు. ఆయుష్షును వృద్ధిపొందించును.

‘‘లోకులను తమతమ జీవన వ్యాపారములలో ప్రవర్తింపచేయువాడు సాక్షాత్తూ ఆదిత్యుడే. దేవ అసురుల చేత నమస్కరింపబడు ఆదిత్యుడే ఆరాధ్యుడు.

Also read: రామ-రావణ భీకర సమరం

ఆయన సర్వ దేవతాస్వరూపుడు ,సకలలోకులను రక్షించువాడు…

ఆయనే బ్రహ్మ

ఆయనే విష్ణువు

ఆయనే స్కందుడు

ఆయనే శివుడు

ఆయనే ప్రజాపతి

ఆయనే కుబేరుడు

ఆయనే కాలుడు

ఆయనే యముడు

ఆయనే సోముడు

ఆయనే వరుణుడు.

Also read: మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ

ప్రతిజీవునిలోనూ ఆత్మగా ఉండి తానే జన్మింపచేయుచున్నాడు ….అందుకే ఆయన …ప్రజాకర్తా

‘‘ఋతువు అనగా జ్ఞానము.  మనకు కలిగిన జ్ఞానములన్నింటికీ కారణము సూర్యుడే.  కావున ఆయన “ఋతుకర్తా.” ప్రభాకరః — ప్రభ అనగా వెలుగు. ఆ వెలుగును కలిగించువాడు సూర్యుడు (ఆదిత్యుడు )….అని ఆదిత్యుని గురించి పూర్వపీఠిక చెప్పి ఆదిత్యహృదయమును అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించుట ప్రారంభించినాడు.

‘‘ఆదిత్యః –అదితికి కుమారుడిగా అవతరించినవాడు. సమస్తమును తనదిగా స్వీకరించి అనుభవించువాడు. సకలజగత్తును అన్నము తినునట్లుగా భుజించువాడు.

సవితా – స్థావర జంగమాత్మకమైన జగత్తుకు స్వామి అయినవాడు.

Also read: రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు

సూర్యః– సువతి ప్రేరయతి కర్మాణి ఇతి సూర్యః అనగా ఎవరి పనులయందు వారిని ప్రేరేపించువాడు. జీవులు అందరిలో ఉండి శాసించువాడు పరమాత్మ. అతడే సూర్యుడు.

ఖగః — ఖే గచ్ఛతి ఇతి ఖగః అనగా ఖం అనగా ఆకాశము, గచ్ఛతి అనగా చరించువాడు

పూషా — వర్షము చేతజగత్తును పోషించువాడు..

భానుః – అనగా ఎల్లప్పుడూ ప్రకాశించువాడు అని అర్ధము …భాతి ఇతి భాను

తిమిరోన్మధనః — చీకట్లను పెకిలించి పారద్రోలు వాడు .

శంభుః — సుఖమును ఇచ్చువాడు

‘‘ఆదిత్యుడే సకల జగత్తును నశింపచేయును. సృష్టించును. తపింపచేయును. అతడే రక్షించును. అతడే శిక్షించును. ఆయనే అంతర్యామి. అంతేగాక, లోకములోని సకల కర్మల ఫలములు ఇచ్చువాడు ఆయనే’’ అనుచూ అగస్త్యమహర్షి ఆదిత్య హృదయము ఉపదేశించి రామా ముమ్మారు ఈ స్తోత్రము జపించిన ఎడల విజయమునొందెదవు అని పలికి ఏ విధముగా వచ్చినాడో ఆ విధముగా వెడలిపోయెను.

.

రాముడు ఆ స్తోత్రమును వినినంతనే మహాతేజస్సుతో వెలిగిపోయెను. ఆచమనము చేసి మూడుసార్లు నిష్ఠగా ఆదిత్య హృదయము జపించెను.

రాముడు ఆదిత్యుని ఉపాసించిన వెనువెంటనే సూర్యమండలమునుండి ఆదిత్యుడు బయలు వెడలి రాముని వద్దకు వచ్చి ‘‘రామా త్వరగా రావణుని వధింపుము ఆలస్యము వలదు’’ అని పలికెను.

Also read: రావణుడు రణరంగ ప్రవేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles