Tuesday, April 30, 2024

వార్థక్యంలో రాజకీయం శ్రీధరన్ కీ, బీజేపీకి నష్టంలేని ప్రయోగమే

  • రాష్ట్రంలో పెరిగిన అవినీతి
  •  కుంటుపడుతున్నఅభివృద్ధి
  • బీజేపీకి తీరనున్న నాయకత్వ సమస్య

కేరళ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళ రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో అధికారం కోసం తహతహలాడుతున్నబీజేపీ ఈ సారి ఎన్నికల్లో బలం పుంజుకోవాలని తాపత్రయపడుతోంది. అయితే కేరళలోని ప్రత్యర్థి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లను ఎదుర్కొనేందుకు ఆపార్టీకి సరైన వ్యక్తి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుంతోంది. దీంతో ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ ను అత్యంత సమర్థంగా అతితక్కువ కాలంలోనే పూర్తి చేసి జాతీయ స్థాయిలో మెట్రో మ్యాన్ గా గుర్తింపు పొందిన  ఎలట్టువాలపిల్ శ్రీథరన్ పై కన్నేసింది. నిబద్ధత, సచ్చీలుడిగా పేరున్న శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని కేరళ రాజకీయాలను బలమైన ముద్ర వేయాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దేశంలోని చాలామంది మేధావులు రాజకీయాలకు దూరంగా ఉన్నపుడు ఢిల్లీ మెట్రో ప్రధాన సలహాదారైన శ్రీధరన్ వంటి గౌరవనీయ వ్యక్తి ఈ వయసులో రాజకీయాలను ఎందుకు ఎంచుకున్నారు. 75 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సున్న వారందరినీ మార్గదర్శకులుగా లేదా గవర్నర్ లుగా నియమించి రాజ్ భవన్ కు పంపుతున్నబీజేపీ 88 ఏళ్ల వయసున్న శ్రీథరన్ ను కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నించడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి.

విజయ్ యాత్రతో శ్రీధరన్:

అయితే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని శ్రీధరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 21 న కాసరగడ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రారంభిస్తున్న విజయ యాత్ర ప్రారంభోత్సవంలో పార్టీలో చేరడమే మిగిలి ఉందని అన్నారు. శ్రీధరన్ హిందూ దినపత్రికతో మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం గత పదేళ్లుగా కేరళలోనే ఉంటున్నానని అన్నారు. ఎల్ డీఎప్, యూడీఎఫ్  ప్రభుత్వాల పాలనను చూశాను. ప్రజలకు అవసరమైన పనులను చేయడంలో ఆయా ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. నేను బీజేపీలో చేరి నా అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని స్పష్టం చేశారు.  ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో పాటు రాష్ట్రంలో విపరీతమైన అవినీతి పెరిగిపోయాయి. రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీలు మాత్రమే లబ్ధిపొందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి సత్సంబంధాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితులను మార్చగలదన్న నమ్మకం ఉందని శ్రీధరన్ విశ్వాసం వ్యక్తం చేశారు.  నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీని ఇష్టపడుతున్నట్లు శ్రీధరన్ తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నపుడు శ్రీధరన్ ఆయనతో కలిసి పనిచేశారు.

వాస్తవికతకు అద్దంపడుతున్న శ్రీధరన్ వ్యాఖ్యలు:

కేరళను పాలిస్తున్న ప్రభుత్వాల తీరుపై శ్రీధరన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవికతను కళ్లకు కడుతున్నాయి. పరిశ్రమలు వస్తేనే ఉపాధి, అభివృద్ధి సాధించగలమన్నది వాస్తవం.   గత పదేళ్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పాలనలో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా కేరళకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే 2024 తరువాత కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఏముంది. ఆక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రావచ్చు. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి రావచ్చు. కేరళలో ప్రతిసారి ప్రభుత్వాలు మారటం ఆనవాయితీగా వస్తోంది. ఎల్డీఎఫ్ అధికారంలో ఉంటే తర్వాత ఎన్నికల్లో యూడీఎఫ్ అధికారంలోకి వస్తోంది. యూడీఎఫ్ అధికారంలో ఉంటే మలివిడత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారం చేపడుతూ వస్తోంది.

బీజేపీకి తీరనున్న నాయకత్వ సమస్య:

శ్రీధరన్  సమర్ధుడైన నిజాయితీ గల ఇంజనీర్ . అంతేకాదు మచ్చలేని మంచి పరిపాలనా దక్షత కల్గిన వాడు. దీంతో కేరళలో తమ పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించడానికి బీజేపీ ఆయన్ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే అవినీతిలో కూరుకుపోయిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లను ఎదుర్కొనేందుకు నిజాయితీపరుడైన శ్రీధరన్ ను ముందు పెట్టడం ద్వారా బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకుపోగలదు. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎంఏ బేబీ, విజయరాఘవన్ లతో పాటు కాంగ్రెస్ నేతలు ముళ్లపల్లి రామచంద్రన్, ఏకే అంటోని, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల ను విమర్శించి పార్టీ ని నడిపేందుకు పేరెన్నికగన్న నేతలెవరూ బీజేపీకి లేకపోవడంతో ఆ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది.

బీజేపీకి ఉపకరించనున్న శ్రీధరన్ నిజాయితీ:

88 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా శ్రీధరన్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజుకి 14 గంటల పాటు నిర్వరామంగా  పనిచేస్తున్నారు. కేరళలో ఒక్కసారిగా బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కసారితో జరిగిపోయేది కాదు. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పోటీదారుగా నిలిచేందుకు దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఉపకరిస్తుంది. ఒకవేళ కేరళ ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీకి ఏమాత్రం ఏమాత్రం నష్టం ఉండదు. కానీ 88 ఏళ్ల వయసులో రాజకీయాలతో కొత్తగా ప్రయోగం చేస్తున్న శ్రీధరన్ కి ఇది పరువు ప్రతిష్ఠలతో కూడుకున్న విషయం. కేరళ ఎన్నికలకు బీజేపీ తరపున శ్రీధరన్ ను ఎంపిక చేయడానికి వయస్సు నిబంధనను బీజేపీ సడలించినట్లు తెలుస్తోంది.

కేరళ అభివృద్ధికి తపన:

ఈ వృద్ధాప్యంలో శ్రీధరన్ రాజకీయాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం చేపడితే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రానికి వస్తాయని కేరళ వాసిగా శ్రీధరన్ ఆశపడటంలో తప్పలేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీధరన్ లాంటీ నిజాయితీ గల వ్యక్తి తపించడాన్ని ఎవరూ తప్పబట్టలేరు. 2022 లేదా 2024 లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. శ్రీధరన్ ఆయన పదవీ కాలంలో పీవీ నరసింహారావు నుంచి వాజ్ పేయి వరకు  మన్మోహన్ సింగ్ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ లను ప్రధానులుగా చూశారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి అగ్రనేతల అండదండలు లేకుండా దేశంలో బీజేపీ ని విస్తరించడంలో మోదీ చూపుతున్న ధైర్యం, చొరవకు శ్రీధరన్ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారు.

కష్టపడితే పోయేదేముంది:

88 ఏళ్ల వృద్ధాప్యంలో రాజకీయ రంగంలోకి ప్రవేశించడంద్వారా శ్రీధరన్  కోల్పోయేది ఏమీ లేదు. ఆయన మెట్రోమ్యాన్ గా ఇప్పటి విజవంతమైన ఇన్సింగ్స్ ఆడారు. ఈ వయసులో ఆయన ఏం చేసిన అది బోనస్ గా మిగిలిపోతుంది.   

ఇదీ చదవండి:బీజేపీలోకి మెట్రో శ్రీధరన్

      
Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles