Friday, March 29, 2024

వాట్సప్ హాండ్సప్!

భారతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యక్తిగత గోప్యతకు రక్షణ కలిపిస్తామని వాట్సప్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నవ్య గోప్యతా విధానంపై తన వైఖరిని ఒక ప్రకటనలో విడుదల చేసింది. దీని ప్రకారం, కొత్త విధానం మే నెల 15 నుంచి అమలులోకి రానున్నట్లు తెలియచేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్యానర్ రూపంలో యూజర్ కు కనిపించేలా ఉంచుతామని చెబుతోంది. ఈ పాలసీని అంగీకరించని వారికి మే 15వ తేదీ తర్వాత కూడా కాల్స్, నోటిఫికేషన్స్ వస్తాయి కానీ, మెసెజ్ లు పంపే అవకాశం వాళ్లకు ఉండదని సుస్పష్టంగా చెప్పింది.  దీనిపై కూడా ఇంకా యూజర్ల ప్రతిస్పందన తెలియాల్సి వుంది. వినియోగదారుల డేటాను, సమాచారాన్ని ఫేస్ బుక్ తో కూడా అనుసంధానం చేయడం అత్యంత ప్రమాదకరం.

విచక్షణారహితంగా షేర్ చేయవద్దు

వాట్సప్ ద్వారా ఇంటి అడ్రస్ లు, లైవ్ లొకేషన్ మ్యాప్ లు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఐడెంటిటీలు  అవసరాన్ని బట్టి కొందరికి షేర్ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని స్క్రీన్ షాట్స్, బ్యాంక్ లావాదేవీలు కూడా. అదేవిధంగా, కొన్ని ఫోటోలు కూడా పంపుతూ ఉంటాం. మనకున్న అవసరాన్ని బట్టి కొందరికి మాత్రమే షేర్ చేస్తూ ఉంటాం. అదే విధంగా, మిగిలిన వారి నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి. మనం షేర్ చేసుకోవాల్సిన అంశాలు, సమాచారం విషయాన్ని బట్టి, కొన్నింటిని మామూలు మెసేజెస్ రూపంలో, కొన్ని వాట్సాప్ ద్వారా, కొన్ని పేస్ బుక్ ద్వారా తెలియచేస్తూ ఉంటాం. వీటన్నింటిని ఫేస్ బుక్ లోనూ వాట్సాప్ స్వచ్ఛందంగా ప్రదర్శిస్తోంది. దీన్ని మార్చుకోడానికి ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా లేవో కూడా చాలామందికి తెలియదు. ఏ సమాచారాన్ని ఏ వేదికపై ఉంచాలన్నది, పంచాలన్నది యూజర్ల ఇష్టానికి సంబంధించిన హక్కు. అదే సమయంలో, డేటా కూడా చాలా కీలకమైంది.

Also Read : పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ

ప్రమాదకరం, అనైతికం

మన అనుమతి లేకుండా వీటన్నింటినీ వాట్సాప్, పేస్ బుక్ లపై ఇష్టారాజ్యంగా ప్రదర్శించే హక్కు వీటికి లేనేలేదు. ఇది ప్రమాదకరమే కాక, అనైతికం. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పెరిగి, కొత్త యాప్స్ అనేకం వచ్చిన నేపథ్యంలో, సైబర్ నేరాలు రోజు రోజుకూ అంతులేకుండా పెరిగిపోతున్నాయి. అత్యాధునిక సాంకేతికత వరం కంటే శాపంగా మారుతోంది. ఈ వేదికలను సద్వినియోగం చేసేవారి కంటే, దుర్వినియోగం చేసేవారి జాబితా పెరిగిపోతోంది. దీనికి తోడు, ఆ యాప్స్ నిర్వహించే సంస్థల విధానాలు మన చేతులు దాటి పోతున్నాయి. వాట్సాప్ తెచ్చిన కొత్త పాలసీ చాలా అభ్యంతరకరంగా ఉందని భారతదేశంలో ఆందోళనలు వెల్లువెత్తాయి.

దేశీ యాప్స్

అసలు ఈ యాప్ కు తిలోదకాలు ఇచ్చి, ప్రత్యామ్నాయ యాప్ పై  కొందరు దృష్టి సారిస్తున్నారు. “దేశీ సందేశ్ ” వంటి దేశీయ యాప్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సిబ్బంది మాత్రమే ఉపయోగించే ఈ యాప్ ను ఇక ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూడా చాటింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఫైల్, కాంటాక్ట్ షేరింగ్ మొదలైన సేవలు దొరుకుతాయి. వెబ్ వెర్షన్ కూడా ఉంది. యూజర్ల సమాచార గోప్యతకు ఎటువంటి భంగం కలుగకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్ స్క్రిప్షన్ సదుపాయం “సందేశ్ ” యాప్ లోనూ ఉంది.

Also Read : నమ్మరాని పొరుగుదేశం చైనా

సమాచార రంగంలో వెర్రితలలు

కాకపోతే, ఇందులో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చుకొనే అవకాశం లేదు. అవతలి వైపు వారు కూడా సందేశ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఉంటే తప్ప, మెసేజెస్ పంపలేం. “సంవాద్ ” అనే మరో యాప్ ను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాట్సప్ తలకు పేస్ బుక్ ను, పేస్ బుక్ తలకు వాట్సప్ ను జత చేసుకొని, ఈ రెండు యాప్ లు అవలంబిస్తున్న విధానాలు సమాచారం రంగంలో వెర్రి తలలు వేస్తున్నాయి. ఈ తరుణంలో, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ లకు డిమాండ్ పెరుగుతోంది.

ఆధిపత్య ధోరణి

ప్రపంచ సమాచార వ్యాపార సామ్రాజ్యంలో ఆధిపత్యం వహించాలనే ఆలోచనతో, వాట్సప్ యాప్ ను కొన్నాళ్ల క్రితం ఫేస్ బుక్ కొనేసింది. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ స్థానం అత్యంత గణనీయమైంది. ఈ రెండూ కలిస్తే మనకు ఎదురేమీ ఉండదని వారి వ్యూహం. రెండు శక్తివంతమైన వేదికలు ఓకే గొడుగు కిందకు అందుబాటులోకి రావడం వల్ల ఇంకా శక్తివంతంగా కమ్యూనికేషన్ ను మలచుకోగలమని యూజర్లు ఎంతో సంతోషించారు. కానీ, జరుగుతున్న పరిణామాలు వ్యక్తిగత సమాచార గోప్యతకు తీవ్రంగా భంగం కలిగిస్తూ, ప్రమాదకరంగా మారుతున్నాయి. వాట్సప్ అనుసరించే గోప్యతా విధానాలు యూరప్ లో ఒకరకంగా, ఇండియా లో ఒకరకంగా ఉన్నాయి. దీనిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ అంశాన్ని ధర్మాసనం చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టింది.

Also Read : ట్రంప్ గెలిచినా ఓడినట్టే

సుప్రీంకోర్టు చురక

మీ కోట్లాది రూపాయల డబ్బు కంటే ప్రజల వ్యక్తిగత గోప్యత అత్యంత విలువైందని వాట్సాప్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్ లపై దృష్టి సారించడం, కేంద్ర ప్రభుత్వం కూడా దేశీయ యాప్ లను రంగంలోకి దించడం మొదలైన పరిణామాలతో వాట్సాప్, పేస్ బుక్ యాజమాన్యం ఆర్ధిక స్వార్థంతో పునరాలోచనలో పడింది. దీనితో, భారతీయ చట్టాలకు లోబడి ఉంటామని దిగివచ్చింది. సోషల్ మీడియాలో దిగ్గజంగా ఉన్న ఈ సంస్థ పూర్తిగా దిగి వచ్చిందని అనుకోలేం.వాళ్ళదైన వ్యాపార వ్యూహం, నాటకం తప్పనిసరిగా ఉంటాయి.ఈ యాప్ ల విధానాలు, వ్యవహారాల శైలిపై భారతీయ సాంకేతిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వం ఇంకా విస్తృతంగా అధ్యయనం చేయాలి.

గోప్యతావిధానంపై కఠిన వైఖరి

ప్రభుత్వాలు సైతం ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఆచితూచి అడుగులు వేస్తే నష్టపోయేది ప్రజలు, దేశం. గోప్యతా విధానాలపై ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలి. సమాచారాన్ని షేర్ చేసే సమయంలో యూజర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆత్మనిర్భర్, దేశీయ ఉత్పత్తులు, సేవల ప్రగతి గణనీయంగా పెరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే చెబుతున్నారు. వాట్సాప్, పేస్ బుక్ వంటి విదేశీ సంస్థలకు పూర్తిగా మనం లోను కాకుండా ఉండాలి. సందేశ్, సంవాద్ వంటి  ప్రభుత్వ దేశీయ యాప్ లను సర్వసమర్ధంగా తీర్చిదిద్దడం అన్నింటి కంటే ప్రధానమైంది. కమ్యూనికేషన్ రంగంలో తలెత్తుతున్న వెర్రితలలకు ముక్కుతాడు వేయడం అందరి బాధ్యత.

Also Read : విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles