Saturday, July 13, 2024

ఉచిత మంచినీరు అందేదెన్నడు

  • ప్రహసనంగా మారిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
  • అధికారుల నిబంధనలతో పథకానికి తూట్లు
  • అయోమయంలో నగరవాసులు

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత తాగునీటి పథకం అమలుపై జాప్యంతో నల్లా యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. పథకానికి అర్హత సాధించేందుకు  అధికారులు విడుదల చేసిన మార్గదర్శకాలతో లక్షలాది మంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత తాగునీరు పొందేందుకుగాను ప్రతి అపార్టుమెంట్లో ఒక ఫ్లాట్‌ యజమాని వివరాలను నమోదు చేస్తే చాలని తొలుత అధికారులు చెప్పారు. తాజాగా ఇప్పుడు ఫ్లాట్ల యజమానులంతా ఆధార్‌ నెంబర్‌తోపాటు జీహెచ్‌ఎంసీకి చెల్లించిన ఆస్తిపన్ను నెంబర్‌ నమోదు చేస్తేనే ఈ పథకం కిందకు అర్హత సాధిస్తారని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు.

ఉచిత నీటికి గుది బండగా మారిన కఠిన నిబంధనలు :

Also Read: ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

హైదరాబాద్‌ లో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 90 శాతం గృహాలకు సంబంధించినవి. గత సంవత్సరం జరిగిన బల్దియా ఎన్నికల్లో రాజధాని పరిధిలోని అందరికీ ఉచిత నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉచిత నీటి సరఫరా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పథకం అమలుకు నిబంధనలు విధించారు. ఒక అపార్టుమెంటుకు సంబంధించి ఒక్క ఫ్లాట్‌ యజమాని అనుసంధానం చేసుకుంటే సరిపోతుందని జలమండలి అధికారులు మొదట్లో చెప్పారు. దీంతో వేలాది మంది యజమానులు ఇలానే చేశారు. అయితే తాజాగా జలమండలి అధికారులు మరో మెలిక పెట్టారు. ఒక అపార్టుమెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అన్ని ఫ్లాట్ల యజమానులు ఆధార్‌, ఆస్తిపన్ను నెంబర్‌ అనుసంధానం చేయాల్సిందేనన్న కొత్త నిబంధనను విధించారు. ఎంతమంది వివరాలను అనుసంధానం చేస్తారో వారికి మాత్రమే ఉచిత నీరు అందుతుందని అధికారులు స్పష్టం చేశారు. మిగతా వారు యథావిధిగా నెలవారీ బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు.

ఉచిత నీటికి కీలకంగా మారిన ఓటీపీ :

ఇక ఆన్‌లైన్‌లో వివరాల నమోదు నరక ప్రాయంగా మారింది. ఇప్పటివరకు 80 వేల మంది నల్లా వినియోగదారులు మాత్రమే నమోదు చేసుకున్నారు. జలమండలి వెబ్‌సైట్‌లో ఉచిత తాగునీరు ఆప్షన్‌ దగ్గర క్లిక్‌ చేసి మన తాగునీటి క్యాన్‌ నెంబర్‌ నమోదు చేయాలి. అనంతరం మరో పేజీ ఓపెన్‌ అవుతోంది. అందులో ప్రతి ఫ్లాట్‌ యజమాని ఆధార్‌ నెంబర్‌, ఆస్తి పన్ను నెంబర్‌ నమోదు చేయాల్సి ఉంది. ఒక యజమానికి సంబంధించి ఆధార్‌ నెంబర్‌ నమోదు చేస్తే అతని ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. ఇలా అపార్ట్ మెంట్ లో ఎన్ని ఫ్లాట్ లు ఉంటే అంతమంది యజమానుల వివరాలు నమోదు చేస్తేనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే నగరంలో ఇప్పటికీ వేలాది అపార్టుమెంట్లు పలు కారణాల రీత్యా బిల్డర్‌ పేరుతోనే ఉన్నాయి. దీంతో తాగునీటి కనెక్షన్‌పై మొబైల్ నెంబరు సంబంధిత బిల్డర్‌దే ఉంటోంది. ఇటువంటి క్యాన్‌ నెంబర్లతో ప్రస్తుతం ఉన్న యజమాని ఫోన్‌ నెంబర్‌ను మార్చాలంటే వెంటనే వీలుకావడం లేదు. మార్చి నెలాఖరులోగా ఈ వివరాలను నమోదు చేసుకోకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి నీటి బిల్లులు పంపించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికితోడు జలమండలి వెబ్‌సైట్‌లో తరచు తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులు కూడా ఉచిత తాగునీటి ఫథకం అమలులో జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయి.  

Also Read: వాణి విజయం కేసీఆర్ గెలుపే!

గడుపు పెంచేందుకు అవకాశం :

అయితే ఉచిత తాగునీటికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు ఏప్రిల్ నెలాఖరు వరకు గడుపు పొడిగించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సిఉంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles