- డిసెంబరు 4న కౌంటింగ్
- నామినేషన్లు బుధవారం నుంచి
- ఉపసంహరణ గడువు 22వ తేదీ
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి నోటిఫికేషన్ ను మంగళవారం ఉదయం విడుదల చేశారు. రేపటి నుండి ఈ నెల 20 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్థసారథి తెలిపారు. నవంబరు 21న నామినేషన్ల పరిశీలిస్తామనీ, 22 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించామనీ తెలిపారు. డిసెంబరు 1 న పోలింగ్, డిసెంబరు 3న అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు చేపడతామని అన్నారు.
బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్
2021 ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుందని ఈ లోపు నూతన పాలకవర్గం కొలువుదీరేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తరువాతే ఓటర్ల జాబితాపై తుది నిర్ణయం తీసున్నామని అన్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో.. ఈ సారి బ్యాలెట్ పద్దతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.
అమల్లోకి కోడ్
జీహెచ్ఎంసీ పరిథిలో 74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం గ్రేటర్ పరిథిలో 9248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇవాల్టి నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.