Friday, April 26, 2024

ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే

శుక్రవారంనాడు పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్  ఏ బాబ్డే దేశంలోని ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో అద్వానమైన సుప్రీంకోర్టు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను పునరుద్దరిస్తారని ఆశించినవారిని నిరాశపరిచారు. అయోధ్య, రాఫెల్ తీర్పులు నరేద్రమోదీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం పారితోషికంగా పొందిన రంజన్ గొగోయ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రతిష్ఠపాలు చేశారు.

గొగోయ్ అడుగుజాడలలోనే…

ఆయన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో సుమారు పద్దెనిమిది మాసాలు గడిపిన బాబ్డే గొగోయ్ కి తమ్ముడిగానే వ్యవహరించారు. న్యాయవ్యవస్థ పాలనలో కానీ, బెంచీలను రూపొందించడంలో కానీ, కేసులను ఏ న్యాయమూర్తులకు పంపాలనే విషయంలో కానీ పాత పద్ధతులే అమలైనాయి. నిరుడు కోవిద్ సందర్భంగా అనూహ్యమైన రీతిలో ఆకస్మికంగా ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటిస్తే దిక్కు తోచక ముంబయ్, దిల్లీ నగరాల నుంచి సొంత గ్రామాలకు వెళ్ళడానికి కాలినడకన బయలు దేరి పస్తులు ఉండి, నానా యాతనలు పడి, దారిలో కొందరు మరణించి, మిగిలినవారు బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరితే వారి విషయంలో న్యాయస్థానం అన్యాయం చేసింది.

వలస కార్మికుల గోడు పట్టలేదు

ప్రభుత్వానికి అండగానే నిలిచింది కానీ తీవ్ర నిరాదరణకు గురైన వలస కార్మికుల గోడు పట్టించుకోలేదు. పేదల పట్ల అన్యాయంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మందలించిన పాపాన పోలేదు. వలస కార్మికుల తరఫున పిటిషన్లు దాఖలైతే వాటిని విచారించలేదు. కొన్ని పిటిషన్లు విచారించక తప్పని పరిస్థితుల ఏర్పటినప్పుడు వలస కార్మికుల తరఫున వాదించే న్యాయవాది కార్మికుల కష్టాలను ఏకరవుపెడుతుంటే ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులూ తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. కనీసం ప్రభుత్వానికి చెప్పే సాహసం కూడా చేయలేదు. పైగా ‘‘వారికి అన్నం పెడుతున్నప్పుడు ఇంకా డబ్బులతో ఏం పని?’’ అంటూ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చొని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించడం అమానుషం.

రైతుల విషయంలోనూ అదే నిష్క్రియాపరత్వం

మానవ హక్కుల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేదు. నాలుగు మాసాలుగా దిల్లీలో నిసరన తెలుపుతున్న రైతులకు అనుకూలంగా అప్పుడప్పుడు మాట్లాడటం తప్పిస్తే ప్రభుత్వాన్ని ఆదేశించే ఉద్దేశం అత్యున్నత న్యాయస్థానానికి లేదని స్పష్టంగా ఏనాడో తెలిసింది. సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. అందులో సభ్యులందరూ మోదీ అభిమానులే కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో హాథ్ రస్ అనే గ్రామంలో ఒక యువతిపైన అత్యాచారం చేసి ఆమెను చంపిన ఘటన గురించి వార్త రాయడానికి వెడుతున్న కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను దేశద్రోహిగా చిత్రిస్తూ పోలీసులు కేసు బనాయిస్తే అతనిని ఆదుకునేందుకు జర్నలిస్టు సంఘాలూ, మానవహక్కుల సంఘాలూ చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. కేసు అనేక దఫాలుగా వాయిదా పడిందే కానీ అమాయకుడైన జర్నలిస్టును విడిపించాలనే ప్రయత్నమే జరగలేదు.

కశ్మీర్ పై పెదవి విప్పలేదు

కశ్మీర్ లో 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాదాపు వంద పిటిషన్లు బాబ్డే న్యాయసింహాసనం ఎక్కేనాటికి ఎదురు చూస్తూ ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలైనాయి. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) తెచ్చిన సందర్భంలోనే బాబ్డే గద్దెనెక్కారు. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ చాలా  పిటిషన్లు దాఖలైనాయి. బాబ్డే ప్రధాన న్యాయమూర్తిగా వ్వవహరించినంత కాలం వరవరరావూ, మరి 15 మంది మేధావులూ, హక్కులకార్యకర్తలూ, న్యాయవాదులూ, కవులూ మహారాష్ట్ర జైలులో మగ్గుతూనే ఉన్నారు. ఆయనకు కానీ, ఆయన తోటి న్యాయమూర్తులకు కానీ  చీమ కుట్టినట్టయినా లేదు. అన్యాయంగా, అక్రమంగా, కంప్యూటర్ లో సృష్టించిన అవాస్తవమైన ఆధారాలు చూపించి పోలీసులు కేసు పెట్టి వారిని ఉపా చట్టం (అన్ లాఫుల్ యాక్టివిటీస్  ప్రివెన్షన్ యాక్ట్) కింద అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సైతం జైల్లో కుక్కితే అదేమని ప్రశ్నించిన దాఖలా లేదు.

వరవరరావు, సాయిబాబాలపై కనికరం లేదు

ప్రొఫెసర్ సాయిబాబా అండా సెల్ లో మగ్గుతున్నా, మృత్యువాకిటిలో ఉన్నప్పటికీ కనికరం చూపించాలనే ధోరణి కూడా అత్యున్నత న్యాయస్థానానికి లేదు. మానభంగం చేసినవాడికి బాధితురాలిని కట్టబెట్టడం ధర్మమేనని ఆలోచించే మానసికస్థితి ఈ ప్రధాన న్యాయమూర్తిలో కనిపించింది. దేశవ్యాప్తంగా మహిళాసంఘాలు నిరసన ప్రకటించాయి. తర్వాత మాట మార్చి సర్దుకున్నారు.  సీఏఏ కి వ్యతిరేకంగా దేశంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలకు మద్దతు తెలిపిన విద్యార్థులపై జామియా విశ్వవిద్యాలయంలోనూ, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనూ గూండాలు ప్రవేశించి దాడి చేశారు. ఎవరు దాడి చేశారో ప్రజలకు తెలుసు. దాడి చేసినవారిపైన పోలీసులు చర్య తీసుకోకుండా దెబ్బలు తిన్నవారిపైన కేసులు పెడితే ఆ అన్యాయమైన వైఖరిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి.

ఎలక్టోరల్ బాండ్లపై మౌనం

అధికారాన్ని వినియోగించుకొని కార్పొరేషన్ల నుంచి విరాళాలను రహస్యంగా సేకరించడానికి వీలు ఉండే విధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వేలకోట్ల రూపాయలను దండుకొని వాటిని ఎన్నికలలో ఖర్చులకూ, శాసనసభ్యులకు ప్రతిపక్షాల నుంచి కొనుగోలు చేయడానికీ వినియోగించుకుంటున్న సంగతి ప్రజలకు తెలుసు. ఈ అవినీతిని సవాలు చేస్తూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైనాయి. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజ్యాంగాన్ని రక్షించవలసిన పవిత్ర బాధ్యత కలిగిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వంతో షరీకైతే పరిస్థితులు ఎట్లా ఉంటాయో జస్టిస్ బాబ్డే దేశవాసులకు చూపించారు.

కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన శస్త్రచికిత్సను సవాలు చేసిన పిటిషన్లను కానీ, సీఏఏ ను ప్రశ్నించిన పిటిషన్లను కానీ జస్టిస్ బాబ్డే హయాంలో నిజాయితీగా విచారించిన దాఖలా లేదు. అదే విధంగా ప్రజాస్వామ్యంలో అతిముఖ్యమైన ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన ఎలక్టొరల్ బాండ్ల వ్యవహారంపైన నోరు మెదపలేదు. పోలీసుల బందీలుగా ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలపాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలించనే లేదు. ఒకటీ అరా పరిశీలించినా హైకోర్టుకు వెళ్ళమని ఆదేశించడమే కానీ బాధితులకు ఊరట కలిగించిన సందర్భంలేదు.

నియామకాలు నాస్తి

సుప్రీంకోర్టుకు ఒక న్యాయమూర్తిని కూడా నియమించకుండా పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే చరిత్రలో మిగిలిపోతారు. కలీజియం వ్యవస్థను సద్వినియోగం చేసుకోలేకపోయారనే అపవాదు మిగిలిపోయింది. హైకోర్టులకు సైతం నియామకాలు చాలా తక్కువ జరిగాయి. కలీజియం చేసిన సిపార్సులను పది నెలలకు పైగా తన దగ్గరే న్యాయశాఖ మంత్రి పెట్టుకుంటే అదే మని ప్రశ్నించిన సందర్భం లేదు. అటార్జీ జనరల్ ను దబాయించడం లేదా ఆయనతో వేలమాడటం మినహా న్యాయమంత్రిని మందలించనే లేదు.

ముఖ్యమంత్రి లేఖపై పారదర్శకత లేదు

జస్టిస్ ఎన్ వి రమణపైన ఫిర్యాదు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాస్తే దానిపైన జస్టిస్ బాబ్డే స్పందించిన తీరు చిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి ఆరోపణలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించడం మినహా ఎందుకు కొట్టివేశారో చెప్పలేదు. ఆ విధంగా చెప్పవలసిన అవసరం లేదనే నియమాన్ని వినియోగించుకున్నారు. ఆరోపణలు చేసిన  వ్యక్తి ముఖ్యమంత్రి. ఆరోపణలు చేసింది తన తర్వాత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న సీనియర్ న్యాయమూర్తిపైన. ఇంత ముఖ్యమైన విషయంపైన వివరణ ఇవ్వకుండా జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించవచ్చునంటూ సిఫారసు చేయడం వల్ల జస్టిస్ రమణపైన అనుమానాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు ప్రదాన న్యాయమూర్తి నిర్ణయం దోహదం చేసినట్టు అవుతుంది. అదే విధంగా జస్టిస్ గొగోయ్ ఒక మహిళపైన అత్యాచార ప్రయత్నం చేసినట్టు వచ్చిన ఆరోపణ విచారణ సంఘానికి అధ్యక్షుడుగా ఉండిన జస్టిస్ బాబ్డే తోటి న్యాయమూర్తి నిరపరాధి అంటూ నిర్ణయిస్తూ నివేదిక సమర్పించారు. కానీ ఆ నివేదికను గోప్యంగా ఉంచారు. అదే గొప్ప న్యాయమూర్తి ఆయన స్థానంలో ఉంటే నివేదికను వెల్లడించి పారదర్శకతను ప్రదర్శించేవారు.

జస్టిస్ రమణకు పరీక్షా సమయం

ఒకప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన న్యాయస్థానంగా పేరు ఉండేది. అది క్రమంగా అడుగంటింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పోయిన ప్రతిష్ఠను పునరుద్ధరించే పద్ధతిలో చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన విధంగా వ్యవహరిస్తారో లేక గొగోయ్, బాబ్డేల బాటలోనే నడుస్తారో చూడాలి. సాహసం మూర్తీభవించిన తెలుగు న్యాయమూర్తి అనిపించుకుంటారో, మనకెందుకీ పోరాటం అనుకుంటారో మరి. ఇది జస్టిస్ రమణకు పరీక్షా సమయం. ఒక సువర్ణావకాశం, ఒక పెనుసవాలు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles