Tuesday, April 30, 2024

స్వర్గం ఒక భ్రాంతి.. ఐశ్వర్యం – పేదరికం – పురుషాధిక్యత!

మరణించినవారు ఎటు పోతున్నారో, అసలు ఆత్మలు ఉన్నాయో లేదో తెలిసిన మనిషి ఒక్కడైనా కనిపించిన దాఖలాలు లేవు. కానీ స్వర్గం అంటే అమృతం అని నరకం అంటే విషం అనే బ్రాంతిలో పూర్వీకులు మనిషి తప్పు చేయకుండా ఏర్పరచిన ఒక బ్రాంతి. ఆ బ్రాంతిలో తప్పులు చేయకుంటే స్వర్గానికి వెళ్తామని నిష్ఠగా చెప్పే వాడు ఒక్కడైనా లేడు. ఏ తప్పులూ చేయని మానవుడు ఉండడు కాబట్టి స్వర్గంలో పాపాత్ములకు చోటు లేదు. తప్పులు అనే ప్రక్రియ కూడా సరియైన నిర్వచనం లేదు. మనిషి అనే వాడు జీవిత పోరాటంలో  ప్రతి రోజు తప్పులు చేయాల్సిందే. ఈగను చీమను,దోమను చంపకుండా ఉండడు… కనుక అది పాపమే. ఒక వేళ ఇంట్లో కూర్చున్నా అవి కుడతాయి కాబట్టి చంపక తప్పదు..చీమకు కూడా హాని తలపెట్టని మనిషి ఉండడు కాబట్టి స్వర్గం అంచులను (అది ఉంటే) చవిచూసిన మనిషిని నేను చూడలేదు.

హేతువాదంలో స్వర్గం ఉండదు

నాస్తిక ఉద్యమాన్ని నేను దగ్గరి నుండి చూశాను… హేతువాదం లో స్వర్గం ఉండదు. ప్రతిదానికీ కార్యకారణ సిద్ధాంతం వారు చెబుతారు… నాస్తిక సంఘంలో పాతికేళ్ళ క్రితం దేవుడు లేడు అన్న కొంత మంది మిత్రులు, ఆ తరువాత తిరుపతి కొండ మీద గుండుతో కనబడ్డారు. ఈ మధ్య తెలిసిన ఒకాయన శ్రీశైలంలో కనబడ్డారు. విభూతి దట్టంగా పూసుకుని ఎదురు పడ్డ ఆయన నాస్తిక సమాజంలో  ఒక నాడు విగ్రహరాధనను గట్టిగా వ్యతిరేకించి “రాయికి పూజించే వీళ్లు స్వర్గం మాట దేవుడెరుగు కష్టాల పాలవుతారు’ అని శాపనార్థాలు పెట్టారు. అలాంటి ఆయన నన్ను చూసి ‘మీరూ మారారా?’ అన్నాడు “అవును అప్పుడు జీన్స్ వేసేవాన్ని… ఇప్పుడు సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నాను’’ అన్నాను.

అప్పుడు నరకం, ఇప్పుడు స్వర్గం

“అది కాదు స్వామీ “ఇప్పుడు మీరు ఆస్తికులా” అని అడిగారు…దానికి ‘‘నేనెప్పుడూ మారలేదు…మీరే దేవుడు లేడని ఆనాటి యువతకు హిత బోధనలు చేశారు కదా’’ అన్నాను. అప్పుడు నరకంలో ఉన్నాను ఇప్పుడు స్వర్గం లో ఉన్నాను అన్నాడు. వివరంగా చెప్పండి అన్నాను నేను.  ‘‘అప్పుడు నిరుద్యోగం, ఆకలి, పెద్ద సంసారం ఈదలేక దేవుడిపై కోపం వచ్చి ఈ నరకం నాకు వద్దు అనుకుని దేవుడే లేడని ప్రచారం చేయడం వల్ల ఒక ఉద్యోగం దొరికింది. తరువాత పెళ్లయి, పిల్లలు ప్రయోజకులై అమెరికా వెళ్లి పోయి ఆస్తులు పెరగడం వల్ల స్వర్గంలో బతుకుతున్నా’’ అన్న ఆయన మాటలు నన్ను అజ్ఞానం నుండి విజ్ఞానం లోకి వచ్చేలా చేశాయి…పేదరికం నరకం..శ్రీమంతం స్వర్గం అదే నేటి సమాజం నిర్వచనంగా మారింది.

Also Read : కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం

అతీంద్రియ ప్రదేశం

స్వర్గం ఒక సాధారణ మత విశ్వాసం నుంచి పుట్టిన లేదా అతీంద్రియ ప్రదేశం. ఇక్కడ దేవతలు, దేవదూతలు, ఆత్మలు, సాధువులు లేదా పూజనీయ పూర్వీకులు వంటి జీవులు పుట్టుకొచ్చారని, సింహాసనం పొందారని లేదా నివసిస్తారని చెబుతారు. కొన్ని మతాల నమ్మకాల ప్రకారం స్వర్గపు జీవులు భూమికి దిగవచ్చు..? లేదా అవతరించవచ్చు, భూసంబంధమైన జీవులు మరణానంతర జీవితంలో స్వర్గానికి చేరుకోవచ్చు లేదా అసాధారణమైన సందర్భాల్లో స్వర్గంలో సజీవంగా ప్రవేశించవచ్చు.

పురాణ కథలు

మరొక నమ్మకం ఒక అక్షం  లేదా ప్రపంచ వృక్షంలో ఉంది. ఇది ఆకాశాలను, భూగోళ ప్రపంచాన్ని, పాతాళాన్ని కలుపుతుంది. భారతీయ మతాలలో స్వర్గాన్ని స్వర్గలోకంగా పరిగణిస్తారు, ఆత్మ దాని కర్మ ప్రకారం వివిధ జీవన రూపాల్లో పునర్జన్మకు గురవుతుంది. ఒక ఆత్మ మోక్షం లేదా మోక్షాన్ని సాధించిన తర్వాత ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. స్పష్టమైన ప్రపంచానికి వెలుపల (స్వర్గం, నరకం లేదా ఇతర) మనుషులు, ఆత్మలు లేదా దేవతలు ఉన్న ఏదైనా ఉనికిని ఇతర ప్రపంచంగా సూచిస్తారు. ఇది పెద్దలు మనకు హిత బోధ చేసిన పురాణ కథలు. ఈ కథల ప్రకారం మనుషులు తప్పు అనే పదాన్ని నిఘంటువు నుంచి తీసేయాలి…కానీ ప్రతిరోజు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే వారు స్వర్గానికి పోవడం మిధ్య! ఇదో అంతులేని వ్యధ. వైకుంఠ ఏకాదశి రోజు మరణించిన వారు స్వర్గంకు వెళ్తారని అంటారు. వాళ్ళు స్వర్గంలో ఉన్న దాఖలాలు మాత్రం లేవు…ఒకరిద్దరు మినహా చాలా మంది పుట్టెడు పాపాలు చేసి అదే రోజు చనిపోతే స్వర్గ ద్వారాల దగ్గర ఉన్న భటులు లోనికి ఎలా రానిస్తారు?

Also Read : సంసారాల్లో స్మార్ట్ ఫోన్ సరిగమలు!

పురుషాధిక్యమే స్వర్గం

ఇక పోతే అక్కడ వివక్ష పురుషాధిక్యత ప్రపంచమే హిందువుల స్వర్గం.దేవతలతో పాటు నివాసం. అక్కడ అమృతం దొరుకుతుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి దేవకన్యలు స్వర్గలోక వాసుల్ని ఆనందపరుస్తారు. ఈ స్వర్గ లోకానికి అధిపతి ఇంద్రుడు. అదేనా ఎంటర్ టైన్ మెంట్? వాళ్లకు ఎంటర్టైన్ మెంట్ లేనిది స్వర్గం కూడా నరకమే కదా? భూలోకంలో ఎందరో నటులు తమ నటనా  చాతుర్యం తో  ప్రేక్షకులను తన్మయులను చేసిన వారు కాబట్టి వాళ్ల పేర్లు స్వర్గంలో ఉండాలి కదా. ఇంద్రునికి ఈ వివక్ష ఎందుకు? అక్కడ పురుష ఆధిక్యం ఎందుకు? సినిమా నటులు స్వర్గంలో ఉంటే తమ నటనా చాతుర్యాన్ని చూపాలి కదా? వాళ్ళు నిజంగా భూమి మీద ఇంత మందికి వినోదం పంచినందుకు వాళ్ళు స్వర్గంలోనే ఉండాలి! అలాంటి వారి పేరు ఏ పుస్తకం పురాణాల్లో వెతికిన కనబడదు!

బౌద్ధంలో అనేక అవకాశాలు

ఇక బౌద్ధమతంలో అనేక ఆకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పటికీ సంసారంలో (భ్రమ వాస్తవికత) భాగమే. మంచి కర్మలను కూడబెట్టిన వారు వాటిలో ఒకదానిలో పునర్జన్మ పొందవచ్చు. ఏదేమైనా వారు స్వర్గంలో ఉండడం శాశ్వతమైనది కాదు-చివరికి వారు తమ మంచి కర్మలను ఉపయోగించుకుంటారు.  మానవుడిగా, జంతువుగా లేదా ఇతర జీవులుగా పునర్జన్మను మరొక రాజ్యంలో తీసుకుంటారు. స్వర్గం తాత్కాలికమైనది, సంసారంలో భాగం కాబట్టి, బౌద్ధులు పునర్జన్మ చక్రం నుండి తప్పించుకోవడం,  జ్ఞానోదయం (మోక్షం) చేరుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు. మోక్షం స్వర్గం కాదు. అది ఒకానొక మానసిక స్థితి.

Also Read : ఇడబ్ల్యూ ఎస్ అంటే ఏమిటీ?

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles